11_012 ద్విభాషితాలు – నగరంలో తెల్లారింది February 15, 2022 నగరంలో తెల్లారింది! రాత్రంతా.. రోడ్లమీద అలసిపోయిన…ఎల్ ఇ డి లైట్లు.. లేత వెలుగు దుప్పట్లో కళ్ళు మూసుకున్నాయి. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం కళ్ళు తెరిచింది. ట్యాంక్ బండ్ పై వాహనాలు.. ఒక్కటొక్కటిగా .. నగరాన్ని వెలుగువైపు.. లాక్కెడుతున్నాయి. వేకువనే నిద్రలేచిన తాతగారి వేడి కాఫీ.. పెద్ద గ్లాసులో పొగలు కక్కింది. నెక్లెస్ రోడ్డు పై నడవడానికి అపార్టుమెంట్ లో ఆర్మీ అంకుల్ మంకీ క్యాప్ సిద్ధమైంది. సిటీ కాపురానికొచ్చిన పల్లెటూరి కొత్త కోడలు పిల్ల ఇంకా ముసుగుతొలగించని.. అత్తారింటివైపు… అయోమయంగా చూసింది. మత్తులో మూలుగుతూ.. దొర్లుతున్న రాత్రి బ్రతుకు.. పగటివేషం ధరించడానికి ఆపసోపాలు పడుతోంది. మరో రోజు సంగ్రామానికి.. మహానగరం శంఖం పూరించింది. మనుగడ నరాల్లో.. మళ్ళీ వేడి రాజుకుంది ! 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Nice father
ThanQ
Wonderful lyric
ThanQ