11_010 ద్విభాషితాలు – సహానుభూతి

 

సూన్యం నిండిన మనసును.. నింపుకోవడానికి..

వంటరిగా..

వేకువ వెలుగురేఖలవైపు నడిస్తే…

ఉషోదయపుటంచులో

పొరలు పొరలుగా తేలుతున్న

తెల్లని పొగ మంచు తడి స్పర్శ

దేహాన్ని తాకింది.

 

కొమ్మపై వాలిన..

రంగులచిన్ని పిట్ట చిరుకదలిక

చిత్తంలో చిత్రాన్ని గీసింది.

 

కొలను తలం క్రింద.. 

ఈదులాడుతున్న చేపపిల్లల..

కేళీ విన్యాసం కంట్లో మెరిసింది.

 

దూరంగా వేణువుపై ధ్వనిస్తున్న..  భూపాలరాగజీవఝరి ఉప్పొంగి..  శ్రవణాన్ని చేరి.. అభిషేకించింది.

 

తలపులో మెదిలిన ఊహ..

కాగితంపై ఊపిరిపోసుకొని

కవితగా కదిలించింది.

 

కానీ..

ఎగసిన..

సౌందర్యజనిత ఆనంద కెరటం

అంతలోనే ఆవిరైపోయింది!

 

నువ్వంటూ లేకపోతే…

ఆ ఆస్వాదన..

అరణ్యంలో రోదనే !

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾