11_014 విద్యార్థి పాఠం

                    

                        ‘ శ్రీకళాపూర్ణ ఆచార్య రామవరపు శరద్బాబు గారి జ్ఞాపకాలు – నుంచి 

                                          సంకలనం : శారదాపూర్ణ 

 

” ఆపరి దోషాద్విదుషాం న సాధుమన్యే ప్రయోగ విజ్ఞానామ్ 

బలవదతి శిక్షితానామ్ ఆత్మన్యప్రత్యయం చేతః ” –

మహాకవి కాళిదాసు సంస్కృత నాటక సూత్రకారప్రకటన 

 

విజ్ఞులు ఔనన్నప్పుడే మన ఆలోచనకి శుద్ధి, మన ప్రజ్ఞకి విలువ. విషయం నీకు తెలిసినదే ప్రతీచీ !  మరోసారి స్మరించుకోవాల్సిన సన్నివేశం గుర్తుచేస్తాను విను. 

ఎప్పటిలా కాలి నడకన బయలుదేరాను ఆరోజు .  విశాఖ వీధుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం  ఎప్పటిలా గంభీర గాలులు వీస్తోంది. ఆ వీధుల్లో నడిచేవారందరి మొహాల్లో తెలియని ఆత్మవిశ్వాసం ఉంటుంది. వెన్నెముక నిటారుగా నించుంటుంది. మహాజ్ఞాని, విద్యావేత్త, వైస్ ఛాన్సలర్ ఆచార్య MR అప్పారావు గారు వస్తున్నారు. కారు చప్పుడు చేస్తూ వచ్చింది. గౌరవం గా ఎదురుచూస్తూ ఉన్నవారందరినీ తల పంకించి పలకరించి గది లోపలి వెళ్లారు. గంటన్నరగా ఎదురుచూస్తున్న నా సహనం కాస్త ఉపశమించింది.  . 

అరగంట తర్వాత పిలిచారు. సంభాషణ ఏమీ లేదు సంజ్ఞలు తప్ప. ఎందుకొచ్చారు ఏంకావాలి అని ఆయన చేతి వ్రేళ్ళు మెలికలతో మాట్లాడాయి. అంత నిర్లిప్తంగానూ సమాధానం ఇచ్చాను. ‘ నేను మన ఆంధ్ర విశ్వ విద్యాలయం లైబ్రరీ లో తాళపత్రాల శాఖలో క్యురేటర్ గా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. దయుంచి నాకు ఉద్యోగం ఇప్పించమని కోరుతున్నాను ‘. ‘ మీ పేరేమిటి?’ ‘ రామవరపు శరత్ బాబు ‘

 ‘ సంస్కృతం డిపార్ట్మెంట్ లో ఏం చేస్తారు?’ ‘ రీసెర్చ్ స్కాలర్ నండీ ‘ .

తల ఎగరేశారు. సౌమ్యత లేదు. గౌరవ ఛాయలు కూడా కనిపించ లేదు. ఉదాసీనత గడ్డ కడుతోంది లోపల. నా ఉద్యోగార్హత లేమిటీ నేను కోరుకుంటున్నదేమిటి ? ప్రశ్నల పరంపర లోపల. ‘ సరి సరి ! మరి మీకన్నా సీనియర్స్ చాలామందుండగా మీకు ఆ పోస్టు వస్తుందని ఎలా అనుకుంటున్నారు ? అందులో లైబ్రరీలో. సంస్కృతం డిపార్ట్మెంట్లో కాదు. అసలు తాళ పత్రాలు చదవగలరా ? ఎక్కడ నేర్చుకున్నారు ? వాటి సంగతి తెలుసా నీకు ? ‘ పదునుగా అంటూ చేతి బెల్లు నొక్కేరు. 

అందరికీ సన్నిహితుడు, పరమ సౌజన్య వ్యక్తి K.వెంకట రత్నం గారు వచ్చారు. ‘ నిన్న మీరు తెచ్చిన తాళపత్ర గ్రంథం తీసుకు రండి ‘ అన్నారు. వెంకటరత్నం గారు నన్ను దీక్షగా గమనిస్తున్నారు. నా కళ్ళు ఒక్కసారి వారి మీద నిలబడ్డాయి. ఏ సందేశాలూ లేవు. ‘ ఇదెప్పుడన్నా చూసారా ? ‘ ఆచార్య అప్పారావుగారు కంఠం కంచులా మ్రోగింది. ‘ లేదండీ ‘ బిత్తరగా సమాధానం చెప్పాను. మధ్యలో ఒక తాటాకు తెరిచారు.

 ‘ చదవండి ‘ అన్నారు. తెలుగు లిపిలో ఉంది. బ్రతికాను అనుకుంటూ మొదటి పత్రం చూసాను. కాళిదాస కృత ‘ ఉత్తర కాలామృతమ్ ‘. గుండెల్లో దిగుడు రాయి పడింది. ఇది జ్యోతిష్య శాస్త్రం. అసలు నా విద్యాభ్యాస కాలంలో పఠన పాఠనాలు లేని, పరిచయం లేని శాస్త్రం. కేవలం ఆసక్తి తో సంపాదించిన శ్రుత జ్ఞానం తప్ప ఏమీ లేదు నాదగ్గర. పరి పరి విధాలైన అలజడి లోపల. నాకు ఉద్యోగం కావాలి అని ఎందుకు అనిపిస్తుందో నాకే స్పష్టంగా లేదు.  

ఆ తాళపత్రాల శాఖ చాల పెద్ద విశాలమైన గది. కట్టలు కట్టలుగా, కుప్పలు కుప్పలుగా తాళ పత్రాలన్నీ పడుంటాయి. ఒక విచిత్రమైన ముక్క వాసన. వెగటు రాదు సరికదా లోపల చిత్రంగా అంతు తెలియని శక్తి నిండుతున్నట్లు అనిపిస్తుంది. తాళపత్రాలున్న బీరువాల వరసల మధ్య చీకటి. చెమ్మగా ఉంటుంది. తోడుగా ఉంటే విశాఖ ఉప్పు సముద్రపు వేసవి వేడి లేదా చలి. కానీ మిత్రుడు గణపతిరాజు అచ్యుతరామరాజు పరిహాసం, పెంకి నవ్వు చెవుల్లోకి వచ్చింది. ఆ రహస్య భవనంలో ఏం ఉద్యోగం, ఎవరిని కలవాలి ? అని. ఆలోచనలని కూడ బలుక్కుని చదవటం మొదలెట్టాను. ఆ పత్రంలో ఉన్న రెండు శ్లోకాలు నడిచాయి సునాయాసంగా. ‘ ఏమిటన్నారు ? ఆ పదం మళ్ళీ చెప్పండి ‘ వెన్నులో వణుకుగానే ఉంది. నుంచునే సంభాషణ అంతా ! ‘యుగ్మ’ ‘మళ్ళీ చెప్పండి ‘ !  

 ‘ యుగ్మ- సార్ ‘ ‘ అంటే ఏమిటి ? సంస్కృత లిపిలో వ్రాయగలరా ? ‘ వ్రాసి అందించాను. ఆచార్య MR అప్పారావు గారు మహా ప్రసిద్ధులు. గొప్ప విద్యావేత్త. వారి వైదుష్యం విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. వారి సమక్షంలో నిశ్శబ్దం కూడా పెద్ద పాఠమే ! జంకు నాపి దత్తాత్రేయుణ్ణి తలుచుకున్నాను ‘ నిఘంటుకార్ధం జత, జంట అని ‘వస్త్ర యుగ్మము’ లో లాగ. అది లౌకికర్థం. కానీ జ్యోతిష్య శాస్త్రం అవటం వలన ఇక్కడ ‘ మిథున రాశి అని చెప్పుకోవలసి ఉంటుంది సార్ ‘. ‘ చాలింక వెళ్ళండి ‘ అన్న మాట చేతివాచీ చూసుకుంటున్న వారి సమాధానంగా వచ్చింది. అయోమయంగా బయటకి వచ్చాను. 

మరునాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయ తాళపత్ర శాఖా పర్యవేక్షునిగా ఉత్తరువులు వచ్చాయి. దశాబ్దం పైగా గడిచింది తాళపత్ర శాఖా గ్రంథాలయ శాఖలో. 

సంవత్సరం తిరగక పూర్వమే 1976 జనవరి నెల రెండోవారంలో కెనడా దేశం టొరంటో నగరం నుంచి ‘ History of Sanskrit Literature’ ఆరు వాల్యూముల మహా గ్రంథం ప్రకటించిన Prof AK Wharton విశాఖపట్టణం వచ్చారు. విదేశీయుల పరిశోధన నిర్వహణ లో నిర్దిష్టత అందరు నేర్వవలసిన విషయం. ఆంధ్ర విశ్వ విద్యాలయం తాళపత్ర శాఖలో తాళపత్రాలు చాల వరకు తెలుగు లిపిలో ఉన్నాయి. సంస్కృత దేవనాగరి లిపిలో ఉన్నవి అదే గదిలో వేరే భాగంలో ఉన్నాయి. ఆ శ్వేతవర్ణ ఆచార్యుడు ఒక పెద్ద palm leaf inscription bundle తెచ్చి దేవనాగరిలో కావాలన్నారు. 

అది ‘ ప్రేమాభిరామం’ అన్న సంస్కృత గ్రంధం తాలూకు తెలుగు లిపిలోఉన్న తాళపత్ర గుచ్ఛం. ‘ క్రీడాభిరామం’ గ్రంధానికి సంస్కృత మూలం. దేవనాగరిలో లేదని చెప్పి,  చేతి వ్రాతలో దేవనాగరి లో మొత్తం తిరగ వ్రాసి రెండు రోజుల తర్వాత వారికి అందించాను. తర్వాత చౌఖంబా, మోతిలాల్ ప్రచురణ సంస్థలు దేవనాగరి, తెలుగు లిపుల్లో ప్రచురించారని తెలిసింది. నేపథ్యంలో తీవ్రత, బలం లేకపోతే ఏ ఆలోచనకీ శక్తి ఉండదు. గురుజనం,సాధుజనం అంగీకరించని ఏ విద్యకీ లక్ష్య సిద్ధి ఉండదు.

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com