11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

 

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అతి ప్రాచీనమయినవి. అంతే కాదు…  ఎంతో వైవిధ్యము, విలువలతో కూడుకున్నవి. అత్యంత ఆకర్షణీయమైనవి కూడా. ఈ కారణంగానే విదేశీయులు అనేకమంది భారతీయ సంగీతము, లలిత కళల పట్ల మక్కువ పెంచుకుని, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేస్తూ, ఆ కృషికి తగిన గుర్తింపుని అంతర్జాతీయ స్థాయిలో పొందడం చాలా సంతోషదాయకమయిన విషయము.

 

ఆ మధ్య కొంతకాలం క్రిందట ఆస్ట్రేలియా దేశస్థుడయిన ఒక యువ చిత్రకళాకారుడు వాట్స్ ఒక జర్నల్ లో వేసిన స్వామి వివేకానందుడి రేఖాచిత్రాన్ని నేను కాకతాళీయంగా చూడడం జరిగింది. ఆ చిత్రం లో ఎంతో జీవకళ ఉట్టిపడుతూ, సాక్షాత్తూ మన కనుల ఎదుట వివేకానందుడు నిలబడి దర్శనాన్ని ఇస్తున్నాడా అన్న భావన కలిగింది. చక్కటి చిత్రం వేసినందుకు అతనిని అభినందించాలని నాకు అనిపించింది. సత్సంకల్పం మనలో ఉదయించాలే కానీ, ఆ సంకల్పానికి అసలు ఊపిరిలూదేది ఆ పరమాత్మే ! ఆందువలననే నేను అతి సులువుగా ఆ కళాకారుని ఎడ్రెస్ ని సంపాదించగలిగాను. అతనికి అభినందన లేఖ ను వ్రాసాను. ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.

 

ఈ రోజులలో ఉత్తరాల ప్రాచుర్యం దాదాపు పూర్తిగా మరుగున పడిపోయిందనే చెప్పాలి. వాటిని వ్రాసేవారి సంఖ్యా, చదివే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయాయి. అప్పట్లో జనం ఉత్తరాలంటే, చెవి కోసుకునేవారు. కార్డు వ్రాసినా, ఇన్లాండ్ లెటర్ వ్రాసినా, కవర్ వ్రాసినా వ్రాసిన వారికీ తృప్తి. వాటిని అందుకుని చదుకునేవారికి అంతకు మించిన తృప్తి కలిగేవి. పోస్టుమాన్ ని ధైవస్వరూపుని గా భావించి ఆరాధించేవాళ్ళం. వచ్చిన ఉత్తరాలనన్నింటినీ చదివి తదనంతరం వాటిని జాగ్రత్తగా ఒక తీగ కు గుచ్చి గోడకు వ్రేలాడదీసి జాగ్రత్త పరచడం ఒక సాంప్రదాయం. అదొక తీపి జ్ఞాపకం !

 

సరే–ఇక విషయానికి వస్తే… నా ఉత్తరానికి ప్రతిస్పందనగా దానిని అందుకున్న కొద్ది రోజులకే అనూహ్యం గా వాట్స్ నుండి ఏరోగ్రామ్ వచ్చింది. ఆస్ట్రేలియా లో సిడ్నీ నుండి వచ్చిన ఆ ఉత్తరాన్ని అందుకున్నాను. అందులో వాట్స్ తన మనసులోని మాటలను నాతో  అక్షర రూపం లో పంచుకున్నారు. తన తండ్రి స్టాఫర్డ్ వాట్స్ కి హిందూమతమన్నా, హిందూ సంస్కృతి అన్నా ఎంతో మన్నన, ఆసక్తి అని వివేకానందుడి, రామకృష్ణ పరమహంస ల బోధనలకు ఆయన ఎంతో ప్రభావితుడైనట్లు, తనను, తన సోదరుని కూడా అదే బాట ను అనుసరించేలా  ప్రోత్సహించారని తెలియజేసాడు. ఆయన అలా అందించిన ఉత్సాహము, స్ఫూర్తి తో తాను వివేకానందుల వారి  చిత్రాన్ని వేసి పంపగా అది ఒక విదేశీ పత్రికలో ప్రచురింపబడిందని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు. వాట్స్  మాటలు మనకి కూడా ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయి.

 

ఇక వాట్స్ ఉత్తరాన్ని జతచేస్తూ ఈ విశేషాలను ప్రస్తావిస్తూ వ్యాసాన్ని వ్రాసి, మీ అందరితోనూ పంచులోవాలని నాకు ఒక ఆలోచన రావడం తో దానికి కార్యరూపాన్ని ఇచ్చాను.

 

                                                   ధన్యవాదాలు… 

                                  <><><>***  నమస్కారములు *** <><><>