ఘష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ॥
ఈ శ్లోకం శ్రీ కులశేఖరుల వారిని ప్రార్థించే శ్లోకం. భక్తిమయ జీవితాన్ని సాగించే కులశేఖర మహారాజు ధర్మబద్ధమైన ఏలుబడిలో రాజ్యం సర్వ సుభిక్షంగా ఉండేది. భూలోక వైకుంఠమనదగిన శ్రీరంగపట్టణాన వెలసిన శ్రీరంగనాధస్వామిని సేవించి రావాలని మహారాజుకు ఎంతో కోరిక గట్టిగా తల్చుకుంటే ఇట్టే వెళ్ళి రాగలడు. కానీ తానొక్కడే వెళ్ళి సేవించి రావడం కాదు. తన పురవాసులైన భక్తులందరితో కలిసి మరీ సేవించి రావాలని రంగయాత్ర గురించి నగరంలో చాటింపించేవారు. భక్తులతో కూడి శ్రీరంగానికి వేంచేస్తే తన్మయత్వంలో మునిగి మహారాజు అక్కడే ఉండిపోయి, మరి రాజ్యానికి తిరిగి రారేమోననే శంకతో, మంత్రులు నిత్యం భగవద్భక్తులను రాచనగరునకు తోడ్కొనివస్తే, ‘‘తస్మిన్‌స్తజ్జనే భేదాభావాంత్॥ అని నమ్మిన కులశేఖరులు వారికి ఆతిధ్యమిచ్చి, వారితో భగవంతుని గురించిన ప్రసంగాలతో పొద్దుపుచ్చి, ప్రయాణాన్ని మరునాటికి వాయిదా వేసేవారట! ఈ విధంగా వారి పట్టణంలో ప్రతినిత్యము రంగయాత్ర చాటింపబడేది! కులశేఖరులకు కృష్ణభక్తితో పాటు శ్రీకృష్ణ భక్తుల సాంగత్యంపై ప్రీతిఎక్కువ! ఇంత గాఢమైనది వారి భాగవత భక్తి!
వారి గుణానుభవపు తాదాత్మ్యత ఎంతటిదంటే ఒకమారు రామాయణ కధా గానం జరుగుతోంది. రామరావణ యుద్ధఘట్టం వచ్చింది. మహారాజుకు ఆ సన్నివేశం కళ్ళ ఎదుట జరుగుతున్న భావన! వెంటనే తన రధాన్ని చతురంగబలాల్ని సిద్ధం చేయించమని ఆజ్ఞాపించి, ‘‘రామా! సుగ్రీవుని సైన్యం మాత్రమే కాదు. నా సైన్యమూ సర్వసన్నద్ధంగావుంది. నేనూ ససైన్యంగా వచ్చి యుద్ధం చేసి నా తల్లిని రక్షించుకుంటాను!’’ అంటూ లేచి ధనుర్భాణాలు అందుకుని సంసిద్ధులయ్యారట! అప్పుడు శ్రీరామచంద్రుడు సీతాసహితుడై, ఎదురువచ్చి ‘‘నాయనా! సీతా సంరక్షణ జరిగింది. ఇదుగో సీత! శాంతించు’’ అని అంతర్ధానమయ్యారట! అప్పుటికి వాస్తవ ప్రపంచంలోనికి వచ్చారు మహారాజు. అంతటి తీవ్రమైనది వారి గుణానుభవపు తాదాత్మ్యత! ఇలా శ్రీరంగనాధుని గుణానుభవంలోనే సమయాన్ని గడిపే భక్తకులశేఖరులకు వందన శతాలు!!!
భగవంతునికి ఉనికి భాగవతుల హృదయ సీమలలోనట! అందుకే భాగవతులను సేవించడం భగవంతునికి అమిత ప్రీతికరం! సదా హరిగుణగానం చేస్తూ, తాము తరిస్తూ, అందరినీ తరింపజేసే హరిభక్తుల సేవ సర్వోత్తమం.
(త్యాగరాజ కృతి…)
హరిగుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో
కరుణగల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారు
ఎందరో మహానుభావులు ` అందరికీ వందనములు
అంటారు త్యాగరాజు.
పుణ్యానిమాన్ భాగవతాన్ స్మరామి! అని భాగవతకోటిని స్మరించడం, భగవంతునికి ఆనందహేతువు! ఆ శ్రీహరి గుణ కీర్తన చేస్తూ, ఆ స్వామిని సదా మదిలో నిల్పుకుని, తెలివితో అంటే, సకల భూతముల యందు నిజాంశతో వ్యాపించియున్నది ఆ పరమాత్మేనన్న విషయము తెలిసి, విష్ణువై అందరిలోనూ ఉన్నది అతడే కనక తనకూ వారికీ భేదం లేదనే చెలిమితో, దీనులయెడ కరుణగల్గి, అందరి యెడలా, అన్నివిధాలా, సుధాదృష్టిలో అమృతంలా హాయినిచ్చే ప్రశాంత దర్శనంగల భక్తమహనీయులకు వందనాలు’’ అంటారు త్యాగరాజస్వామి తన శ్రీరాగ పంచరత్నకృతిలో అంటే… ‘‘ అద్వేష్టాస్సర్వ భూతానాంమైత్రః కరుణ ఏవచ’’ అని భగవద్గీత భక్తియోగంలో చెప్పిన భక్తలక్షణాలున్న వారిని స్మరించి వందనాలర్పించారన్నమాట! అంతేకాదు భక్తితో భగవంతుని హృదయంలో నిల్పుకుని భావనానందాన్ని అనుభవించే ‘‘భక్తుల సందర్శనం కూడా’’ భగవద్దర్శనమంత బ్రహ్మానందాన్ని కల్గిస్తుంది సుమా! అంటారు
అయ్యవారు (త్యాగరాజు) తన ‘‘బంగాళరాగ’’ కృతిలో.
‘‘ రామభక్తి సామ్రాజ్య మేమానవులకబ్బెనో
ఆ మానవుల సందర్శన మత్యంత బ్రహ్మానందమె’’ అంటారు.
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి
నాధేతి నాగశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురుమేముకుంద ॥
మహాభక్తశేఖరుడైన శ్రీ కులశేఖర మహారాజు మొట్టమొదటగా ముకుందుని గురించి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. ‘‘ ఓ ముకుందా! శ్రీ వల్లభా! వరదా! దయాపరా! భక్తప్రియా! భవలుంఠనకోవిదా! నాధా! నాగశయనా! జగన్నివాసా! అంటూ ఎలుగెత్తి పిలిచే నా మొరను ఆలకించు తండ్రీ! అంటూ, నేను పలికే ప్రతి పదం (పలుకు) నీ నామమే కావాలి, అడుగడుగునకూ నీ నామకీర్తనమే నా జీవిత గమనంలో నిండి ఉండాలి. అంటారు.
ముక్తికి ముఖ్యసాధనం నామం. మాటకు సంస్కృతమున ‘పదము’ అని పేరు. పదము అంటే అడుగు అని కూడా అర్ధం. అడుగు కదిపినా నోరువిప్పినా భగవన్నామమే పలుకుదును గాక. ఏ పనులు చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా భగవన్నామము మరపురాకూడదు. ముందుగా ‘‘శ్రీవల్లభా’’ అంటున్నారు. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీవల్లభుడాతడు. బిడ్డలమైన మనను తండ్రి ప్రేమకు పాత్రులను చేసేది తల్లి శ్రీ. ఆమె లక్ష్మి. కృష్ణావతారంలో రాధగా, రుక్మిణిగా వచ్చినది ఆతల్లియే! ఆమె నాశ్రయిస్తే ఆమె ద్వారా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేనిదే భగవదనుగ్రహం లభించడం కష్టం. భగవానుని నామాల్లో స్వామికి ఇష్టమైన నామం శ్రీవల్లభ! అందుకే ముందుగ ఆ నామంతో కీర్తించడం! అలా కీర్తించిననాడు భగవానుడు మనలను రక్షించకుండా ఉండలేడు. అమ్మద్వారా ఆశ్రయించడమే మన యోగ్యతగా, మనకు వరాలిస్తాడు. కనుకనే వరదా! అని కీర్తించాలి.
రామదాసు ఈ ఉపాయంలోనే చెరనుండి ముక్తుడయ్యాడు. చాలా కాలం రామచంద్రుని వేడుకుని, స్వామి దయ రాకపోవడంతో తల్లి సీతమ్మకు మనవి చేసుకున్నాడు రామదాసు. రామచంద్రులు నాపైచలము చేసినారూ సీతమ్మా చెప్పవమ్మా’’ అంటూ అర్ధించాడు. జనక తనయనాదుమనవి గైకొని జగజ్జనకునితో దెల్పవే. ఓ జనని ॥ అంటూ వేడుకున్నాడు. ఏమైనా తల్లి సీతమ్మ ద్వారానే తాను రక్షణ పొందాలని నిర్ణయించుకుని…
ప. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ నను బ్రోవమని చెప్పవే
అ.ప. లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి
ఏకాంతమున నేక శయ్య నుండెడి వేళ ॥ నను ॥
చ. అద్రిజవినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొనువేళ
నెలతరో బోధించి నను బ్రోవమని చెప్పవే ……
అంటూ ప్రార్ధిస్తే తల్లి మనస్సు కరిగింది. స్వామికి నచ్చజెప్పింది. ఈలోగా రామదాసు కర్మపరిపక్వమూ అయింది. స్వామి దాసుని చెరవిడిపించాడు. తానీషాకి సొమ్ము చెల్లించి. ఆ తల్లి శ్రీ, ఆ స్వామి శ్రీ వల్లభుడు! వరదా అని వేడుకుంటే మొర వినకుండా ఉండలేడు.
ఏదో అమ్మవారిని మెప్పించడానికి వరాలివ్వడం కాదు. ఆ తల్లి దయా స్వరూపిణి కదా! బిడ్డల వేదనకు ఆమె ఓర్వలేదు. ఇలా ఆమె తన కడగంటి చూపు ఆర్తులపై ప్రసరించడమేమిటి! స్వామి హృదయములో దయ వెల్లువౌతుంది. అంతే! బాధపడే బిడ్డల యెడ స్వామి మనసు ఆర్ద్రమవుతుంది. అలాంటి స్వామిని దయాపరా! అని కీర్తించాలి. భక్త్యాస్తే-తీవమే ప్రియాః ॥ యోమద్భక్తస్సమే ప్రియః। సచమమప్రియః ॥ అన్నాడు స్వామి.
అంతటి దయామూర్తియై.న దేవునికి మనమేమి అర్పించగలం! ఆయన మననుండి ఏమపేక్షిస్తాడు కనక! మన ప్రేమను కాంక్షిస్తాడు. భక్తిని ఆపేక్షిస్తాడు.
భక్త్యాస్తే-తీవమేప్రియాః యోమద్భక్తస్సమే ప్రియః సచమమప్రియః ॥ నా యందు భక్తిని నిల్పుకున్నవారు నాకు ఇష్టులు అన్న భగవానుని భక్తప్రియా! అని కీర్తించుకోవాలి.
నిజానికి మనం భక్తులమైనందువల్ల, భగవంతుని ప్రేమించినందువల్ల, భగవంతుని కేమి ప్రయోజనం?
తండ్రి బిడ్డల క్షేమాన్ని కాంక్షిస్తాడు కదా! ఆ స్వామి దయకలగడమేమిటి మన సంసార బంధాలు ఛేదింపబడటమేమిటి ? ఇట్టే జరిగిపోతుంది. పసివాడైనా ప్రహ్లాదుడు ఈ విషయం ఆ జన్మ సిద్ధంగా తెల్సుకున్నాడు. కనుకనే ‘‘సంసార జీమూత సంఘంబు విచ్చునే. చక్రి దాస్యప్రభంజనము లేక? తాపత్రయా భీలదావాగ్నులారునే విష్ణుసేవామృత వృష్ఠి లేక ॥ అంటారు. అటువంటి తండ్రిని భవలుంఠన కోవిదా। అని కీర్తించుకోవాలి.
‘‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ
ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనె యుండగ ॥ తక్కువేమి॥
అవును. భక్తుల సంసారబంధాలను త్రెంచివేసేవాడు మన నాధుడు. మన సంసార బంధాలను త్రెంచడంలో భగవంతునికింత ఆసక్తి ఏమిటి అనా మీ ఆలోచన ? ఆయన మననాధుడు కదా? మనమంతా ఆయనకు చెందిన వారం. తన వారిని రక్షించుకొనే బాధ్యత పాలకుడైన తనదేకదా ? అందుకే నాధా! అని అని కీర్తించుకోవడం!
ఇంత చేసీ ఏమి చెయ్యని వానిలా హాయిగా చిద్విలాసంగా శేషశయ్యపై శయనించియున్నాడు స్వామి. శేషుడు తన శరీరాన్ని, స్వామికి ఇల్లుగా, పాన్పుగా, పాదుకగా, వస్త్రంగా, తలగడా, గొడుగుగా, పాదపీఠముగా మార్చి మార్చి వినియోగ పరుస్తున్నాడే! అలాగే మనం కూడా మన ఈ శరీరాన్ని, హృదయాన్ని, అన్నివిధాలా ఆయనకే వినియోగపరచిననాడు, ఆ శేషుని మీద పరుండినట్లే, మనలో కూడా విశ్రమించి ఉండగలడు. అటువంటి స్వామిని ‘‘నాగశయనా’’ అని కీర్తించాలి. మనలోని విషయ వాసనలనే విషాన్ని వేరుచేసి మన ఆత్మను తనకు ఆవాసంగా చేసుకోగలడు.
ఎక్కడో పాలకడలిపై శేషతల్పం మీద పవళించియున్న ఆస్వామిని ఈ భూమిపై నున్న మనం పొందగలమా అని వెరవనక్కరలేదు. ఆ స్వామి జగన్నివాసుడు సర్వ జగములకు తాను నివాసమై యుండువాడు. అతడు లేనిచోటు లేదు. ఈ సర్వ జగత్తు నందూ మనలోని ప్రత్యణువులోనూ కూడా ఉన్నస్వామిని ‘‘అణోరణీయన మహతో మహీయన, అప్రమేయనన॥’’ అంటూ పురందర దాసులవారు కీర్తిస్తూ పాడితే, త్యాగరాజు, ‘‘దూరభారమందూ నా హృదయార విందమందు నెలకొని’’ యున్న సర్వాంతర్యామిని గుర్తించి పాడారు. జగత్తులో ప్రతి అణువులోనూ ఉన్న స్వామిని జగన్నివాసా! అని కీర్తించాలి. ఇలా అడుగడుగుకూ, మాటిమాటికీ, నీ దివ్య నామాన్ని కీర్తించుకునే అదృష్టాన్ని మమ్ము పొందనీ స్వామీ అంటారు కులశేఖరులు. తమ ఆరాధ్యదైవం యొక్క నామ పారాయణానందాన్ని, అనంతగుణ నామాలనూ, స్తోత్రాలరూపాల్లో వెల్లడిరచుకుంటూంటారు భక్తులు.
విశ్వేశ! విశ్వ భవనాశక! విశ్వరూపా!
విశ్వాత్మక! త్రిభువనైక గుణాధికేశ
హే విశ్వనాధా! కరుణామయ దీనబంధో!
అంటూ (మహేశ్వరుని) విశ్వానికంతటికీ నాధుడైనవాడా! విరాడ్రూపా! ముల్లోకాలలోనూ అధికుడవైన స్వామీ! జగన్నాధా! అందరి పాపాలనూ పోగొట్టే విశ్వేశ! దీనబంధుడా! అంటూ శ్రీ శంకర భగవత్పాదులు సదాశివుని గురించిన నామాలతో స్తోత్రం చేస్తున్నారు.
సదా రామరామేతి నామామృతంతే
సదారామమానంద నిష్యన్దకన్దమ్
పిబన్తం, నమన్తం, సుదంన్తం హసన్తం
హనూమన్తమన్తర్భజే తంనితాన్తమ్ ॥
సదా రామరామ అనే నామామృతాన్ని పానం చేస్తూ, నిత్యానందాన్నిచ్చే రామసుధను గ్రోలుతూ, నమస్కరిస్తూ, సంతోషంతో చిందులు వేస్తూ సదా ఆ పరవశంలో మునిగి తేలే హనుమంతునికి వందనాలంటారు శ్రీరామభుజంగప్రయాతస్తోత్రంలో ఆచార్యుల వారు. శ్రీరామనామామృతం రుచి హనుమంతుడెరిగినంతగా మరొక్కరికి తెలియదేమో! ఆ నామపారాయణానందాన్ని అనుభవించే ఎవరిని చూసినా ఇలాగే అనుకోవాలనిపిస్తుంది. దైవం అంటేనే తెలియని కరకు బోయకు ఒక్కసారి ఆ నామం ఉపదేసించేసరికి ఆ రామనామ జపపారవశ్యంలో కాలమే తెలియలేదు! వత్సరాల తరబడి తన చుట్టూ పుట్టలు కట్టినా, చీమలు, పాములూ, శరీరాన్ని విధిలం చేస్తున్నా, ఆనామ జప ఆనందం నుండి బయటి ప్రపంచంలోకి రావాలని అనిపించనేలేదూ! ప్రకృతే వర్షమై పుట్టను కరిగిస్తే, కవి కాగల కర్తవ్యం వాస్తవ ప్రపంచంలోకి వాల్మీకిగా అవతరింపజేసింది. రామనామమహిమ ఆదికవిని చేసింది!
తరువాయి వచ్చే సంచికలో……
– ——- ( 0 ) ——-