స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి

  
 
 

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తెలుగు మహిళలు ఎప్పటికప్పుడు తోటి మహిళల్లో చైతన్యం, విప్లవాత్మక ఆలోచనలు కలిగించే సాహిత్యాన్ని అనంతంగా సృష్టించారని ప్రముఖ సాహితీవేత్త, సింగరేణి కాలరీస్ మహిళా డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. కనకదుర్గ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ శనివారం సాయంత్రం “నెల నెలా వెన్నెల” కార్యక్రమం అంతర్జాలం వేదికగా ప్రసారమైంది. ఇందులో ” స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ” అంశాన్ని ఆమె విస్తృతంగా చర్చించారు. ముందుగా కార్యక్రమాన్ని నిర్వహించిన కమలాకర రాజేశ్వరి మాట్లాడుతూ…  వక్త ప్రసంగాల్లో, రచనల్లో సృజనాత్మకత, జిజ్ఞాస, జిగీష ఉట్టిపడుతుంటాయని ప్రశంసించారు. అటువంటి ఆమె ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని (1994) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, యూజీసీ నుంచి ఫెలోషిప్ ను అందుకోవడంలో ఆశ్చర్యం లేదన్నారు. అనంతరం డా. కనకదుర్గ మాట్లాడుతూ… స్వాతంత్య్రపు విలువల దీపం రోజురోజుకీ కాంతి విహీనం అవుతుంటే, అమృతమనే చమురు పోసి దాన్ని దేదీప్యమానం చేయాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని సూచించారు. 

 

సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల ప్రభావం  సమాజంపై ఉంటుందని, అప్పుడప్పుడు సాంస్కృతిక పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. దానికోసం ప్రజలలో చైతన్యం తేవడానికి రచయితలు బాధ్యత తీసుకొని సాహిత్యాన్ని సృజిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా, స్త్రీ, పురుష సమానత్వం ఉంటేనే గాని స్వాతంత్య్రం లభించిందని అప్పట్లోనే సమాజంలోని ప్రముఖులు గుర్తించారన్నారు. ముందుగా, గడప కూడా దాటనివ్వని కట్టుబాట్ల నుంచి స్వతంత్రంగా ఎదగడం, చదువు, వృత్తివిద్యలు నేర్చుకోవడం, ఈ రెండింటికీ ఆటంకంగా ఉన్న బాల్య వివాహాలు, బాల్య వైధవ్యాన్ని ఎదుర్కొనేందుకు విధవా పునర్వివాహాలను ప్రోత్సహించడం, తరువాత అస్తిహక్కు సాధించుకోవడం ద్వారా స్వతంత్ర్య జీవనావశ్యకత, ఆర్థిక స్వావలంబన,  పరిపాలనలో భాగస్వామ్యం కోసం రాజకీయ పరిజ్ఞానం, హరిజనోద్ధరణ అన్న సోపానాలను మహిళలకు సంఘ సంస్కర్తలు ఏర్పరిచారని వివరించారు. వీటన్నిటి ప్రచారానికి సాహిత్యం అమితంగా తోడ్పడగా తిలక్ పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమం (విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ దీక్ష, ఖద్దరు ఉద్యమం), జలియన్ వాలా బాగ్ ఉదంతం తరువాత 1920 లో గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమం, హిందూ ముస్లింల ఐక్యత, హరిజనోద్ధరణలలో స్త్రీలు అత్యంత దేశభక్తితో పాల్గొన్నారని గుర్తుచేశారు.

 

1897లో గొడవర్తి బంగారమ్మ బాలికలకోసం పాఠశాలను స్థాపించి వారికి ఉపయుక్తమైన కావ్యాలు, చరిత్ర, గణితం, వృత్తివిద్యలు నేర్పారని వెల్లడించారు. పి. లక్ష్మీ నరసమ్మ నిర్వహించిన సభలు, పులవర్తి కమలాదేవి రచించిన అనేక కవితలు, కథలు, స్త్రీలకు రాజకీయ పరిజ్ఞానం ఉండాలని అయ్యదేవర బాలాత్రిపుర సుందరమ్మ రాసిన వ్యాసాలను గుర్తు చేశారు. ఇంటింటికీ తిరిగి ఖద్దరు దుస్తులను అమ్మడమే కాక, విదేశంలో ఉన్న భర్తకి లేఖలు రాస్తూ దేశభక్తి గురించి నూరిపోసిన మాగంటి అన్నపూర్ణమ్మ, స్వాతంత్రోద్యమంలో తండ్రి పోవడంతో తల్లికోసం ఉద్యమంలో పాల్గొనని కొడుకుని ఉద్యమం బాట పట్టించిన తల్లి త్యాగాన్ని తెలిపే మైనవోలు పద్మావతి రాసిన “త్యాగిని” కథ,  స్నేహం ఆధారంగా బసవరాజు వెంకట రాజ్యలక్ష్మి రాసిన సాహిత్యం, కొత్తపల్లి కౌసల్య “ఆత్మగౌరవం” వక్త ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. దాడి నాగమ్మ “కథ కాదు” అప్పట్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకి, వాటిని సహించి యుక్తితో తప్పుకొని ఉద్యమం కొనసాగించిన మహిళల స్థైర్యానికి అద్దం పడుతుందని డా. కనకదుర్గ తెలిపారు. కనుపర్తి వరలక్ష్మమ్మ “శారద లేఖలు” పేరిట బ్రిటీషువారి “విభజించు పాలించు” విధానానికి వ్యతిరేకంగా రాశారన్నారు. చంద్రకాంతమణి రచన “ప్రేమ వేదిక”, ఉద్యమంలో ధనిక, పేద ఐక్యతను తెలిపే ఆచంట సత్యవతి రాసిన “దసరా బహుమానం”, చుండూరి రమాదేవి “బాతాఖానీ” గల్పికలను ఉదహరించారు. “లవణసాగర మథనం” అన్నది ఉప్పు సత్యాగ్రహం కోసం రాజేశ్వరి అందించిన సాహిత్యమన్నారు. ఇంకా తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ఓలేటి నిత్యకళ్యాణమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ, దేశిరాజు భారతీదేవి, దర్శి అన్నపూర్ణమ్మ, వేదాంతం కమలాదేవి, అభ్యుదయ కవయిత్రి భట్టుకొండ విశాలాక్షిలను పేర్కొన్నారు.

 

1919లో మద్రాసు రాష్ట్ర స్థానిక పంచాయతీలలో స్త్రీలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారని, 1931లో మహిళలు లోకల్ బోర్డు ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయం జరిగిందని, ఫలితంగా 1937లో మద్రాసు రాష్ట్రీయ స్వాతంత్ర్య ఎన్నికల్లో స్త్రీలకు 9 ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయని చెప్పారు. ఆచంట రుక్మిణమ్మ మొదటి మహిళా మంత్రి అయ్యారని తెలిపారు. 34 సంవత్సరాల సుదీర్ఘ బోధన, రచనానుభవం ఉన్న డా. కనకదుర్గ తను విస్తృతంగా పరిశోధించిన విషయాలను గంటపాటు ప్రసంగించి అబ్బురపరిచారు.  

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾