సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. వాటికి హాజరవడం కేవలం మానసిక ఆనందం కోసం మాత్రమే కాదు. ఆ కార్యక్రమాలకు హాజరు అయితే, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారితో కొత్తగా పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. అలా ఏర్పడిన పరిచయాలు కాలక్రమేణా బలపడి, మనుషులను, వారి మనసులను మరింత దగ్గరకు చేరుస్తాయి. ఇదే అభిప్రాయం తో నేను ప్రత్యేకించి ఇటువంటి కార్యక్రమాలు కొన్నింటికి తప్పకుండా వెడుతూ ఉంటాను. అవి సాహిత్య కార్యక్రమాలయినా, సంగీత కార్యక్రమాలు అయినా సరే., ఇవి నేను ఉంటున్న విజయవాడ వరకే పరిమితం కాకుండా, దూర ప్రాంతాలయిన చెన్నై, విశాఖ, హైదరాబాద్ వగైరా నగరాలలో జరిగే కార్యక్రమాలకయినా వెడుతూ ఉండడం పరిపాటి..
దాదాపు 20 ఏళ్ళ క్రితం మచిలీపట్టణం కు సమీపాన చాటపర్రు గ్రామం లో గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి జయంతి సందర్భం గా జరిగిన ప్రత్యేక సంగీత కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఘంటసాల గారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మ గారు, వారి దగ్గర బంధువు శ్రీ నరసింగ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. వారిని ఆనాడు కలవడం ఒక మధురానుభూతి. నరసింగ గారు ఆ రోజు కార్యక్రమం జరిగిన శివాలయం ఆవరణ కు సమీపం లో ఉన్న ఘంటసాల వారి చిన్ననాటి ఇంటిని చూపించారు. ఆ కార్యక్రమంలో నాకు పరిచయమయిన మరో ప్రముఖ వ్యక్తి గాయకుడు శ్రీ తాతా బాలకామేశ్వర రావు. ఆ పిమ్మట మరొక సందర్భం లో హైదరాబాద్ లో చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గాన సభ జరిగిన ఘంటసాల వారి సంగీతోత్సవానికి కాస్త ఆలస్యంగా వెళ్లడం జరిగింది. సీట్లు ఖాళీ లేక, వెతుక్కుంటే ఒక చోట ఒక పెద్దాయన ప్రక్కన సీటు దొరికింది. ‘ అమ్మయ్య’ అని ఆ సీటు ను ఆక్రమించుకోగలిగాను.. పరిచయం లో తెలిసింది ఆయన పేరు నరసింహమూర్తి గారని, నాటి కార్యక్రమంలో పాడుతూన్న గాయనీమణులలో అఖిల అనే అమ్మాయి వారి కుమార్తె అని. హాల్ అంతా జనం తో నిండి కిక్కిరిసిపోయింది. మధ్యలో లేచి నా కెమెరా తో కార్యక్రమం ఫోటోలు తీసుకునేవాడిని. ఇది గమనిస్తూ వచ్చారు మూర్తి గారు. నన్ను అడిగి నా అడ్రస్ తీసుకున్నారు.
ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి మూర్తి గారి నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆనాటి కార్యక్రమం ఫోటోలను కొన్ని తనకు పంపవలసినది గా కోరుతూ. అదే ఈనాటి తోకలేని పిట్ట మూర్తి గారి కోరిక మేరకు నేను ఆ ఫోటోలను ఆయనకు పంపడం జరిగింది. ఆయన ఎంతో ఆనందించారు.
అటు తరువాత హైదరాబాద్, విజయవాడ, కర్నూల్ నగరాలలో జరిగిన శ్రీ ఘంటసాల జయంతి కార్యక్రమాలకు నేను వెడుతూ ఉండడం అక్కడ గాయని అఖిల గారిని కలుస్తూ ఉండడం జరిగింది. అఖిల గారు కూడా ఎంతో వినయశీలి. ఆప్యాయం గా పలకరిస్తూ ఉంటారు.
ఇలాగ కొత్త స్నేహాలకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దోహదం చేస్తూ ఉండడం ఎంతో హర్షణీయం
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾