గేయరూపకం
1) పాడండి ఒక మంచిపాట
బ్రతుకంత సంక్రాంతిగా వెలుగుపాట
తేనె తెలుగులో తడిసినపాట
నిండు మనసులో పొంగినపాట
చేమంతులలో సిరులేరుకొని
పూబంతులలో పొలుపు పంచుకొని
హేమంతములో చల్లదనాలకు
వసంతాలలో వలపు కలుపుకొని
తెలుగు పొలములో మలగని వెలుగై
పలుకు పలుకు కప్పురపు పరిమళమై
గుండె గుండెలో నిండేపాట
పూలు కూడ తలలూచేపాట
పాడండి ఒక మంచిపాట
పాడండి సంక్రాంతిపాట
2) మకరరాశికి లోకబాంధవుడు
విచ్చేయు పరువదిన మీ మకరసంక్రాంతి
భుజము భుజము కలిపి
ప్రజలు మెలిగిననాడు
ఎదురెరుంగనిది మకర విక్రాంతి
అన్నికులముల మతము
ఐక్యమందిననాడు
మనజాతికే మధురసంక్రాంతి
చిన్నసంసారము చెన్ను మీరిననాడు
ప్రతిజంటకొక ప్రణయసంక్రాంతి
3) భోగి పళ్లోయించుకున్నాడు
దేవేంద్ర భోగివలె బాబు కూర్చున్నాడు
పండుగంతా బాబు ముస్తాబులో వుంది
సంక్రాంతిశోభ ఆ చిరునవ్వులో వుంది
ముత్తైదువుల సభను కొలువుదీర్చినబాబు
రాచఠీవిని వొలకబోసేను
కనులతోనే పలుకరించేను
4) సంక్రాంతిలక్ష్మి మీ తలుపు తట్టినదండి
లెండమ్మ రండమ్మ చెలులారా !
ఏడాదికొకసారి ఏతెంచు పర్వదినమ్ము
` ఈనాడె ఈనాడె సఖులారా !
సిగలోన చేమంతి చేతిలో పూబంతి
సంక్రాంతి సీమంతినీ స్వాంతమున శాంతి
మకరాంక విక్రాంతి ఈ మధురసంక్రాంతి
చైతన్యపులకితము ఈ మకరసంక్రాంతి
5) ఎంతపొగరు ఎంతపొగరు మంచు కెంతపొగరు
జంటలగని జంకిపోవు చలి కెంతటిపొగరు
చిరుఎండకె కరగిపోవుమంచు కెంతపొగరు
క్షణములోన నీరుగారు మంచు కెంతపొగరు
మంటనుగని పారిపోవు ఎలుగుబంటి వంటి చలికి ఎంతటిపొగరు
కన్నుమిన్ను కానకుండా మిన్నుమన్ను ఏకముగా
ఆక్రమించుకున్న ఈమంచు కెంతపొగరు
బందిపోటు దొంగవోలె
మతోన్మాద హంతవోలె
తలుపుమూసినా లోనికి చొరబడు
ఈచలి కెంతటిపొగరు
ఒంటరిగానున్నవాని ఒక్కఊపు వూపివేసి
దుప్పటిలోకూడ దూరి
ముప్పుతిప్పలను బెట్టి
జంటలవూపిరి గాలికి
సతమతమైపోవు చలికి ఎంతటిపొగరు
6) గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
ముగ్గుల నిగ్గుల గొబ్బిళ్ళో
గోపబాలునికి గొబ్బిళ్ళో
గోలోకపాలునికి గొబ్బిళ్ళో
మల్లెలుపూచే తెల్లనినవ్వుల
నల్లనిస్వామికి గొబ్బిళ్ళో
బోసినోట పదునాల్గులోకములు
చూపినశిశువుకు గొబ్బిళ్ళో
వెదురుకు కుదురుగ పాటలు నేర్పి
ఎదలను దోచిన స్వామికి
లీలగ శిరసున శ్రీపాదమునిడి
కాళీయుని పొగరణచిన స్వామికి || గొబ్బిళ్ళో ||
7) అడుగడుగో సూరీడు
ఆకశమేలే రేడు
సహస్రకిరణాల కలిమి
పెనుచీకటి గొంతునులిమి
బడుగువాని గుడిసెమీద
బంగరురంగులు పులిమి
ఇల్లిల్లూ మేలుకొలిపి
పల్లెపల్లె నిదురలేపి
ఉన్నవాని లేనివాని
ఒకేవిధముగా చూచె || అడుగడుగో ||
సూరీడడుగో సూరీడదడుగో || అడుగడుగో ||
8) అంతవున్నతుడైన సూర్యునికెంత సమదృష్టి
అన్నియుగముల వృద్ధుడైనా ఏమి ఆ సృష్టి
మేడలపై విహరించే మహారాజు తానైనా
మింటిరాజ్యమేలుకునే చక్రవర్తి తానైనా
మురికివాడల, పూరిపాకలచేరి యెల్లర పలుకరించేను
అంటరాని తనమ్ము నరయక
అందరికీ తన కౌగిలిచ్చేను.
9) బొమ్మలకొలువు పేరంటానికి ముత్తైదువులు రారండి.
చిరునవ్వులతో కొలువైయుండిన బొమ్మలకులుకులు చూడండి
అడుగో అడుగో రాముడు
అడుగో గుణాభిరాముడు
దేముడేఅయినా నరుడుగపుట్టి
ఇడుములు కుడిచిన మహానుభావుడు
అడుగో అడుగో రాముడు
రఘువంశాంబుధి సోముడు || అడుగో ||
అడుగో యేసుక్రీస్తు
మంచితనానికి దోస్తు
దేవునికొడుకై తాను జనించి
దీనులకోసం బ్రతికాడు
శిలువనువేసిన తులువలనైనా
చిరునవ్వులతో బ్రోచాడు || అడుగో ||
` స్వతంత్రభారతజాతి జనకుడై
పదవులనొల్లని మహానుభావుడు
సత్యాగ్రహమే సాగించాడు
జాతిసమైక్యత సాధించాడు
అహింసతోనే హింసను గెలిచిన
కర్మయోగి ఆ గాంధీజీ || స్వతంత్ర ||
కడవపట్టుకొను పల్లెపడుచుతో
కదలివచ్చు ఈ రైతన్న
శ్రమలోసౌఖ్యం చవిచూచిన
వాడన్నదాత ఈ రైతన్నా || కడవ ||
అన్నిబొమ్మలు కలసినప్పుడే
అది బొమ్మలకొలువు
అన్నిమనసులు కలసినప్పుడే
అది వలపులనెలవు || అన్నిబొమ్మలు ||
( ఆకాశవాణి సౌజన్యంతో… ఈ గేయరూపకం గతంలో ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది.)
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾