అక్టోబర్ లో న్యూ ఢిల్లీలో తమ అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వచ్చేవిధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. 2020 అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి – సింగపూర్, తెలుగు మల్లి – ఆస్ట్రేలియా, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య – యునైటెడ్ కి౦గ్ డమ్, దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక – జొహానెస్ బర్గ్ వారు సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను “ సభావిశేష సంచిక ” గా పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, 27 ఏళ్ళుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమౌతుందన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలని సూచించారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మన పదసంపదను సైతం ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు.
నిద్ర లేచింది మొదలు మన వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించిన ఆయన, ఈ పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడి కి, రచయితలకు, ప్రచురణకర్తలకు పేరు పేరునా అభినందనలు తెలిపారు.
ఈ అవిష్కరణ మహోత్సవాన్ని రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.
హాంగ్ కాంగ్ లో నివసించు భారతీయులందరు కూడా ఈ శరన్నవరాత్రి సంబరాలను ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. కొత్త వస్త్రాలు, కొత్త నగలు, ముత్తైదువులకు బహుమతులు మొదలైన షాపింగ్ హడావిడి ఒక నెల ముందు నుంచే మొదలవుతుంది. కోవిడ్ కి ముందు రోజుల్లో అయితే, భారతదేశం వెళ్లిన వాళ్ళు , అక్కడే దసరా మరియు దీపావళి కి కావాల్సిన షాపింగ్ చేసుకొని వస్తారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటీ మాట్లాడుతూ ఈ చిన్న దీవి కి వలస వచ్చిన తెలుగు వారి సంఖ్య పెరుగుతుండగా, వేడుకలు – సంబరాలు జరుపుకొనే ఉత్సాహం రెట్టింపు అవుతోంది అన్నారు.
అక్టోబర్ నెల భారతీయులందరికి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు, పదవ రోజు విజయ దశమి కలిపి, శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ జరుపుకొంటారు.
ప్రత్యేకించి తెలుగు వారికి పండుగల నెలగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలలో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. అంతా పండుగ సంబరాలు, కుటుంబ సభ్యుల కోలాహలాలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా.. మరొకటి దసరా పండుగ (విజయదశమి). అయితే తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ, తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన పండుగ దసరా.
హాంగ్ కాంగ్ లో ఉత్తర భారతీయులు దుర్గా పూజలు, అష్టమి నాడు కన్య పూజలు, విజయదశమి నాడు రావణ దహనం చేయగా, దక్షిణ భారతీయులు నవరాత్రులకి పోటీ పడుతూ బొమ్మల కొలువులు తీర్చగా, హాంగ్ కాంగ్ స్థానికులు “హౌలెంగా” అంటే “బ్యూటిఫుల్” అంటే “ఎంతో అందంగా వున్నారు” అంటూ అభినందిస్తుంటారు.
లలితా సహస్రనామం పారాయణం తొమ్మిది రోజులకి జరిపే వారి వివరాలు, తొమ్మిది ప్రసాదాలు, తొమ్మిది రంగులు వివరాలతో ఒక నెల ముందుగా ప్రణాళిక తయారు చేసుకొంటారు, తుంగ చుంగ్ లోని ఆడపడచులు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఒక క్రొత్త క్రియకు శ్రీకారం కట్టారు! ఇదివరలో పారాయణానికి వెళ్ళేటప్పుడు పండ్లు, పూలు, బహుమతులు తీసుకువెళ్ళేవారు. ఆ ఇల్లాలు ఇవన్నీ ఏమి చెయ్యాలో తెలియక అందరికి పంపిణీలు చేయగా, కుళ్లినవి వృధా అయ్యాయని బాధ పడేవారు.
ఒక డొనేషన్ బాక్స్ లేదా హుండీ ని తయారు చేసుకున్నారు, అది తొమ్మిది రోజులు ఇల్లిల్లు తిరిగి వస్తుంది. పదవ రోజు, వచ్చిన డబ్బులన్నింటిని అనాధలు – అవసరం ఉన్న వారికోసమై సేవలు చేస్తున్న స్వచ్చంద సంస్థలకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా హాంగ్ కాంగ్ మరియు భారత దేశంలోని వృద్ధాశ్రమం, అనాధ పిల్లల ఆశ్రమానికి ” సర్వే జన సుఖినో భవంతు” అనే స్పూర్తితో అందజేశారు.
ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. అలాంటి ప్రాశస్త్యం బతుకమ్మ పండుగకు ఉంది. 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది… 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో ‘బతుకమ్మ’ పండుగను పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ ఆకారాలను చూస్తే.. కనులపండుగే !
ఇక్కడ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఫ్లవర్ మార్కెట్ చాలా పెద్దది, పేరొందిన పూల బజారు. అందరూ ఇక్కడి నుంచి కావాల్సిన పూలను కొనుక్కోవడానికి కొంతమంది కలిసి వెళ్తారు. అందంగా అలంకరించుకొని, అందమైన బతుకమ్మని ఎంతో ప్రేమగా తలపై తెచ్చి, ఉత్సాహంగా చప్పట్లతో బతుకమ్మ ఆడి, కోలాటం ఆడి – పాడి, అందరితో సరదాగా పండుగ చేసుకొంటారు.
దసరా అంటే బెంగాలీ వారు కూడా కొన్ని నెలలు ముందుగానే ఉత్సవ వేడుకలకి సన్నాహాలు ప్రారంభిస్తారు. దుర్గా అమ్మవారి విగ్రహాన్ని భారత దేశం నుంచి తెప్పించి, పూజారులని, వంట వారిని కూడా ప్రత్యేకంగా భారత దేశం నుంచి పిలుస్తారు. ఎంతో వైభవంగా పూజలు, ప్రసాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నవరాత్రులు వేడుకలు జరపగా, పదవ రోజు అంటే విజయదశమి నాడు “సింధూర ఖేలా” అంటే ముత్తైదువులు ఒకరికి ఒకరు కుంకుమ తో హొలీ లాగా ఆడి, ఒకరికొకరు తీపి మిఠాయిలు తినిపించి వేడుకలు ముగిస్తారు.
అంతే కాదండోయ్, ఈ నవరాత్రుల సందడి దాండియా నైట్స్, గర్బా నైట్స్ అనే కార్యక్రమాలతో హాంగ్ కాంగ్ దీపావళికి స్వాగతం పలుకుతుంది!!