11_001 నిత్య చైతన్యమూర్తి అప్పలాచార్య

.

తెలుగుకు వెలుగులు నింపుతున్న నిత్య చైతన్య మూర్తి మరిగంటి అప్పలాచార్య

.

ఆయన శ్వాస తెలుగు భాష….

ఆయన ధ్యాస తెలుగు భాష….

ఆయన అడుగు జాడ గురజాడ….

ఆయన గొంతులో భాష…..

గుండెలో యాస… తెలుగు నుడికారమే

వెరసి తెలుగు భాషకు సజీవరూపం అనిపిస్తారు. ఆయనే శతవసంతాల వయసు దాటేసిన మరింగంటి అప్పలాచార్యులు గారు. తేట తెలుగు గోదావరీ తీరమైన భద్రాచలం లో సంప్రదాయ వైష్ణవ కుటుంబం లో నవంబర్ 2, 1920 లో జన్మించారు. వారి తల్లి తండ్రులు మరింగంటి కృష్ణమాచార్యులు, సీతమ్మ గార్లు. సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో జన్మించినందువల్ల నేమో చిన్నతనంలోనే భారత భాగవత, రామాయణ కావ్యాలను ఔపోసన పట్టారు. అంటే పోతన, నన్నయ్య, తిక్కనల తేనెలొలుకు తెలుగు పద్యాల సొబగులను వంట పట్టించుకున్నారు. ఆ చిన్ననాటి పద్యాలు నేటికీ కంఠోపాఠమే. అవే ఆయనలో తెలుగు భాష పట్ల మక్కువను, అవ్యాజమైన ప్రేమానురాగాలకు బీజం వేశాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయ, సాంఘిక పరిస్థితుల ప్రభావం ఆయనపై గాఢంగా ముద్రవేశాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం లో అమాయక గిరిజనుల పై బ్రిటీషు ప్రభుత్వం జరుపుతున్న వివక్షత, అత్యాచారాలు అలాగే పొరుగుననే ఉన్న నిజాం నిరంకుశ పాలనలో తల్లడిల్లుతున్న తెలంగాణ రైతాంగం బాధలు చూసి చలించిపోయారు. ఆయన ఒక సామాన్య పౌరుడిలా చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోలేదు. నేను సైతం…. ప్రపంచాగ్నికి…. సమిధ నొక్కటి ఆహుతిచ్చాను… ! అన్న రీతిలో ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అన్యాయంపై జరిగే తిరుగుబాటు ఉద్యమాల్లో ముందుండే వారు ఆచార్యుల వారు.

అప్పటి నుండి అభ్యుదయ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని వామ పక్ష సాహిత్యాన్ని చదవడమే కాదు… ఆచరణాత్మకంగా అనుసరించారు. సంప్రదాయ వాదానికే కట్టుబడి ఉండకుండా అభ్యుదయ వాదానికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చారు.

ఆ రోజుల్లో ఓసారి ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. ఆనాటి అక్కడి భయానక దృశ్యాలు తలుచుకుంటే ఇప్పటికీ ఆయన ఒళ్ళు జలదరిస్తుంది. తెలుగు భాషకు జరుగుతున్న అవమానం నిలువెల్లా దహించివేసింది. ఆయన మాటల్లోనే….

“ నేను హైదరాబాద్ స్టేషన్ లో దిగాను. ఏదో పరాయి దేశానికి వచ్చినట్టనిపించింది. ఎటు చూసినా తెలుగు అక్షరం కనిపించలేదు. పోర్టర్ సైతం ఉర్దూలో మాట్లాడుతున్నాడు. అంతా షెర్వానీలు, రూమీ టోపీలే ధరించి ఉన్నందున ముస్లిములెవరు ? కాని వారెవరు ? గుర్తించడం కష్టంగా ఉంది. బైటికి వచ్చి టాంగాను వెతుక్కొని ఎక్కాను. బండి సాగింది. రోడ్డు మీద అంతా పాన్ ఉమ్మి మరకలు. అరబ్బులు, పఠాన్లు విరివిగా తిరుగుతున్నారు కత్తులు, కఠారులు ధరించి. అయితే ఎక్కడ చూసినా తెలుగు అక్షరం కనిపించలేదు. తెలుగు దేశానికి తలమానికం లాంటి ఈ మహానగరంలో తెలుగు వాడు గానీ, తెలుగుదనం గానీ, తెలుగు అక్షరం గానీ కనిపించలేదని బాధపడ్డాను. తెలుగు తల్లిని సగానికి చీల్చి బొట్టు, తాళీ తీసివేసి, ముసుగు వేసి, ఉర్దు మాట్లాడమని హింసిస్తున్నట్లుంది నాకు. ఈ దౌర్జన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని తెలంగాణలోని కోటి తెలుగువాళ్లు ఎలా సహిస్తున్నారా అనిపించిందా క్షణంలో…. ” చెబుతున్న ఆయన కళ్ళు తడిబారాయి.

అందుకే ఇలాంటి వైవిధ్య పరిస్థితుల్లో తెలుగు జాతి ఔన్నత్యం కోసం మూడు కోట్ల తమ్ముళ్ళు ఒక్కటవ్వాలని భావించారు. నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం ఉధృతంగా జరుగుతున్న కాలంలో నైజాం సర్కారు శ్రీరామనవమి సందర్భంగా సంప్రదాయం ప్రకారం భద్రాచలం దేవస్థానానికి ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు వచ్చారు. ఇక్కడి మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాని పోలీసు హెచ్చరికలను కూడా ధిక్కరించి ఆచార్యుల వారు ఊళ్ళోని యువతను ప్రోగుచేసి ‘ గో  బ్యాక్…. ’ అంటూ నినదించారు. ఇది భద్రాచల చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం.

ఏకోపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే వ్యాయామ శిక్షకుడిగా ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడే వారికి అనసూయమ్మ గారితో వివాహం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా నడయాడిన ధర్మపత్ని ఆవిడ.

పిల్లలకు విద్యను బోధించడం అంటే కేవలం పుస్తకాల్లో సిలబస్ మాత్రమే బోధించడంగా భావించలేదు ఆయన. విద్యార్థులకు వ్యక్తిత్వం, వికాసం, మంచి నడవడిక ఉంటే జీవితం నల్లేరు మీది బండిలా సాగుతుందని ఘాఢంగా నమ్మేవారు. అందుకే గిరిజన విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు. వారంతా గూడెం లో కాయ కష్టం చేసుకొనే కష్టజీవుల పిల్లలు. శుచీ, శుభ్రం తెలీని వారు. ఆచార్యుల వారు మట్టిబొమ్మల్లాంటి వారిని మనుషుల్లాగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొన్నారు. వారి దినచర్యలో స్నానం చెయ్యడం, తలకు నూనె రాచుకొని తలను శుభ్రంగా దువ్వుకోవడం నేర్పించారు. తన సొంత ఖర్చులతో విద్యార్థులందరికీ దువ్వెనలు కొనిచ్చారు. గూడెం ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి జీవితాలతో ఆడుకుంటూ వారిని మోసం చేస్తున్న మంత్రగాళ్ల గుట్టు మట్లను బయిట పెట్టి అవసరమైతే దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు.

ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందున ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు వడలి మందేశ్వరరావు గారు, భాస్కర శాస్త్రి గారు వీరికి ఆప్తమిత్రులు. తరచూ వీరి మధ్య మంచి సాహితీ చర్చలు జరుగుతుండేవి. తెలుగు సాహిత్యం పట్ల అభిమానం, దేశభక్తి కలగలసి స్థానిక ( భద్రాచలంలో ) గ్రంధాలయోద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలోనే ‘ దాశరథి గ్రంధాలయం ’ వేళ్లూనుకుంది. యువతను జాగృతం చేసే విధంగా అన్ని రకాల పత్రికలు, పుస్తకాలు అక్కడ పోగేశారు. చైనా, రష్యా దేశాల నుండి కూడా అభ్యుదయ సాహిత్యాన్ని తెప్పించేవారు. యువతరం లో రాజకీయ చైతన్యం, ఉద్యమ స్పూర్తి నింపేవారు.

వృత్తి రీత్యా భద్రాచలం నుండి కళింగపట్నం, రాజమండ్రి, అమలాపురం, పిఠాపురం లలో విధులు నిర్వహించినప్పటికీ ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా న్యాయ పోరాటం చేసేవారు. “ దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్… ” అన్న గురజాడ వారి సూక్తిని అణువణువునా ఒంట పట్టించుకున్నారు. ఈ క్రమం లోనే వేమన, సుమతి కారుడు, శ్రీశ్రీ, దేవులపల్లి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివారు. కేవలం తను చదవడం మాత్రమే కాదు… నలుగురిచే చదివించేవారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని తను ఆస్వాదించడమే కాదు… అందరికీ ఆ మాధుర్యాన్ని చవి చూపాలని తపన పడేవారు అప్పలాచార్యులు గారు.

మీ జీవితంలో మరచిపోలేని అత్యంత ఆనందకరమైన సంఘటన ఏది అని ప్రశ్నిస్తే ఒక్క క్షణం కళ్ళు మోసుకొని తాదాత్మ్యంగా ఇలా చెప్పారు.

“ భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ ఒకటి నాడు ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజున భద్రాచలం లోని యువతను, విద్యార్థులను పోగేసి అర్థరాత్రి వేళ కాగడాలతో ఊరేగింపు నిర్వహించాను. ఇందుకు కావలసిన గుడ్డ, చమురు ను స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా అందించారు. “ మా తెలుగు తల్లికి…. మల్లె పూదండ ” అన్న గీతాలాపన చేస్తూ సుమారు కిలోమీటర్ పొడుగునా కాగడాల ఊరేగింపు జరిపాము. పురజనులంతా హర్షాతిరేకంతో పూలు జల్లుతూ అడుగడుగునా మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికారు… ”.

చెప్పడం పూర్తవగానే ఆయన కళ్ల నుండి జలజలా ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి.

తెలుగు భాష పట్ల అత్యంత మక్కువను పెంచుకున్న ఆచార్యుల వారు ప్రస్తుత తరుణంలో మాతృభాష మృతభాష గా మారుతున్న తీరు పట్ల తీవ్రంగా కలత చెందారు. తెలుగు భాష అంతరించిపోతోందని గొంతు చించుకొని అరవలేదు. కంఠశోష వచ్చేలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. 95 ఏళ్ల పైబడిన ముది వయసులో కూడా తన పరిధిలో తనకు చేతనయిన విధంగా తెలుగు భాష రక్షణకు తొలి అడుగు వేశారు. చుట్టూ ముసురుకున్న చీకట్లను తిడుతూ కూర్చోకుండా చిరుదీపాన్ని వెలిగించదలచారు.

వారి పెద్ద కుమారుడు అరుణ కుమార్ అకాల మరణం తర్వాత వారి సృత్యర్థం భద్రాచలం లోని కోమల విద్యా విహార్ పాఠశాలలో ప్రతీ ఏటా విద్యార్థులకు వేమన పద్యాల పోటీ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు 20 వేమన పద్యాలను కంఠస్థము చేసి ఒప్పజెప్పాలి. మొదట ఈ పోటీ గురించి విన్నవారు ఇది అసాధ్యమైన పనిగా నిరుత్సాహ పరిచారు. కాని ఆచార్యుల వారి పట్టుదలతో పోటీ నిర్వహించడం జరిగింది. ఆశ్చర్యం గొలిపేలా మొదటి పోటీ రోజునే అన్ని వయసుల పిల్లలు ఏకధాటిగా పద్యాలను అప్పజెప్పారు. ఆరోజు తరువాత వారు వెనుదిరిగి చూడలేదు.

పోటీ రోజున తప్పులు లేకుండా పద్యాలను ఒప్పజెప్పిన వారిని విజేతలుగా ప్రకటించి వారికి బహుమతులు ఇస్తున్నారు. అంతే కాదు. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నారు. ఆచార్యుల వారు ఈ కార్యక్రమానికి జరిగే ఖర్చునంతా స్వయంగా తనకు వచ్చే ఫించను ఆదాయం నుంచే భరిస్తున్నారు. కానీ ఎవ్వరినుండి ఒక్క పైసా ఆశించడం లేదు. కోరడం లేదు.

2005 వ సంవత్సరం నుండి మొదలైన ఈ కార్యక్రమం తెలుగు భాషాభివృద్ధి స్పూర్తితో గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఏటా 20 పద్యాల చొప్పున ఇప్పటి వరకు సుమారు 200 పద్యాలను పిల్లలకు నేర్పించారు. ఈనాటి పిల్లలలో తెలుగు భాష పట్ల అభిరుచి, మమకారం పెంచే విధంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ప్రతి యేడూ డిసెంబర్ 11 నుండి 15వ తేదీ మధ్యలో శతక పద్యాల పోటీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. వంద సంవత్సరాలకు చేరిన వీరి కృషి, వారి ఆలోచనా ధోరణి నేటి తరం వారికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు కు మళ్ళీ వెలుగు వచ్చి తీరుతుందని, తెలుగు భాషకు పూర్వ వైభవం తిరిగి వస్తుందన్న నమ్మకం కలుగుతుంది.

తల్లి పాలల్లోని మాధుర్యాన్ని తలపించేది అమ్మభాష తెలుగు భాష. అలాంటి మన భాష పరాయి భాషా ప్రభావంతో చిక్కి శల్యమయి పోతోంది. తెలుగు భాషా వికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప ఈ పరిస్తితి చక్కబడదు. తెలుగు భాషా వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… అని అందరూ ఊక దంపుడు ఉపన్యాసాలిస్తారు.

అందుకు భిన్నంగా ఆ కృషికి నాందిగా తానే నడుం బిగించి పాశ్చాత్య భాషా తుఫాను గాలికి రెప రెపలాడుతున్న తెలుగు దీపానికి తన రెండు చేతులూ అడ్డం ఉంచి తన వంతుగా ఆ దీపపు వెలుగును ప్రజ్వలింప జేయాలని చూస్తున్న ఆచార్యుల వారి కృషి బహుధా అభినందనీయం.

ఇప్పుడు గాని శ్రీశ్రీ గారు వీరిని చూసి ఉంటే

“ కొంతమంది వృద్ధులు

రాబోవు యుగం దూతలు

పావన నవజీవన

బృందావన నిర్మాతలు…. ” అని తన కవితను సవరించి వ్రాసి ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు.

తెలుగు సంస్కృతీ వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. జాప్యం జరిగితే జరిగి ఉండవచ్చు. కానీ కాలయాపన తగదని ముందడుగు వేసిన ఆచార్యుల వారి కృషి తెలుగు వారమైన మనందరికీ గర్వకారణమే కాదు… స్పూర్తి దాయకంగా నిలుస్తుంది కూడా…..

.

*********************************