ఆత్మీయ మిత్రుడు, స్నేహమంటే ప్రాణమిచ్చే స్నేహశీలి, అందరి శ్రేయోభిలాషి, ‘ శిరాకదంబం ’ కుటుంబ ( సంపాదక వర్గ ) సభ్యుడు గొర్తి బదరీ విశ్వనాథ శాస్త్రి ఆకస్మిక మరణం తీరని లోటు…. అశ్రునయనాలతో…..
మా “బదరీ” కి నివాళి
****************
“అరే స్నేహం అంటే
మనసు….అంతర్వాహినిగామారి
పెల్లుబుకుతుందేం ఈ “మనీషి”కి!
ఆత్మీయతల స్వచ్ఛమైన
గంగాజలం నిలువెల్లా నింపుకున్న
కోనసీమ నాణ్యమైన కొబ్బరి రుచి
ఈయన స్నేహంలో పొంగి పొర్లుతుందేం!
కళ్యాణోత్సవం వేళ కదిలే
అమలాపురం వెంకటేశ్వరస్వామి రథమంత ఉన్నతుడు!
జగ్గన్నతోట తీర్ధ ప్రభంత హుందా!
కంచుకంఠాల జగ్గయ్య గొంతుధ్వని..!
ఎన్ని చెప్పనూ…
నిలువెత్తు మానవత్వపు బంగారుతనం
మా “బదరీ”గారు!
తిలక్ “గుండెక్రింద చెమ్మకి”
ఈ వెన్నముద్ద విగ్రహం ఓ ప్రతిరూపం!
నవునవ్వుల..హాశ్చర్యార్థకాల
వెనుకే వినమ్రపు లాహిరి మా బదరీ!
ఎన్నెన్నో ఉషోదయాల పలకరింపులు
ఇంతలో మబ్బులచాటుకు
వెళ్లడం…
ఆత్మీయ “అభిజ్ఞ”పరివారానికి
కోవిడ్ ని మించిన శాపం!
సిరల్నీ-ధమనుల్నీ
రక్తంతో కాక…
“మానవత్వం..మానవ సేవ..
మా మంచి స్నేహితాలసేవ” అనే
రక్తంతో రంగరించి..
ఆ బ్రహ్మ సృజించి ఇచ్చిన
ఈ “బదరీ బొమ్మ”…అర్ధాంతరంగా పగిలిపోయి…
ఇక కనపడదనే
వార్త….
ఈ సూర్యోదయాన్ని
మింగేసి…
మనసుని
ఎంతో బావురు మనిపిస్తోంది!
జీవనగమనాన్ని
స్నేహాసుగంధాలతో సుసంపన్నం చేసుకుని….
కర్పూర కళికై…
ఎప్పటి కాలానికైనా
ఓ తీయనైన పచ్చబొట్టు జ్ఞాపకంగా
మిగిలే
మా బదరీ….
కోనసీమ వైభవాల సాక్షిగా,
ఆ అరుణాచలేశ్వరుని పాదపద్మాల
సాక్షిగా..
చిరంజీవి…
చిరంజీవి….!
మా ఉనికిని ఎల్లవేళలా
తన స్నేహసౌరభాలతో నింపే
ధన్యజీవి!
ఒక్కడే..
మా బదరీ…
ఎనలేని…ఎల్లలులేని
మానవత్వాపు మహాఋషి!!
అశ్రునివాళితో…
‘ అభిజ్ఞ ’ మిత్ర బృందం
రచన : కూచి కృష్ణప్రసాద్
బద్రి గారూ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక మందిని జాతి భాష కుళామతాలకు అతీతంగా అన్ని విధాలా ఆదుకున్న మానవతా మూర్తి.