11_008 ముకుందమాల – భక్తితత్వం 03

 .                        

                       శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే ।

                      సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥

   

అంటూ అనవరతం రామనామాన్నే జపిస్తూ ఆనందాన్ననుభవిస్తూంటాడు ఈశ్వరుడు. సదా రామనామం జపిస్తూంటే మరో నామాన్ని గురించిన ఆలోచనే రావడం లేదట వారికి. ఎందుకంటే రామ అన్న నామం ఉచ్ఛరించేసరికి మనసు ఆ రెండక్షరాలను దాటి వెళ్ళడం లేదు. అలౌకిక సుఖ స్వరూపం తానుగా ఆ రెండక్షరాలలో అనుభూతికి వస్తూంటే, మరో భావానికి కూడా ఆస్కారం ఉండటం లేదట వారికి.

తన భక్తుల ఆ నామపారాయణానందాన్ని ఎరిగిన స్వామి అందుకే

                        నాహం వసామి వైకుంఠే, యోగినాం హృదయేనచ

                        మద్భక్తాః యాత్రగాయన్తి తత్రతిష్ఠామి నారద।

 

            నేను వైకుంఠంలో వసించను. యోగుల హృదయాలలోనూ కనబడను. నా భక్తులు ఎక్కడైతే నన్ను గురించి గానం చేస్తూంటారో అక్కడ వుంటాను నారదా! అని పద్మపురాణంలో భగవానుడే స్వయంగా నారదమహర్షితో అంటారు.

 

              ప॥        ఓ రామ నీ నామమెంత రుచిరా

                          శ్రీరామ నీనామ మేమిరుచిరా॥

              చ. 1      కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషనుల

                         గాచిన నీ నామమేమి రుచిరా                         ॥ శ్రీ ॥

              చ. 2      కదళి ఖర్జూరాది ఫలముల నధికమౌ

                        పతిత పావన నామమేమి రుచిరా                    ॥ ఓ రామ ॥

            అంటూ రామనామంలోని రుచికి పరవశిస్తూ పాడుకుంటాడు భద్రాచల రామదాసు. మరో భాగవతోత్తముడు పురంధరదాసు :-

               ప॥        రామ నామ పాయసగే కృష్ణ నామశర్కరయ

                          విఠలనామ తుప్పవకరసి బాయి సప్పరి శో ॥

 

            రామ నామ పాయసంలో కృష్ణనామం చెక్కెరగా, విఠలనామం నెయ్యిగా అమరి నా (నోటికి) నాలుకకు అమృతం అందివస్తూందంటారు పరవశంగా!

                          నామ స్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే

                          రామ హరే! కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ॥

 

            భవతరణానికి నామస్మరణ కన్నా మంచి ఉపాయం లేదుసుమా!

            త్యాగరాజస్వామి వారి ‘‘ప్రహ్లాదభక్తవిజయం’’ గేయ రూపకంలోని ఒక కృతిలో.

            హిరణ్యకశిపుని వధానంతరం ప్రహ్లాదుడు స్తోత్రం చేశాక శాంతించిన నరహరి ఆ చిన్నారి బాలకునితో…

                        ‘‘ అడుగువరములనిచ్చెదనూ’’ అంటే ` అందుకు,

                        స్వామీ! ‘‘ అడుగడుగుకు నిన్నే తలచుచున్నాను ’’.

            ఇంకేం కావాలి తండ్రీ నాకు! నీ తలపులోనే కోటి స్వర్గాల సుఖం అంది వస్తూంటే!!! అంటాడు. ప్రహ్లాదుడు! 

    

    1.                      జయతు జయతు దేవో దేవకీనందనో యం

                            జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః

                            జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో

                            జయతు జయతు పృథ్వీ భారనాశో ముకున్దః ॥

 

            ముకుందః! దేవః! దేవకీనందన జయతు జయతు మోక్షమునిచ్చే వాడు  ముకుందుడు. ఎవరీ ముకుందుడు ? మా దేవకీనందనుడే! తానెక్కడో గోలోకంలోనో, వైకుంఠంలోనో ఉంటే మనం తనను చేరలేమనీ, పొందలేమనీ, తానే దిగివచ్చి, తనచేత సృష్టించబడిన ఈ జగత్తులో, ఒక తల్లిగర్భాన పదినెలలు వసించి, ఆ తల్లి కడుపుపంటగా, ఆనందసంధాయకుడై, జన్మించినాడు. ఆహా! ఎంత దయామయుడవయ్యా! స్వయం ప్రకాశమానుడవైన నీవు లీలావతారుడవై, దేవకీ దేవికి కుమారుడవై పుట్టావా తండ్రీ! నీ వాత్సల్య సౌశీల్యాలు సర్వోత్కర్షతో విరాజిల్లును గాక!

 

                             ముకుద్దః కృష్ణః వృష్టివంశప్రదీపః జయతు జయతు

 

            పృథ్వీ భారాన్ని తొలగించడానికై దేవకీ నందనునిగా అవతరించి స్వామి, అమాయకులు, అజ్ఞానులు అయిన యాదవులను ఆదరించాడు. వారికి ఆనందాన్ని ప్రసాదించాడు నిత్యానంద స్వరూపుడవైన కృష్ణా! నీవే మోక్షప్రదాతవు!

            దేవకి కుమారునిగా అవతరించి, పృథ్వీ భారాన్ని తొలగించడానికి, యాదవ కుల మణిదీపమై వృష్ణివంశజుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి యదుకులంలో వసించాడు స్వామి! నిరతి శయానందస్వరూపుడవు. నీవే కృష్ణుడవు. కృష్ణ ప్రదీపమవు నీవు సామాన్య దీపము వంటివాడవు కావు. సామాన్యదీపము వత్తి, నూనెల సహాయముతో బయటి చీకట్లను మాత్రం పోగొడుతుంది. కానీ మా కృష్ణ ప్రదీపమో! ఏవిధమైన ఆధారమూ అవసరం లేకుండానే ఆంతర్యంలోని అజ్ఞానపు చీకట్లను తొలగింపజేసి, జ్ఞానానందాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి కృష్ణ ప్రదీపమునకు మంగళమగును గాక!

 

                               మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు

 

            మోక్షాన్నిచ్చే ముకుందతత్వం గుణములు లేనిదీ, రూపంలేనిదీ కాదు. కోమలాంగమూ, మేఘశ్యామలమూ అయినది. మేఘంలాగా రసంతో అంటే, జలంతో నిండినది. జలములతో తడిపేది మేఘము. దయారసంతో నిండి ఆర్ద్రమెనర్చేది మా కృష్ణ మేఘం. నీటితో నిండిన మేఘం వర్షించడానికి ప్రార్ధన అక్కర్లేదు. మా కృష్ణ మేఘమూ అంతే! చూచిన వారి తాపాన్ని చల్లారుస్తాడు. దర్శించిన వారి ఆది భౌతిక, ఆది దైవిక ఆధ్యాత్మిక తాపాలను పోగొట్టే ముకుంద మేఘం, దయారసం కురిపించడం నిర్హేతుకమే. అది స్వామి స్వభావం. కారుమేఘం తనకున్నదంతా వర్షించి, తాను వెలవెలబోతుంది. మరి కృష్ణ మేఘం? ఆశ్రిత అనాశ్రిత భేదం లేకుండా దయా రసం వర్షించి, ఇంకా ఏదో చెయ్యవలసిందేమోనని వైవర్ణ్యం పొందుతాడట. ఎంతదయ! మేఘం వంటి స్వభావమే కాదు. రంగు కూడా శ్యామలమే! అనంతత్వానికి చిహ్నమైనది ఆ శ్యామ వర్ణం! ఆ నీలిమయే మనకు రక్ష! ఆ స్వామి అపరిచ్ఛిన్నుడు, ఆనందమయుడు, వాత్యల్యరూపుడూ, అటువంటి మేఘశ్యామలునికి జయం జయం.

            కళ్యాణగుణుడు, దివ్య మంగళ సుకుమారుడు, ముగ్ధ మంజుల విగ్రహుడు ఆ స్వామి మేను ఎంత సుకుమారం! ఆ మూర్తి ఎంత మధురము! మనకోసమై ఎంత కష్టపడ్డాడు స్వామి! అ గుణములు, ఆ సుందరమూర్తీ మాకనురాపు తగిలి మాయకుండ వర్ధిల్లును గాక!

            తమాలవర్ణం గురించి, కవులూ, భక్తులూ ఎంత తన్మయత్వంతో వర్ణించు కుంటూంటారో! ఎంత వర్ణించినా తనివి తీరదు కదా!

 

                                 సజల జలదనీలం వల్లవీకేళిలోలం

                                 శ్రితసురతరుమూలం విద్యుదుల్లాసిచేలమ్‌

                                 సురరిపుకుల కాలం సన్మనో బింబలీలం

                                 నతసురముని జాలం నౌమిగోపాల బాలం॥

 

            నీటితో నిండిన మబ్బులా, ఆ నీలమేఘశ్యామల మూర్తి, ఆర్తులను అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. సహృదయులు తమ హృదయంలో సదా పొడగనే ఆ స్వామి కాంతులీనే పీతాంబరాన్ని ధరించి దర్శనమిస్తున్నాడు! ఆశ్రితులకు కల్పవృక్షం వంటి గోపాలుడు రాక్షసులకు మాత్రం యముని వంటివాడు. గోపీలోలుడైన గోపాలబాలునికి ఇవే మా మ్రొక్కులు. అంటూ కృష్ణకర్ణామృతంలో లీలాశుకుల వారు కూడా ఆ గోపాలబాలుని మేఘశ్యామలునిగా వర్ణిస్తారు తన్మయత్వంలో మరో చమత్కారమైన శ్లోకం వీరిదే…

 

                                   యాందృష్ట్వా యమునాం పిపాసురనిశం వ్యూహో గవాంగాహతే

                                  విద్యుత్వానితి నీలకంఠనివహో యాంద్రష్టుముత్కంఠతే

                                  ఉత్తంసాయ తమాలపల్లవ మితి చ్ఛిందంతి యాంగోపికాః

                                  కాన్తిః కాళియ శాసనస్య వపుషః సా పావనీ పాతునః ॥

 

            అది చల్లని సాయం సమయం రేపల్లె సమీపారణ్య ప్రదేశం. నీల మేఘశ్యామలుడైన శ్రీకృష్ణుడు ఆ ప్రదేశంలో విహరిస్తున్నాడు. ఆ నీలిమను చూసిన గోవులు యమునానది అనీ, దాహం తీర్చుకుందామనీ, గబగబా చేరవచ్చినవి! దూరాన్నుండి చూచిన నెమళ్ళు, నీలమేఘం అక్కడ గూడు కట్టింది కాబోలని ఆతృతతో చేరవచ్చాయి, పురులు విప్పి ఆడటానికి సిద్ధంగా! కృష్ణునికై వెతుకుతూ బయలుదేరిన గోపకాంతలు అల్లంత దూరాన చేతికందే చిగుళ్ళలో కనబడేది తమాల వృక్షమేననీ, తుంపి తలలో తురుముకుందామనుకుంటూ బిరబిరా చేరవస్తున్నారట!! కాళియుని మర్దించిన నాటి ఆ అందెల రవళీ, తళుకులీనే ఆ నీలమేఘపు కాంతీ సదా మమ్ము బ్రోచుగాక! అంటూ లీలాశుకులు ఒక అద్భుతమైన సుందర దృశ్యాన్ని మన కన్నుల ముందుంచారు.  ఈ చమత్కార పూరితమైన శ్లోకంలో ‘నీరదనీలకళేబర కృష్ణుని! చమత్కారంగా!

            అనంతత్వానికి చిహ్నమైనది ఆ శ్యామవర్ణం ఆ నీలిమయే మనకు రక్ష. ఆ స్వామి అపరిచ్ఛిన్నుడూ, వాత్సల్యరూపుడూ! అటువంటి మేఘశ్యామలునికి జయం జయం. ఆ స్వామి మేను ఎంత సుకుమారం! మనకోసమై ఎంత కష్టపడ్డాడు తండ్రి! ఆ గుణములు, ఆ సుందరమూర్తి, మా కనురాపు తగిలి మాయకుండ వర్ధిల్లును గాక!

            ముకుందుడు అంటే మోక్షమిచ్చువాడని అర్ధం. మోక్షం మనకు కొత్తగా కల్పించి ఇచ్చేదా? కాదు. కాదు. భూమికి రాక్షసులు బరువైతే ఆత్మకు నేను, నాది అన్న భావన బరువు. అది తొలగడమే పృథ్వీభారనాశం, మోక్షం. శ్రీ కృష్ణుడవ తరించిన శుభవేళ నేను, నాది అన్నవి ఏవీ లేకుండాపోయినై. అన్నీ ఆ స్వామివే! అంతా ఆ స్వామే. మా కోసం ఈ భువినవతరించిన ముకుందా! నీకు జయం జయం.

 

                                    పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్క్రుతాం

                                    ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ॥

 

            నిజమే స్వామి అవతారానికి సాధు పరిత్రాణమూ, దుష్క్రుద్వ నాశనమూ, రెండూ ఫలములే. కాని సాధు పరిత్రాణమే ముఖ్యకారణం. అందుకే మూడు పాదాలలో స్వామి అవతార ప్రయోజనం, సాధుపరిత్రాణ దీక్షను చెప్పి, చివరి పాదంలో పృథ్వీ భారనాశంః అంటూ భూదేవి భారాన్ని తొలగించిన వాడుగా కొనియాడుతున్నారు. భూమికిబరువైన రాక్షసులను, అహంకార మమకారదూషితులను  లేకుండా చేసి, శ్రీకృష్ణపరమాత్మ ముకుందుడయినాడు. అట్టి ముకుందునకు జయము! జయము!!

 

    1.                              ముకుంద మూర్ధ్నా ప్రణితత్యయాచే

                                    భవంతమేకాంత మియంతమర్ధం

                                    అవిస్మృతి స్త్వచ్చరణారవిందే

                                    భవేభవే మే-స్తు భవత్ప్రసాదాత్‌ ॥           

    

            మొదటి శ్లోకంలో శ్రీకృష్ణుని ముకుందా!అని పిలచి రెండో శ్లోకంలో ఎదుట నిలచిన ముకుందునికి జయము పలికి, ఈ శ్లోకంలో తన మనసులోని కోరికను ముకుందునికి ఈ విధంగా తెల్పుకుంటూ స్తోత్రం చేస్తున్నారు. ఈ శ్లోకం ముకుంద అనే నామముతో ప్రారంభమైంది. మొదటి మూడు శ్లోకాలలోనూ కూడా ముకుంద నామం స్మరింపబడింది. ఇందు ముకుంద దశాక్షరీ మంత్రం నిక్షిప్తమై ఉందని చెబుతారు పెద్దలు. అందుకే ఇది ముకుందమాల. దీనిని కంఠస్థం చేసిన వారికి ఆ మంత్రానుష్టాన ఫలం తప్పక లభించగలదు. ‘‘ఓ ముకుందా! నీ పాద పద్మములను జన్మజన్మలకు నేను మరువకుండునట్లు అనుగ్రహించు తండ్రీ! నీ యెదుట శిరసువంచి, మోకరిల్లి, నిశ్చయంగా ఈ కోరికను కోరుతున్నాను. ప్రతి జన్మలోనూ నీ పాదారవిందములపై నా తలపు నిలిచి ఉండేలా అనుగ్రహించు తండ్రీ! అంటూ కులశేఖరులు ముకుందమాలలోని సారభూతమైన ప్రార్ధనను చేస్తున్నారు. ఇంకా తలవంచి, నమస్కరించి, నిన్ను ఈ చిన్ని కోరికను కోరుకుంటున్నానయ్యా! అనుగ్రహించు స్వావిూ! అంటున్నారు ఆర్తిగా! ప్రతి జన్మము నందూ నీ పాదారవిందాలపై నా తలపు నిలిచి ఉండేలా చేయమని, అంటూ, తాను కోరి, పొందదలచిన పురుషార్ధాన్ని వివరిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన వాడు పొందాలని కోరదగినది పురుషార్ధం. లౌకిక జీవనంలో ధర్మ అర్ధకామాలు కోరదగిన పురుషార్ధాలు. అలౌకికమైన పరమపురుషార్ధం మోక్షం. ఈ మోక్షాన్ని కూడా అనేకులు, అనేక విధాలుగా భావించడం కద్దు. కొందరు జన్మరాహిత్యాన్ని మోక్షమనీ, మరికొందరు భగవత్సాయుజ్యం మోక్షమంటారు. అవిద్యానివృత్తి మోక్షమని కొందరంటే, భగవత్సాలోక్యమూ, భగవత్సామీప్య, సారూప్యాలు మోక్షమని భావిస్తారు కొందరు.

 

తరువాయి వచ్చే సంచికలో……

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾