11_004 నా అమెరికా పర్యటన

 

బోట్స్‌వానా తో మేము ఉన్న 5 సం. సమయంలో తెలుగు వారు కలిసి చేసుకున్న పండుగలు అవీ చెప్పాను. మా RITES గ్రూపులో ఇద్దరు సివిల్ ఇంజనీర్లు, ఒక అకౌంటెంట్, ఒక ట్రాఫిక్ ఆఫీసర్ కుటుంబాలతో ఉన్నారు. వారంతా ఢిల్లీ నుండి వచ్చారు. ప్రతీ సెలవలకి ఇంటికి వెళ్ళేవారు. అమెరికాలో మా అబ్బాయి చదువుకునే వాడు, నేను మాత్రం ఆ ఊరు, కాలేజీ అవీ చూస్తానని చెప్పి, బయిలుదేరాను. ఇది 1989 – 91 ల మధ్య జరిగింది.


అప్పటికి మా చెల్లెళ్ళు, తమ్ముడు అమెరికాలో డాక్టర్లు గా స్థిరపడ్డారు. ఆ రోజుల్లో ప్రతీ యింటి నుంచి పిల్లల్ని అమెరికా పంపించి చదివించుకోవాలన్న తాపత్రయం ఉండేది. మా అబ్బాయి AKRON యూనివర్సిటీ లో MS చేస్తున్నాడు. ఈ ఏక్రాన్ సిన్సినటి, కొలంబస్ దగ్గర ఉంది.


నేను వాషింగ్టన్ చేరితే మా అబ్బాయి వచ్చి తీసుకు వెళ్ళి వాషింగ్టన్ దగ్గరున్న మార్టిన్స్ బర్గ్ లో డాక్టర్లుగా ఉన్న మా చెల్లెలు దగ్గర ఒక వారం ఉంది, మా అబ్బాయితో వాడి కాలేజీ, ఆ చుట్టుపక్కల చూడాలని ప్లాను. మూడురోజులు ఆలస్యంగా చేరటంతో నేను నడిచి వచ్చానని అంతా ఏడిపించారు.


సరే ! నేను గేబరోన్ ( బోట్స్‌వానా ) లో ప్లేన్ ఎక్కి నైరోబి చేరాలి. అక్కడనుంచి ప్రయాణికులు వారు చేరవలసిన ప్లేన్లు ఎక్కి వెళ్ళాలి.


మేము బయిలుదేరిన రెండు గంటలకి ప్లేన్ గాలికి ఊగడం మొదలయింది. పైకి క్రిందికి ఊగింది చాలాసార్లు. ఏదో సమస్య. చక్రాలు సరిగా లేవు. వెనక్కి వెళ్లిపోతున్నాం అన్నారు. రెండు మూడు సార్లు మంచినీళ్లు, కోక్ లు యిచ్చి భయం లేదన్నారు. అయితే అమెరికా వెళ్తామా ? తిరిగి గేబరోన్ వెళ్లిపోతారేమో అని కంగారుగా అనిపించింది. కొందరు ఇది మామూలే అన్నట్టుగా ఏ తొట్రుపాటు లేకుండా ఉన్నారు. ఇంతలో హరారే లో దిగుతున్నాం అన్నారు. హరారె ‘ జింబాబ్వే ‘ అనే ప్రక్క దేశం కాపిటల్. భయంలేదు, సేఫ్ లాండింగ్ అన్నారు. అందర్నీ డిగమన్నారు. ప్లేన్ తలుపు దగ్గర గుండెల దాకా పెరిగిన గడ్డితో నిండి ఉంది. ఎయిర్పోర్టు ఉద్యోగులు బలశాలులు. అందర్నీ ఎత్తుకుని దింపారు గడ్డిలో. చేతిలో చిన్న బాగ్ తో చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియక తడుముకుంటుంటే ‘ గో టు ది రైట్ బిల్డింగ్ ’ అన్నారు. కొంత గడ్డిలో పరుగుపెట్టాక రన్ వే లాంటిది కనబడింది. లైట్లు వెలుగుతూ కనబడుతున్న బిల్డింగ్ వైపు పరుగులు పెట్టారు అందరూ. ఇంతలో ఒక అమెరికన్ ఆవిడ నా చెయ్యి పట్టుకుని, ‘ రన్ ’ అంది. ఆవిడతో పరుగెత్తి ఆ బిల్డింగ్ చేరాక కొంతమంది జనం కనబడ్డారు. అందరినీ హాలులా ఉన్న చోట కూర్చోమన్నారు. నా చెయ్యి పట్టుకున్న అమెరికన్ తరచూ ఈ ఆఫ్రికా దేశాలు వస్తుందట. పీస్ కమిషన్ అంది.


అందరినీ పాస్ పోర్టులు అవి తీసి నిలబడమన్నారు. ఎవరెవరు, ఏ దేశం వెళ్తున్నారో ఆ ప్రకారం, విభజించి కూర్చోబెట్టారు. ఈలోగా మేము బయిలుదేరిన ఇంటి అడ్రెస్ లకి మెసేజ్ పెట్టారు. అప్పుడు సెల్ ఫోన్లు అంతగా వాడుకలో లేవు. ఆ రాత్రి అంతా అలా కుర్చీల్లో కూర్చుని ఎప్పుడు పిలుస్తారా అనుకుంటుంటే ప్లేన్ రెండు రోజులదాకా రాదని, అక్కడే ఉండాలని, హోటల్లో ఏర్పాటు చేస్తున్నాం అనీ మా మా యిళ్లకి మెసేజ్ లు వెళ్ళాయని చెప్పారు.


అలా వ్రేల్లాడి అక్కడ హోటల్ కి చేరుకున్నాం బస్సుల్లో. నాకు, ఆ అమెరికన్ కి ఒక రూమ్ యిచ్చారు. ఆవిడ చాలా ధైర్యం చెప్పింది. మావారికి కబురు వెళ్లింది. నేను అమెరికా వెళ్లలేదని, రెండురోజులు అక్కడ ఉంటానని.


మర్నాడు అక్కడ ఉంటున్న రావ్, కస్తూరి దంపతులు హోటల్ కి వచ్చి, నా గురించి అడిగి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. ఊరంతా ఆ రెండు రోజులు త్రిప్పి చూపించారు. మంచి భోజనం పెట్టారు. నాకు ధైర్యం చెప్పి, మా వారితో మాట్లాడించారు. ఆమె కస్తూరి నామధేయురాలు. నిజంగా కస్తూరి పరిమళాలు వెదజల్లింది. మూడురోజుల తర్వాత వాషింగ్టన్ వెళ్ళే ప్లేన్ రెడీ అని ఎక్కాలన్నారు. బ్రతుకు జీవుడా అనుకున్నాము. హరారేలో మళ్ళీ ఎక్కి సవ్యంగా వాషింగ్టన్ చేరుకున్నాను. మా అబ్బాయిని చూశాక అమెరికా వచ్చాం అని ధైర్యం వచ్చింది.


మా చెల్లెలింటికి మార్టిన్స్ బర్గ్ వెళ్ళి ఒక నాలుగు రోజులు గడిపి, AKRON కి మా అబ్బాయి కారులో తీసుకువచ్చాడు. స్టూడెంట్స్ చిన్న అపార్మెంట్స్ ఉన్నచోట కలిసి ఉంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద గిన్నెలతో కూరలు అవీ వండేవారు. అందరూ కలిసి వండుకుంటూ సరదాగా ఉండేవారు. అందరికీ ఒకేసారి క్లాసులు ఉండవు కదా ! కామన్ గా బట్టలు ఉతుక్కునే మెషిన్లు ఉండేవి.


కానీ దుప్పటి మీద దుప్పటి ఆరేడు వేసుకునేవారే కానీ ఉతుక్కునేవారు కారు. కొంతమంది హైదరాబాద్ అబ్బాయిలుండడం వలన మా అబ్బాయి సంతోషంగా ఉండేవారు. నాకు వాడి కాలేజీ చూపించాడు. వాళ్ళ ప్రొఫెసర్ ని పరిచయం చేశాడు. నాకు చాలా సంతోషం కలిగింది. నేను రెండు నెలలున్నాను ఆ అపార్ట్మెంట్ లో. నన్ను వంట చేయనిచ్చేవారు కాదు. అందరూ నలభీములైపోయారు అనుకున్నా.


అక్కడ వీలింగ్ అనే ఊరులో ప్రభుపాద విగ్రహం నిలువెత్తు బంగారు పూతతో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాం. అద్భుతమైన కట్టడం, ప్రభుపాద విగ్రహం బంగారు పూతది ఉన్న ఆ ప్రదేశాన్ని ‘ ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ’ అని పిలుస్తారు.


ఏక్రాన్ దగ్గరలోనే వీలింగ్ ఉంది. స్టూడెంట్స్ అందరితో కలిసి వెళ్లాము. అలా మొదలయిన నా మొదటి అమెరికన్ ప్రయాణం తరువాత ఎన్నోసార్లు వెళ్ళినా, అక్కడే సెటిల్ అయిన పిల్లలున్నా, అది మనకి పరాయి దేశమే.


అక్కడ చేరిన మన పిల్లలు అన్నీ స్వంతంగా చేసుకోవడం నేర్చుకున్నారు. పరాధీనం లేదు. వారి పిల్లలకి చాలమందికి వారి మాతృభాష రాదు. కొంతమంది ఇంట్లో మాట్లాడితే కొంచెం వస్తుంది. కానీ అక్కడ స్కూళ్ళ వాతావరణం పూర్తిగా భిన్నం. అందువలన మన పిల్లల పిల్లలు మనకి అమెరికన్స్ అయిపోయారు కదా ! అది జీర్ణించుకోవలసిన విషయం.


                                                  ——— ( 0 ) ———-