.
అత్తగారు:
ఏడుకొండలవాడ గోవిందా రామ
ఎత్తుకెళ్ళు నన్ను గోవిందా రామ
స్వర్గానికెళ్ళాక గోవిందా రామ
పులిహోర చేస్తాను గోవిందా నీకు
పులిహోర చేస్తాను గోవిందా
.
కొడుకు: అమ్మా, ఇవేం గోవింద నామాలే, కొత్తగా ఉన్నాయి?
.
కోడలు: ఆఁ, మీ అమ్మ స్పెషల్ గా రాసిన గోవింద నామాలు!
.
కొడుకు: ఆఁ, గోవింద నామాల్లో కూడా తిండి గొడవేనా?
.
కోడలు: ఆవిడకి భక్తి భుక్తి యావ కూడా ఎక్కువే.
.
అత్తగారు:
మేకలాంటి కొడుకు గోవిందా రామ
పులిలాంటి కోడలు గోవిందా రామ
నేనంటే పడదు గోవిందా రామ
ఎడ్డేమంటే తెడ్డెం గోవిందా రామ
మొన్న పక్కింటి పిన్నిగారిచ్చిన ఆవకాయ తిన్నావా?
.
కోడలు: ఆఁ తిన్నాను. భలేగా ఉంది.
.
అత్తగారు: ఆఁ ఏం బాగులే.. నా మొహంలా ఉంది. గొడ్డు కారం. కొంపదీసి నా కొడుక్కి పెట్టావా ఏం?
.
కోడలు: ఇంకా లేదండీ. ఇవాళ పెడతాను.
.
అత్తగారు: అస్సలు పెట్టద్దు. ఈసారి నేనే ఆవకాయ పెడతాను.
.
కోడలు: మీరా!? ఎందుకొచ్చిన ఆవకాయండీ? ఇంట్లో అందరికీ బీపీలు, కొలెస్ట్రాలు. డాక్టర్ ఊరగాయలే తినద్దన్నాడు. ఇంక ఆవకాయ పెట్టడమెందుకు?
.
అత్తగారు: ఆఁ, నీ చేతి వంట తినలేక ఛస్తున్నాను. కూరలో ఉప్పు ఉండదు, పచ్చట్లో పులుపు ఉండదు, పులుసులో ముక్కలుండవు, చారులో ఘాటు ఉండదు. నా నాలుక చచ్చిపోయింది. నా నోటికి కాస్త ఆవకాయ తగిలిస్తే గాని ప్రాణం లేచిరాదు.
.
కోడలు: ఎందుకండీ ఒళ్ళు పాడు చేసే ఆవకాయ మీద అంత మోజు? తాజాగా రోజుకొక పచ్చడి చేసుకొని హాయిగా తినచ్చు కదా?
.
అత్తగారు: ఆఁ ఏం పచ్చడిలే. నువ్వు చేసేది కొత్తిమీర, కరివేపాకు, పుదీనాలేగా?
.
కోడలు: వాటిల్లోనే ఉన్నాయి విటమిన్లు. అవి తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
.
అత్తగారు: బాగుందే వరస. మన పెద్దవాళ్ళందరూ ఆవకాయ తినేగా దిమ్ము దిమ్మని తిరిగింది!? నువ్వు చేసే పచ్చళ్ళు తినే మీకు ఊఁ అంటే నీరసం ఆఁ అంటే నీరసం. ఆ కాలంలో ఉండేవా ఈ బీపీలు, షుగర్లు? ఎంతెంత తినేవాళ్ళం!
.
కోడలు: ఎందుకు లేవు? మీకు పేర్లు తెలిసేవి కావు. అంతే. ఇప్పుడున్న జబ్బులన్నీ అప్పుడు కూడా ఉండేవి. నెలల తరబడి మంచాన పడేవాళ్ళు కాదా? కోడళ్ళు చచ్చీ చెడీ చాకిరీ చేసేవాళ్ళు కాదా? ఆడపడుచులు తళుగ్గా వచ్చి అమ్మని పలకరించి మింగిపోయేవారు కాదా!?
.
అత్తగారు: ఊరికే అన్నారా పెద్దలు.. పుణ్యం కొద్దీ పురుషుడు ఖర్మ కొద్దీ కోడలు.. అని!
.
కోడలు: నామీద కోపంతో సామెతలు మార్చేయకండి.
.
అత్తగారు: నేను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను. కయ్యాల వారి ఇంటిపేరు గల అమ్మాయి వద్దురా… అని. వింటేనా?
.
కోడలు: జగడాల జగదాంబ కొడుకుని చేసుకోవడం మా అమ్మకీ ఇష్టం లేదు. ఓ సుఖమా? సంతోషమా? ఒక సరదానా పాడా? వంటింటి కుందేలునైపోయాను. ఎంతసేపూ మింగబెట్టడమే నా పని.
.
అత్తగారు: ఔనే, తింటాను. నా కొడుకు సంపాదనేగా? నువ్వెవత్తివే అడగడానికి? ఇంత తింటున్నాను కాబట్టే నీ కిట్టీపార్టీ స్నేహితుల్ని మేపుతున్నాను.
.
కోడలు: నేనడిగినప్పుడు ఒక్కసారైనా చేశారా? మీకు మూడొచ్చినప్పుడు ఒక్కసారి పకోడీలు చేశారులే మహా. జన్మంతా దెప్పుతూనే ఉన్నారు.
.
అత్తగారు: ఏది ఏమైనా సరే, నేను ఆవకాయ పెట్టి తీరతాను. ఎవరడ్డమొస్తారో చూస్తాను. (ఇంతలో కొడుకు వస్తాడు.)
.
ఒరేయ్ మాధవా!
.
కొడుకు: ఏమ్మా?
.
అత్తగారు: బజారు నుంచి ఐదొందల కాయలు కొట్టించి పట్టుకురా.
.
కొడుకు, కోడలు ముక్త కంఠంతో ఒకేసారి: ఐదొందల కాయలే!?
.
అత్తగారు: ఔను. నా అక్కచెల్లెళ్ళకి, నా అన్నయ్యలకి, పక్కింటి పిన్నిగారికి కూడా ఇవ్వాలి కదా. అసలు ఐదొందల కాయలు చాలా అని నేనాలోచిస్తుంటే?
.
కోడలు: ఆలోచిస్తారు. తేరగా వస్తే వెయ్యి కాయలు కూడా పెడతారు.
.
అత్తగారు: అవునే, పెడతాను. నీ బాబు సొమ్మేం కాదు. ఇస్తానన్న కట్నానికే గతి లేదు.
.
కోడలు: విన్నారా మీ అమ్మగారి మాటలు? ఆనాడు ఆదర్శం ఆదర్శం అంటూ కట్నం తీసుకోకుండా మా నాన్న చేతులు కట్టేశారు. మీ అమ్మకి సర్దిచెప్తానని పెళ్ళి చేసుకున్నారు. కానీ ఈరోజు వరకు మీ అమ్మగారి నోరు కట్టేయలేకపోయారు.
.
కొడుకు: ఎందుకమ్మా ఈ రాద్ధాంతం? వదిలేయ్.
.
అత్తగారు: నేను వేసే కొత్తావకాయ ఖర్చుతో మీ ఆస్తి తరిగిపోతుందని మీ ఆవిడ తెగ బాధపడిపోతోంది. నీ డబ్బు ముట్టుకుంటే ఒట్టు. నాకు నా పుట్టింటివారు ఇచ్చిన స్త్రీ ధనం ఇంకా ఎంతోకొంత ఉందిలే. దానితో ఆవకాయ పని కానిచ్చేస్తాను.
.
కోడలు: నేనెందుకు చెపుతున్నానో అర్థం చేసుకోరేం? పోయినేడాదే కదా ఆవకాయ తినేసి మంచాన పడ్డారు! బాధ పడింది మీరా నేనా! ఇప్పుడు మళ్ళీ ఆవకాయ అంటారేంటి?
.
అత్తగారు: అవునే, అంటాను. ఒక్కసారి కాదు. వందసార్లంటాను. ఇదే నాకు ఆఖరేడాది.
.
కోడలు: ఆఁ, ఈమాట నేను కాపురానికొచ్చినప్పట్నుంచీ చెప్తూనే ఉన్నారు. నేనూ వింటూనే ఉన్నాను.
.
కొడుకు: మహాప్రభో, ఇక ఆపండి! నాకు ఆఫీసుకు టైమవుతోంది. అమ్మా, నీకు ఆవకాయేగా కావలసింది? నేను ఆఫీస్ నుండి వస్తూ రెడీమేడ్ ఆవకాయ సీసా పట్టుకొస్తాను. సరేనా?
.
అత్తగారు: సరేలే. అదేదో తెచ్చి తగలేయ్. మీ ఆవిడ దెప్పిపొడుపులతో నా ఆవకాయకి దిష్టి కొట్టింది. ఇహ ఆవకాయ పెట్టినట్టే!
.
కోడలు: ఆ తెచ్చేదేదో సాల్ట్ లెస్, ఆయిల్ లెస్ ఆవకాయ చూసి తీసుకురండి.
.
అత్తగారు: ఉప్పు తక్కువావకాయలు, బుద్ధి తక్కువావకాయలూ నాకక్ఖరలేదు. దాని బదులు ఆ పుదీనా, కరేపాకు పచ్చళ్ళే నా మొహాన కొట్టండి. (అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)
.
కొడుకు: (ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.)
.
కోడలు: హమ్మయ్య. ఈరోజుకి గండం గడిచింది. రేపు ఇంకేం భాగవతం మొదలవుతుందో!? (శ్రోతలతో/ ప్రేక్షకులతో) మా ఇంటి భాగోతం విన్నారు కదా. మీరే చెప్పండి. ఆవకాయ పెడదామా వద్దా?
.
———-(O)———-