11_014 విషాదమైకం

 

ఏడుస్తూ వుంటే…

గుండెల్లోంచి తోడుతున్నట్లు…

తొలగిస్తున్నట్లు…

తేలికవుతున్నట్లు…

తేలుతున్నట్లు…

బానేవుండొచ్చు.

 

ప్రపంచమంతా జీవిస్తుంటే..

నువ్వొక్కడివే…

నిశ్శబ్దంలో నిర్జీవిలా…

ఎవరికీ బదులివ్వక..

ఎటూ చూడక…

నీకే ఘోరం జరిగినట్లు..

నీలో నువ్వే కుమిలిపోతుంటే..

కూలిపోతుంటే…

నీకదో గుర్తింపులా…

ఘనకార్యంలా…

బానే వుండొచ్చు.

 

సుష్కించిన శిరోజాలతో..

ఎర్రబడిన కళ్ళతో…

చారలు కట్టిన చెక్కిళ్లతో..

వ్యధ నిండిన వదనంతో…

ఎదురయ్యే జాలి చూపులతో..

విరాగిలా…

వికారిలా..

వియోగిలా…బ్రతకడం..

ఓ మత్తులా వుండొచ్చు.

 

కానీ…తమ్ముడూ!

విషాదమొక వ్యసనం.

అది ఎదురైతే..

చూసి… దాటి.. వదిలెయ్యాలి.

దాన్ని పలకరించి…

పట్టుకు వ్రేలాడి….బానిసైతే…

అది నిన్ను మైకంలో ముంచి..

మనుషులకు..  మరపుకూ..

నిన్ను  దూరం చేసి…

నీ ఊపిరిని పీల్చేస్తుంది.

జాగ్రత్త!

Please visit this page

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీ ఆత్మీయులకు ‘ శుభకృత్ ‘ ఉగాది శుభాకాంక్షల ప్రకటనలకై మార్చి 25 లోపు సంప్రదించండి… editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com