11_002 మా యూరోప్ పర్యటన – లండన్

.

ప్యారిస్ నుంచి లండన్ ప్రయాణం. తెల్లవారుఝామున పోర్టుకి వెళ్ళి హోవర్ క్రాఫ్ట్ ( Hover craft ) లో లండన్ చేరుకున్నాము. ఈ ప్రయాణం చరిత్రకెక్కిన ఇంగ్లీష్ ఛానల్ లో చేశాము. రైలు, విమానం కాదు…. నీటిమీద షిప్ కాదు… బోట్ కాదు… హోవర్ క్రాఫ్ట్ అనేది మోటార్ బోట్ లాంటిది. అద్దాలతో టాప్ ఉంటుంది. అక్కడ కొన్ని ఇండియన్ కుటుంబాలని కలిసాము.

.

ఒడ్డు చేరగానే దిగి ఇంగ్లండ్ నేలమీద నిలబడి నమస్కరించాము. మా మామగారు చదివిన దేశం. మన దేశనాయకులు కొంతమంది ఇంగ్లాండ్ లో ‘ లా ’ చదివిన దేశం. ఆ రోజుల్లో అందరూ లండన్ లో ‘ లా ’ చదవాలనుకునేవారు.

అటునుంచి ముందుగా బకింగ్ హామ్ ప్యాలెస్ చేరుకున్నాము. అక్కడ గార్డులు మారడం చూసాము. వారి డ్రెస్సులు, తలపాగాలు, గుర్రాల మీద మార్పు జరపటం అన్నీ చూసాము. అతి త్వరితగతిన బ్యాండ్ సహాయంతో కన్నుల విందులా జరిగే ‘ change of guards ’. అందరూ చూసే అవకాశం ఉన్నది.

.

.

తరువాత పీకడెల్లీ ( Piccadilly ) స్క్వేర్ అంతా తిరిగాము. లండన్ మెట్రో ఎక్కి, తిరిగి మేడమ్ టుస్సాడ్స్ ( Madame Tussauds) వాక్స్ మ్యూజియం చూసాము. ప్రసిద్ధి గాంచిన వ్యక్తుల విగ్రహాలు మైనం లాంటి దానితో తయారు చేసి పెట్టారు. నేటికీ చేస్తూనే ఉన్నారు ఈ కళాఖండాలని.

.

తరువాత లండన్ వీధులన్నీ తిరిగి, ఆలూ టిక్కి, చాట్ మసాలాలు తిని దేశీ రుచి, సువాసన అనుభవించి చాలా సంతోషించాము. అలవాటైన రుచి కదా ! ఆ చలి దేశంలో చాట్ భలే ఉంది.

.

మా స్నేహితులు గోపాల్, సామ్రాజ్యం. వీరు డాక్టర్లు గా లండన్ లో స్థిరపడ్డారు. వారి తల్లిని, పాపని కలిసి మంచి ఇంటి భోజనం చేశాము. వారికి శుభాశీస్సులు.

.

చాలామంది ఇండియన్స్ షాపులు పెట్టుకుని వ్యాపారస్తులుగా జీవించడం చూసాము. కొద్దిమంది ఆఫ్రికా లోని ‘ ఇడీ ఆమెన్ ’ నుంచి లండన్ వచ్చి స్థిరపడినవారున్నారు. మన దేశాన్ని పాలించిన అఖండ తెలివి, సామర్థ్యం కలిగి, ప్రపంచంలో వీలయినన్ని దేశాలు ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటిష్ వారు సర్వ సమర్థులు. వారి భాష చాలా దేశాలలోనూ నేటికీ వాడబడుతోంది కదా !

.

ఎన్నో తిరుగుబాట్లు, నిరసనలు, సత్యాగ్రహాలు నెరిపిన తర్వాత నిరాయుధులుగా మన దేశం మనకి వదిలి వెళ్లారు. గౌరవంగా ఇంగ్లాండ్ లోనే చదువుకుని స్వదేశం తిరిగి వచ్చిన మన నాయకులందరూ ఏకమై స్వదేశంలో తయారు చేసుకునే వస్త్రం, పంటలు వగైరాల అవసరం బోధ పరిచారు. బాపు స్వయంగా ఖద్దరు రాట్నం తిప్పి బట్ట నేయడం, దారం తీయడం చేశారు. ఆదర్శంగా జీవించారు. తరువాత మరెన్నో మార్పులు జరిగాయి. స్వాతంత్ర్యం అంటే ఏమిటో నేర్పారు. కానీ మనదేశం రెండుగా విడిపోయింది. ఇది చరిత్ర.

.

మనం పెరుగుతున్న దేశం మనది.దాన్ని బాగుచేసుకోవాలని, స్వయంకృషితోనే అది సాధ్యమని బోధించారు.

.

వీరందరికీ శతకోటి వందనాలు. ఈ 1980 ల్లో జరిపిన మా యూరోప్ యాత్ర విశేషాలు మీతో పంచుకోగలిగాను. ఇది ఆరోజుల్లో సాహసయాత్రే ! అలా 25 రోజుల యూరోప్ యాత్ర ముగించుకుని ఢిల్లీ కి తిరిగి వచ్చాము.

.

———(O)———