11_006 ద్విభాషితాలు – వధువు వాగ్దానం


సఖుడా!

“సఖా సప్త పదా భవ”

అన్న శాస్త్రానుసారం

ఏడడుగులు నడచి

వైవాహిక బంధానికి

నీతో జత  కలసిన నేను

క్రమం తప్పని పద లయలతో

నీ నీడలా నిన్ను అనుసరిస్తాను.

తరాలుగా..


ఈ అవనిపై కరడుగట్టిన.. పురుషాధికారంతో..

నన్ను అణగద్రొక్కే..

అహంకారిగా కాక..

సమభావంతో ఆదరించే సంస్కారాన్ని

నీలో దర్శించాలనుకొంటున్నాను. 

నీ నిరంతర స్నేహంలో..

సేద తీరాలనుకొంటున్నాను.


ఒక పువ్వు సౌకుమార్యాన్ని రక్షించిన తీరుగా..

నన్ను పెంచిన..

నా తల్లిదండ్రుల ప్రేమ ప్రేరణగా..

నా మెట్టినింటి ధర్మనిర్వహణకు

శ్రీకారం చుడతాను.


ఆరు ఋతువుల ఆవిష్కరణలనూ

అందమైన వర్ణచిత్రాలుగా మలచి..

మన పెరడు అందాలను..

ద్విగుణీకృతం చేస్తాను.

అందరి మన్ననలూ పొందే

ఆదర్శవనిగా మన ఇంటిని 

తీర్చి దిద్దుతాను.


వేళ ఉగ్రమైనా..

విధి వెక్కిరించినా..

ఓదార్పు హస్తంతో నిన్ను తట్టి..

ధైర్యవచనంతో  నడిపిస్తాను.

ప్రేమ పోసి పెంచుకొన్న..

మన బ్రతుకుతరువు యొక్క..

కాంతిఫలాల్ని నీకందించి..

సంపూర్ణ సుఖమయజీవనయానానికి

బాటలు వేస్తాను.


నువ్వే ప్రాణంగా బ్రతికిన

నా అత్తమామలకు

సముచితాసనం వేసి..

మరో కుమార్తెగా..

ఓరిమితో ఉపచారాలు చేస్తాను.

ఇంటికి దీపంగా వెలుగుతాను.


మన పరిణయవేళ..

నా పాణిగ్రహణం చేసిన నీకు..

ఇది..

నేను చేస్తున్న వాగ్దానం !