11_012 గరుత్మంతుడి గర్వభంగం

                       ‘ జగత్ప్రభు – సర్వేశ్వరుడు – విష్ణుమూర్తి వాహనాన్ని ’ అని తను అనుకోగానే గరుడుడికి గర్వం పొంగి పొరలింది. ‘ అవును నేను లేకపోతే విష్ణుమూర్తి పనులు ఒక్కటైనా పూర్తి కాదు కదా ! నేను లేకుండా విష్ణువు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఈ ప్రపంచంలో నన్నెవరూ చెరపలేరు. నాకు నేనే సాటి. విష్ణుమూర్తే నా ఆధీనంలో వుంటే నాకేం తక్కువ ? నేనే కార్యమయినా నిర్విఘ్నంగా వేగంగా చేయగలను ’ అనుకొని గరుడుడు సర్పాలన్నిటిని అంతం చేయడం ప్రారంభించాడు. ఎక్కడైనా సర్పం కనపడితే చంపి గుటుక్కున మింగి వేయడం ప్రారంభించాడు. సర్పాలు హాహాకారాలు చేశాయి. గరుడుడిని తప్పించుకోవడానికి భీతిల్లి అటూ ఇటూ పరుగెత్తి ప్రాణ రక్షణ కోసం విలవిలలాడడం ప్రారంభింకాయి. బయిట ఎక్కడా సర్పాలు కనిపించడమే లేదు.

చివరికి సర్పాలన్నీ కలిసి ఒక సభ చేశాయి. శివుని సర్పమణిని ఆ సభకు అధ్యక్షుణ్ణి చేశాయి. గరుడుని ఆక్రమణ నుంచి ఎలా తప్పించుకోవాలో చర్చ మొదలుపెట్టాయి. ఎన్నో ఆలోచనలు, సలహాలు, ఉపాయాలు చెప్పారు. కానీ – నిజంగా గరుడుని పట్టుకొని వశపరచుకునే ఉపాయం ఎవరూ చెప్పలేదు. చివరికి అధ్యక్షుడు మణి లేచి ‘ సర్ప వంశ నాశనాన్ని నేను అరి కడతాను. మీరు దిగులుపడకండి ” అన్నాడు. ఆ మాటలు విని సభ చాలించారు.

మణి శివుణ్ణి ప్రార్థించింది. మణి ప్రార్థనకి శివుడు ఆనందించాడు. మణిని వరం కోరుకోమన్నాడు. “ భగవాన్ ! గరుడుడు నన్ను చంపకుండా వరమియ్యండి ” అంది. శివుడు “ తథాస్తు ” అని తన లోకానికి వెళ్లిపోయాడు.

మణి తిరుగుతూ తిరుగుతూ విష్ణులోకం చేరుకొంది. విష్ణులోకంలో ఇచ్ఛవచ్చినట్లు విహరింపసాగింది. తిరుగుతుండగా మణిని గరుడుడు చూడనే చూశాడు. తన శత్రువు తన కళ్ల ఎదుట తన లోకంలో స్వేచ్ఛగా తిరగడం చూసి కోపం హద్దులు దాటింది. “ ఓరీ ! మణీ ! నా లోకంలో, నా ఎదుట ఇలా తిరిగే ధైర్యం నీకేలా వచ్చింది ? ” అన్నాడు.

“ అంత కోపం చేయకండి మహాప్రభో ! శాంతించంది. మా జాతిని అంతం చేస్తే మీకు వచ్చే లాభమేమిటి ? ” అని వినయంగా అడిగింది.

“ నేను పాములకి శత్రువుని. నేను వాటిని చంపాకనే శాంతిగా నిద్రపోగలను. నేను నిన్నుకూడా తినగలను. కానీ ఇప్పుడు కాదు. నాకిప్పుడు ఆకలిగా లేదు. ఈరోజు సాయింత్రం నీ మెత్త మెత్తని, వెచ్చని మాంసంతో ఆకలి తీర్చుకొంటాను ” అని మణిని సురక్షితంగా దాచి పెట్టాడు.

సాయంకాలమైంది. శివలోకంలో మణి లేదు. నందీశ్వరుడికి ఆ సంగతి తెలిసింది. శివుని వద్దకు వెళ్ళాడు. మణి శివలోకంలో లేదనే సంగతి శివునికి విన్నవించాడు. శివుడు ధ్యానం చేసి చూశాడు. విష్ణులోకంలో మణి బందీ అయిందని తెలిసింది. “ నందీశ్వరా ! మణిని విష్ణులోకంలో బందీని చేశారు. గరుడుడు మణిని భక్షించాలని చూస్తున్నాడు. అంచేత సత్వరం నువ్వు విష్ణులోకానికి వెళ్ళి భగవాన్ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మా సందేశంగా వినిపించు. మణిని గరుడుని బారి నుంచి తప్పించు ” అన్నాడు.

నంది వెళ్ళి సంగతిని వివరించి చెపితే విష్ణుమూర్తి గరుడుడిని పిలిచి మణిని విడువమని ఆజ్ఞాపించాడు.

విష్ణుమూర్తి ఆదేశం విన్నాడు గరుడుడు. చెప్పరానంత కోపం వచ్చింది. “ ఏం మాట్లాడుతున్నారు ? నేనివాళ మణిని వదలను. నేడు దానిని భక్షించి నా ఆకలి తీర్చుకొంటాను. నేను మీకెంతో సహాయం చేశాను. మీ యాత్రలన్నీ నావలనే జరిగాయి. మీ అపూర్వ విజయశ్రీలన్నిటికి నేనే కారణభూతుడననే మాట మర్చిపోకండి ” అన్నాడు.

గరుడుడి పలుకులకు విష్ణుమూర్తికి కోపం రాలేదు. తనలో తానే అనుకొన్నాడు. గరుడునికి అహంకారం పెరిగి పోయింది అని ఈ అహంకారం పెకలించి వేయకపోతే వానికి అరిష్టం తప్పదు అనుకొన్నాడు. గరుడుని శాంతించమని చెప్పాడు. గరుడుడు శాంతపడ్డాక అతని రెక్కలపై మెల్లగా చరిచి – “ గరుడా ! నువ్వంటే నాకు చాలా గర్వం. నీ వల్లనే కదా ! నేను అటూ ఇటూ తిరగగలుగుతున్నాను. నీ వల్లనే నాకు ఎన్నో విజయపరంపరలు దొరికాయనే సత్యం కాదని ఎవరనగలరు ? నా ఇంత బరువైన శరీరాన్ని ఎన్నో మైళ్ళ మైళ్లు మోసుకు తీసుకుపోయావు ” అని ప్రేమగా పలుకుతూనే విష్ణుమూర్తి తన కుడి కాలి వేలు గరుడుడిపై పెట్టాడు.

భగవాన్ విష్ణువు తన కుడి కాలి వేలు గరుడుని పై పెట్టగానే గరుడుడు వివిలలాడిపోయాడు. ఎంతో బరువు తనపై మోపినట్లయింది అతనికి. ఆ బరువు తనను పాతాళానికి తొక్కి వేస్తుందని, ప్రాణాలు తీసుకొంటుందని అనిపించిందతనికి. ఒక్క క్షణం ఆలోచించాడు. భగవంతుడిని వేలు తీయమని ఎలా చెబుతాడు. కానీ భరించలేక పోతే ఏం చేయగలడు ? దీనంగా ప్రార్థించాడు – “ దేవా ! కాస్త…. వేలు…. నేను అణిగిపోతున్నాను….. ”

“ వేలా ? వేలేంచేసింది ? నా శరీరాన్ని ఎన్నో మైళ్ళు మోసినవాడివి. వేలు భరించలేవా ? ఘోర ఆశ్చర్యం ఇంకేముంటుంది ? ” అన్నాడు విష్ణుమూర్తి.

అప్పటికి గరుడుడికి అంతా అర్థమయింది. “ ప్రభూ ! నన్ను క్షమించండి. నేను అహంకారంతో విర్ర వీగాను. మీరు నా అహంకారాన్ని అణిచి ఉపకారం చేశారు. నేను మణిని ఇప్పుడే విడుదల చేస్తాను ”.  

భగవానుడు కాలి వేలు తొలగించగానే గరుడుని ఆగిన శ్వాస కదలడం ప్రారంభించింది. గరుడుడు అనుకొన్నాడు – ‘ భగవత్కార్యంలో అందరూ నిమిత్తమాత్రులే కానీ కర్తలు కారు. మనం ఎంత మహత్కార్యం చేసినా మనం నిమిత్తమాత్రులం. అంతా ఆయనదే అనుకొంటే అహంకారం తలెత్తదు ” అనుకొని ప్రభువు పాదాలకు నమస్కరించి మళ్ళీ ఎప్పుడూ నాలో అహంకారం మొలకెత్తకుండా చూడండి ” అన్నాడు.

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾