“వృద్ధాప్యంలో సమస్యలు – తీసుకోవలసిన జాగ్రత్తలు”
వృద్ధాప్యం రాకముందే అందుకు సంబంధించిన ఆర్థిక, శారీరక, మానసికపరమైన ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ పిల్లల వైద్యులు డా. గుళ్ళపల్లి సురేంద్ర పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం శనివారం (13 నవంబర్ 2021) సాయంత్రం యూట్యూబ్ ద్వారా ప్రసారమైంది. ఇందులో “వృద్ధాప్యంలో సమస్యలు -తీసుకోవలసిన జాగ్రత్తలు’ అంశంపై విజయవాడ వాస్తవ్యులు డా. సురేంద్ర ఆసక్తికరంగా ప్రసంగించారు. ముందుగా చింతలపాటి శివ సుబ్రహ్మణ్యం (ఉపాధ్యక్షుడు, కేసరి మహోన్నత పాఠశాల, చెన్నై) ప్రేక్షకులకు స్వాగతం పలికారు. తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ట్స్ అకాడమీ (విజయవాడ) అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు వక్తను పరిచయం చేస్తూ… ఆయన ప్రపంచమంతా పర్యటించి ఆయా ప్రాంతాల ప్రకృతిని, వింతలూ విశేషాలను డాక్యుమెంటరీలలో నిక్షిప్తం చేశారని చెప్పారు. అలాగే, తెలుగునాట వందల ఏళ్ళపాటు జరిగిన విషయాలను, అంటార్కిటికా మీద కూడా డాక్యుమెంటరీలు తీసిన ప్రపంచ హితకారి, పాత్రికేయుడు కూడా అని కొనియాడారు.
అనంతరం డా. సురేంద్ర మాట్లాడుతూ… తన వృద్ధాప్య జీవితానికి సంబంధించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయత్నించానని, అనుభవజ్ఞుల అనుభవాలు కొంతమేరకు తోడ్పడ్డాయని చెప్పారు. అప్పట్లో అంతర్జాలం ఉండేది కాదని, అది వచ్చిన తరువాత కూడా ఇప్పటికీ ఈ విషయానికి సంబంధించిన అనేక అంశాలు ఒకచోట లేవని పేర్కొన్నారు. తను తెలుసుకున్న సమాచారం ప్రకారం దేశంలో దాదాపు 75 శాతం మందికి బీమా లేదని తెలిసిందన్నారు. ఇంటికి ఆధారమైన సంపాదనపరులకి ఏదన్నా ఆపద వస్తే తట్టుకొనే శక్తి 8 శాతం కుటుంబాలకు మాత్రమే ఉందనే నిర్ఘాంతపోయే నిజాన్ని వెల్లడించారు. నాలుగు రూపాయలు వెనకేసుకొనే సౌలభ్యం లేనివాళ్ళు పిల్లల మీదే ఆశ పెట్టుకుంటున్నారని, కొందరు పిల్లలనే తమ ఇన్వెస్ట్మెంట్లని అన్నప్పుడు తను వారిస్తుంటానని వెల్లడించారు. పిల్లలు ముందు తమకి తాము, తరువాత పొరుగువారికి, దేశానికి ఉపయోగపడేలా పెంచాలని సూచించారు. వీలైనంత వరకు వృద్ధులు తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేయాలని కోరారు. పైగా, పిల్లలకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పులు మాత్రం మిగల్చద్దని హితవు పలికారు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు బాధ్యత వహించాలన్నది ఎవరూ కాదనలేని విషయం అన్నారు. ఆస్తి అనేది స్థిరాస్తి, నగదు, బంగారంగా ఉంటే inflation ని తట్టుకోవచ్చన్నారు.
శారీరక జాగ్రత్తల గురించి మాట్లాడుతూ, ముందు నుంచీ వ్యాయామం చేస్తుంటే వృద్ధాప్యంలో అనారోగ్యం బారినపడే అవకాశం తక్కువని డా. సురేంద్ర అన్నారు. దేశంలో 95 శాతం మంది వ్యాయామం చెయ్యనివాళ్ళే అని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ లాక్ డౌన్ అప్పుడు ఎక్కువగా వ్యాయామం చేయనివాళ్ళకే ఇబ్బందులు కలిగాయని గుర్తు చేశారు. కార్పొరేట్ ధోరణి వల్ల జనంలో ఆసుపత్రుల మీద అపనమ్మకం పెరిగిన మాట నిజమేనని, అయితే, కుటుంబ వైద్యులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నపళంగా పెద్ద సమస్యలొస్తే తీర్చే వ్యవస్థ ఉంది కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని చూసే వ్యవస్థ లేకపోవడం శోచనీయం అన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహిస్తే పెద్దవి కలిగే పరిస్థితులు తక్కువగా ఉంటాయని వివరించారు. అందుకే కుటుంబ వైద్యులు ఉండాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి, వాటిని పాటించాలి అని సూచించారు. విదేశాల్లో పీడియాట్రిక్స్ తోపాటు పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన జీరియాట్రిక్స్ కూడా ఉంటుందని, అది మన దేశంలో ఇంకా ఎందుకు రాలేదెందుకో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి మానసిక సంసిద్ధత కూడా ఆర్థిక, శారీరక సంసిద్ధతలంత అవసరమని డా. సురేంద్ర చెప్పారు. వృద్ధాప్యం అనివార్యం కాబట్టి దాన్ని మానసికంగా ఒప్పుకోవాలన్నారు. బాల్యంలోనే ఆ తరువాతో కలిగిన అభిరుచిని వ్యాపకంగా పెట్టుకొని ఆనందాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. ముందుచూపుతో తను తీసుకున్న జాగ్రత్తలను, తన జీవితానుభవలను ప్రేక్షకులతో పంచుకున్నారు.