సహచరీ!
నీ కన్నవారినీ…
ఆ ప్రేమైక నివాసాన్ని వీడి..
నేను పయనిస్తున్న బాటలోకి అడుగు వేసావు.
నాతో కలసి నడక ప్రారంభించావు.
ఇది నాకు…
జీవితాన్ని పునర్నిర్మించుకొనే
కొత్త ప్రయాణం.
నీ మెట్టినిల్లయిన మా ఇంట..
కొలువు తీరిన..
సంస్కృతిని గౌరవిద్దాం.
ఓరిమితో మన పెద్దల్ని అర్ధం చేసుకొంటూ..
విలువలకు అద్దం పడదాము.
ఇప్పుడే నాతో జత కలిసిన నువ్వు..
హెచ్చు తగ్గుల్ని సమన్వయ పరచుకొంటూ..
వీడని తీగల్లా అల్లుకుపోయి..
స్నేహపరిమళసుమాల్ని..
కలకాలం పూయిస్తావని ఆశిస్తాను.
నాతో కలసి.. స్వప్నసుధారసధారలకు దోసిలి పడతావని విశ్వసిస్తాను.
నెచ్చెలీ!
వసంతారంభం నుండి..
శిశిరాంతం వరకూ…
నాకు ఎదురయ్యే ప్రతి అనుభూతినీ
నీతో పంచుకొని..
మన అనుబంధాన్ని అభిషేకిస్తాను !
రేపటి మన పున్నమి చిత్రానికి…
వెన్నెల రేఖల్ని గీస్తాను.
మన జీవనవనంలో
కోయిల గానాన్ని…
ఎల్లవేళలా నీకు వినిపిస్తాను.
వేసవిగాడ్పు ఉదృతంగా వీచినప్పుడు .
వర్షపు చినుకునై…
నిన్ను చల్లగా తాకుతాను.
నీ మనసు గాయపడినప్పుడు ..
నా మనసును మందుగా వేస్తాను.
అహాన్ని వీడి..
నీ అభిప్రాయాల్ని గౌరవిస్తాను.
జీవనయానంలో తోడు కోసం
స్నేహహస్తం చాచిన నీకు..
ఇది…
నేను చేస్తున్న వాగ్దానం !