11_002 ప్రతీచి – లేఖ

.

ప్రతీచి – లేఖ ( వెలుగులోకి )


ప్రతీచీ ! ఎక్కడో పది వేల మైళ్ళ దూరంలో ఉన్న నీ కళ్ళతడి ఇక్కడ పాలంగి చెరువు పక్కన నడుస్తున్న నా అర చేతిలో ఉత్తరాన్ని తడిపేస్తోంది. మంచు వానలు ఉధృతం అన్నావు. ఓ పక్కన చలి ఎముకలు కొరికేస్తుంటే మరి వీధిలో నడవట మేమిటి ? గోదావరి ఈదురు గాలులు ఇక్కడ కూడా. ఉత్తరం అందుకున్నాను. చేతుల్లో వణుకు. నీ నుంచి అనేటప్పటికి మనసుకి వణుకు. చదవక ముందే కళ్ళలో చెలమలు. గొంతు బిగుసుకున్నట్లుంటుంది. కానీ మాటల్లో చెప్పలేని ఆనందం మాత్రం తన్నుకొస్తుంది. ఇదివరకటి బాధలు లేవు. ప్రపంచం ముందుకెళ్లిపోతోంది. చాలా త్వరగా నాలుగు రోజుల్లో చేరింది నీ ఉత్తరం. ఇదేమిటీ మొన్ననేగా నీ నుంచి అందుకున్నాను. చూడబోతే స్టాంపుతో పాటు పోస్టల్ వాళ్ళ తారీఖు కూడా తడిసిపోయింది.

.

మనందరిలో ఆర్ద్రత లక్షణం పరమ నిగూఢంగా ఉంటుంది. నీలో ఉంది. నాలో ఉంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది అంటే ఇదిగో ఇలాంటి సన్నివేశాల్లో. నాలో ఉన్న మార్దవానికి ప్రతిబింబానివి నువ్వు. మనసు చాలా విచిత్రమైనది ప్రతీచీ. అందువలన లోకం మరీ విచిత్రంగా కనిపిస్తుంది. మన లోపలుండే ఆలోచనలు. మన చుట్టూ ఉండే ప్రపంచం రెండూ వట్టి నీటి తుంపర్ల లాంటివి. పడకుండానే ఆవిరైపోతాయి. వాటికి ఒక స్థితి, రూపం లేదు. నీటి బుడగ లెంత సేపుంటాయి చెప్పు !

.

ఓమాటు ఆకాశంకెసి చూడు. మబ్బ్గు నీకు ఏనుగులా కనిపించటమేమిటి ? నాకు ఆవుల మందలా కనిపించటమేమిటి ? ఇలా కనిపించటానికి వర్షపు చినుకుల విన్యాసం కారణమా, ఇరవై నాలుగు వంకర్లు పోయే మన మనసులు కారణమా ? యాదృచ్చికమంటావా, కారణముందంటావా ? మన మీద ఈ ప్రభావం ఏమిటి ? కారణం అల్పం కావచ్చు. కానీ ఫలం మాత్రం మన జీవుణ్ణి మూల ముట్టుగా కదిలించేస్తోంది. ఇదంతా మన సంస్కార లక్షణం కాదూ ! అందుకే నిన్ను ప్రతిబబింబమన్నాను.

.

ఇక నీ ఉత్తరంలో విషయం.

సంగమేశ్వర శాస్త్రి మ్రోళ్ళు చిగిర్చేలా వీణ వాదన చెయ్యటం నా అనుభవంలో భాగం. బెంగుళూరు నాగరత్నం రాళ్ళు కరిగేలా పాడటం నాకు తెలుసు. వారి సమక్షంలో చుట్టూ వాతావరణం మారిపోతుంది. సంగీతం వినేవారికి శరీర స్పృహ పోతుంది. పాటలో సంగతులు వింటుంటే చందమామ చేతికందినట్లుంటుంది. ప్రతీ స్వరం ముద్రలుగా జ్ఞాపకాల ప్రపంచంలో చేరతాయి. ఆనందానికి సంగీతాన్ని మించిన వెసులుబాటేముంది అనిపించే సంప్రదాయం ఆనాటిది. పాట పాడేరు కానీ పాట తయారు చేయలేదు వాళ్ళు.

.

వెగటైనా సుఖమైనా సంస్కార విశేషాలే. పోతే సంస్కారమనేది ప్రాక్తన విషయం. ఈ జన్మలో అనుభవాని కొస్తుంది నిజం. కానీ ఆ లక్షణం ఎప్పటినుంచో కూడా కూడా రావలసినదే. చాల జన్మల నుంచి అని నేనన్నానంటే నువ్వు కథని మరో మార్గం పట్టిస్తావు. జన్మలేమిటంటావు. ఉన్నదీ జన్మ ఒకటేనంటావు. ప్రస్తుతానికి కాలాన్ని తారీఖులు పరం చేసి మన వాదనని దారి మళ్లించకుండా విషయం మీద నిలబడదాం. సంస్కారమనేది మన ఆలోచనల పరిణామం. దాన్ని గుర్తించటం కష్టం. వివరించటం మరీనీ… ఇక అనుసరించటం అంటావా అది అసాధ్యం. మనిషన్న ప్రతీ వాడికీ సంస్కారం ఉంటుంది. సహజగుణం. బ్రతుకులు ఎందుకు ప్రాకృతలైపోతున్నాయంటావూ చెప్పు. వారికా విషయం గుర్తు రాదు. వారికి వారి అనుభూతి వారి ప్రాణంలో భాగం కాలేదు కనుక. విషయానికొస్తే ఆ పాటగాడి పాట, ఆ వాతావరణం, ఆ సంగీతం, చుట్టూ జనాలు వారి ఉద్రిక్తత మతి పోగొట్టాయన్నావు. నీకు భరించరాని వెగటు పుట్టించాయన్నావు. అలజడితో ఉక్కిరి బిక్కిరి నీకు. ఆ ‘ వెగటు ’ ఎక్కడుందో గమనించు. ఎందుకుందో ఆలోచించు. అది నీ స్వభావానికి సహజమైన స్పందన ప్రతీచీ ! నీకు మల్లెనే ఆ ‘ వెగటు ‘ పుట్టించే చెడుకి ముఖం చిట్లించే వారంతా నువ్వు వారికి సహాయం చేసేవని ఆనందిస్తారు అనుభవంలో భాగం పంచుకున్నందుకు.      

.

ఇప్పటి తరం పాత సంప్రదాయాలనీ, పాట సంప్రదాయాలనీ పక్కకి త్రోసేశారు. గురువులతో పని లేదు. సరిదిద్దుబాట్ల బాధ లేదు. అంతర్జాలం అన్నీ నేర్పుతుంది. మనం పరికరాలకి బానిసలుగా పడుంటే చాలు. బుద్ధికి పనెక్కువ. మనసుకి విశ్రాంతి. పాట ప్రాణంతో నడిచొస్తున్నట్లుండేది పూర్వం. ఒక మాట చెప్తాను. ముత్యంలో నీరు లాంటిది సంగీతంలో రసం. సంస్కార బలం మెండుగా కావాలి రససిద్ధికి. నువ్వు నాలుగు రోజుల క్రితం వ్రాసిన ఉత్తరం పది వేల మైళ్ళు దాటి దగ్గరకొచ్చినట్లే వచ్చి నన్ను బహుజన్మల వెనక్కి లాక్కు పోతోంది. ‘ ఆ దేశానికి వలస పోయిన వారందరూ ఎన్నో దెబ్బలు తిని విచిత్ర పరిణామం పొందుతున్నార ’ న్నావు. వాతావరణం బలీయ మన్నావు. కాదు. వారి కోరికే బలీయం. లేదంటే ఆ దేశం అగ్రరాజ్యం కాలేదు. మనసులు పల్చనవుతున్నాయి. అంతే. వెళ్ళిన వారంతా పల్లెటూళ్లలో మూడో తరగతి దేశం మూలల్లో పుట్టిన వారే కదా ! సంస్కారం ‘ సత్తా ’ ననుసరించి ఉంటుంది. ఉనికిని బట్టి దానిని గుర్తించట మెలాగనేది నీ ప్రశ్న. నిరంతర పరిశీలన కావాలి. సాంద్రత నారనివ్వకూడదు. ఎప్పటికప్పుడు మనసు పదును పెట్టుకోవాలి. మన కన్నా మన జీవితం పెద్దదని గ్రహించాలి. ప్రపంచంలో తాత్వికులు చేసేదదే.

.

అక్కడి మనుష్యుల సంస్కారం వారి ఆలోచనలని చెప్తుంది. వారి నడవడి, వారి ఆలోచనలను చెప్తుంది. తప్పొప్పుల ప్రసక్తి లేదు ఇక్కడ. మంచి చెదుల బేరీజు వెయ్యొద్దు మనం. ప్రస్తుతం నువ్వుంటున్న దేశం గురించి మాట్లాడుతున్నాం గనుక అక్కడి మనుష్యులు అని చెప్పవలసి వస్తోంది. అయితే ద్వాంతం ఎక్కడుందంటావు ? మూడు పదులు దాటని ముచ్చటైన వయసు నీది. అందునా జీవితకాలంలో అటూ ఇటూ ముఫ్ఫై ఏళ్ల చొప్పున వదిలేస్తే మధ్యనున్న మురిపాల చోటులో నున్న, అందులోనూ ఆ దేశంలో ఉన్న నీ మనసులో ఉందా ద్వాంతం ? లేదా అక్కడి వారి సంస్కార విశేషంలో ఉందా ? నీకీ క్షణంలో ఉన్న ఆలోచన లన్నింటినీ స్వపనం చెయ్యి ఒక మాటు. ఎందుకంటే సంస్కారం కానీ, సంస్కార బలం కానీ సంప్రదాయం కానీ పరిపుష్టం కాదు ఎవరికీ. ఏమంటే ఈ సంస్కారాల గుంపులో కొన్ని కొన్ని జీవన్మరణ సమస్యలని బట్టి ఏర్పడతాయి. మరి కొన్ని అనుభవాల బట్టీ. ఈ రెంటికీ మధ్య నున్న అంతరం చాలా సూక్ష్మం. దీన్ని తెలుసుకోటానికి అదృష్టం ఒక ఆధారం. అదొక్కటే ఆధారం అని నేననను. ఎందుకంటే కనుపించనిదీ, అంతుబట్టనిదీ కనుక అదృష్ట మన్నాను. సంస్కారం పెంచుకొన్న్ కొద్దీ పెరుగుతాయి. సాధన కొద్దీ పెరుగుతాయి. ఏకాగ్రత కొద్దీ పెరుగుతాయి. ప్రపత్తి కావాలి. తర్వాత చెప్పుకుందాం. విషయానికొస్తాను.

.

అతగాడి పాట ఎంత కల్లోలం కలిగిస్తుందో చూడు. శాస్త్రీయత ఏ రంగంలో నైనా, ఏ విషయంలో నైనా అవసరమే. శుద్ధంగా, సమగ్రంగా దృష్టి నిలబెట్టాలి. వారూ చేస్తున్నారు శ్రమ. నీ మనసు పదార్థం వేరు. వారు వేరు. మనం ఎక్కడ నుంచున్నాము ? నిరంతరంగ ఎందుకు ఆలోచిస్తున్నాం ? మనలో జీవుడు ‘ అందం – ఆనందం – జ్ఞానం ’ అన్న ముక్కాలి పీట మీద నుంచున్నాడా ? లేక కుంటి కాలి జీవుడా ? ముందు ప్రశ్నించుకోవాలి మనని మనం. సమాధానాలు వెతకాలి. ఆలోచనలని నిర్ధారించుకోవాలి. ఆ స్వేచ్చ నీకుంది ఆ దేశంలో.

.

నీ మాటలు నీకు మరో సారి వినిపిస్తాను. ఈసారి నీ ఆలోచనలు మాటల్లా నానుంచి వస్తున్నాయి. శ్రద్ధగా విను. నిన్ను నువ్వు వినే వీలుంటుంది కదా. నీ ఉత్తరం చదువుతాను. నీ మాటలే ఇవి.

.

“ వైయసీ ! ఉద్యోగపు ఉరకలు పరుగుల తర్వాత ఒత్తిళ్ళు తోసుకుంటూ ఐదు గంటలు ప్రయాణం చేసి వచ్చాము నిన్నటి శుక్రవారం రోజున మిషిగన్ కి. ఊరంతా ఒకటే హడావిడి. ఇతని పాట చాలమందికి ఇష్టం. వేల కొద్దీ ప్రజ వచ్చి చేరతారు. ఊరంతుందీ భవనం. అంతా ఇనుము. అన్ని ప్రక్కలా అయోమయం. నాలోపల మరీనీ. తోసుకుంటూ వచ్చి కూర్చున్నాం. ముఫ్ఫై వేలమంది వింటున్నారు. అరుస్తున్నారు. అవి కేవలం అరుపులు కావు. దీర్ఘమైన కేకలూ, ఈలలూ. వికృతమైన ధ్వనులు. పాటందుకోగానే ప్రేక్షకుల్లో పిచ్చి కూతలు. వాయిద్యాల వేగంతో డ్రమ్ముల చప్పుళ్ళు. విచిత్రమైన లయ చప్పట్లతో. చెవుల్లో గింగుర్లు. ఈ దేశంలో దొరికే అన్ని పానీయాలు ప్రవహిస్తున్నాయి. విపరీతంగా తింటున్నారు. త్రాగుతున్నారు. ఆకలి పెంచే వాసన చుట్టూ ! సంగీతంలో ఉగ్రత. పాటలో మత్తు. రజస్సు తమస్సు ఒక్కటయ్యాయి. యౌవనం చేతులు రెండు పైకెత్తి గాల్లో అటూ ఇటూ ఊగుతోంది. పాటలో ఎక్కడో తీపి ఉంది కానీ కటువుగా వినిపిస్తోంది. సాధన చాలా ఉంది కానీ పదునుగా కోస్తోంది. పాడటంతో పరిశ్రమ ఉంది కానీ ప్రత్యాహారం లేదు. వింటున్న వారి శరీరాలు తూగిపోతున్నాయి. గానం విశేషం కావచ్చు కానీ విషయం చుట్టూ వస్తువు చుట్టూ తిరుగుతోంది. కానీ ఏమిటిది ? వేల వేల జనాలకి వినోదం కలుగుతోంది. వెఱ్ఱి పొంగుతోంది. నాతో వచ్చిన వారంతా వింటున్నారు. తలలు ఊపుతున్నారు. చప్పట్లు చరుస్తున్నారు. గావు కేకల్లో గానం తక్కువగా ఉంది. అసలు లేనట్లుంది.

.

వైయసీ ! ఏం జరుగుతోందిక్కడ ? చెప్పవా ? నా మాటలు నీదాకా వచ్చేనా ? ఈ సంగీతంలో ఏముంది ? నాలో ఎందుకింత అలజడి ? ఏమిటీ స్పందన ? నేనుండ లేను ఇక్కడ. నా గుండెల్లో కూడా భయంకరమైన చప్పుళ్ళు. దడ ఉధృతమైపోతోంది. నేను వెళ్లిపోతాను. పారిపోవాలిక్కడి నుంచి. అందర్నీ చూస్తుంటే నాదే తప్పన్న భావన కలుగుతోంది. చెప్పు నాలో లోపం ఉందా ? నాలో జీవితం మీద ఉత్సాహం తగ్గుతోందా ? సరదాలేమీ లేవా ? వినలేక పోతున్నానెందుకు ? తెలియని అహంకారం. నాకు నచ్చిందే పాట అన్న భావన గడ్డ కట్టుకుంటోందా !  

.      

నాతోటి వాళ్ళందరూ కూర్చుని వినగా లేనిది నాకెందుకు ఇంత అలజడి ? లేచి గబ గబా పెరుగుతున్న నన్ను చూసి మావాళ్ళు కంగారు పడుతున్నారు. ఇప్పుడే వస్తానని చెప్పి పరుగు పరుగున బయిలుదేరాను. ముఫ్ఫై వేల మందిని కూర్చోబెట్టగల ఆ మహా భవంతిని, అంతస్థులన్నింటినీ దాటి, మెట్లు దిగి వచ్చి ద్వారం దగ్గరకొచ్చాను. బయట మంచు కొండలు. అడుగేస్తే జారి పడేలా ఉంది. వశం తప్పిన మనసు శరీరాన్ని వీధిలోకి త్రోసింది. చలికి ఒళ్ళు కొయ్యబారిపోతోంది. మళ్ళీ లోపలికి వచ్చాను. భవంతి లోపలే చెట్లున్నాయి ! చుట్టూ గట్టు. నాకోసం అనిపించింది. వచ్చే పోయేవాళ్లు తలుపు తీస్తుంటే చల్లటి ఈదురు గాలి మొహాన్ని కొడుతోంది. తప్పదు. ఇక్కడే ఉండాలి. టీవీలు మోత. అబ్బా ! నవ్వుతున్నావేమో కానీ పరుగు పరుగున వచ్చాను. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న నిన్ను ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే కలవాలని ! నేను ధైర్యంగా పారిపోగలిగిన చోటు అదొక్కటే. నేను వ్రాస్తుంటే నువ్వు వింటున్నావు. చిత్రంగా లేదూ ! గాయకుడి వివరాలందిస్తూ ఈ సంస్థ వారు ఎనిమిది పేజీల పుస్తకం అచ్చు వేశారు. గుట్టలు ఎక్కడ చూసినా ! లక్ష ప్రతులు వేసారేమో ! ఆఖరు పేజీ తెల్లకాగితం. ఆటో ఇటూ కూడా ! ఇది తయారు చేసేటప్పుడు చాలా మంది, మరెంతో ఆలోచనతో చాలా కళాత్మకంగా చేస్తున్నామని అనుకుంటూ చేసుంటారు. నిజానికి బాగానే ఉంది. కళ్ళకి మాత్రమే ! ఏమిటి బాగుందో తెలియటం లేదు. సుఖం మనసు దాకా రాలేదు. లోపల బొమ్మలు ! గాయకుల బట్టల స్థానం లో పచ్చబొట్లు వికృత రూపాలు ! భరించ శక్యంగా లేదు. అన్నీ చింపేశాను, తెల్లకాగితం అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని.  

.

లోపల తవ్వుకుంటున్నాను గుండె లోతుల్లోకి. నా వస్తువులన్నీ అక్కడ మా వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను. నా మనసు శిక్ష కోరుకుంటోంది. పంతంగా ఉంది. రజస్సు తగ్గాలి. పుస్తకాల గుట్టల్లో దొరికిన పెన్నుతో చింపి పట్టుకున్న తెల్లకాగితం మీద వ్రాయటం మొదలెట్టాను, గోవిందా నామాలు. నూట ఎనిమిదవ నామం. ఈ ప్రక్షాళన నేను తీర్మానించుకున్నది. సముద్రపు హోరులా పొంగుతున్న ఈ అరుపుల సంగీతాన్ని తప్పించుకోవాలి.

.

వాయిద్యాల మ్రోతలు, మరల చప్పుళ్ళు, కంఠ స్వరాలు అన్నీ కలిసి యంత్రాల సహకారంతో సముద్ధతి పొందుతున్నాయి. శరీరంలో రక్తం ఉడుకెత్తుతోంది. అలవికాని వేగం గుండె చప్పుళ్లతో. కరువులో అధిక మాసం అంటే ఇదేనేమో ! ఆకాశంలో విమానం మ్రోత. ఆసుపత్రి వారి అంబులెన్స్ సైరన్లు !

.

నా మటుకు నాకు సర్వం ఒక పెద్ద వెక్కిరింత !

.

ఈ వాతావరణానికి వెగటు వెయ్యి రెట్లవుతోంది. కార్య కారణం సంబంధాలేవో ఆలోచనల్లా తన్నుకొస్తున్నాయి. వీళ్ళంతా ఎందుకు ఎలా వింటున్నారు ? నాకు ఇంత బేలతనం ఎందుకు వైయసీ ? నాకందనిదీ అనుభూతిలోకి రానిదీ వీరందరికీ ప్రాప్తిస్తోందే మరి ? నా గుండెలో ఏమిటీ ఇరుకు ? ఎందుకీ బరువు ? ఈ భవంతి చుట్టూ వీధి పొడుగునా కనుచూపు మేర దాకా మధ్య మధ్యలో కొన్ని మినహా ఈ దేశంలో సాధారణంగా కనిపించే వీపింగ్ విల్లో ( Weeping Willows ) వృక్షాలు. పెద్ద పెద్ద వృక్షాలు. తలలు బలంగా వ్రేలాడేసి, భూమివైపు అఱ్ఱులు చాస్తూ ఈదురుమంటూ ఊగుతున్నాయి ! లోపలా ఇదే దృశ్యం ! ‘ స్పృహ ’ ప్రజల ఒళ్ళు వదిలి ఎక్కడికో పోతోంది. చీకటి, విద్యుద్దీపాల మెరుపు, చెట్ల హోరు, పాటగాడి పాటకి వంత పాడుతున్నాయి. పాటల మాటల్లో శృంగారం అనుకుంటూ, ప్రేమంటూ ఏవో మాటలు జోప్పిస్తున్నాడా గాయకుడు. ఎంత చేదీమాట !

.

చప్పట్లు వినిపిస్తున్నాయి కట్టలు త్రెంచుకున్న ప్రవాహంలా. పాడిన వారికి కొన్నీ, వ్రాసిన వారికి కొన్నీ, నిర్వాహకులకీ, మూడు గంటలు విన్న వేల వేల ప్రజకి మిగిలినవీ ! జనం త్రోసుకొస్తున్నారు. అంతూ దరీ తెలియని అంధకారంలా ఉంది. ఎంత తీవ్రంగా ఉంది నాలో స్పందన !

.

వర్షం వెలుస్తోంది నెమ్మది నెమ్మదిగా ! నేను ఇమడలేను. నావంటి వారు ఉంటారు. ఊహల చేలల్లో నీతో నడుస్తున్నాను నిశ్శబ్దంగా. నాకూ ప్రపంచానికీ రెండు నివేశాలే అడ్డు ఒకటి ‘ నేను ’ రెండవది ‘ ….. ’ !!!

.

—–

.

‘ ప్రతీచీ ! ఆగు ! రెండవది ‘ జన్మ సంస్కారం ’. ‘ సంస్కార విశేషం ’ అందాం. నీ మాటలు నీకు తిరిగి వ్రాయటంలో ఉద్దేశం నువ్వేమిటో నీకు తెలియజెప్పటానికే ! మన సంభాషణలకి రాకపోకలు అవసరం లేదు. అలుపు ఆయాసం లేకుండా ఎప్పటికప్పుడు ఊపిరందుకోగలం. మన పాత సంప్రదాయానికి ఏమాత్రం తీసిపోదు ఇప్పటి సాంకేతిక సంగీతం. అంతర్జాలం అతి విచిత్రమైన వింత. విశిష్టం కూడా ! సంగీతం శాస్త్రం అనుకునేవారికి అతి చేరువ. వెసులుబాటు పెరిగింది. అందరికీ గురువు ప్రసక్తి లేకుండా దొరుకుతోంది. అంతేకాదు మనసుదాకా పోయేది కాదది ఏమాత్రం. సంగీతం క్రొత్తదారులు పట్టడం మనకి తెలిసినదే. భావదీప్తి ఎలా కలుగుతుంది ? అనురక్తి, రససిద్ధి కలగడానికి మూల కారణం ఆలోచించావా ? అక్కడి సంగీతం ఆలోచనకి, బుద్ధికి దగ్గర ! మన పాట మనసుకి దగ్గర ! అక్కడ ఉగ్రత – ఇక్కడ స్నిగ్ధత ! ప్రతికూల భావాలకి చోటు లేదు. కలిసి మమేకమై పోవటమే కానీ ! అక్కడి పాటలు ప్రాణం, చర్మం ఛీల్చుకుని బయటకి రావలసినదే !

.

సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం.

‘ నాలో వాంఛ తగ్గుతోందా ’ అని అడిగావు. ‘ జిజ్ఞాస ఆవిరైపోతోందా ’ అన్నావు. నీ అనుభవాన్ని ఎవరు కాదన లేరు. కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం. అంత తియ్యదనం ఎక్కడ నుంచి పుట్టుకొస్తోందో ఆలోచించావా ఎప్పుడైనా ? ఏడుపులో ఇంత సుఖాన్నివ్వగలదా సంగీతం. మరి ఉద్రేకం సంగతేమిటి ? నువ్వూ నేనూ పాట వలన ఉద్రిక్తతని ఎందుకు వద్దనుకుంటున్నాం ? మిగిలేది అలజడి కనుక ! కొందరికది ఉత్సాహం. సుముఖతా విముఖతా రెండూ మనసు లక్షణాలవటమే దీనికి కారణం. ఈ రెండూ మనలో ఉన్నాయి. గమనించు. మనిద్దరం ఎందుకు సంవాదిస్తున్నామో చెప్పనా ?

.

– అరవై యేళ్లనాటి అనుభవం. గోదావరి పుష్కరాల ముమ్మరం. పడవలు తెప్పలు తెగ తిరుగుతున్నాయి. రాజమండ్రి వీధుల్లో హడావిడి, గోదావరి నీటిలో మరీ హడావిడి. ఇక ఊళ్ళో నాటకాల సంఘాల ప్రదర్శనల జోరు చెప్పనక్కరలేదు. ఆరోజు ఎప్పటిలా గోదావరి దాటాను. తెడ్డువేసే పడవవాడి పాట హుషారు చెవుల్లో గింగుర్లెత్తుతోంది. గోదావరి నీళ్ళు, పడవ నడక, తెడ్డు ఊపు, ముందుకీ వెనక్కీ ఆ బోయీ ఊగటం, పాటలో మార్దవం. మాటల్లో పల్లెటూరి జాతీయం. చల్లటి గాలులు, నీళ్ళ వాసన అన్నీ వలయాలు తిరుగుతున్నట్లుంది. సుఖం తోడుగా గట్టు దాటి గుట్ట నెక్కి మట్టి దిబ్బ మీద నున్న రాయి మీద చతికిల బడ్డాను. భుజం మీద పరిచయమున్న స్పర్శ, హాయిగా హరిదాసు గారి పలకరింపు ఎప్పటిలా. నాటకం మొదలైంది. పరిచయ వాక్యాలన్నీ ఒకే గజిబిజి. పద్యాలతో నాటకం ప్రారంభం. రాగాలు కటువు. మృదుత్వం లేదు. మార్దవం లేదు. మనసు లేదు. సమాసాలు దీర్ఘంగా సాగుతున్నాయి. ‘ దాసు గారూ ! ఈ పద్యమేమిటండీ ? ఈ రాగం వీడి సొంతమా ? ఇష్టం వచ్చినట్లు సాగదీస్తున్నాడు. సుఖం లేదు. సరికదా జెఱ్ఱులు పాకుతున్నట్లుంది. నాకు మాత్రమే ఇలా ఉందా ? ఆ నటుడు అనుభూతి ఎలా ఉంటుందో ఊహించగలరా ? అలసట వస్తోంది. ఓపక్కన నిరాశ కూడా కలుగుతోందండీ ! ’ దాసు గారి చిరునవ్వు లోపల ఎక్కడో తాకింది. చెయ్యి భుజాన్ని తట్టింది, ఈసారి ప్రేమతో ధైర్యం చెప్తూ. మాటలు అవసరం లేని సమాధానమిస్తూ ! నెమ్మదిగా దాసుగారి స్వరం వినిపిస్తోంది. ‘ నాకు తోడున్నందుకు నా బాధ కాస్త ఉపశమించింది వైయసీ ! మనిద్దరం ఇప్పుడు అనుభవిస్తున్న ‘ వెగటుం ’ ది చూసేవా అది మన జన్మకీ, మన జీవుడికీ ‘ సమాన ధర్మం ’ ‘ సహజం ’ ఇదో ‘ సంస్కార విశేషం ’ గా తెలుసుకోవాలి మనం. ఈ పరిణామం అర్థం కావాలంటే ముందు దాన్ని గుర్తించాలి. ‘ బిలహరి ’ బిగువూ, ‘ ఆరభి ’ రుచీ మనకి పరిచయం. ‘ శ్రీ ’ రాగం ఇచ్చే ఉత్సాహంతో పెరిగాం. స్వరం పేరు స్థానం తెలియనక్కరలేదు. సరిగమపదని అనకుండా కేవలం రెండే రెండు స్వరాలు పలికి లోపలి లోకాలన్నిటినీ కదిలించేయ్యవచ్చు. ‘ శుద్ధ రిషభం ’ అన్నమాట ప్రస్తావన లేకుండా రిషభంతో కళ్ళు తడి చెయ్యవచ్చు. పై షడ్జమం దాటి రిషభంలో ‘ హరీ ’ అంటూ బాలమురళి అందుకుంటే మన దుఃఖానికి ఆనకట్ట కట్టగలరా ఎవరైనా ? మధ్యమావతిలో ఒక్క రిషభాన్ని చతుశ్రుతి నుంచి శుద్ధం చేసి, మహోత్సాహాన్ని పరమ సాంద్రం చేసెయ్యొచ్చు కదా ‘ రేవతి ’ చేసి !

.

కంఠంలో పలికే స్వరాల గురించి, స్థానాల గురించీ చెప్పటం ఆరంభిస్తే అది శాస్త్రం. జ్ఞానం అనుభూతినివ్వదు కదా వైయసీ ! శాస్త్రం తెలియకపోయినా స్వరం ఎన్నో జ్ఞాపకాలని స్పురణకి తెస్తుంది. కళ్ళు కాల్వలు కత్తిస్తుంది. గుండెల్లో సముద్రాలు పొంగిస్తుంది. రక్తాన్ని ఉడుకులెత్తిస్తుంది. ఒళ్ళంతా పులకలు పుట్టిస్తుంది. చెంపల్లో చంపకాలు పూయిస్తుంది. ఆవేశాన్ని అవధులు దాటిస్తుంది. పరమ తన్మయమైనా నిర్వేదమైనా స్వరానికి లోబడి ఉంటాయి. ఈ స్థ్తితి భావుకులది మాత్రమే. శాస్త్రంతో పనిలేదు. పాటలో లయమై నిద్రపోవచ్చు. రసానుభూతిలో రమించవచ్చు. కొంతవరకు ఇదంతా తాత్కాలికం. చేయి పట్టుకుని ‘ కాలం ’ దాటించాలంటే ‘ అభిజ్ఞత ’ కావాలి. రసాన్ని మించిన ఆనందం కోసం వెతికేవరికి సంగీతం ఒక మార్గం. గమ్యం కాదు. పూర్వజన్మగత సంస్కార విశేషం. శాస్త్ర పరిచయం వలన కళ్ళముందుకొచ్చి కూర్చుంటుంది. సామాన్య పాటగాడు తన పాటని భావుకులకి వినిపించాలనుకుంటారు. పాడతారు మనసుతో. ఆ క్షణంలో ఒళ్ళు మరిచిపోవచ్చు. శాస్త్రం తెలిసిన రసభావవేత్త తన శ్రోతకి స్వర్గం చూపిస్తాడు. తన్మయం కలిగిస్తాడు. రెండు రకాలుగా గాయకునిదే గెలుపు.

.

వైయసీ ! ఈ నాటకాల వాళ్ళు వస్తున్నారు. పోతున్నారు. మనమంతా వచ్చి వింటున్నాం గుంపులు కట్టి. కంపెనీల వాళ్ళు గుడారాలు వేస్తారు. పందిళ్ళు వేస్తారు. ఈ దీపాలేమిటి వేషాలేమిటీ ? ఈ రంగులూ బట్టలూ నగలూ ఏమిటి ? భీముని చేత ‘ శివరంజని ’ పాడిస్తున్నాడీయన. ధర్మరాజుతో ‘ కధనకుతూహలం ’ ఎందుకంటావ్ ? ఈ ప్రమాదమంతా ఏమాత్రం ‘ విషయం ’ తెలియకపోవటం వలన. వింటున్నవారికీ తెలీదు. నాటకాల వాళ్ళకీ తెలీదు. కర్నాటక సంగీతం ఒక పెద్ద వెక్కిరింతగా తయారైంది. పడేవాడికి వినేవాడికి కావలసింది సంగీతం కాదు. కాలక్షేపం ఆ క్షణం గడవటం. విను విను వైయసి ! పద్యాన్ని ‘ బేహాగ్ ’ లో లాగుతున్నాడు. కర్ణాటకంలో మొదలెట్టి హఠాత్తుగా హిందూస్థానీ లోకి దూకుతున్నాడు. గెంతులేస్తున్నాడు. దానికుండే ‘ ఈడ్పు ’ సంగతి తెలిసినట్లులేదు వీడికి. కచ్చితంగా ఈ నాటకాల నాయకుడు తెలుగు వాడే. ఇంత ధైర్యం వాడికే ఉంటుంది. తననుకున్నదే శాస్త్రం. ఊరి పొలిమేర దాటి ఉండడు ఏనాడూ ! రాష్ట్రం సంగతి పక్కనుంచి. నేర్చుకున్నా కొద్దిపాటి బేహాగ్ తో వచ్చీరాని హిందూస్థానీలో ‘ కీచక వధ ’ చేస్తున్నాడు. ఓరినీ !!!

.

సాధన అనివార్యం వైయాసీ ! శాస్త్రాన్ని నిర్లక్ష్యం చెయ్య వీలులేదు. గురువును నాశ్రయించక తప్పదు. ‘ ముఖే ముఖే సరస్వతీ ’ అని ఊరికే అనలేదు. మనసులకి అధోగతి పట్టడానికి కారణం అర్థమవుతోందా ? సంగీతం మన చిత్త వృత్తిని సంస్కరించగలదు. మనసునీ జీవితాన్నీ సరళ రేఖమీద నడిపించగలదు. రస బంధురమ్ చెయ్యగలదు. స్పందనని అలౌకికం చెయ్యగలదు. మనలో ఆర్ద్రతని శత గుణకం చెయ్యగలదు. ఇదంతా ఒక రోజుతో వచ్చేది కాదు ” –

.

ప్రతీచీ !!! హరిదాసు గారు గుక్కతిప్పుకోకుండా అన్న మాటల తీవ్రత ఈ రోజుకీ సాన పట్టిన కత్తి పదునులా తోస్తుంది. నాలో మనసుకి పట్టిన తుప్పు వదిలినట్లనిపిస్తుంది.

.

నీ దేశంలో నీ లోకంలో ఆ కళాకారుడెవరో, ఆ ప్రేక్షక ప్రజ లెవరో, ఆ సభేమిటో నాకు తెలిసే అవకాశం లేదు. నా ఊహాకీ అందదు కూడా. నీకు తెలుసు. నేను ప్రపంచానికి, వర్తమాన వ్యవహారాలకీ చాలా దూరం అని. ఊహించగలను అర్థమవుతుంది. కానీ ఊహించను. నాకు అవసరమూ లేదు. నాకు వద్దు. నేను అందులో ఇమడలేను. ఒక్క అనుభూతి మనిద్దర్నీ ఎన్ని సుళ్ళు తిప్పిందో చూడు. ఎన్నెన్ని కోణాల్లో మనం పరుగులు పెట్టామో కదూ ! ప్రపంచంలో ఏ జీవికాజీవే అయినా అనుభూతి మాత్రం అచ్చమైన బ్రహ్మపదార్థం సుమా ! మన మనసుల సామాన్య ధర్మమేమిటో, విశేష ధర్మమేమిటో తెలుసుకునే ప్రయత్నం కాదూ ఇదంతా ?

.

నీకు ‘ వెగటు పుట్టడం ’ నాకు చాలా అపూర్వంగా తోచింది. ఎంతో మనోహరమైన స్థితి అది. కారణం ‘ పాట ’ కానే కాదు. నీ మనసు పొరల్లో తేనె ప్రవాహం. నీ వయసు చిలిపి జోరు. నీ పరుగుల వెనుక లోపల్లోపల దాగి ఉన్న సున్నితత్వం. విశృంఖలంగా ఉన్న స్వేచ్చా భావం. రాగదర్శన వాంఛ ! మన కళల్లో ఒంటికాలి కుంటి నడకలు లేవు. అనుభూతికి జన్మ సంస్కారం పునాది. విషయం తెలిసిన దానివి ఒక సంగతి చెప్పనా ? అసలు కళలు సూర్యకాంతి లాంటివి. సంప్రదాయాలు చంద్రకాంతి లాంటివి. తక్కిన చమత్కార ప్రస్థాన మంతా చుక్కల మెరుపులు ! పగలు గడిస్తే చుక్కలే చమత్కారాలు. అంతర్జాలపు వలలో చేపల్లా చిక్కుకుపోయాం మనం. గిల గిలా ! ఇప్పటి వాయిద్యాలు, సాంకేతిక జ్ఞానం స్వభావాలు మనలో ఇంపు నింపినా, ఒక్కమాటు చందమామ కనిపించేసరికి కరిగి వెన్నెల వాకలై పోమూ ! కంఠం నుంచి బయిటకొచ్చే స్వరం వెంట మన ఆర్తి, ఆవేదనా, ఆనందం, ఆగ్రహం అన్నీ ఒరుసుకు పొంగులెత్తుతాయి కదా !

.

మన సంస్కారం బట్టీ మన స్పందన ! స్పందన బట్టీ స్వరం ! సంస్కారానికి, స్పందనికి, స్వరానికి మధ్యనున్న అంతరువు గమనించావా ? గాలి చొర లేనంత దగ్గరా కాగలదు. కొలతల కందనంత దీర్ఘమూ కాగలదు. ‘ గాలికైనా తను కౌగిలీ నన్నాడు ’ ఎంకి పాటలో. నువ్వూ, నేనూ విన్నాం జ్ఞాపకం ఉందా ?

.

ప్రతీచీ ! నీ గుండెల్లో చెలమలకి ఆనకట్టలు కట్టకు ! శుద్ధ చైతన్య గుణం ఉండబట్టే ఈ సంస్కారం ! అది చాలా చిక్కన ! ఎంతో తీపి ! నీ కళ్ళలో తడారనివ్వకు ప్రతీచీ !! ” –

.

ఉత్తరాలు అనుభూతులు. వర్తమానం, గతం దూరం. కాలం అన్నిటి రెపరెపల్లో వైయాసీ గోదావరి చేలల్లో.

.

ప్రతీచి అమెరికా వీధుల్లో సుదీర్ఘంగా ! ఒంటరిగా ! నిశ్శబ్దంగా !

.

——– ( O ) ——–