మామయ్య నెపుడైన కన్నారా !
నెహ్రూమామయ్యనుగుఱించి విన్నారా ?
బాలబాలికలలో
పూలమాలికలలో
నిలు వెల్ల పులకించి
వలపు లొలికేవాడు !
కోటీశ్వరుడుగానె
జనన మందాడు !
కోట్లాదిప్రజసేవ
కోరుకున్నాడు !
తనయిల్లు తనముల్లె
తనవయసు తనమనసు
సకలమును దేశ సే
వకె సమర్పించాడు !
అంతకన్నను భోగి మఱి లేడు !
అతని మించినత్యాగి మఱి లేడు !
గాంధితాతయ్యతో
ఖైదులకు వెళ్ళాడు !
తాతయ్యశిష్యు డై
తను ప్రధా నయ్యాడు !
బాలబాలికలె తన
ప్రాణ మన్నాడు !
బాలలే మనజాతి
భాగ్య మన్నాడు !
పసిపిల్లలను చూసి
పరవశించేవాడు !
ఎత్తుకొని ముద్దాడి
యెద హత్తుకొనువాడు !
పెద్దపెద్దలలోన
పెద్దవా డై కూడ
బాలలను చూడగానే
బాలు డయ్యేవాడు !
పూలనవ్వులు చూచి
పులకించిపోయాడు !
ఎఱ్ఱనిగులాబీకి
ఎపుడు మన సిచ్చాడు !
పంచశీలను తను, ప్ర
పంచమున ౘాటాడు !
జగతిలో శాంతిదూ
తగ పేరు పొందాడు !
స్వాతంత్ర్యభారతమె
స్వర్గ మన్నాడు !
నవభారతమె తనకు
వందన మ్మన్నాడు !
తనచితాభస్మమును
మనదేశమం దెల్ల
చల్లించివేయు డని
‘ విల్లు ’ లొ వ్రాశాడు !
కొందంతత్యాగమ్ము
గుండె నిండినవాడు !
గుండె పోటున నతడు
కూలిపోయాడు !
పౘ్చకప్పురమట్లు
బ్రతుకు వెలిగించాడు !
ఇందిరను మన కిచ్చి
ఇల విడిచి పోయాడు !
కోట్లాదిప్రజ తనకు
గుండెకా యన్నాడు !
కోటి గుండెలలోన
గుడి కట్టుకొన్నాడు !
అతడు పుట్టినరోజు
అవనికే పర్వమ్ము !
భరతావనిని నాడె
బాలలదినోత్సవము !
మామయ్య నెపుడైన కన్నారా ?
నెహ్రుమామయ్యగుఱించి విన్నారా !
——- ( 0 )——–