.
రక్తికి, భక్తికి, ముక్తికి రమ్య సోపానాలు శరన్నవరాత్రులు
.
ప్రావృట్కాల పయోద సడలి, శరత్ జ్యోత్స్న అవతరించబోయే సమయంలో ఆరంభమవుతాయి దేవీనవరాత్రులు.
చల్లని కాలం, తెల్లని వెన్నెల, పలుచని గాలులు, కురుచతనం పోగొట్టుకుంటున్న నిశలు ప్రకృతిని ఆవరించి మురిపిస్తున్న సమయంలో అవతరిస్తాయి నవరాత్రులు. మహాదేవి ప్రతి యింటా అడుగు పెడుతుంది= ప్రతి మనస్సులోను తొంగిచూస్తుంది. భువిని దివిగా మార్చటానికి, తాత్కాలికంగాఅయినా నరులను సురలుగా చేయటానికి అవతరిస్తుంది అమ్మ దుర్గమ్మ.
అందుకనే ఆ చల్లదనం – ఆ తెల్లదనం
.
ఇళ్లలో వెలుగు కళ్లలో వెలుగు
.
సృష్టికి మూలం మహామాత. ఆమె కనుసంజ్ఞలలో మెదులుతుంది… కదులుతుంది జగత్తు. పృథ్వి ఆమె రూపం. అట్టి సీమను దివ్యసీమగా మార్చటానికి, నరుల నేత్రాలను దేదీప్యమానంగా వెలుగొంద జేయటానికి తల్లి ఈ నవరాత్రులలో అందరి ఇళ్లల్లో, కళ్లల్లో నాట్యమాడుతుంది.
ప్రతినిత్యమూ పూజించవలసిన దేవికొరకు నవరాత్రులు ప్రత్యేకించట మేమిటి ? తక్కిన సమయాలలో ఆమెను మరిచిపోవటమా ? అని ప్రశ్నించారొకరు. దీనికి ఒక పండితోత్తముడు చెప్పిన సమాధానం-
“ నిజము ! ఏనాడూ ఆ తల్లిని మరువరాదు. అలా మరువక ప్రార్థించేవారూ ఉంటారు. వారు కొద్దిమంది మాత్రమే. తక్కినవారు వ్యాపకాలలో పడి తల్లిని జ్ఞాపకం పెట్టుకోరు. అలాటివారికి మాటిమాటికీ జ్ఞాపకం చేయడం ఎవరికి కుదురుతుంది ? ఎలా కుదురుతుంది ? అలాంటివారి కోసం ఈ నవరాత్రులు ఏర్పడినవి. ఇవి అతి పవిత్రమైన రోజులు. తల్లి అనుగ్రహంతో అందరినీ ఆదరించే, అనుగ్రహించే రోజులు ”.
దేవీ ఉపాసకులు ఈ నవరాత్రులలో అమ్మను తొమ్మిది రూపాలుగా దర్శించి, చిత్రించి, ప్రార్థించి, పూజించి తన్మయులవుతూ ఉంటారు. ఈ పర్వదినాలలో మహామాత సర్వసంపదలు అందిస్తుంది మానవకోటికి. సర్వమంగళగా దర్శనమిస్తుంది. నరులు తెలియక చేసిన దోషాలను మన్నిస్తుంది. ఆర్తితో ప్రార్థిస్తే అభయహస్తం జాస్తుంది. మానవులు తల్లిని మరచినందుకు పశ్చాత్తాపం చెందుతూ నవరాత్రులలో తల్లిని అనేక రకాలుగా పూజిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. తల్లిని తాము మరచినందుకు తల్లి తమపై ఆగ్రహిస్తుందేమోనని భయపడుతుంటారు. అలా భయపడిన ఒక ఇల్లాలి ప్రార్థన యిది.
.
తల్లిరొ ! నీదు మోము గన
ధర్మనిధానము ! నేత్ర పంక్తిలో
చల్లని వెన్నెలల్ కురియు
సర్వ చరాచర వాస్తు సంపదల్ !
అల్లన నూగు నీ అభయ
హస్తము లందున ! భక్తురాలిపై
చెల్లున-టమ్మ తామసము
చిన్మయ రూపిణి, లోకపావనీ !
.
నవరాత్రి నవ్వుల పండుగే కాదు ; పువ్వుల పండుగ. తల్లిని కోటి పువ్వులతో పూజించవలసిన పండుగ. ఈ పర్వదినాలలో విఘ్నరాజును కొలిచిన బలంతో వేల్పుటమ్మలను కొలిచే అవకాశము వస్తుంది. చల్లని కాలంలో అడుగు పెడతాయి నవరాత్రులు. తొమ్మిది రోజులూ వేల్పుటమ్మల పాదాలమీద నరులు గుండెలు గుమ్మరించి నిమీలిత నేత్రులై ఆమె కరుణను అర్థించే పుణ్యఘడియలు. ఎక్కడ చూచినా కుంకుమరాసులు, పూలగుట్టలు, స్త్రోత్రపాఠాలు, మంగళహారతులు, జేగంటలు, భక్తిరస పరిపూరిత హృదయాలలో ఆథ్యాత్మిక స్పందనలు.
.
ప్రార్థనలకు ప్రతీకలు పండుగలు
.
మానవుడు ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందిన వెలుగును దర్శించటంకోసము ప్రాకులాడుతూ ఉంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతులలోనుంచి తప్పించుకొని తపస్సిద్ధి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థనలకు ప్రతీకలు మన పండుగలు.
మహామాత జగత్తును సృష్టించినప్పుడు దానిని పరిశీలిస్తూ, ప్రాభవం కల్పిస్తూ చిరస్థాయి కావాలని దీవిస్తూ నవరాత్రులు గడిపిందట. ఆ కారణమున జగత్తు దిగ్విజయంగా నడవటం ప్రారంభించిందట. ఆ తల్లి అలా గడిపిన తొమ్మిది రాత్రులు ఆమెకు ప్రియమైన దినాలు అయినవి. వాటిని జ్ఞాపకం చెయ్యటానికే నవరాత్రుల పండుగ అని పెద్దలు చెబుతుంటారు. అందువల్లనే ఆ తల్లి వివిధ స్వరూపాలలో నవరాత్రులలో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఆయా రూపాలలో ఆమెను ఉపాసించి వరాలు ఆర్థిస్తూ ఉంటారు.
మహామాత జగత్తులోగల దౌష్ట్యాన్నీ, కూరత్వాన్ని రూపుమాపటంకోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఆమె ప్రతిజ్ఞ. అందువల్లనే ఆమెను దనుజ సంహారిణిగా పూజిస్తూ ఉంటారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ణి వధించి మానవకోటికి తన మహిమను చూపిన ఆ మహామాతను అర్చించడం నవరాత్రులలో పరిపాటి. ఆమె ఎంత చల్లనితల్లో అంత ఉగ్రస్వరూపిణి. ఆ ఉగ్రత లోకసంగ్రహార్థం. మహాదుర్గగా, కాళీమాతగా, మహిషాసుర మర్థనిగా, చండిగా ఆమెను ఉపాసించి సిద్ధిని పొందుతూఉంటారు. ఈ రూపాలన్నీ దుష్టశిక్షణ, లోకశాంతికే. అలాటి స్వరూపాన్ని సామాన్య దృష్టితో అర్థంచేసుకోవటం సాధ్యంకాదు. నిండైన భక్తి అవసరం.
.
సర్వకళా స్వరూపిణి ఆ తల్లి
.
సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.
ఈ నవరాత్రులలో సరస్వతీపూజతో పాటుగా ఆయుధపూజ, విజయదశమి ప్రొద్దులుకూడా జరుగుతాయి. వీటికి సంబంధించి ఐతిహాసికంగా కథలున్నాయి.
.
విజయ దశమి విజయుని దశమి
.
జూదంలో ఓడిపోయిన పంచపాండవులు పదమూడేళ్లు వనవాసం చేశారు. ఇక అజ్ఞాతవాసం గడవాలి. అజ్ఞాతవాసం కఠోరమైనది. వారిని ఆ సంవత్సరకాలంలో ఎవరూ గుర్తించరాదు. అలా గుర్తించటం జరిగితే మళ్ళీ అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం చెయ్యాలి. అందువల్ల వారందరూ మారువేషాలు తాల్చవలసి వచ్చింది. అరణ్యవాసం పొడుగునా తాల్చిన ఆయుధాల నన్నిటినీ కట్టకట్టి శవాకారంగా రూపొందించి ఒక జమ్మిచెట్టు మీద దాచివేశారు.
బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరగోగ్రహణ సమయంలో ఉత్తరునికి రథసారథిగా నియమితుడైనాడు. ఉత్తరుడు ప్రగల్భాలేతప్ప పౌరుషం లేనివాడు. అర్జునుడు రథాన్ని ఆ శమీవృక్షం దగ్గరకు పోనిచ్చి ఆ చెట్టుపై నున్న ఆయుధాలు తీశాడు. ఆ రోజుతో అజ్ఞాత వ్రతదీక్ష పరిసమాప్తమైంది. అందువల్ల ధైర్యంగా గాండీవం ధరించి యుద్ధానికి బయలుదేరుతాడు. పాండవులలో తొలుతగా అలా సమరానికి ఉరికి విజయం సాధించినది అర్జునుడే. అది విజయదశమి. విజయుని దశమికూడా అయింది.
శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసింది కూడా నవరాత్రులలోనే అంటారు కొందరు పెద్దలు. రామాయణంలో శరదృతువు రాగానే వానరసేనలు సీతాన్వేషణకు బయిల్దేరినట్లు ఉదాహరించబడింది. ఆంజనేయుడు లంకకుపోయి సీతను కనుగొని ఆ వర్తమానం రామునికి తెలియబరిచాడు. తదుపరి వానరసేనలు బయిలుదేరటం, వారధికట్టడం, లంకను చేరటం, యుద్దానికి ఉపక్రమించటం జరిగింది. మరి ఈ విధంగా ఆలోచిస్తే నవరాత్రుల నాటికి రావణ సంహారం జరిగిందనటానికి అవకాశం చాలదు. అయినా ఎందుకో ఈ నమ్మకం జనంలోకి వచ్చి నిలబడిపోయింది.
.
విజయ దశమి విద్యకు ఉత్సవం
.
ఈ విజయదశమిని, ముందున్న నవరాత్రులను విద్యార్థులు, గురువులు విశేషమయిన ఉత్సాహంతో ఉత్సవంగా జరపటం తెలుగునాట ఒక ఆచారం. విద్యార్థులకు వీరోచితగాథలు చెప్పటం, వారిచేత జయీభవ ! విజయీభవ ! అని విజయ వాక్యాలు పలికించటం, వారి చేతులలో విల్లంబులు ధరింపజేయటం, వారిచేత సామూహికంగా జైత్రయాత్రలు చేయించటం ఆ ఆచారంలో ఒక భాగం.
పిల్లల చేతులలో కోతిబొమ్మలు కూడా ఉంటాయి. రావణసంహారం నిమిత్తం వెళ్ళిన వానరసేనను తలుచుకోవడమేనేమో యిది !
.
“ ధర సింహాసనమై నభంబు గొడుగై
తద్దేవతల్ భృత్యులై
పరమాయ్నాయము లెల్ల వంది గణమై
బ్రహ్మాండ మాకారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై
శ్రీగంగ సత్పుత్రియై
వరుపన్ నీ ఘనరాజసంబు నిజమై
వర్థిల్లు నారాయణా ! ”
.
ఈ పద్యం పాడుతూ బడిపిల్లలు కొత్త దుస్తులు తాల్చి, సంబరాలు పడుతూ, తోటివాళ్లతో కలసి, విల్లంబులు, కోతిబొమ్మలు చేపట్టి ఇంటింటికీ వెళ్ళేవారు. పిల్లల వెనుకనే వారి గురువులు.
కళకళలాడుతూ పిల్లలు అలా ఇంటికి రాగానే గృహాస్థులు ఆనందంతో వారిని ఆదరించేవారు. తమకు, తమ గురువులకు ఏమికావాలో ఆ పిల్లలు జయజయధ్వనులు చేస్తూ చెప్పేవారు.
.
“ అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు ”
.
గృహాస్థులు పిల్లలకు రుచికరమైన ఉపహారాలు పంచి గురువులను కొత్తబట్టలతో దక్షిణ తాంబూలాలతో సత్కరించేవారు.
మా చిన్నతనంలో బళ్ళలో దసరా పండుగల్లో ఇద్దరు కుర్రవాళ్ళకు నరనారాయణులని పేరు పెట్టేవారు. నరుడు నారాయణుని కీర్తించటం, ఆరాధించటం, ఆయన నరుని అనుగ్రహించి ఆశీర్వదించటం ఉండేది. చివరకు నర నారాయణులొక్కరే అని సూచించి ఒకరిలో ఒకరు లీనం కావటం ప్రదర్శించేవారు. పసితనంలోనే అంటువంటి భావనలు కల్పించటం మన సంస్కృతికి గొప్ప చిహ్నం. పండుగలు జరుపుకోవటంలో ఇమిడి ఉన్న సూక్ష్మం కూడా అదే. అవి వేడుకలే కాక విజ్ఞాన బోధనలు. సాంస్కృతిక సాధనలు.
ఈ శరన్నవరాత్రేలు పరమ పవిత్రమైన పర్వదినాలు. మహామాతను అర్చించి పునీతులయ్యే పున్నెపు దినాలు. ఆ శివసుందరి, ఆ లలితాంబ, ఆ కాత్యాయని మనకు సకల శుభాలు అందించాలని ప్రార్థిద్ధాము. “ ముక్తిని సాధించు సామగ్రిలో భక్తి యొక్కటే గొప్పది ” అనేదే నవరాత్రులకు చెందిన దివ్యసందేశం.
.
పరిచెద పారిజాతములు పాదము లల్లన మోపి రాగదే !
తెరిచెద గుండె వాకిళులు తీరుగ గుమ్మము దాటి రాగదే !
సరిదెద నాత్మపీఠమును చల్లన వచ్చి అలంకరింపవే !
కురిసెద భక్తి గీతములు కోరిన కోరిక లాలకింపవే !
.
–—— ( O ) ——-