11_002 అన్నమయ్య – పోతన

.

          “కలౌ వేంకట నాయకః” అని కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని పరమ భక్తాగ్రేసరుడు అన్నమయ్య. 95 ఏళ్ళ పూర్ణ ఆయుష్మంతుడు. 32 వేల సంకీర్తన సుమాలతో శ్రీనివాసుని అర్చించి తరించాడు ఈ పదకవితామహుడు. అదే 15వ శతాబ్దికి చెందిన వాడు పోతన మహాకవి. తన సహజ పాండిత్యంతో సంస్కృత భాగవతాన్ని తేట తెలుగు పద్యాలలో రచించి తరించాడు. వీరిద్దరిని పరిశీలించి చూస్తే ఎన్నో విషయాల్లో ఇరువురి దృక్పథాలు ఒక్కటే అని తెలుస్తోంది.  “జన్మానాం నర జన్మం దుర్లభం “ అని ఎన్నో జన్మల తర్వాత పొందే ఈ మనుష్య జన్మలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. “పునరపి జననం పునరపి మరణం” అన్న చక్రం లేకుండా మోక్షాన్నిపొందటం మానవ జన్మతోనే సాధ్యం. అయితే మోక్షం ఎలా లభిస్తుంది? అంటే కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల ద్వారానే సాధించగలం. ఈ మార్గాల్లో నడచి మోక్షాన్ని అందుకున్న వారిలో ప్రధానంగా పేర్కొనదగ్గవారు అన్నమయ్య పోతనలు. 

.

          వీరిరువురు అలౌకిక విషయాలకి ప్రాధాన్యత నిచ్చారు. సత్కర్మలనే ఆచరించారు. తమకి భగవంతుడిచ్చిన జ్ఞానంతో భక్తి మార్గంలోనే జీవితమంతా నడిచారు. కాబట్టే మోక్షాన్ని అందుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరూ ఒకే కాలానికి చెందినవారు. ఒకే దృక్పథంతో ఇహలోక వాంఛ లేనివారు. అలౌకికమైన, శాశ్వతమైన మోక్షేచ్ఛతోనే భగవంతుని పూజించి తరించారు. దానికి వీరెంచుకున్న మార్గాల్లో తేడా ఉన్నా వారి భావాల్లో భేదం కనపడదు. ఒకరిది పద సాహిత్యమైతే, మరొకరిది పద్య సాహిత్యం. అన్నమయ్య పదాల్లో సాహితీ విలువలున్నాయి. పోతన పద్యాల్లో సంగీత బాణీలున్నాయి. మరి వీరిద్దరూ వారి సొంత ప్రయోజనార్థమై రచనలు చేసారనుకుంటే పొరపాటు. వాటిలో సామాజిక ప్రయోజనం కూడా ఎంత కావాలంటే అంత కనిపిస్తుంది. వీరి పద పద్యాలు పరిశీలిస్తే నిత్య సత్యాలు, జీవన విధానం, దాని విలువలు, నిర్మలమైన మనోభావాలు, స్ఫూర్తి, మోక్షానికి మార్గం లాంటి సూత్రాలు కనిపిస్తాయి. “ఏకం సత్” అంటే శాశ్వతమైన పరమాత్మని అనన్యమైన భక్తితో స్తుతించి మోక్షాన్ని పొందారు అన్నమయ్య పోతనలు. మనిషి స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని లోకానికి బోధించిన సద్గురువులు వీరు. అన్నమయ్య, పోతనలు నడచిన దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే. అది ఏమిటంటే నిష్కామ భక్తి మార్గంలో పయనించి ముక్తిని పొందాలన్నదే వీరి భావన. ఒకరు పద్య గద్యాలతో కీర్తించారు. మరొకరు తేనెలొలికే తియ్యని తెలుగు పదాలతో సంకీర్తనలను సంతరించారు. పరమాత్మలో ఐక్యమైన ఈ పద పద్య కవులు భానుచంద్రుల్లా వారి రచనల్లో ఎన్నటికీ చిరంజీవులే అవుతారు.

.

          అన్నమయ్య పోతనల మధ్య ఉన్న భావ సామ్యాల్ని కొన్నింటిని పరికిద్దాం. అన్నమయ్య శ్రీ మన్నారాయణుని ఖడ్గమైన నందకాంశతో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు రాయలసీమలోని తాళ్ళపాక గ్రామంలో ప్రభవించాడు. శ్రీహరి పరమ భక్తుడైన ప్రహ్లాదుని అంశతో పోతన, కేసన లక్కమాంబ దంపతులకు జన్మించాడు. పోతన రాయలసీమ ప్రాంతం వాడని కొందరంటే, తెలంగాణా ప్రాంతం వాడని మరికొందరు విమర్శకుల అభిప్రాయం. పోతన కూడా రాయలసీమ ప్రాంతం వాడే అన్న దాని ప్రకారం ఇరువురు ఏక ప్రాంతవాసులే అవుతారు. వారి తల్లిదండ్రుల నామాలు కూడా లక్ష్మీనారాయణుల పదాలకి సమానార్థకాలే అవుతున్నాయి. ఎలాగంటే అన్నమయ్య జననీ జనకులు నారాయణ సూరి, లక్కమాంబలైతే పోతన తల్లిదండ్రులు లక్కమాంబ కేసనలు. కేశవ నామార్థానికి సమానంగా కేసన, లక్ష్మి పదానికి సమానార్థకంగా లక్కమాంబ అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులే వీరి మాతాపితరులుగా భావించవచ్చు.    అన్నమయ్య పోతనలు ఒకే కాలం వారు. అంటే సమకాలికులు. వీరిలో చాలా సాదృశ్యాల్ని మనం గుర్తించవచ్చు. ఇద్దరికి ఊరి పేరే ఇంటి నామంగా స్థిరపడింది. ఇరువురూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారే. మరొక ప్రధానమైన అంశం వీరిలో ఒకటిగా కనపడేదేమిటంటే ఇద్దరూ రాజాశ్రయాన్ని ధిక్కరించారు.

.

          ప్రతి మనిషి ఆధ్యాత్మిక విషయాల జిజ్ఞాసను ఏర్పరచుకుని ప్రయోజనాన్ని పొంది వాటితో  పరమానందాన్ని పొందగలడు. ఇక్కడ ఈ జిజ్ఞాస అన్నది వీరిరువురి సాహిత్యం చదవడం వల్ల కలుగుతుంది. తద్ద్వారా విజ్ఞానాన్ని పొంది అమితానందాన్ని అనుభవించవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పోతన పద్యాల్లో శబ్దాలంకార సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పదకవితాపితామహుని పదాల్లో గానామృతాన్ని పానం చేయవచ్చు.   వీరిరువురి సాహిత్యంలో కానవచ్చే భక్తి పారవశ్యానికి పొంగిపోని వారు ఉండరు.

.

మ. లలితస్కంధము గృష్ణ మూలము శుకాలాపాభిరామంబు మం

     జులతాశోభితమున్ సువర్ణ సుమనసుజ్ఞేయమున్ సుందరో

    జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై

    వెలయున్ భాగవాతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజాశ్రయమై”

అన్నది పోతన భాగవత సారాంశమైతే, అన్నమయ్య సంకీర్తనల సారాంశం ఇలా కన్పిస్తోంది.

.

మ. శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞాన సారంబులై

     యతిలోకాగమ వీథులై విపుల మంత్రార్థంబులై నీతులై

     కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై

     నుతులై తాళులపాక యన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్”

.

          ఇక అన్నమయ్య పోతనల జీవిత సాదృశ్యాల్ని కొంత పరికిద్దాం. సదాచార భక్తి ప్రపత్తులున్న సంప్రదాయ కుటుంబాల్లో పుట్టారు. దైవానుగ్రహంతో పాండిత్యాన్ని కలిగి ఉన్నవారు. తమ అమేయమైన భక్తితో ఆధ్యాత్మిక జ్ఞానం మెండుగా కలిగిన జ్ఞానులు. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి నిరంతరం ఆ పురుషోత్తముని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ధ్యానిస్తూ ధర్మబద్ధమైన జీవనాన్ని ఆచరించినవారు. తమ చుట్టూ ఉన్న సమాజానికి వారిలో ఉన్న ఆ భక్తి రసామృతాన్ని పంచిన సత్కవివరేణ్యులు అన్నమయ్య పోతనలు. అన్నమయ్య కుమారులు, మనవళ్ళు కూడా మంచి కవులుగా కీర్తిని పొందినవారు కావడం విశేషం. మరి పోతనకు శిష్యులు భాగవత రచనలో పాత్రులయ్యారు.

.

          “ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, బాల రసాల సాల, కాటుక కంటీనీరు…”లాంటి పోతన పద్యాలు గమనిస్తే రాజాశ్రయం పట్ల ఉన్న విముఖత అర్థమవుతుంది. అదే విధంగా అన్నమయ్య సైతం రాజాజ్ఞని ‘నరహరి కీర్తనానిన నా జిహ్వ నొరుల నుతింప నోపదు జిహ్వ’ అని ధిక్కరించి రాజాగ్రహానికి గురయ్యాడు. అయినా తన భక్తి ప్రపత్తులతో రాజుని కూడా మహాభక్తుడిగా మార్చిన అన్నమయ్య తాను నమ్మిన ఆ పరమాత్మ శరణాగతి తత్త్వాన్ని లోకానికి తెలియజేశాడు. ఇద్దరూ బహు గ్రంథకర్తలే. అన్నమయ్య 32 వేల శృంగార, ఆధ్యాత్మ, భక్తి సంకీర్తనలతో పాటు 12 శతకాలు, శృంగార మంజరి అనే ద్విపద కావ్యం, వేంకటాచల మాహాత్మ్యం, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం అనే గ్రంథాలను కూడా రచించాడు. ఆ రకంగానే పోతన కూడా భాగవతం కాకుండా భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం లాంటి ఇతర రచనలు చేశాడు.

.

          అన్నమయ్య పోతన లిరువురిలో శివ కేశవాభేదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈతడే హరుడు, ఈతడే అజుడు..అని ఒక చోట, కాల కూట విషమైన గ్రక్కున మింగిన నీలవర్ణుడే మా నిజ దైవము…అని మరొకచో అన్నమయ్య అనడం దీనికి నిదర్శనం.  మరి పోతన కూడా మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని శరీరానికి అంటుకున్న మన్ను విభూతి అలదుకున్న శివరూపంలా ఆ బాలకృష్ణుని రూపం ఉన్నదని వర్ణించే పద్యం చదివితే “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే” అన్న శ్లోకం మదిలో మెదులుతుంది.

.

          అన్నమయ్య పోతనలు తమ రచనల్లో పొందు పరచిన భాషని చూస్తే ఇద్దరూ పండిత పామర జన రంజకంగా తమ పద పద్యాలను తీర్చారు. సహజ పండితుడైన పోతన అన్ని వర్గాల వారిని మెప్పించే రీతిలో రచిస్తానని చెప్పాడు. తన గ్రంథంలో వ్యావహారిక పద పరిమళాలను చదువరుల చేత ఆస్వాదింపజేసిన తీరు అత్యంత అమోఘం. ఉదాహరణకి “అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.., ఓయమ్మ నీ కుమారుడు మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మ, ఏమి నోము ఫలమొ” లాంటి పద్యాలు మచ్చుతునకలు. అన్నమయ్య కూడా తన సంకీర్తనల్లో “చూడమ్మ సతులాల..,  చక్కని తల్లికి చాగు బళా…” లాంటి ఎన్నో కీర్తనల్లో జనపదంలో ఉన్న భాషని ఇంపుగా గుప్పించాడు. దీనివల్ల ఏమిటి తెలుస్తుందంటే సామాన్యప్రజ కూడా పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకుని తరించాలనుకున్న ఈ భక్తకవుల మనోభిష్టం అనన్య సామాన్యం అనే చెప్పాలి.

.

          అన్నమయ్య తన పదాలనన్నింటిని రాగతాళయుక్తమైనవిగా తీర్చాడు. కొన్ని పద్య లక్షణాలున్న పదాలు కూడా కనిపిస్తాయి. అలాగే పోతన  పద్యాల్లో సంగీతపరమైన పద్యాలు కొన్ని కనిపిస్తాయి. అవి ప్రార్థనా గీతాలుగా, లాలి పాటల్లా పాడుకునే పద్యాలను అందించిన పోతనకు సంగీతం పట్ల ప్రావిణ్యం ఉన్నట్లు కనిపిస్తోంది. “కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ….నీ పాద కమలసేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము, మందార మకరంద మాధుర్యమున తేలు..” లాంటి పద్యాలు, జోజో కమలదళేక్షణ జోజో మృగరాజ మధ్య వంటివెన్నో గమనిస్తే వాటిల్లో ఉన్న సంగీత మాధుర్యం వ్యక్తమవుతుంది.

.

          వీరిద్దరి సాహిత్యంలో ప్రధానంగా కనబడే ఒకేరకమైన భావసామ్యాల్లో కొన్ని విహంగ వీక్షణంలా ఇలా చెప్పుకోవచ్చు. ఈ భావ సామ్యాలను చూస్తుంటే వీరిద్దరు గొప్ప భావాలున్న పవిత్ర స్నేహితులా అని అన్పించడం కద్దు. ఎందుకంటే ఒకరినొకరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇంచిమించు ఒకే కాలంవారు. మరి ఇంత భావసామ్యం ఏ ఇరువురిలో ఉంటాయి? అని అనుకుంటే ఒక్క కారణం కనిపిస్తోంది. అది దైవ సంకల్పం. ఇద్దరి హృదయాల్లో కొలువైన వాడు శ్రీహరి మాత్రమే. ఆ పరమాత్మే వీరి మనసుల్లో ఉండి తన గుణగణాలను కీర్తింపజేశాడనిపిస్తుంది. అన్నమయ్య

.

“నా నాలికపై నుండి నానా సంకీర్తనలు

పూని నాచే పొగిడించితివి          

వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ

కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివింతె అయ్యా”

.

అని తన నాలుకపై కొలువుండి సంకీర్తనలు పలికించాడంటే పోతన ఏమన్నాడో తెలుసుకుందాం. “పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట..”అని తన చేత ఆ రామభద్రుడే భాగవతాన్ని పలికించాడని చెప్పాడు. “భాగవతము తెలిసి పలుకుట చిత్రము…నే బలికిన భవహరమగునట…” అని పోతన అంటే అన్నమయ్య ఇలా అన్నాడు. “నేనొక్కడ లేకుండితే నీ కృపకు బాత్రమేని పూని నా వల్లనే కీర్తి బొందేవు నీవు అని కూడా చెప్పుకున్నాడు. వీరి భక్తి అనన్య సామాన్యం. భగవంతుడు అంతరాత్మగా ఉండి వీరి చేత ఈ మాటలు పలికించాడు. ప్రత్యక్షంగా వ్రాసింది వీరైనా ఆ విధంగా చేయించిన వాడు భగవంతుడే అనడం వీరి వినయానికి, భగవంతునిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం.

.

          అన్నమయ్య పోతనల పద పద్య పోకడల్లో కూడ భావ సాదృశ్యం కనిపిస్తుంది. శరద్రాత్రి నాడు శ్రీకృష్ణుని చేరవచ్చిన గోపకాంతలకు మురళీధరుడు కన్పించలేదు. అప్పుడు ఒక గోపిక ఆ లీలావినోదుని రూప లావణ్యాలను ఇలా చెబుతూ వెదుకుతోంది.

.

ఉ. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పై

    జల్లెడువాడు మౌళి పరిసర్ఫిత పింఛమువాడు నవ్వు రా

    జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో

    మల్లియలార మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరె “

.

అనే పద్యాన్ని పోలిన అన్నమయ్య పదం కూడా ఒకటి  కనిపిస్తోంది. “వలచి వచ్చితి నేను వానికి గాను” అనే కీర్తనలో చెందమ్మి కన్నులవాడు చేతి పిల్లనగ్రోవి వాడు ఇందువచ్చి కంటిరా…నెమలి పింఛము వాడు, నీలిమేఘ కాంతివాడు రమణుడాతడు మొక్కేను రమ్మనరమ్మ..జమళి చేతుల వాడు సంకుచక్రముల వాడు అమర నీ పాల జిక్కునట చూపరమ్మ” అని ఇక్కడ అన్నమయ్య తానే నాయికగా మారి పురుషోత్తముని రూపురేఖలు వర్ణించిన తీరు గమనిస్తే ఇద్దరూ  వైష్ణవులు కాబట్టి మధుర భక్తిని ప్రదర్శించారనిపిస్తుంది.

.

          వీరిద్దరి మనోభావాల్లో మనదైన చల్దులు కూడా ఆరగించాడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. భక్తితో పెట్టాలే కాని విదురుడు పెట్టిన అరటి తొక్కలని కూడా ఆరగించాడు కదా! ఇక చలువ చేసే చద్ది తినిడంలో ఆశ్చర్యం లేదు. “మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద” అని పోతన పెట్టాడు. “ఊరగాయలను నొద్దిక చద్దులు నారగింపుచు” అని అన్నమయ్య కూడా ఊరగాయలతోడి చద్దిని పెట్టాడు..

.

          మరొకచోట భగవంతుని స్తుతించని బ్రతుకులెందుకు వృథా అంటూ ఇద్దరూ తమ భావాలను వ్యక్తీకరించారు. వీరి భక్తి రస భరిత భావ సామ్యాల్లో ఒకరికొకరు తీసిపోరనిపిస్తుంది. అన్నమయ్య “హరిగొలువని కొలువులు మరి యడవి గాసిన వెన్నెలలని అంటున్నాడు. మరి పోతన నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనమ్ములు కఠిన శిలలు అని అన్నాడు. “విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే కాదు పాద యుగళము తోడి పశువు” అని అన్నాడు.

.

          పరమపురుషుడు, పరమశివుడు, పరదేవత, పరబ్రహ్మ అని ఎలా అన్నా ఆ పరమాత్మ ఒక్కడే. కాని నామాలు, రూపాలు వేనవేలు. అలాంటి పరమాత్మ తత్త్వాన్ని ఈ పద పద్య కర్తలిరువురు కీర్తిస్తున్నారు ఇలా. “ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవు..” అన్న కీర్తనలో పరతత్త్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. మరి పోతన కూడా అదే భావాన్ని “భావించి కొందఱు బ్రహ్మంబు నీవని తలపోసి కొందఱు ధర్మమనియు..” అనే సీస పద్యంలో పరబ్రహ్మ తత్త్వాన్ని వర్ణించాడు.

.

          ‘విష్ణువు’ అంటే అంతటా వ్యాపించిన వాడు అన్న అర్థం ఉంది. సంకీర్తనాచార్యుడు, సహజపండితులిరువురు సర్వాంతర్యామిగా శ్రీ మహావిష్ణువుని స్తుతించిన తీరు వారి భావ సామ్యానికి మరొక ప్రతీకగా చెప్పవచ్చు. ”హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు.. “అని పోతన అంటే అన్నమయ్య “విశ్వమెల్ల నీ విరాట్రూపమే సర్వం విష్ణు మయంగాన…” అన్న కీర్తనలో చెప్పాడు.

.

          శ్రీహరి ధ్యానమే ఇహపర సాధనంగా గొన్నవారు అన్నమయ్య, పోతనలు. “పానీయంబులు ద్రావుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్…” అన్న పద్యంలో నిరంతరం నారాయణ నామపారాయణమే  శరణ్యమన్నాడు. దానికి సాదృశ్యంగా అన్నమయ్య “ఇహపర సాధనమిదియొకటే సహజపుమురారి సంకీర్తనొకటే” అన్న కీర్తనలో చెప్పాడు. “సతతము శ్రీహరి సంకీర్తననంత ద్వ్యతిరిక్త సుఖంవక్తుం నాస్తి..” అని మరొక కీర్తనలో కొనియాడడం యాదృచ్ఛికం అందామా? వీరి హరిభక్తికి ప్రతీక అందామా?

.

          ‘నారాయణ’ అన్న నామాన్ని అనడానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యమంటుంది శ్రీ వైష్ణవ మతం. ఇక్కడ పోతన అన్నమయ్యలు ఏమంటున్నారో చూద్దాం! భాగవతాన్ని రచించే అవకాశం పూర్వ జన్మ సుకృతం అన్నాడు పోతన.

.

మ. “ఒనరన్ నన్నయ తిక్కనాది కవిలీ యుర్విం బురాణ వళుల్

      తెనుగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో

      తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనిగించినా

      జననంబున్ సఫలంబు జేసెదన్ పునర్జన్మ లేకుండగన్”

.

అట్లే అన్నమయ్య కూడా భగవత్ సంకీర్తనలు గానం చేయడం తన సుకృతంగానే భావించాడు. “నెమ్మది వేంకట నిలయుని దాసుల సొమ్మై నిలుచుట సుకృతమది”.

          పోతన భాగవత ప్రశస్తిని, అన్నమయ్య సంకీర్తన ప్రశస్తిని ఇలాగ కొనియాడారు.

.

“నిగమములు వేయుచదివిన

సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను

నిగమంబు బఠింప ముక్తి నివసనము బుధా” 

.

అని పోతన చెప్పాడు. ఇక అన్నమయ్య ఎలా అన్నాడో చూడండి. “అన్ని మంత్రములిందే ఆవహించెను” అన్నిటికిది పరమౌషధము” అని,  “కలియుగంబునకు గలదిదియె వెలసి పంచమవేదము కలిగె “ అన్నకీర్తనల్లో సంకీర్తన ప్రశస్తిని చెప్పాడు.

.

          శ్రీ కృష్ణుడు భగవద్గీతలో భక్తిని గురించి చెబుతూ మొదటి తరగతికి చెందిన వారి లక్షణాలు “సతతం కీర్తయం తో మాం..” అన్న శ్లోకంలో నా గుణాలను, దివ్య నామాలను, అద్భుత లీలలను కీర్తిస్తూ, నా పై భక్తితో ప్రణామాలాచరించి తీవ్ర నిశ్చయంతో నన్నే చేరాలని ఇంద్రియాలను , మనస్సును నిగ్రహించి నా యందు మనస్సు లగ్నం చేసి నన్ను ఉపాసిస్తారన్నాడు. ఈ మొదటి తరగతికి చెందిన వారే  పద పద్యకవులిద్దరు. నిత్యం నారాయణ నామస్మరణే పరమావధిగా, అదే మోక్షానికి మార్గమని భావించారు. మార్గాలు వేరైనా తాము అనుకున్న గమ్యాలను చేరుకున్న మహాభక్త కవులు అన్నమయ్య పోతనలు.            

.

——-(O) ——-