విమానాశ్రయంలోకి చేరాం మొత్తం మీద. నన్ను పెద్ద గ్లాసు తలుపుల దగ్గర చేర్చి ఆయన ఆగిపోయారు. ఎవర్నీ లోపలకి రానివ్వటం లేదు. నాకూ భయమే ఆయనకీ భయమే. ఇంకిక్కడేం కష్టాలు మొదలవుతాయో. వెళ్ళేది లిబియా. ట్రిపోలీ కి.
పాస్పోర్ట్, వీసా కాగితాలు తీసి చూసుకున్నాను మరోసారి. చెయ్యి ఊపి ఆయనని వెళ్ళమన్నాను.
నేను ఇంకా వెనక్కి తిరిగి చూడదలచుకోలేదు. ఏమేమిటో ఆలోచనలు లోపల, సెప్టెంబర్ 11 కాదుగా ఈరోజు ఎందుకు ఊపిరి బిగబట్టినట్టుంది ? ఇప్పటికో యాభైసార్లయినా విమానాల్లో ప్రయాణం చేసాను. ప్రతీ పర్యాయం పరమానందమే. మరి ఇండియా కి కదా వెళ్ళింది. అమ్మ పోయినప్పుడు మాత్రం ఉద్విగ్నత, పట్టలేనంత దుఃఖం వెంట వచ్చాయి. ఎప్పుడాలోచించినా చాలా ఆశ్ఛర్యం గా ఉంటుంది. అమ్మ వెళ్ళిపోవటం ఇప్పుడు ఏమాత్రం బాధ కలిగించటం లేదు. అమ్మని గూర్చిన తలంపు నేను పీల్చే గాలిలా, ఒంటికి పట్టే చెమటలా, ఊపిరిలో వెచ్చదనం లా అనిపిస్తుంది. ప్రకృతిలా సహజం గా !! అంటే అమ్మ ప్రకృతిలో కలిసిపోయిందా ? కాలాంచలాలు దాటి నిలిచిపోయిందా !
ఎమ్మే చదివేటప్పుడు ప్రొఫెసర్ KVR నరసింహం గారి పాఠం గుర్తొచ్చింది.
‘ మనుష్యులందరూ మరణిస్తారు, కొందరు ‘ ఉత్క్రాంతి ‘ చెందుతారు. శ్రీనాథుని భీమఖండం జ్ఞాపకం వచ్చింది. నిజం అమ్మ కన్న చలవ. అలాంటిది వ్యాసుడు వాల్మీకి ఈ రోజుక్కూడా మన మధ్య ఉండటం లాంటిదే !
లిబియా ప్రయాణం అన్న నాటినుంచీ అమ్మ, తల్లి నేల, మాతృదేశం, పుట్టిన ఊరు బలంగా గుర్తొస్తున్నాయి. చాలా దేశాలు తిరిగాను. ఇప్పటిలా లోపల ఇరుగ్గా ఎప్పుడూ లేదు.
‘ అమ్మా నువ్వు ఒక్క మూడు నెలలు వస్తే నాకు తోడవుతుంది ‘ బంగారు తల్లి నా చిన్న కూతురు మాటలు గింగురుమంటున్నాయి, నన్ను రమ్మంది. అబ్బో మూడు నెలలే ? అయితే ఇష్టం లేని ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అక్షరం ముక్క రాని ఉర్దూ వినాలి. నేను పట్టుకెళ్తున్న గిట్స్ ఉప్మా ప్యాకెట్లు గుర్తొచ్చాయి.
అమ్మయ్య. నవ్వొచ్చింది లోపల. ఫరవాలేదు కొంతలో కొంత. నలభై ఐదేళ్లయినా నా పాస్పోర్ట్ మన దేశంది అవటం తో నేను ఆ దేశం వెళ్లగలుగుతున్నాను. ఎవరో కఠినంగా అదిలించినట్లయింది. వెనక్కి చూసాను. యూనిఫామ్ లో ఉన్న విమానాశ్రయం ఆవిడ. కనీ కనిపించని బొట్టు ఉంది నా నుదుటిమీద. దానిమీదే ఆవిడ చూపు. నా కాగితాలు ఇవ్వమంది. ఇచ్చాను. ఆవిడ చూసింది. నిశితం గా పరిశీలనగా ! ఇంకొకరు వచ్చారు. చూసారు. మరొకరు వచ్చారు చూసారు. ఎందుకు ప్రయాణం అని ప్రశ్న. మాట్లాడేది ఇంగ్లీషే అయినా సరిగ్గా అర్థం కాలేదు. సాయానికి అని చెప్పాను. ఎవరికీ పేరు చెప్పవద్దన్న మాట గుర్తుంచుకుని. తనిఖీ పూర్తయింది. విమానం లోకి వెళ్లి కూర్చున్నాను. చికాగో నుంచి నేను ఒక్కత్తెనే ఆ పరాయి దేశానికి. నాలో అర్ధం లేని భయం ఉంది కానీ చుట్టూ అందరూ మామూలుగానే ఉన్నారు. అమెరికా అందించిన గొప్ప సంస్కార లక్షణం. తప్పు ఒప్పు, మంచి చెడు నిర్ణయాలుండవు. ఎవరినీ ఎవరు న్యూన పరచుకోరు. ఆచార్య వేమూరి రామనాథం గారి మాట జ్ఞాపకాల లో ముందుకొచ్చింది. ” ఇది అరుదైన అవకాశం. కాలాన్నీ, ఆలోచనని వృధా చేసుకోకండి. కొన్ని పరిస్థితులు వచ్చినా అవి తాత్కాలికం. అగ్ర రాజ్యం, మిగిలిన దేశాల మధ్య నున్న రాజకీయ సంబంధాలని నిశితం గా పరిశీలించి కాగితం మీద పెట్టండి. ఎవరి అనుభవం వారిదే కదా. మీరు వెళ్తున్న హోదా వేరు. ఉండే పరిసరాలు వేరు. కలిసే అధికారులు వేరు, మెదిలే సన్నివేశాలు వేరు. అంత మీకు లాభసాటి. విమానం బయలుదేరింది. కెప్టెన్ మాటలు గంభీరంగా వినిపించాయి.
ముందు జర్మను భాషలో తర్వాత ఇంగ్లీష్ లో. 8 గంటల 46 నిమిషాల ప్రయాణం.
విమానం 944 అధికారి జాగ్రత్తల వివరాలు దాని తర్వాత. సామాన్య ప్రజానీకం దగ్గరకి రావు కానీ రాజకీయ సంక్షోభాలు, వ్యతిరేక వాదాలు, ఆర్ధిక సమస్యల ఉగ్రతలు, అభద్రతా భావాలూ ఒక స్థాయిలో ఆగిపోతాయి. న్యూస్ పేపరు తీసి చూసాను. గడాఫీ చిత్రం పెద్దదిగా మొదటి పేజీలో. సద్దాం హుస్సేన్ వార్త దాని ప్రక్కనే.
” మరింకేం వార్తలు చూడాలనుకున్నావు ? సీతారామ కళ్యాణం చూద్దామను కున్నావా ” ప్రతీచి మాటలు నవ్వు వినిపించింది. సడన్గా తెలిసింది అంతా నా భ్రమ అని.
పేపరు ముందు సీటు వెనక సంచిలో పెట్టి కళ్ళు మూసుకున్నాను. ఇబ్బందిగానే ఎనిమిది గంటలు గడిచాయి. ట్రిపోలి లిబియా కి వెళ్తున్నది ఇద్దరేనని తెలిసింది. రెండో ఆవిడా ముగ్గురు చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తోంది. తర్వాత తెలిసింది.
ఆమె అమెరికన్ ఎంబస్సి కి చెందిన జూన్ భార్య అని. ఆరు వారాల పసికందుతో ఉద్యోగ బరువు బాధ్యతలతో ఆమె తిరుగు ప్రయాణం. జర్మనీ లో పలకరించింది ఆవిడ. సంభాషణ బావుంది. అనుభవాల్లో కాయికాలకంటే మానసికాలు మెరుగు. మానసికాలకంటే హార్థికాలు ఉత్తమం. అవే ప్రధానం. కాయికాలూ, మానసికాలూ, హార్థికాలూ, ఆధ్యాత్మికలూ అంటూ ఏమిటివన్నీ ? కాస్తంత సంస్కృత భాషా వాసనలున్న వాడికే అర్థమయే మాటలు. మిగిలిన భాషల వాళ్లకి ఇన్ని తరగతులున్నాయా ? ఏమో !! ఉండే ఉంటాయి వేరే పేర్లతో. వైజ్ఞానికం గా ఎంత ఎదిగి పోయాయి ఈ పడమటి దేశాలు ? వీళ్ళ ప్రగతికి కారణమైన సంగతులు తెలుసుకోవాలి. విజ్ఞానం లో దారులు, జ్ఞానం లో రహస్యాలు ఎలా తెలుస్తాయో ! ఈ ప్రయాణం వలన లోపల ఒకటే సంకులం ! దాదాపు మూడు గంటల విరామం. ఆవిడ తో చర్చలు. హంగేరీ సరిహద్దుల్లో ఉన్న సర్బియా దేశం నుంచి వస్తోంది 65 సంవత్సరాల స్త్రీ. ఉద్యోగం మినహాయిస్తే క్రైస్తవ మత ప్రచారం ప్రధానమైన ఆదర్శం అని చెప్తోంది. ‘ ముస్లిములు, భారతదేశం నుంచి వలస వచ్చిన జిప్సీ జాతివారు, హిందువులూ, డెవిల్ వర్షిప్ర్స్, KKK లూ వీళ్ళలో ఎవరిలోనూ సామరస్యం సమన్వయము లేదు ‘ తీవ్రం గా బలంగా ఖండిస్తూ మాట్లాడుతోంది.
ఆవిడ విద్య, చదువు, సాంఘిక దృక్పథం, ప్రపంచ రాజకీయ సిద్ధాంతాల మీద స్పృహ ఎంత పదునుగా ఉన్నాయో ప్రతీ మాటలో స్పష్ఠమవుతోంది. బలవంతం గా వింటున్నాను. సమాధానం చెప్పటం లేదు. ప్రతీచి సలహాలు గుర్తొస్తున్నాయి. ఏదో విజయ గర్వం ఆవిడ మొహం లో. నాకు విసుగ్గా ఉంది. 2002 నుంచి ఆరేళ్ళు ముందుకి వచ్చామనుకున్నాను. ఇల్లు దాటితేనే ప్రపంచం తెలిసేది. రెండున్నర గంటలు గడిచాయి. ఎనభై మంది వచ్చి చేరారు.
ఇండియన్లు ఎవరు లేరు. రహస్యం గా ఉన్న చిన్న బొట్టునీ తీసేసాను. స్టిక్కర్ కదా. సులభంగా అయింది పని. నామీద నాకే అసహ్యం వేసింది. కుంకం స్థానంలో పెంచుకుని అలవాటుపడ్డ స్టిక్కరు కల్చరు కి. నేనెలా మాట్లాడగలను ? ఇస్లాం రూపురేఖలతో బహు కొద్దిమంది. అందరిలోనూ ఆధునికత మూర్తీభవించి కనిపిస్తోంది.
నల్లవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆడవాళ్ళ సంఖ్య తక్కువే. మగవారి చూపులు సుఖం గా లేవు. స్వేచ్చకీ పమిట వెయ్యాల్సి వస్తోంది. చీర కట్టవలసి వస్తోంది.
విమానం బయలుదేరింది. దూసుకుపోతోంది మేఘాల్లోకి. ఈ సారి విమానం లో ఉన్న వారందరిలో ఆర్ధిక స్థోమత, అది అందించే అధికారం, నాగరికత, దర్పం కనిపిస్తున్నాయి. ఆంగ్లం తక్కువ వినిపిస్తోంది. ఉర్దూ అరబిక్ భాషలు మణిప్రవాళం గా వినిపిస్తున్నాయి. నాలుగో సారి విమానాశ్రయం అధికారులు వీసా కాగితాలు తనిఖీ చేసారు.
కిటికీ లోంచి ఆల్ప్స్ పర్వత శిఖరాలు 35, 000 అడుగుల ఎత్తు నుంచి మనోహరం గా ఉన్నాయి. ప్రకృతి బాగానే ఉంది. మనసులో మాత్రం మబ్బు పట్టినట్లుంది.
ట్రిపోలి చేరింది విమానం. విమానం దిగి అందరి తో పాటు భద్రత తనిఖీ స్థలం చేరాను. పది అడుగుల్లో ముందుగా ఇరవై నాలుగేళ్ళ వయసుంటుందేమో నల్లజాతి ‘ Allan ‘ గౌరవం గా పలకరించి, గుర్తించినట్లు చెప్పి, ప్రశాంతం గా ధైర్యం గా ఉండమని చెప్పి, మందహాసం తో నా పాస్ పోర్ట్ తీసుకుని ముందుకి నడిచేడు. ప్రతీచి రాలేదు.
మరీ పెద్ద విమానాశ్రయం కాదు. ఐరన్ సిమెంట్ భవనాలు అన్నీ. చుట్టూ ఎడారి భూములు ఈత చెట్లు. బీడులు పోయిన మట్టి గుట్టలు. పచ్చదనం కనుచూపు మేరలో లేదు.
వేడి గాలులు. పూలు పూసే అవకాశం లేదనిపించింది. మా ఇద్దరి మధ్య సంభాషణ లేదు. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. లిబియా దేశం మెడిటరేనియన్ సముద్రపు ఒడ్డున ఉన్నట్లు చదువుకోడం. అంతా కలిపి ఆరు మిలియన్ల జనాభా. ఈ వూళ్ళో రెండు మిలియన్లు బహుశా. జనాభా ఒత్తిడి లేదు. సామాన్లు వచ్చే కన్వేయర్ బెల్టు చిరిగిపోయి, విరిగిపోయి రబ్బరు వ్రేల్లాడుతోంది. భవనం అంతా అరవై అడుగుల ఎత్తు. ఇనప దూలాలు, ఇనప ఊచలు , రాతి స్తంభాలు, మోటుదేరిన, కండలు తిరిగిన, కటువు చూపుల మొగవాళ్లే చుట్టూ.
‘ ఎవరితోనూ చూపులు కలపకు, నవ్వుతూ పలకరించకు, ముద్దొస్తున్నారని పిల్లలని చూడకు ‘ అబ్బో ప్రతీచి అన్ని హెచ్చరికలు గుర్తుకు వచ్చాయి.
బయటకి వచ్చేసరికి ఆత్రం గా బలంగా గట్టిగా రెండు చేతులు మెడ చుట్టూ వేసి ప్రతీచి బాబుని చేతికందించింది.
చిన్న కృష్ణుణ్ణి చేతికందుకున్న యశోదనైపోయాను ఆ క్షణం లో. ఎంతటి అదృష్టం నాది. మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ నేపథ్యం లోకి వెళ్లిపోయాయి.
జీవితమంటే ప్రయాణం. ఇదే అసలైన జీవితం. నా ప్రయాణం మనసంతా పరుచుకుపోయింది. అలవికాని ఆనందం అలసట గా కళ్ళ వెంట చెలమల తెరలుగా వస్తుంటే ప్రతీచి నిశ్శబ్దంగా చూసింది. ” అమ్మా ప్రయాణం బావుందా ” ఆ మాటలు వేణుగానం లా వినిపించింది.
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
Thanks for sharing these unique travel experiences.