11_012 ఆనందవిహారి


అమెరికా చికాగో నగరంలో

బాపూజీకి స్మృత్యంజలి – 2022

 

 

 

 

2022 జనవరి 30 న మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అమెరికా చికాగో నగరంలో స్కోకీ అన్న ప్రదేశంలో గాంధీ మెమొరియల్ ఫౌండేషన్ సంస్థ వారు మహాత్మా గాంధీ కి స్మృత్యంజలి సమర్పించారు. సంస్థ ఉపాధ్యక్షులు డా శొంఠి శ్రీరామ్, కౌన్సిల్ జనరల్ అమిత్ కుమార్, శ్రీమతి సురభి, కార్యవర్గ సభ్యులు, చికాగో నగర వాసులు, డా. సురేష్ బోడీవాలా, డా. విజయ్ ప్రభాకర్, మొదలైన వారు హాజరయ్యారు.

ఉధృతమైన మంచు తుఫాను, చలిగాలుల మధ్య “ వైష్ణవ జనతో”, “ రఘుపతిరాఘవ” గానం సాగింది.

 

 

 

 

 

శ్రీ గొల్లమూడి శ్రీనివాస్, శ్రీమతి కవిత, శ్రీ శివచర్ల గాంధీ విగ్రహానికి పూదండ, పుష్ప గుచ్ఛాలు సమర్పించారు.

 


ప్రవాసాంధ్ర సాహిత్యానికి

కొత్త మెరుపు స్త్రీల గొంతుక


ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్యం వ్రాత, అచ్చు పుస్తకాలతో మొదలుపెట్టి అంతర్జాలం వరకు విస్తరించి ఉందని ప్రముఖ ప్రవాసాంధ్ర రచయిత్రి, పాత్రికేయురాలు కల్పన రెంటాల పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యూట్యూబ్ వేదికగా ఫిబ్రవరి 11వ తేదీ శనివారం సాయంత్రం ప్రసారం చేసిన “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో ఆమె “ప్రవాసాంధ్ర సాహిత్యానికి కొత్త మెరుపు స్త్రీల గొంతుక” అంశంపై ప్రసంగించి అమెరికా, కెనడాలలో వెలువడ్డ రచయిత్రుల సాహిత్య విస్తృతిని సింహావలోకనం చేశారు. ముందుగా కార్యక్రమ వ్యాఖ్యాత భమిడిపాటి శరత్ జ్యోత్స్న మాట్లాడుతూ.. ఘనమైన సాహిత్య నేపథ్యం, “సారంగ” అంతర్జాల పత్రికా నిర్వహణ, అమెరికాలో సుదీర్ఘ నివాసం రీత్యా  ప్రవాసాంధ్ర సాహిత్యం విషయంలో వక్త ప్రసంగం ఎంతో విలువైనదని  పేర్కొన్నారు. 

అనంతరం కల్పన మాట్లాడుతూ… అమెరికా తెలుగు కథ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకొని ఏడేళ్ళు దాటిపోయిందని తెలిపారు. అందువల్ల ప్రవాసాంధ్ర స్త్రీల సాహిత్యం గురించి మాట్లాడాలంటే కనీసం 6 దశాబ్దాల సాహిత్య చరిత్ర గురించి మాట్లాడాలన్నారు. 1960లతో మొదలుపెట్టి అమెరికా, కెనడాలలోని తెలుగు రచయితలు రాసిన సాహిత్యం సావనీర్లు, అచ్చు పుస్తకాలు, బ్లాగులు, అంతర్జాల పత్రికలు ఇత్యాది అనేక మధ్యమాలలో ఉందని వివరించారు. 

ఈ సాహిత్యాన్ని మూడు తరాలుగా విభజించి అనేకమంది రచయిత్రుల సాహిత్య కృషిని గురించి ప్రస్తావించారు. అమెరికా, కెనడా దేశాలలోని రచయిత్రుల కథలు, నవలల గురించి ప్రసంగించారు. ఒకట్రెండు కథలు రాసినవాళ్ళ నుంచి వందల కథలు రాసినవాళ్ళ పేర్లు చెప్పారు. కొన్ని ముఖ్యమైన నవలలు, కథల గురించి ప్రస్తావించారు. 

   ప్రవాసాంధ్రులు ఏది రాసినా ప్రవాస సాహిత్యం అవుతుందా? లేక ప్రవాస జీవితం మీద రాస్తేనేనా అన్న చర్చ కొంతకాలంగా జరుగుతోందని ఆమె చెప్పారు. అయితే, ముందు గతం మీద ఆసక్తి (నోస్టాల్జియా) బయటికి వచ్చిన తరువాత రచయితలు వర్తమానం గురించి చర్చిస్తారన్నది తన అభిప్రాయమని వెల్లడించారు. ఇరవయ్యేళ్ళ నాడు తను అమెరికా వెళ్ళినప్పుడే అక్కడి రచయిత్రులు, వారి కథలు, ఇతర రచనల గురించి వాకబు చేశానని ఆమె తెలిపారు. 1970లలో ఆ దేశాల్లో తెలుగు సాహిత్య ఊట మొదలైందని అంటూ… 1977 నుంచి తానా, 1990 నుంచి తానా వేసిన ప్రత్యేక సంచికలు, శ్రీశ్రీ గారి వ్రాత ప్రతి “ సిప్రాలి”, 1995 నుంచి వంగూరి ఫౌండేషన్ వెలువరించిన కథా సంకలనాలు, అనేక బ్లాగులు, అక్కడి అనేక స్థానిక పత్రికలు ప్రవాసాంధ్ర సాహిత్యానికి పెద్ద పీట వేశాయని చెప్పారు. 

తొలితరం రచయిత్రుల్లో…. చెరుకూరి రమాదేవి మొదటి నుంచి రాస్తున్న కథకుల్లో ప్రముఖులని పేర్కొన్నారు. నిడదవోలు మాలతి కృషి ఈనాటికీ కొనసాగుతోందని, తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేసే ఆమె “తూలిక డాట్ నెట్” పరిశోధకులకు, తరువాతి తరాలకు ఉపయుక్తం అని కొనియాడారు. గైనకాలజిస్ట్ అయిన పూడిపెద్ది శేషుశర్మ కథ “చీకటి వెలుగులు”లో  ఎవరూ ప్రస్తావించడానికి అంతగా ఇష్టపడని గృహహింస, కుంగుబాటుల గురించి రేఖామాత్రం ప్రస్తావన అయినా ఉందని తెలిపారు. అపర్ణ ములుకుట్ల గునుపూడి కథల సంపుటితోపాటు నృత్య రూపకాలు కూడా రచించారని వెల్లడించారు. కూచిపూడి, భరతనాట్య సాంప్రదాయాల ద్వారా అవి ఖ్యాతి పొందాయన్నారు. కలశపూడి వసుంధర “గిరీశం ఇన్ వైట్ హౌజ్”లో వినూత్నంగా గిరీశం పాత్ర ద్వారా అమెరికా రాజకీయాలలోని అప్రజాస్వామిక, అనైతిక విలువలని అవహేళన చేయించారని అన్నారు. వంగూరి ఫౌండేషన్ వెలువరించిన చిమటా కమల రచన “అమెరికా ఇల్లాలు” ఉదయం నుంచి రాత్రి వరకు అమెరికా తెలుగు మహిళలు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, వాళ్ళకు కలిగే సందేహాలను హాస్యప్రధానంగా వివరించే చిన్నకథల సంకలనం అన్నారు. 

1990లలో రాసిన మొదటి రెండుతరాల రచయిత్రులూ కూడా, కలగలసిపోయిన అమెరికా, తెలుగు సంస్కృతులు, తెలుగువారి జీవన విధానం, పిల్లల పెంపకంలోని ఇబ్బందులు, మారుతున్న భార్యాభర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళలో ఎదుర్కొనే అవస్థలు ఇతివృత్తాలుగా రాశారని వివరించారు. తను ధారావాహికగా రాసిన “తన్హాయీ” నవల సహా మరికొంతమంది రచయిత్రుల నవలలను కల్పన ఉదాహరణగా పేర్కొన్నారు. 

2000 తరువాత వచ్చిన మూడవతర సాహిత్యం అమెరికా తెలుగు కథకి కొత్త మెరుపు అద్దిందని వ్యాఖ్యానించారు. సుస్మిత రాసిన “హీరాత” నవల ఆడవాళ్ళు సైన్స్ ఫిక్షన్ కూడా రాయగలదని నిరూపించిందని అన్నారు. యువ రచయిత్రులు కె. గీత, మమత, హిమబిందులు అక్కడి జీవితంలోని భిన్నమైన అంశాల గురించి రాయడం ముదావహం అని ప్రశంసించారు. ఇక కెనడాలో కోమరవోలు సరోజ, ఉపాధ్యాయుల సూర్యకుమారి, రాయవరపు లక్ష్మి, ఇంకొంతమంది చేస్తున్న సాహితీ సేద్యం గురించి తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన సమావేశం కొత్త రచయిత్రులని వెలుగులోకి తెచ్చిందని చెప్పారు. 

అమెరికా, కెనడాలు కాక ఇతర దేశాలలో  తెలుగు రచయిత్రుల ద్వారా జరుగుతున్న సాహిత్య కృషిని స్పృశించారు. 

భారతదేశంలో తెలుగురాష్ట్రేతరులతో కలుపుకొని ప్రవాసాంధ్ర తెలుగు సాహిత్య చరిత్రని దేశాలవారీగా సంకలనం చేయాల్సిన గురుతర బాధ్యత అక్కడి సంఘాలు, వ్యక్తుల మీద ఉందని కల్పన అన్నారు. ఇతివృత్తంలో, కథను నడిపే తీరులో, భాషలో తేడాలను పరిశీలించాలంటే స్త్రీల సాహిత్యం, పురుషుల సాహిత్యం అంటూ విభజన చేయాలని అభిప్రాయపడ్డారు. స్త్రీల సాహిత్య విమర్శలో అనాదిగా వస్తున్న అనాదరణ స్త్రీల అస్తిత్వ ఉద్యమ ప్రభావంతో కొంత తగ్గిందన్నారు. సాహిత్యం అంతా ఒకచోట ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటూ ప్రసంగాన్ని ముగించారు.  

ఈ కార్యక్రమం వీడియో  –

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾