శ్రీ కులశేఖరులు తాను భావించీ, అర్ధించి పొందదలచిన మోక్షం యొక్క స్వరూపాన్ని ఇలా వివరిస్తున్నారు.
హే దేవా! నాకు జన్మరాహిత్యం అక్కరలేదు. పరమపదప్రాప్తిని నేను కోరడం లేదు. ఏ లోకంలో ఏ రూపంలో ఉన్నా సరే నేను కోరే పరమపురుషార్ధమైన మోక్షం, నీ పాదాలను క్షణమైనా మరువకుండ ఉండగల్గడమే! అంటూ అది మాత్రమే నీ నుండి నేను కోరుకుంటున్నది. అంటారు.
నీ పాదముల భక్తినిండారగా నిచ్చి కాపాడు శక్తీ నీ కరముల నుండగ
మా పాల తెలిసి ఇక మము బ్రోవరాదా శ్రీ రామచంద్రా!!
అంటారు త్యాగరాజస్వామి. రామా! నీ పాదాలపై భక్తిని కూడా నీవే మాకు ప్రసాదించి బ్రోవవలెనయ్యా! అంటూ ప్రార్ధిస్తారు.
‘‘తద్విస్మరణే పరమవ్యాకులతేతి!’’ యధా ప్రజగోపికానాం అంటారు నారదులు తమ భక్తిసూత్రాల్లో. భగవంతుని భావన క్షణం మరుపు కల్గుతుందేమోనని వ్యాకుల పడిపోతుంటారట గోపికలు. కులశేఖరులు కోరే మోక్షం కూడా భగవత్పాదార వింద విస్మృతి రాహిత్యమే ‘‘మాధవుని స్మరణ విస్మరణమే మరణము ’’ అంటుంది. భక్త మీరా! ఆ పరమాత్మని క్షణమైనా మరపు లేకుండా స్మరించడమే ధ్యానం. అదే భక్తి.
‘‘అనన్య చేతసాస్సతతం యోమాంస్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్ధ నిత్యయుక్తస్య యోగినః
ఓ అర్జునా! ఎవడు అనన్యచిత్తుడై, నన్నుగూర్చి ప్రతి దినమూ, నిరంతరమూ ఇతర విషయములందు ప్రవర్తించని మనసు గలవాడై నన్నే స్మరించునో అటువంటి ధ్యానపరునకు నేను సులభంగా పొందబడు వాడనైయున్నాను అంటారు గీతాచార్యుడు అక్షరపరబ్రహ్మయోగంలో. లోకంలో సకలసంపదలనూ, సామర్ధ్యాన్ని మానవుడు ప్రయత్నించి సంపాదించగలడేమో కాని అనన్య భక్తిని పొందడానికి మాత్రం, అంతఃకరణశుద్ధితో పాటు, ఆ అనంతుని అవ్యాజకరుణ అత్యావశ్యకం. ఆ కరుణను యాచిస్తూ కులశేఖరులు, జ్ఞానాన్నీ కర్మనూ కూడా నేను కావాలని కోరుకోవటం లేదు తండ్రీ. యధావిధి కర్తవ్యం సాగుతూంటుంది గాక! ఈ భక్తితో మరొకదానిని పొందాలని కోరటం లేదు. మరొక ఫలప్రాప్తిని నే నాశించడం లేదయ్యా. కేవలం నీ స్మరణమే నాకు కావాలి. ఇదే నాకు సాధ్యం తప్ప మరొక దానికి ఇది సాధనం కారాదు. ‘‘ఏకాంతం’’, ‘‘ఇయంతం’’, అన్న రెండు మాటలలో ఈ భావాన్ని ఒత్తి చెబుతున్నారు.
అజ్ఞానమూ, మాయ అంటే భగవత్పాదారవింద విస్మృతి, మరుపు. అది లేకపోవడమే అజ్ఞాన నివృత్తి అన్నమాట. ఇదీ మోక్షం. అంతేకాని శరీరాన్ని వీడటమూ కాదు. మరో లోకాంతరాలను పొందడమూ కాదు. భగవత్పాదారవింద విస్మృతి రాహిత్యమే శ్రీ కులశేఖరులు కోరే మోక్షం. నిరంతర భగవధ్యానంలో భ్రమరకీటకన్యాయంగా భగవత్స్వరూపమే తానుకాగలడు. అంటే భగవత్స్వరూపునిగా తనను తాను తెలుసుకోగలడు అన్నమాట!
భక్తుడైనవాడు ఆరాధ్యదైవపు పాదారవిందస్మృతినే సదా కోరుకుంటూంటాడు. అనవరతమూ ఆ పాదారవిందమహిమనూ, ఉత్కృష్టతనూ తలపోస్తూ, కొనియాడుతూంటాడు తన్మయంగా..
‘‘ పరమయోగులకు పరిపరి విధముల పరమొసగిడినీ పాదము ॥
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము ॥
బ్రహ్మకడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము ॥
అంటూ తన ఆరాధ్యదైవమైన వేంకటేశ్వరుని పాదమహిమను పదే పదే తలపోస్తూ పాడారు అన్నమయ్య.
చరణములే నమ్మితి నీ దివ్య చరణము లే నమ్మితి
పారాదవిందమే ఆధారమని నే నమ్మితి నమ్మితి నమ్మితినీ దివ్య॥ చరణ
అంటూ పాదారవిందాలను నమ్మి, అవే ఆధారాలుగా జీవితాన్ని కొనసాగిస్తా నంటున్నారు తన్మయంగా. రామదాసుల వారు!
‘‘శంకరస్య తవపాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని’’ ఏమి ఈ భక్తుల భావసారూప్యం!!!
భగవంతుని ఆరాధించడం జన్మించిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆలోచన, ఆచరణ మొదలైనవి వరంగా గల మానవజన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ తండ్రిని అర్చించుకోవాలి. అంతేకాని కేవలం ఐహికమైన కోరికల కోసం అంతటి దేవుని ప్రార్ధించడం అవివేకమే అవుతుంది. అందుకే కులశేఖరులు ఈ జన్మలోనే కాదు అన్ని జన్మలలోనూ స్వామి పాదపద్మాలను మరువకుండులాగు వరం ప్రసాదించమంటున్నారు.
నాహంవందే తవచరణ యోర్ద్వంద్వమద్వందహేతోః
కుంభీపాకం గురుమపిహరే నారకంనాపనేతుం
రమ్యా రామా మృదుతనులతానన్దనే నాపిరంతుం
భావేభావే హృదయభవనే భావయేయంభవంతం॥
పూర్వ శ్లోకంలో తాను కోరేదేమిటో చెప్పిన మహారాజు, ఈ శ్లోకంలో తాను కోరని వాటిని గురించి చెబుతున్నారు. స్వామి చరణద్వయాన్ని ఆశ్రయించిన కారణాలు చెబుతూ… నేను సుఖదుఃఖాది ద్వందాలను జయించడం కోసం నీ చరణద్వయాన్ని ఆశ్రయించలేదు. అనాదియైన జన్మపరంపరలలో నేను చేసిన పాపాల ఫలమనుభవించడానికి జడిసి, వానిని తప్పించుకోవడం కోసం నీకు నమస్కరించడం లేదయ్యా! కుంభీపాకాది నరకబాధలను తొలగించుకోవడం కోసం కూడా నిన్ను వేడుకోవడం లేదు. నందనవనంలోని సుకుమారులైన అప్సరఃకాంతల కొరకూ, స్వర్గసుఖాలను అపేక్షించీ నిన్ను ఆశ్రయించానంటావా! ఉహు! కానేకాదు!! ఈ శరీరంతో, ఎట్టిస్ధితిలోనున్నా, మనసులో కలిగే ప్రతి భావము నందూ నిన్నే భావించాలి అన్నదే నా కోరిక. అనుక్షణం నీ స్మరణతోనే కాలం గడపగలగాలి. అని మాత్రమే కులశేఖరులు ముకుందుని ప్రార్ధిస్తున్నారు పదే పదే. భగవంతుని భావనలోనే గడిపే భక్తుల అనుభవాలు ఇలాగే ఉంటాయి.
విడజాలదురా నా మనసు వినవేరా శ్రీరామ॥
అడియాసలచే దగిలి నేనార్తిపడి నీ పదంబులను ॥ విడజాలదు రా॥
తనువే పనులకు జనినా మరి కనకరానిది కనుగొనినా
నినుగా భావించి సంతసిల్లితిని శ్రీ త్యాగరాజనుత ॥ విడజాలదు రా॥
రామచంద్రా! నేనొకవేళ ప్రపంచ భోగాల యందు దీనుడైనా, నా చిత్తం మాత్రం నీ పాదాల చింతన విడువకున్నదయ్యా! నేను మరల్చదలచినా ఇతర విషయాల వంకకు నా మనసు రావడం లేదు. నా శరీరం ఏఏ పనులు చేస్తున్నా, నా నేత్రాలు చూడకూడని ఇతర విషయాలను కనుగొంటున్నా, నా మనసు మాత్రం అన్నిటినీ నీ రూపంగానే భావిస్తూ నీ యందే లగ్నమై యున్నది. సాధారణంగా మన అనుభవం ఏమిటి అంటే ఈ శరీరంతో భగవత్కైంకర్యం చేస్తున్నా, చిత్తం మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూంటుంది. కానీ త్యాగరాజస్వామి హృదయం మాత్రం కేవలం రాముని యందే లగ్నమై ఉండిపోయింది. కులశేఖరులు కోరుకునేది ఈ స్థితినే! ఇదే భావాన్ని శంకరులు….
నవైప్రార్ధ్యం రాజ్యం నచకనకలతా భోగవిభవే
నయాచేహం రమ్యాం, నిఖిలజనకామ్యా వరవధూమ్
సదాకాలే కాలే ప్రమధ పతినా గీతచరితో
జగన్నాధ స్వామి నయానపధగామి భవతుమే॥
ఓ దేవా! నేను రాజ్యాన్ని కానీ, ధనకనకభోగాలు కానీ, కోరడం లేదయ్యా!
త్రిభువనసుందరియగు వదువు కావాలని నిన్ను యాచించలేదు. సర్వవేళలా ఈశ్వరుడేస్వామి చరిత్రని పరవశంతో గానం చేస్తూంటాడో ఆ జగన్నాధస్వామి నా కన్నుల ముందు సాక్షాత్కరించును గాక! (నా దృష్టిపధంలో ప్రత్యక్షమగును గాక?) ఇదే నా కోరిక అంటారు శంకరభగవత్పాదులు తమ జగన్నాధాష్టకంలో.
ప్రహ్లాదుని పాములచే కరిపించినా, ఏనుగులతో త్రొక్కించినా ఆ బాలుడు బాధపడలేదు. కారణం మనసు పూర్తిగా శ్రీహరిపై లగ్నమై ఉండిపోయింది. బాధ సుఖము అన్నవి ఇంద్రియాలకు వర్తించే విషయాలు. ఇంద్రియాలు ఇంద్రియార్ధాలతో కలిసినపుడు రాగద్వేషాలూ, కష్టసుఖాలూ కలుగుతాయి. మనసును ఆ ఇంద్రియాలతో చేరనీయకుండా, భగవద్భావంతో నింపినప్పుడు, శరీరానికి కలిగే ఈ సుఖదుఃఖ భావనలు హృదయంలో ప్రవేశించలేక బయటే నిలిచిపోతాయి. అందువల్ల కష్టసుఖాల వలన కలగవలసిన బాధ, ఆనందాలకు స్థానము, విలువ లేకుండా పోతాయి. శరీరానికంటే హృదయానికి పెద్దపీట వేసి, ఆ హృదయంలో జగన్నాధుని ప్రతిష్టించుకుని, ఆత్మానందాన్ని అనుభవించే భక్తుని, యోగ క్షేమం పరమేశ్వరుడే వహిస్తాడు. అందువల్లనే ప్రహ్లాదుని అంతమొందించాలన్న ప్రయత్నం ప్రతిసారీ వీగిపోయింది. ఏనుగులచేత తొక్కిస్తూంటే.. ఆనాడు గజరాజు మొర విని రక్షించిన ఓ దేవా! నీ చిత్తం నా భాగ్యం అంటూ, ఈ శరీరమేదో అయిపోతుందన్న భాధ లేకుండా, ఈ శరీరాన్ని రక్షిస్తే, నోరారా నిన్ను కీర్తించుకుంటూ గడుపుతాను. అలాకాక ఈ శరీరం అంతమైందా.. విశ్వనాధుడవైన నీలోనే కలిసిపోతాను’’ అనుకోగలిగే ధైర్యం, ఆ బాలుడికి భయాన్ని కల్గించలేకపోయింది. సముద్రంలో తోయిస్తే సాగరం నీ శయన మందిరం కదా స్వామి! అక్కడ నీ దర్శనం లభిస్తుందేమో? ఇంతకంటే అదృష్టమేముంటుంది ? అని సంబరపడ్డాడా భక్తబాలుడు! ఈ విధంగా ప్రతి అణువులోనున్న పరమాత్మను దర్శించి ఆ స్వామిని కీర్తించుకుంటూండటం ఒక్కటే ప్రయోజనమైనప్పుడు, ఇక దేనికి భయం ? అందుకే కులశేఖరులు కూడా కోరేది ద్వంద నాశనం కానీ, కర్మవినాశనం కానీ కాదు. నిరంతర భగవద్భావన. ఇదే పరమపురుషార్ధం. ఇదే భక్తి. ఇదే మోక్షం. అంటే సంతత భగవత్పాదార వింద విస్మృతి రాహిత్యమూ, నిరంతర భగవద్భావ నానందమూ! ఇవీ వీరు కోరుకునేవి. ఏ రూపంగా, ఏ నామంతో కీర్తించుకున్నా ఈ భక్తులందరూ కోరుకునేది దీనినే!
అంతా రామమయం బీజగమంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారకలు
ఆ మహాంబుధులు అవనీ జననములు ॥ అంతా ॥
అండాండంబులు పిండాండంబులు
బ్రాహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనమ్ములు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు ॥ అంతా ॥
సర్వేసర్వత్రా రామమయంగా గోచరించింది రామదాసుకి. తనను రక్షించే దైవం ఎక్కడికెళ్తే అక్కడే ఉన్నపుడింక భయమేముంది. అదే దైవం సదాశివ బ్రహ్మ్రేంద్రులకు పరబ్రహ్మగా గోచరించి అబ్బురపరచింది.
సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం ॥
కింరచనీయం కిమరచనీయం ॥ సర్వ ॥
భక్తునికి భగవంతుని పాదపద్మాలపై దృష్టి చలించని విధంగా భక్తి ఏర్పడాలి. అందులోనే బ్రహ్మానంద సబ్రహ్మచారి అయిన ఆనందం పొందగలగాలి. ఇదీ అసలైన భక్తుని స్వభావం.
పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాదన సం
ధానుండై మరచెన్ సురారి సుతుడే తద్విశ్వమున్॥
సర్వకాల సర్వావస్థలయందూ అచంచలమైన భక్తినీ, విశ్వాసమునూ ఏర్పరచుకున్న వారికి భౌతికమైన సుఖాలపై కోరికలేముంటాయి?
అందుకే ఏ కోరికా పుట్టించని కోరికను కోరుకుంటున్నారు శ్రీ కులశేఖరులు. వారు కోరినదీ కోరికే అయినా, అది కోరికలను దరిచేరనీయని వింతైన, అద్భుతమైన కోరిక!
తరువాయి వచ్చే సంచికలో……
——– ( 0 ) ——-
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి 👇🏾