11_014 అమరజీవి పొట్టి శ్రీరాములు

                            ( జననం : 16-3-1901 / మరణం : 15-12-1952 )

           అతడొక సామాన్యుడు…. అంగబలం, అర్థబలం లేనివాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినవాడు. ప్రేమ తప్ప, ద్వేషం ఎరగనివాడు. అనురాగం తప్ప, విరోధాన్ని దరిచేరనివ్వనివాడు. ఆడినమాట తప్పనివాడు, పట్టినపట్టు విడవనివాడు. ఎవరినుండీ ఏదీ ఆశించనివాడు, అందరికోసం మరణించినవాడు. అందుకే అతడు జాతి చరిత్రలో చిరస్మరణీయుడు. ఆతడే శ్రీరాములు… పొట్టి శ్రీరాములు…. అమరజీవి పొట్టి శ్రీరాములు.

తెలుగువారి చరిత్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానం అపూర్వమైన ఘట్టం. ఒక్క తెలుగువారి చరిత్ర అనేమిటి? మానవాళి చరిత్రలోనే అదొక చిరస్మరణీయమైన ఘట్టం. సత్యాహింసల మార్గంలో, తన జీవితాన్ని తెలుగుజాతి కోసం సర్వ సమర్పణ చేసిన ఒక మహనీయుడి దివ్య చరిత్ర అది.

1901వ సంవత్సరం మార్చి 16వ తేదీన పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు పొట్టి శ్రీరాములు. ఆనాటి మద్రాస్‌ (నేటి చెన్నై) లోని అణ్ణాపిళ్ళై వీధిలోని 163వ నెంబరు అద్దె ఇంట్లో, పేదరికం విశ్వరూపం చూపించిన కాలంలోనే శ్రీరాములు జననం జరిగింది. గోవిందప్ప నాయకర్‌ వీధిలోని ‘‘బంగాపల్లి కూటం’’లో శ్రీరాములు చిన్ననాటి చదువు ఆరంభమైంది. 1908లో శ్రీరాములు ఏడవ ఏట ఆయన తండ్రి గురవయ్య మరణించాడు.

కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి సహకారంతో, జార్జిటౌన్‌లోని అడియప్ప నాయకర్‌ వీధిలోని ప్రోగ్రసివ్‌ యూనియన్‌ పాఠశాలలో, ఆరు, ఏడు తరగతులు ఆ తరువాత మింట్‌ వీధిలోని హిందూ ధియోలాజికల్‌ ఉన్నత పాఠశాలలో పై తరగతులు చదివాడు శ్రీరాములు. ఇక్కడే ఎ.వి. దొరస్వామి అయ్యర్‌ అనే ఉపాధ్యాయుడు శ్రీరాములులోని ప్రతిభా సామర్థ్యాల్ని గమనించి ప్రోత్సహించాడు. ఆయన సారధ్యంలో పొట్టి శ్రీరాములు నటుడిగా గుర్తింపు సంపాదించుకొన్నాడు. అనేక ఆంగ్ల నాటకాలలో ఆయన ఎన్నో పాత్రలు నటించాడు. శ్రీరాములుకు బిలియర్డ్స్‌ ఆట అంటే చాలా ఇష్టం. బాడ్మింటన్‌లో కూడా శ్రీరాములుది అందెవేసిన చేయి. ఆ రోజుల్లోనే శ్రీరాములు అన్న నారాయణ మరణించాడు. శ్రీరాములుకు పదహారేళ్ళు వచ్చేసరికి ఆ ఇంట ఇది రెండో మరణం. అతికష్టం మీద ఆ కుటుంబం దీనినుండి తట్టుకొనేలోగానే, శ్రీరాములు సోదరి గురమ్మ మరణించింది. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ విషాదం శ్రీరాములు జీవితాన్ని కృంగతీయడం, పైగా ఆర్థిక ఇబ్బందులు, కన్నతల్లి, వదిన వైధవ్య దుఃఖం అనుభవిస్తూ కళ్ళముందు తిరుగాడడం, ఈ అశాంతితో శ్రీరాములు ఐదవ ఫారం పరీక్ష తప్పడంతో, భవిష్యత్‌ అయోమయమైపోయింది. ఐదవ ఫారం తప్పినవారికి కూడా, బొంబాయిలోని (నేటి ముంబై) విక్టోరియా జూబిలీ విద్యాసంస్థలో శానిటరీ ఇంజనీరింగ్‌ చదవడానికి అవకాశం ఉందని ఒక దినపత్రికలో ఒక ప్రకటన శ్రీరాములుకు కన్పించింది. కానీ ఎలా? రోజు గడవడమే కష్టమైన ఆ కుటుంబానికి, బొంబాయి చదువు ఎలా సాధ్యం. ఆ స్థితిలో శ్రీరాముల్ని భుజం తట్టి ప్రోత్సహించింది కన్నతల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు బొంబాయి ప్రయాణమయ్యాడు. విక్టోరియా జూబిలీ విద్యాసంస్థలో ఆయన శానిటరీ ఇంజనీరింగ్‌ చదువు మొదలయ్యింది. బొంబాయిలో అందరూ ఆయనను పి.ఎస్‌. గుప్తా అని పిలిచేవారు. శానిటరీ ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లోనే ఆయన వివాహం జరిగింది. తమలాగే పేదరికంతో బాధపడుతున్న తన మేనమామ కుమార్తె సుబ్బమ్మను పెళ్ళిచేసుకొన్నాడు. కట్నకానుకల ప్రసక్తి లేదు. పెళ్ళి ఖర్చులకు కూడా డబ్బు లేదు. మద్రాస్‌లోని కలవల కణ్ణన్‌శెట్టి ధర్మ సంస్థ సహకారంతో, నిరాడంబరంగా వివాహం జరిగింది. పెళ్ళిలో ఆమె పేరును ‘‘సీతగా’’ మార్చింది మహాలక్ష్మమ్మ.

బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్‌ చదువు పూర్తవగానే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. గ్రేట్‌ పెనిన్సులార్‌ రైల్వేలో అసిస్టెంట్‌ ప్లంబర్‌గా శ్రీరాములు జీవితం ఆరంభమైంది. అక్కడే శ్రీరాములుకు అగ్ని పరీక్ష ఎదురయ్యింది. ఆయన పై అధికారి, రైల్వే కుళాయి గొట్టాల్ని బయట అమ్మేసి డబ్బు తెచ్చి ఇవ్వమని శ్రీరాముల్ని ఎంతో బాధ పెట్టేవాడు. అవినీతివైపు ఒక్క అడుగు కూడా వేయలేని వ్యక్తిత్వం శ్రీరాములుది. అయితే పై అధికారి లంచగొండి. మాటల్లో చెప్పలేనంత సంఘర్షణ అనుభవించాడు శ్రీరాములు. ఈ దుఃఖంలోనే మరొక దెబ్బ తగిలింది. శ్రీరాములు కన్నతల్లి మహాలక్ష్మమ్మ మరణించింది. కాలం మరింత కసిబూనింది. శ్రీరాములుకు ముద్దులు మూటగట్టే కొడుకు పుట్టి, ముద్దు ముచ్చట్లు చూసుకొనేలోగానే, అకాల మృత్యువుకి గురయ్యాడు. చివరికి శ్రీరాములు ధర్మపత్ని సీత కూడా, క్షయవ్యాధితో ఎంతో వేదనపడి అసువులు బాసింది. ఇలా ఇరవై ఎనిమిదేళ్లు వచ్చేసరికి పొట్టి శ్రీరాములు బ్రతుకులో నా అన్నవాళ్లు అందరూ… ఒక్కరొక్కరే వెళ్ళిపోయారు. అందరూ శ్రీరాముల్ని వంటరివాడ్ని చేసి దూరంగా, తిరిగిరాని తీరాలకు వెళ్ళిపోయారు.

ఆ తరువాత తన దగ్గర ఉన్నదంతా పేదలకు పంచిపెట్టేసి, స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనడానికి, సబర్మతీ ఆశ్రమం వైపు సాగిపోయాడు. శ్రీరాములు, 1930 ఏప్రియల్‌ 1వ తేదీన గాంధీజీని దర్శించాడు. సబర్మతీ ఆశ్రమంలో సత్యాగ్రాహిగా శిక్షణ పొందాడు శ్రీరాములు. సబర్మతీలో నూలు తీయడంలో, రాట్నం వడకడంలో సిద్ధహస్తుడయ్యాడు. చెప్పులు కుట్టే పనిలో మంచి శిక్షణ పొందాడు. సబర్మతిలో ఉండగానే అంగ్ల ప్రభుత్వం సత్యాగ్రహులందర్నీ అరెస్ట్‌ చేసింది. అందరితోపాటుగా శ్రీరాములూ అరెస్ట్‌ అయ్యారు. ఆ విధంగా శ్రీరాములు తొలి కారాగార జీవితం నాసిక్‌ జైలుతో ఆరంభమైంది. జైలు జీవితంలోనూ ఆయన ఆదర్శంగా నిలిచాడు.

1934 జనవరి 15వ తేదీన, బీహార్‌ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. 77,700 చదరపు మైళ్ళ భూభాగంలో వచ్చిన ఈ భూకంపం, ఉత్తర బీహార్‌ను సర్వనాశనం చేసింది. ఆ విపత్కర పరిస్థితిలో, తన మేనల్లుడు నరసింహ గుప్తాతో కలిసి బీహార్‌ చేరాడు శ్రీరాములు. అన్నిటికన్నా దారుణంగా దెబ్బతిన్న సీతామోర్‌ తాలూకాలో, రాత్రీపగలూ బేధం లేకుండా శ్రమించారు వారందరూ. ఆ తరువాత గుజరాత్‌లోని సత్యాగ్రహ ఆశ్రమంలో చేరి, ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాల్ని సాగించాడు. కొన్నాళ్ళకి తారవాడలోని శ్రమజీవి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకొని, వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించాడు. ఇంతలో మారెళ్ళ గ్రామంలో మేనమామ అవసానదశలో ఉన్నట్లు, తంతివార్త రాగానే శ్రీరాములు మారెళ్ళ వెళ్ళాడు.

అక్కడే ఆయన తన తొలి నిరాహార దీక్ష చేశారు. శ్రీరాములు తొలిదీక్ష విజయవంతం అయ్యింది. అక్కడి నుండి శ్రీరాములు నడక గాంధీ ఆశ్రమంవైపు సాగింది. ఈ ఆశ్రమంలో ఉండగానే, స్వాతంత్రోద్యమ కృషి ముమ్మరంగా చేశాడు. 1943 జనవరి 26న స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు శ్రీరాముల్ని అరెస్ట్‌ చేసింది ఆంగ్ల ప్రభుత్వం. కొంతకాలం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో, మరొకొంత కాలం బళ్ళారి సెంట్రల్‌ జైలులో, ఆలీపూర్‌ క్యాంప్‌ జైల్లో ఇలా శ్రీరాములు జైలు శిక్షలు అనుభవించాడు. జైలు జీవితంలో శ్రీరాములు స్వయంగా ఖైదీల మల మూత్రాల్ని ఎత్తి, మరుగుదొడ్లు కడిగి, జైలును శుభ్రపరచి, సత్యాగ్రహానికి కొత్త అర్థం చెప్పాడు. జైల్లో మహాత్మా గాంధీజీకి ప్రతిరూపంగా శ్రీరాములు కన్పించాడు అందరికీ.

జైలు నుండి విడుదలయ్యాక అంటరానితన నిర్మూలనవైపు శ్రీరాములు తన లక్ష్యాన్ని స్థిరం చేసుకొన్నారు. మెడకు అట్టలు కట్టుకొని అంటరానితనాన్ని నిరోధించండి అంటూ ప్రచారం చేస్తున్న శ్రీరాముల్ని పిచ్చివాడని హేళన చేసేవారు. వితంతు పునర్వివాహం, యానాదులకు సహపంక్తి భోజనాలు, అనాధప్రేత సంస్కారం, ఇలా శ్రీరాములు కృషి నెల్లూరు జిల్లాలో బహుముఖంగా విస్తరించింది. హిందూ సంఘ సంస్కరణ సమితి స్థాపనతో అది మరింతగా విజృంభించింది. శ్రీరాములు పోరాటం ఇక్కడ మరొక మలుపు తిరిగింది. అస్పృశ్యత అనే సాంఘిక దురాచారంతో, సాటి మనుషులకు దేవాలయాలలో ప్రవేశం కల్పించకపోవడం అన్యాయమని భావించిన శ్రీరాములు నెల్లూరులో వేణుగోపాల స్వామి గుడిలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ 1946 మార్చి 7 నుండి నిరాహార దీక్ష ప్రారంభించాడు. దీక్షా వార్త చివరకి గాంధీజీ వరకూ చేరింది. ముగింపులో ధర్మకర్తలు అంగీకరించడంతో, 16-3-1946న శ్రీరాములు దీక్ష విరమించి, లక్ష్య సాధనలో కృతకృత్యుడయ్యాడు.

ఇదంతా పరాయి పరిపాలనలో జరిగిన సంగతులైతే స్వరాజ్యం వచ్చాక కూడా శ్రీరాములుకు ఏమీ గౌరవం కలగలేదు సరికదా, రేషనింగ్‌ విధానంలో లోపాలని తొలగించమని కోరినందుకు 1947 అక్టోబర్‌లో, స్వదేశీ ప్రభుత్వమే అరెస్ట్‌ చేసి, జైలుకు పంపించింది. అదీ చిత్రం. పరిస్థితులు ఎలా ఉన్నా శ్రీరాములు ప్రయాణం మాత్రం సాగుతూనే వచ్చింది. మహాత్ముడి వర్థంతి అయిన జనవరి 30వ తేదీని ‘‘పీడిత జన సేవాదినంగా’’ ప్రకటించమని శ్రీరాములు ప్రభుత్వానికి వినయంగా విన్నవించాడు. కానీ మద్రాస్‌ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానితో 1948 సెప్టెంబర్‌ 10న శ్రీరాములు నిరాహారదీక్ష సాగించాడు. ప్రజా జీవితానికి భంగం కలిగిస్తున్నాడనే నేరం మోపి, 11వ రోజు దీక్షలో శ్రీరాముల్ని అరెస్ట్‌ చేశారు. జైల్లో ‘సి’ తరగతి ఖైదీగా ఆయనకు కఠిన శిక్ష విధించారు. అయినా శ్రీరాములు చలించలేదు, దీక్ష సడలలేదు.

జైలు నుండి విడుదలయ్యాక, ఆయన తన పట్టు విడవలేదు. సేవాగ్రాం ఆశ్రమం చేరి 1949 జనవరి 12 నుండీ తిరిగి నిరాహారదీక్ష ప్రారంభించాడు. అయితే అక్కడా రోజులు గడిచాయి గానీ, ప్రభుత్వ నిర్ణయంలో మార్పులేదు. చివరికి డా॥ బాబూ రాజేంద్రప్రసాద్‌ గట్టిగా నచ్చచెప్పాక, మద్రాస్‌ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, ప్రతినెలా 30వ తేదీని, పీడిత సేవాదినంగా అంగీకరించింది. శ్రీరాములు ఇరవై ఎనిమిది రోజుల దీక్షాయజ్ఞం పరిసమాప్తమయ్యింది. శ్రీరాములు సాగించిన సత్యాగ్రహ పోరాటాలలో చివరిది ఆంధ్రరాష్ట్ర సాధనా పోరాటం.

ప్రఖ్యాత దేశభక్తుడైన బులుసు సాంబమూర్తి అద్దె ఇంట్లో శ్రీరాములు దీక్ష ఆరంభమైంది. 1952 అక్టోబర్‌ 19 ఆరంభమైన పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష ఏభై ఎనిమిది రోజులు నిరాటంకంగా సాగింది. రాష్ట్రసాధన, ఆంధ్రరాష్ట్రం అనే విషయాలను ప్రక్కన పెడితే, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఆధునిక కాలపు ఓ కఠోర సత్యం, ఓ అద్భుత వాస్తవం. వైద్యశాస్త్రపరంగా, మత విశ్వాసాల పరంగా, ఆధ్యాత్మికంగా అదొక గొప్ప ప్రయోగం.

దీక్ష ప్రారంభించిన 19-10-1952న ఆయన బరువు 119 పౌనులు, 15-11-1952 నాటికి ఆయన 19 పౌనుల బరువు తగ్గిపోయారు. అంటే దాదాపుగా రోజుకి ఒకపౌను బరువు తగ్గిపోయారన్నమాట. నలభై రెండవ రోజుకు ఆయన బరువు 94 పౌన్లకు తగ్గిపోయింది. శరీరం ముడతలు పడిరది. గుండె కండరాలు బలహీనమయ్యాయి. నలభై ఆరవరోజున వాంతిలో నెత్తుటి జీర కన్పించింది. నలభై ఏడవ రోజున కూడా తనను కలవడానికి వచ్చిన ఆంధ్రప్రభ ప్రతినిధితో నవ్వుతూ మాట్లాడారంటే, ఆయన గుండె ధైర్యం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాములు నిరసనవ్రత దీక్షాజ్వాలలో ఏభై ఎనిమిది రోజులు గడిచిపోయాయి. 1952 డిసెంబర్‌ 15వ తేదీ రాత్రి 11గంటల 23 నిముషాలకు శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధనా మహాయజ్ఞంలో తుదిశ్వాస విడిచారు. ఏభై ఎనిమిది రోజుల కాలంలోనూ, ఆయన తన ఆలోచనల్ని, చిరునవ్వును, జ్ఞాపకశక్తిని కోల్పోలేదంటే ఆయన ఎంతటి మహామానవుడో ఎవరికైనా అర్థమౌతుంది. శ్రీరాములు మరణించిన పదినెలలకు ఆంధ్రరాష్ట్రం కర్నూల్‌ రాజధానిగా అవతరించింది.

పొట్టి శ్రీరాములు పోరాటంలో అనేక దశలు కన్పిస్తాయి. ఉత్తమోత్తమ సత్యాగ్రాహి, పీడిత ప్రజా సేవకుడు, ప్రేమపూరిత మానవుడు, సంఘసేవా పరాయణుడు, అస్పృశ్యతా నివారణోద్యమ స్ఫూర్తి ప్రదాత, ఖాదీ ప్రేమికుడు, ఉత్తమ శిష్యుడు, వితంతు వివాహ కార్యకర్త, అనాధప్రేత సంస్కార నిర్వాహకుడు, మద్యపాన నిర్మూలనా సాధకుడు. నిత్యకృషీవలుడు, గొప్ప దేశభక్తుడు. వీటన్నిటికీ మించి, తోటి మనిషిని మనసారా ప్రేమించే మానవీయమూర్తి. ఇలా.. ఆయన గురించి ఎంత చెప్పినా, చెప్పవలసింది ఎంతో మిగిలే ఉంటుంది. ఆయన అమరజీవి. దేశమంతా స్వాతంత్య్ర అమృతోత్సవాలను వైభవంగా నిర్వహించుకొంటున్న వేళ, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

                                          జైహింద్‌.

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com