11_012 సప్తపర్ణి కథలు – స్వేచ్చ

 

రాఁవుడూ లేవరా నాన్నా స్కూల్ కి వెళ్ళాలి. ఆలస్యం అవుతోందిరా అబ్బాయ్ “

అమ్మమ్మ మాటలు చెవుల్లోకి వెళ్తున్నాయి చక్కగా. హాయిగా. ఎప్పటిలా.  రోజులా. 

ఇదెలా సాధ్యం ? రామచంద్ర గబుక్కున లేచాడు మంచం మీద నుంచి, ఏదో ఉత్సాహం ! 

ఒక్కమాటు కళ్ళు మూసుకుని ధ్యానం చేసాడు, చప్పుడు కాకుండా ప్రాణాయామం సాగింది. 

ఏ ప్రయత్నం అవసరం లేదు. శరీరం, మనసు అన్నీ అలవాటు పడిపోయాయి. 

అయ్యబాబోయ్ ! తొమ్మిది నెలలైయింది ఇక్కడికి వచ్చి.

త్వరగా త్వరగా గడిచిపోతున్నాయి రోజులు. 

ఈ రోజు ల్యాబ్ కి వెళ్ళాలి. ఎందుకో తేలికగా ఉంది లోపల.  

తనున్న దెక్కడ ? కళ్ళు చుట్టూ చూశాయి. పెద్ద పెద్ద చెట్లు, మంచి గాలులు కిటికీ లోంచి  వీస్తున్నాయి. 

నిజంగా హార్వర్డ్ యూనివర్సిటీ లో ఉన్నాడా ?

జేకబ్ పక్క మంచం మీద అస్తవ్యస్తం గా పడుకున్నాడు. 

వాడు లేవకుండా లేచి స్నానం చెయ్యాలి. లేదంటే అంతా చెత్త చెత్త చేస్తాడు. నీళ్లు మడుగులు కట్టిస్తాడు. 

పాపం వీడిక్కూడా వేణ్ణీళ్ళు కావాలిగా అనుకుంటూ కొద్దిపాటి నీళ్లతో స్నానం పూర్తి చేసాడు రామచంద్ర. 

పడుకునే ప్రక్క సరి చేసాడు రోజులా. ఈ పనులకి ఆలోచన అవసరం రాలేదు.  

ముందురోజు పడుకునే ముందు ఇస్త్రీ పెట్టుకున్న బట్టలు వేసుకుని, తన బ్యాక్ ప్యాక్ తీసుకుని బయలుదేరాడు.  అదేమిటో లోపల అందంగా అనిపిస్తోంది. అద్ధం చూసుకుని ఒక్కక్షణం నిలబడ్డాడు. తనంటే తనకి నచ్చుతోంది ! 

అరే ఇంకా ఎనిమిది కాలేదు, మంచిదే కాఫీ తీసుకుని వెళ్ళచ్చు అనుకుంటూ స్టార్ బక్స్ దగ్గర ఆగాడు

ఈరోజేమిటో గమ్మత్తుగా ఉంది లోపల. ఎవరినీ పలకరించాలని లేదు. పలకరిస్తే నచ్చటం లేదు. 

మొదట్లో నాకు ఇక్కడ చదువు సాగదా అన్నంత గడ్డు గా ఉన్న మాట నిజం.  

భోజనం చేసేటప్పుడు విచిత్రం గా ఉండేది.

తనేమో వైదీకి భోజనం అలవాటు పడ్డవాడు అమ్మమ్మ ధర్మమా అని. 

ఇరవై ఏళ్ళు అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర గడిచాయి.

ఇక నాన్న సంగతి చెప్పక్కరలేదు. కానీ అదేమిటో తనకి నాన్న ప్రభావం కన్నా అమ్మమ్మ ప్రభావం బలంగా ఉంది. ఈ రోజుక్కూడా ! తాను మారక పోతే ముందుకెళ్లేదెలా

తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో అన్నం తినమంటే నచ్చేది కాదు.

వడ్డిస్తే మరీనూ ! ఇప్పటికి అర్థమయింది.

వాళ్ళందరూ మాటల్లో చెప్పకుండా చెప్తారు ఏం  చెయ్యకూడదో, ఎందుకు చెయ్యకూడదో

ఎలా చెయ్యాలో… అన్నీనూ ! లోపల బలవంత పడిపోయేది మనసు. భయం ! ఎవరన్నా ! 

పైగామొహమాట పడకు రాఁవుడూ ‘ అదో నిర్బంధం !

స్వేచ్ఛ అంటే తెలియలేదు. ప్రతీ క్షణం నేర్చుకోవటమే

ఏదో ఒకటి…… ఎప్పుడూ !

అమ్మ నాన్నా భయం. అమ్మమ్మ అంటే భయం, ఎదుటింటి వాళ్లంటే బెదురు. 

స్కూల్ లో టీచర్స్ అంటే దడ ! తాను సిగ్గు పడే రకం కాదు. ధైర్యం, బలం కావలసినంత ఉన్నాయి. 

ఇంట్లో బలవంతపు చదువుతో మార్కులు కుప్పలు కుప్పలుగా వచ్చేవి. 

ఏదో సరదా అల్లరికి తప్పు పని చెయ్యాలన్న ఆలోచన రాకపోలేదు. కానీ ఏదో అడ్డం వచ్చేది. 

తెలివి తేటలు, శ్రద్ధా ఉన్నా అణకువ లేకపోతే ఎవరూ గౌరవం ఇవ్వర్రా రాఁవుడూ !

అమ్మమ్మ ప్రతీ రోజూ పాడే పాట ! 

ఇంటిదగ్గర భయం కొద్దీ విన్నాడు. స్కూల్ లో బలవంతం గా విన్నాడు తాను. 

పారిపోవాలని ఇంటినుంచి వీధిలోకి వెళ్తే, వెళ్లే ముందు పెద్ద పాఠం అమ్మమ్మ నుంచి.

ఎలా తెలిసేదో ఆవిడకి ! 

అదేమిటో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఉన్నట్టుండి ఆలోచనలు తుఫానులా వస్తున్నాయి. పాటల్లా వినిపిస్తున్నాయి ! వింత పడుతున్నాడు లోపల రామచంద్ర !

కారణం గుర్తించ గలుగుతున్నాడు ఒక విధం గా ! 

బూట్లకి దుమ్ము తగలకుండా నడుస్తున్నాడు. ప్యాంటు నలగకుండా. హాయిగా చల్ల గాలి చుట్టేస్తోంది. 

లీవ్ ది డోర్ ఓపెన్ ” బ్రూనో మార్స్, ఆండర్సన్ ఆల్బం లో పాట నోటినుంచి అప్రయత్నంగా వస్తోంది

జోళ్ళకే కాదు, కాళ్ళకీ పిక్కల పైదాకా దుమ్ముకొట్టుకు పోతే నీకు చదువెలా  అబ్బుతుందిఅని దిగులు పడి

భరించలేకపోయే పోయే అమ్మమ్మ గుర్తుకొస్తోంది. 

పాపం ఆవిడ కోసం ఒక్క సారైనా తాను ఆవిడకి నచ్చినది చెయ్యలేదు. 

నువ్వెక్కడి కెళ్ళినా ఫరవాలేదబ్బాయ్. దుమ్ము మీద పడకూడదని గుర్తుంచుకో చాలు.

నాకు తెలుసు. నువ్వు పై దేశాలకి వెళ్తావు. నీ చదువంతా ఇక్కడ అయిపోయిందిలే.

అక్కడ కొత్తగా వెలగబెట్టేదేమీ లేదు. 

కానీ అమెరికా చదువుల వలన వాళ్ళ ఆచారాలు అలవాటు పడతాయి.

నియమాలు నిష్ఠలూ అక్కడా ఉంటాయి. అది గమనిస్తే చాలు.

పశువుల మంద నుంచి నిన్ను వేరు చేసేది ఒకటేరా, నీమీద నీకు గౌరవం ఉండటం. 

నువ్వంటే నీకు ఇష్టం ఉండటం. చదువుకోటం లో లేదు ఫలితం, ప్రవర్తనలో ఉంటుంది. 

డబ్బు సంపాదించటం లో ఉండదు తెలివి. జాగ్రత్త చెయ్యటం లో ఉంటుంది. 

సంప్రదాయం అంటే చదువు, ప్రాయోజకత్వం కాదు రాఁవుడూ ! సభ్యతా సంస్కారం ! “ 

చెవుల్లో గింగుర్లు. లోపల కూడా ! 

అబ్బబ్బా ! అమ్మమ్మా నన్ను వదులు ! గట్టిగా మాటలు నోటినుంచి బయటకి వచ్చాయి. 

రెండు చేతులతో దండం పెట్టాడు రామచంద్ర గాల్లో !

 ఏమైంది బ్రదర్ ! భుజం మీద జాకబ్ చెయ్యి పడింది. 

నువ్వింకా లేవలేదని నేను వచ్చేసాను. ఏమిటి బట్టలు కూడా మార్చలేదా ?

లేచిన వాడివి లేచినట్లు వచ్చేసావా ‘ ? 

వెకిలిగా నవ్వాడు జాకబ్. జుట్టు సరి చేసుకుంటూ, షర్ట్ ప్యాంటు లోపలికి సద్దుకుంటూ ! 

యూనివర్సిటీ హాల్ లో నోటీసు బోర్డు చూస్తున్నారు ఇద్దరూ ! ఇద్దరి పేపర్లు అంగీకారం పొందాయి. 

ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకి నడుస్తున్నారు. 

జాకబ్ మొహం లో సందేహాలు లేవు. తేలికగా నవ్వుతున్నాడు. 

తనని అమ్మ మ్మ వదలలేదు. ” నువ్వు బాగుంటే చాలదబ్బాయ్. నీ చుట్టూ బావుండాలి.

నీ వలన నీ చుట్టూ అందరూ బావుండాలి ” 

అన్నమాచార్య పాట పడుతోంది అమ్మమ్మ. మానవత్వపు విలువలు ప్రేమలో ప్రతిఫలిస్తాయి ! 

ఏదో అంతా అర్థమయినట్లనిపిస్తోంది. ప్రశాంతం గా ఉంది. పాట పాడాలని ఉంది.

 స్వేచ్ఛ అంటే ఇదే !!

అమ్మమ్మ పోయినప్పుడు తనకి ఏడుపు ఎందుకు రాలేదా అని ఇన్నాళ్లూ ఆలోచించాడు తాను. 

ఆవిడా వెళ్తూ తనని పంజరం లోంచి వదిలేసింది.  

తన శాంత మాత్మలో తగిలినప్పుడు కదా పనిగొన్న తన చదువు ఫలియించుట ” !!!

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾