11_008 – తో. లే. పి. – ఎక్కిరాల అనంతకృష్ణ

మాస్టర్ ఇ .కె . గారు- 

మాన్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య  గారు విశాఖపట్నం కేంద్రం గా జగద్గురు పీఠం వ్యవస్థాపకులు గా అందరు ఎరిగిన విషయమే — అయితే అంతకు ముందే అయన హిందూ కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగం లో ఉపన్యాసకులుగా పనిచేసేవారు. దాదాపు అదే సమయంలో, అనగా 1957-58 సంవత్సరంలో నేను అదే కళాశాల లో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదివే విద్యార్థి ని. మాది పి. యు. సి. తొలి బ్యాచ్. శ్రీ కృష్ణమాచార్య మాస్టారు మాకు ఉపవాచకం గా నిర్దేశింపబడిన కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ఏకవీర ను బోధించేవారు. మాష్టారు పాఠాన్ని బోధించే తీరు, దాని విశ్లేషణ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి .. ఈ రకం గా ఆనాడే వారంటే  ఒక ప్రత్యేకమైన భక్తి భావం, ప్రేమ ఏర్పడ్డాయి.

 

మాస్టారి తండ్రిగారు శ్రీ అనంతాచార్య గారు ఆయుర్వేద చికిత్స లో నిష్ణాతులు. మాస్టర్ గారు బ్రాడీపేట లో నివాసం ఉండేవారు.. ఆయన అటు తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఉపన్యాసకులు గా పనిచేసారు. అటు పిమ్మట కొంతకాలానికి విశాఖపట్నం కేంద్రం గా జగద్గురు పీఠాన్ని స్థాపించి, దానిని ఒక ధార్మిక, ప్రజాసేవా సంస్థ గా నిర్వహించేవారు. ఈ సంస్థ గురు పూజా కార్యక్రమాలను, ప్రవచనాలను, జ్యోతిషం, హోమియో విధానాలలో శిక్షణ ను ఉచితం గా నిర్వహిస్తూ ఉండేది. ఇందులో ఎంతోమంది శిక్షణ ను పొంది, సంస్థకు, ప్రజానీకానికి ఉచిత సేవలను అందిస్తూ ఉండేవారు.

 

మాస్టారు గారి సంతానం లో జ్యేష్టుడు శ్రీ అనంతకృష్ణ గారు. మాస్టారి కుటుంబసభ్యులు కూడా వారి పెద్దల అడుగుజాడలలోనే నడిచేవారు. అనంతకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం లో ఎమ్. ఏ. పట్టాను పొందారు. అయితే ఆయన వేరే ఉద్యోగ రంగం లో ప్రవేశించకుండా ఆయన, ఆయన సోదరులు కూడా ఇతర కార్యకర్తలను కూడా సమీకరించి, సంస్థకు విశిష్ట సేవలను అందిస్తూ ఉండడం ఒక విశేషం. ఈ సంస్థ కాలక్రమేణా తన కార్యకలాపాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసి అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. 

 

1977 లో నేను ఉద్యోగ రీత్యా ఖమ్మం పట్టణానికి రావడం జరిగింది. నేను అక్కడకి వచ్చిన కొంత కాలానికి ఖమ్మం లో కూడా జగద్గురు పీఠం శాఖ ను నెలకొల్పారు. అక్కడ వైద్య విభాగం లో సేవలను  పొంది బోణీ చేసిన వాడు మా జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి సుధాకర్. ఆ రకం గా మా సుధాకర్ అన్నా, మా కుటుంబం అన్నా మాస్టారు గారు, అనంత కృష్ణ గారికి ప్రత్యేకమైన వాత్సల్యం, అభిమానం. అంతే కాకుండా నా శ్రీమతి సీతాదేవి సంస్కృతం చదువుకున్న విద్యార్థిని అవడం వారి అభిమానానికి మరో కారణం. ఇ. కె. మాస్టారిని 1957 లో గుంటూరు లో శిష్యుని గా ఉన్న నేను వారిని తిరిగి దర్శించుకున్నది 1977 లో…అంటే 20 ఏళ్ల  అనంతరం అన్నమాట ! ఇది నిజంగా అనూహ్యం ! ఖమ్మం కేంద్రాన్ని మాస్టర్ ఇ. కె. గారు, అనంత కృష్ణ గారు, వారి సోదరులు బుజ్జి గారు తదితరులు తరచు దర్శిస్తూ ఉండేవారు. తరువాత, మేము మరొకొందరు మిత్రులం ప్రతీ ఏడాది జనవరి మాసం లో సింహాచలం సమీపాన జరిగే గురు పూజలలో పాల్గొనడం మరొక ఆనందదాయకమైన అంశం.

 

అనంతకృష్ణ గారు నాటికీ, నేటికీ అదే అభిమానం తో ఆదరణతో నన్ను పలకరిస్తూ ఉంటారు ఎప్పుడు, ఎక్కడ వారిని కలిసినా… మాస్టారు ఆశీస్సులే ఆ వెనుక ఉండి దీనిని నడిపిస్తూ ఉన్నాయి.

 

అనంత కృష్ణ గారు అప్పట్లో నాకు, మా శ్రీమతి కి ఎంతో అభిమానం తో వ్రాసిన లేఖ ఈనాటి తోక లేని పిట్ట !…. మీ ముందు…. మీ కోసం… 

 

అనంత కృష్ణ గారి నేతృత్వం లో పై సంస్థకు అనుబంధం గా Master E.K. Spiritual and Service Mission నిర్వహింపబడుతోంది. ఈ సంస్థ కార్యకలాపాలు, మాస్టారు గారి ప్రవచనాలు, అనంత కృష్ణ గారి ప్రవచనాలు, తదితర విశేషాల కోసం, దయచేసి ఈ దిగువ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. 

                                             masterek.org

 

                         

                             <><><>***  ధన్యవాదములు …నమస్కారములు ***<><><>

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾