11_002 – తెలుగు యాత్రా సాహిత్యం

.

‘ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు సముద్రం మరింత ప్రేమించదగ్గదిగా కనిపిస్తోంది. వెన్నెల వెలిగిస్తున్న ఆ రాత్రి నేను సముద్రాన్నే చూస్తున్నాను. ఆ నీళ్ళల్లో చంద్రప్రతిబింబం కనిపిస్తున్నది. సముద్రతరంగాలవల్ల  చంద్రుడు ఆ నీళ్ళల్లో అటూ ఇటూ తిరుగాడుతున్నాడా అన్నట్టుంది. ఇక ఒక కృష్ణపక్షపు రాత్రి, ఆకాశం నిర్మలంగా ఉండి, నీళ్ళల్లో నక్షత్రాలు ప్రతిఫలిస్తూ ఉన్నాయి, మా చుట్టూ ఉన్న దృశ్యం చాలా అందంగా ఉంది. ముందు ఆ దృశ్యమేమిటో నాకు అర్థం కాలేదు. నా ముందు అసంఖ్యాకంగా వజ్రాలు పరుచుకున్నట్టనిపించింది. కాని, వజ్రాలు నీళ్ళల్లో తేలవని నాకు తెలుసు. బహుశా అవి రాత్రి పూట మటుకే కనిపించే వింతకీటకాలేమో అనుకున్నాను. ఆ ప్రతిబింబాల్ని చూస్తూ ఆకాశం కేసి చూడగానే నేను చూస్తున్నది నక్షత్రాలప్రతిబింబాలని అర్థమయింది. నా పిచ్చి ఊహలకు నాకే నవ్వొచ్చింది..’

.

1888 నవంబరులో మోహన దాస్ కె. గాంధి అనే పందొమ్మిదేళ్ళ యువకుడు మొదటిసారి సముద్రప్రయాణం చేస్తూ రాసుకున్న యాత్రావర్ణన ఇది. వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది.

.

యాత్రలు మూడు రకాలు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, యాత్రలూను. ఒకప్పుడు పాతరాతియుగం దాకా మనిషికి సంచారం ఒక అవసరం, బతుకుతెరువు. కాని కాంస్య యుగం మొదలయ్యాక, మనిషికొక గూడు, నీడ, నెగడి లభించాక, యాత్ర ఒక పరీక్షగా మారిపోయింది. కాంస్యయుగ మహేతిహాసాలన్నిట్లోనూ నాయకుడి లక్ష్యం తిరిగి తన ఇంటికి చేరుకోవడమే. ప్రతి గృహోముఖయాత్రా ఒక ఒడెస్సీనే. కాని, జిబ్రాన్ అన్నట్లుగా, ఇంటిపట్టున సేదదీరాలనే మన ప్రతిఒక్కరిలోనూ ఇంటికైదుని దాటి విశాలప్రపంచంలోకి నడిచివెళ్ళిపోవాలనుకునే ఒక సంచారి కూడా కొనసాగుతూనే ఉన్నాడు. ఆ సంచారం ఇప్పుడొక జీవనోపాధి అవసరంగా కాక, ఒక మానసిక అవసరంగా, ఒక ఆధ్యాత్మిక అవసరంగా మారింది.

.

బయటి ప్రపంచంలోకి ప్రయాణించాలనే ఈ ఆకాంక్షను ప్రాచీన భారతీయ సాహిత్యం ఒక సంస్కృతిగా మార్చింది. ఎందుకంటే, ప్రాచీన భారతదేశం రాజకీయ భూగోళం కాదు, ఒక సాంస్కృతిక భూగోళం. మహాభారతం యుద్ధం ముగిసాక శాంతిపర్వంలోనూ, అనుశాసనపర్వంలోనూ పదే పదే విస్తారంగా మాట్లాడింది తీర్థయాత్ర గురించే. అలాకాక, ఒక సౌందర్యదృష్టితో ఈ లాండ్ స్కేప్ ని చూడాలన్న భావుకసంవేదనను ఉద్దేశిస్తూ వచ్చిందే మేఘదూతం. కొండలు, మబ్బులు, వానలు, పొలాలు, నెమళ్ళు, పుట్టగొడుగులు, ఇంద్రధనువుల్తో కూడుకున్న సమ్మోహనీయమైన ఇండియన్ లాండ్ స్కేప్ అంతా ఆ కావ్యంలో కనిపిస్తుంది. కాని,  యాత్ర, నిజమైన అర్థంలో, వీటన్నిటికన్నా భిన్నమైంది అనుకుంటే, అడుగడుగునా అనిశ్చయానికి ఎదురీదటమే యాత్ర అనుకుంటే, రామాయణాన్ని మించిన ట్రావెలాగ్ మరెక్కడుంది? రామాయణమంటేనే రాముడు నడిచిన దారి కదా. ఆ యాత్రనే దశరథుడి పెద్దకొడుకుని కథానాయకుడిగా మార్చింది.

.

ఇప్పుడు ప్రపంచంలో యాత్రల (travel) స్థానంలో విహారయాత్ర (tourism) వచ్చి చేరిందంటున్నాడు క్రెయిగ్ స్టోర్టి తన తాజా పుస్తకం Why Travel Matters (2018) లో. 1841 జూలై 5 వ తేదీన థామస్ కుక్ మొదటి ఎక్స్ కర్షన్ నడిపినప్పుడే విహారయాత్ర యాత్రని నిర్మూలించిందని తేదీల లెక్కచెప్తున్నాడు కూడా. మనం తిరుగుప్రయాణం టిక్కెట్టు కొనుక్కుని మరీ మొదలుపెట్టేది విహార యాత్ర. తిరిగివస్తామనే నమ్మకంతో చేపట్టేది తీర్థయాత్ర. కాని, ఎప్పుడు తిరిగొస్తామో, అసలు తిరిగొస్తామో లేదో కూడా తెలియకుండా పూనుకునేదే నిజమైన యాత్ర.

.

తెలుగులో 1838 లో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ రాయడంతో ఆధునిక యాత్రాచరిత్ర రచన మొదలయ్యిందని ఒక లెక్క. కానీ, పద్య సాహిత్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, తెలుగు సాహిత్యంలో మొదటి యాత్రాకథనం, వర్ణన పాల్కురికి సోమన పన్నెండో శతాబ్దంలో రాసిన పండితారాధ్య చరిత్రలోని ‘శ్రీపర్వత ప్రకరణం’. అది భారతసాహిత్యంలోని మొదటి multilingual travelogue కూడా, ఎందుకంటే, ఆయన అందులో కన్నడ, తమిళ, మరాఠీ, తెలుగు భక్తుల ప్రయాణపు వరసలని ఆయా భాషల్లోనే వర్ణించాడు.

.

ఆధునిక యాత్రాచరిత్రలు ఏనుగుల వీరాస్వామయ్యతోటే తెలుగులో మొదలయ్యాయనుకుంటే ఇప్పటిదాకా, రెండువందలకు పైబడి యాత్రా కథనాలు వెలువడ్డాయంటున్నారు దాసరి అమరేంద్ర. ముఖ్యంగా, 1999 లో మాచవరపు ఆదినారాయణ ‘భ్రమణకాంక్ష’ వెలువడిన తరువాత, తెలుగులో యాత్రాసాహిత్యం కూడా ప్రధానస్రవంతి సాహిత్యంగా పరిగణనలోకి చేరుకుందని వివరించారు. అయితే, గత రెండు శతాబ్దాలుగా వచ్చిన తెలుగు యాత్రాకథనాలు అధికభాగం తీర్థయాత్రాకథనాలు, లేదా విహారయాత్రా కథనాలు. ఏదో ఒక పనిమీదనో లేదా ఒక వెకేషన్ కోసమో దేశంలో వివిధ దర్శనీయ స్థలాలకో లేదా విదేశాలకో వెళ్ళివచ్చినప్పుడు అక్కడి తమ అనుభవాలను వర్ణించే కథనాలే ఎక్కువగా వచ్చాయి. కొందరు యాత్రారచయితలు ఉద్దేశ్యపూర్వకంగానే తమ రచనల్ని ట్రావెల్ గైడ్లుగా రూపొందిస్తున్నారు కూడా. అవి కూడా అవసరమే. కాని, నిజమైన యాత్రారచనలు తెలుగులో చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో యాత్రీకులింకా చెప్పుకోదగ్గ సంఖ్యలో పుట్టనే లేదు. యాత్రీకులంటే జయతి, లోహితాక్షణ్ వంటి వారు. తమకున్నదంతా అమ్మేసుకుని తమకంటూ ఏదీ లేకుండా, ఆకాశమే కప్పుగా, రహదారినే ఇంటిగా స్వీకరించినవారు.

.

ఇందుకు తెలుగుజాతి మనస్తత్వంలోనే కారణం వెతకవలసి ఉంటుంది. ఏ జాతి కృత్రిమవ్యక్తిత్వ వికాససాహిత్యాన్ని, చదువులో, కెరీర్ లో బాహ్యవిజయాల్నీ మాత్రమే కోరుకుంటుందో ఆ జాతి యాత్రలకి విరుద్ధ దిక్కులో ప్రయాణిస్తున్నట్టు. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం యాత్రల వల్లనే సాధ్యంటున్నాడు Gregory V Diehl తన ఇటీవలి రచన Travel as Transformation (2016) లో. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడుపుకోవాలకునేది ఒక వైఖరి. జీవితం ఎటు నెడితే అటు కొట్టుకుపోదామనుకునేది మరొక వైఖరి. కాని యాత్ర ఈ రెండింటికన్నా భిన్నమైంది. అది కావాలని ప్రయత్నపూర్వకంగా ఏటికి ఎదురీదడం. ప్రమాదాన్ని చేతులు చాపి స్వాగతించడం. కాని, అటువంటి యాత్రీకులే లేకపోయుంటే, ఈ ప్రపంచం నేడు మనం చూస్తున్నంత దగ్గరగా జరిగి ఉండేది కాదు.

.

నిజానికి మనం చేసే ప్రతి యాత్రలోనూ రెండు యాత్రలుంటాయి. ఒకటి బాహ్యప్రపంచంలోకి చేసే యాత్ర. రెండవది అదే సమయంలో మనకు మనం చేరువయ్యే అంతర్లోక యాత్ర. ఒకప్పుడు 17 వ శతాబ్ది జపాన్ లో మహాకవి బషొ కాలినడకన రెండువేల మైళ్ళకు పైగా యాత్రలు చేసాడు. కాని, ఆ యాత్రల పొడుగుతా అతడు తనలోని కవికి, సౌందర్యారాధకుడికి, ప్రాచీనమహాకవుల వారసుడికి మరింత చేరువగా జరగడానికి ప్రయత్నించాడు. అందుకనే ఆ యాత్రల్ని తెలుగు చేస్తూ, నేనా పుస్తకానికి ‘హైకూ యాత్ర’ అని పేరుపెట్టాను.

.

అది తీర్థయాత్ర అయినా, విహారయాత్ర అయినా, సాహసయాత్ర అయినా, అంతిమంగా నువ్వు చేరుకోవలసింది నీ దగ్గరికే. ఆ అంతర్దృష్టి కనక సంభవిస్తే, ఒక మామూలు విహారయాత్రావర్ణన కూడా నిజమైన యాత్రా సాహిత్యంగా మారిపోతుంది. ఒకప్పుడు శ్రీ శ్రీ రష్యావెళ్ళినప్పుడు, అక్కడ తాను కలుసుకున్న లట్వియన్ కవయిత్రిలో, తాను ఏణ్ణర్థం వయసులో పోగొట్టుకున్న, తల్లిని చూసానని రాసుకున్నాడు. అక్కడ మనిషిని ఒక సరుకుగా చూడని ఆర్థికవ్యవస్థ నెలకొందనీ, అందుకే, అక్కడ మటుకే మరొక స్త్రీలో తనకు మాతృదర్శనం సాధ్యమయిందనీ ఆయన చెప్పుకున్న ఆ అంతర్దృష్టి ఆ యాత్రానుభవాన్ని చిరస్మరణీయ యాత్రావర్ణనగా మార్చేసింది.

.

తెలుగుసమాజం ఇప్పుడు అత్యంత ప్రాపంచిక సమాజం. మనుషులు వ్యక్తులుగానూ, సమాజంగానూ కూడా ఇంత వ్యాపారధోరణిలో కూరుకుపోయిన చోటు భారతదేశంలో నాకు మరెక్కడా కనిపించడంలేదు. ఈ కైదునుంచి తెలుగుజాతిని బయటపడేయాలంటే మహాయాత్రీకులు మరింతమంది పుట్టుకు రావలసి ఉంటుంది.

.

———(O)———