11_004 ఆనందవిహారి

                                    పండుగలది పాటలది అవినాభావ సంబంధం

                                    నెల నెలా వెన్నెల కార్యక్రమంలో జోస్యుల ఉమ

 

   పండుగలకు, పాటలకు అవినాభావ సంబంధముందని, ఒకప్పుడు తెలుగునాట ఇల్లు అలికే దగ్గరి నుంచే పాటలు మొదలయ్యేవని చెన్నైకి చెందిన ప్రముఖ రచయిత, గాయని జోస్యుల ఉమ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అక్టోబర్ 9వ తేదీ శనివారం సాయంత్రం నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో ఆమె ‘స్వర నవరాత్రి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పించారు. తన కుమారుడు, స్వరకర్త అయిన శైలేష్ తో కలిసి సంగీత, సాహిత్య విందును వడ్డించారు. ముందుగా సామవేదం వనజ శరన్నవరాత్రుల ప్రాముఖ్యతను క్లుప్తంగా తెలిపి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు.

 

  అనంతరం, త్రిమూర్త్యాత్మకమైన అమ్మవారి గురించి ఉమ అనర్గళంగా ప్రసంగిస్తూ…. దసరాల్లో ఇల్లు అలకడం, పూజకు సిద్ధం చేయడం, అమ్మవారిని అలంకరించడం, పూజించడం తదితర అన్ని అంశాలకు సంబంధించిన సాంప్రదాయ పాటలతో అలరించారు. సొంతంగా సంగీతం కూర్చిన స్వీయ రచనలని కూడా కర్ణపేయంగా వినిపించారు. “జంతువులకు రాజైన సింహారాజమా” అంటూ మహిషుడితో అమ్మ చేసిన యుద్ధంలో ఆమె వాహనమైన సింహం పోషించిన పాత్రను పాట రూపంలో వివరించారు. దేశమంతటా ఉన్న గ్రామ దేవతలందరినీ పేరుపేరునా తలచుకుంటూ జానపద శైలిలో తల్లీకొడుకులు పాడిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ప్రాచీన, ఆధునిక వాగ్గేయకారులు అమ్మవారి మీద వెలువరించిన కృతుల పల్లవులను కొన్నింటిని వినిపించి ఈ సంగీత కార్యక్రమానికి శాస్త్రీయతను జోడించారు. 

 

    కార్యక్రమం రెండవ భాగంలో, దేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరా పండగలు జరిపే తీరును శైలేష్ వివరించారు. దసరా రైలు ఎక్కండంటూ ఉత్సాహంగా అక్కడి అమ్మవార్ల పేర్లను చెప్తూ బెంగాలీ, భోజ్‌పురి, హిందీ, కన్నడ, తమిళ పాటలతో సందడి చేశారు.  పూర్వాంచల్ ప్రాంతంలోని సాంప్రదాయంలో తల్లి సప్తమినాడు పుట్టింటికి వెళ్ళి అష్టమినాడు తిరిగొస్తుందని చెప్పారు. ఆ సందర్భంగా స్థానికులు “ఓ ఖతానీ హమరో సహయ్యా ఏ దుర్గా మయ్యా” పాటను పాడతారన్నారు. శ్రీరాముడికి కూడా ప్రాముఖ్యత ఉన్న శరన్నవరాత్రుల్లో అయోధ్య, కులు (హిమాచల్ ప్రదేశ్) తదితర చోట్ల జరిగే రాంలీల ఉత్సవాన్ని కళ్ళకు కట్టారు. ఇక చెన్నై మైలాపూరులో బొమ్మల ప్రదర్శన వల్ల ఎంతో ముందునుంచే నవరాత్రుల వైభవం అణువణువునా తొణికిసలాడుతుందన్నారు. “చిన్న చిన్న బొమ్మై” అనే తమిళపాటతో అలరించి కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు.  

 

ఈ కార్యక్రమం ఈ క్రింది వీడియోలో…….