శ్లో॥ ‘‘సతతం కీర్తయంతోమాం యతం తశ్చధృఢవ్రతాః ।
నమస్యంతశ్చమాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥
అని భగవద్గీతలో చెప్పిన విధంగా ఉపాసించడమే శ్రీకృష్ణ సరస్సులో అవగాహన చేసి తేజో జలపానమొనర్చడం. ఈ అనుభూతిని పొందిన వారికి బాహ్య విషయాల్లో రుచి నశించి బడలిక ఉండదు.
శ్లో॥ నిత్యానంద రసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం
స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృ త్సద్వాసనా విష్కృతమ్
శంభుధ్యాన సరోవరం వ్రజమనో హంసావ తంస స్ధిరం
కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి ?
ఓ మానసరాజహంసమా! శ్రమ పడెదవేల ? శాశ్వత ఆనంద మనెడి జలముతో నిండినదీ, మునుల హృదయ పద్మములకు నిలయమైనదీ, నిర్మలమై, సద్విప్రులనే హంస శ్రేష్ఠములచే సేవింపబడేదీ, సద్వాసనలు వెదజల్లుతూ సత్యమైయున్న శివపాద ధ్యానమనే సరోవరము జేరి హాయిగా విహరించరాదు? బురదకూపము వంటి ఇతరాశ్రయములెందుకు ? అంటారు శివానందలహరిలో.
భగవంతుని పాదాలను ఆశ్రయించాలనే దృఢనిశ్చయం ఉన్నవారు, సతతమ్ ఎల్లప్పుడూ భగవంతుని కీర్తిస్తూనే ఉంటారు. సతతమ్ అని చెప్పడం వల్ల ఏదో ఒక సమయంలో కీర్తించడం కాదు. నిరంతరమూ కీర్తించాలి. భగవత్ప్రాప్తికై సదా యత్నశీలురై యుండాలి. ప్రయత్నశీలురకు మాత్రమే ఆ దైవపదము లభ్యమవుతుందికానీ, తదితరులకు కాదు. ప్రయత్నం లేక ప్రాపంచిక విషయాలే సిద్ధించవే! ఇక దైవ వస్తువు సిద్ధిస్తుందా! దృఢవ్రతంలో పట్టుదలతో పారమార్ధిక సాధన చెయ్యాలి. ఈ విధంగా నిరంతర దైవస్మరణ, దృఢ వ్రతము, భక్తితో కూడిన ధ్యానమూ, భగవత్సాక్షాత్కార ఆనందాన్ని పొందడానికి మార్గాలని గీతాచార్యుని సందేశము. రామకృష్ణ గోవిందేతి ` నామ సంప్రయోగే
కామమిహస్నాతవ్యం ` సర్వోత్తమ ప్రయాగే
దిగ్దేశకాలానపేక్ష ` సిద్ధసర్వసులభూ
సద్గురుకృపాసముద్ర ` సంగహేతులాభే
రామనామగంగయా ` మిళిత కృష్ణనామ
యామునే గోవిందా ` నామ సరస్వతిప్రదితే ॥
సర్వపాపౌఘ తిమిర ` చండసూర్యమండలే
సాధునారాయణ తీర్ధ ` తీర్ధరాజ వినుతే ॥
భగవంతుని దివ్య నామ త్రయమైన రామకృష్ణ గోవిందనామోచ్ఛారణమే సర్వోత్తమమైన ప్రయాగ. ఇందు స్నానంచేసిన వారికి అంటే ఈ నామాలను జపించే వారికి ఇష్టఫలాలు లభిస్తాయి. అందుకు దిగ్దేశ కలాపేక్షలేదు. అంటే ఈ కాలంలోనే జపించాలని కానీ, ఈ దిక్కున ఈ ప్రదేశంలోనే అనే నియమాలేవీ అక్కరలేదు.
రామనామమనే గంగ, కృష్ణ నామమనే యమున, గోవింద నామమనే సరస్వతీ, నదులతో కూడి త్రివేణీ సంగమమై యున్నది. ఈ నదీత్రయములో యోగీశ్వరుల మనసులనే రాజహంసలు విహరిస్తాయి. బ్రహ్మ విష్ణు రుద్రాది నామములు ఇందులో అలలు, అంటే సమస్త నామములూ సర్వస్వరూపుడైన భగవంతుని యందే అన్వయింపబడుతున్నాయన్న మాట. ఏ నామంతో పిలిచినా ఆ నామం ఆ సర్వేశ్వరునిదే అవుతుంది. ఈ ప్రయాగ కామక్రోధాదులనే సంతాపాలను హరించి హృదయాన్ని చల్లబరచేది. నామత్రయ స్మరణమే మానసిక స్నానం. వాచిక స్నానం, కీర్తనం, నర్తనం చేయడం కాయిక స్నానం. ఈ విధంగా త్రికరణశుద్ధితో భగవంతుని అంతరంగంలోనే ధ్యానించడమే ఉత్తమమైన అంతశ్శుద్ధికి కారణమై పునీతుని చేయగలదు.
యోగమార్గాన కూడా ఈ విధమైన త్రివేణి సంగమం సూచించబడిరది. అది ఇలా
ఇడా భాగీరధీ గంగా పింగళా యమునా నదీ
తయోర్మధ్యగతర్నాడీ సుషుమ్నాచ సరస్వతీ
ఏవం జ్ఞానః హ్రదేతీర్ధే రాగద్వేషమలాపహే
యస్నాతి మానసే తీర్ధే ` సయాతి పరమాంగతీం
అది మనలోని ఇడా నాడి గంగయనీ, పింగళానాడి యమునా నది యనీ, రెంటికీ మధ్య నున్న సుషుమ్నా నాడి అంతర్వాహిని యైన సరస్వతీ నదియనీ చెప్పబడిరది. యోగానుష్టానంతో భగవంతుని పొందడం ఈ ప్రయాగలో మునక విడటం అవుతుంది. ఈ స్నానం అవగాహం మొదట సాధకునిలోని రాగద్వేషాలనే మురికిని పోగొడుతుంది. ఆ పై భగవదవగాహన అనే జ్ఞానాన్ని కల్గిస్తుంది. ఈ విధంగా భగవదనుభవంలో మునిగే ఉండే వారికి జీవితమంతా ఆనందమయమే.
సరసిజనయనే సశంఖచక్రే
మురబిధిమా విరమస్వచిత్తరంతుం
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతే నతుల్యం।
ప్రపంచంలో సుఖాలు ఎన్ని అనుభవించినా ఉన్న దాన్ని వదిలి మరో సుఖానికై పరుగులిడుతుంది మనసు. తృప్తి అన్నదే వుండదు. నిరంతర సుఖాన్వేషణలో విశ్రాంతే కనబడదు. కానీ ఏ కాలమందైనా, హరిచరణస్మరణం అనే అమృతం లాంటింది మరెక్కడైనా చూశామా ? లేదు లేదు! ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. ఇంతకాలం ఏ సుఖాన్నైనా కొంతకాలం అనుభవించగానే, ఆ సుఖంపై అనురక్తి తగ్గిపోయి ఇక చాలు అనిపించి మరో సుఖానికై వెంటపడేది మనసు. అందుకే మనసుకు స్ధిరం లేదని సదాశివ బ్రహ్మేంద్రులు మరీ మరీ చెప్పడం!
స్ధిరతానహినహిరే మానస స్ధిరతా నహినహిరే ॥
పరమహంస యోగ విరుద్ధానాం
పటు చంచలతర సుఖ చిత్తానాం ॥స్ధిరతా॥
అంటారు సదాశివ బ్రహ్మేంద్రులు.
కృష్ణానుభవంలో మునిగి సేదదీరి ఆనందంలో తన్మయమందే అదృష్టాన్ని అందించిందీ మనసు!! ఎంత చక్కని అనుభవం అనుకుంటూ మళ్ళీ మనసు యొక్క పోకడ తెలిసిన వారు కనుక ఎక్కడ ఆ అనుభవం నుండి, ఆ ఆనందం నుండి పక్కదారి పట్టేస్తుందోనని` ఓ మనసా! చూశావా? హరిచరణ స్మరణ సుఖం ఎంత బాగుందో! ఇంతకాలం ఎన్నిరకాల సుఖాల్ని రుచిచూడలేదు ? నిజం చెప్పు? ఇంత ఆనందం ఎప్పుడైనా అనుభవించామా ? అంటూ కులశేఖరులు తన మనసుతో సంభాషణకు దిగారు.
ఓ మనసా ఇలాగే కలకాలం ఆనందామృతాన్ని ఆస్వాదిస్తూనే ఉండు సుమీ! మానకుమా! మానసమా! మా నాధుని యందు రక్తి గ్రోలుమా హరిచరణ స్మరణామృతం!
పిబరే రామరసం రసనే పిబరే రామరసం !! (సదాశివబ్రహ్మేంద) అంటూ మనసుకి నచ్చజెప్పి ఓ సాధకులారా! ఈ అమృతం లాంటిది వేరే లేదు. రాక్షసులు దేవతలు మధించచగా వచ్చిన అమృతం లాంటింది కాదిది! అది అచేతన మయింది కానీ, సాక్షాదాత్మస్వరూపుడైన పరమాత్మతోడి నిత్య సంబంధం కల్గించేది ఈ అమృతం. ఇంతటి ఆనందం వేరే దేని వలనా దొరకదు మీకు. విడవకుండా అనుభవించండి. అంటూ తాను పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆకాంక్షిస్తున్నారు మహారాజు. ఆ ఆనందం ఎప్పుడూ దూరం కాకూడదని కోరుకుంటున్నారు కూడా. ఈనాడు ఈ అమృతం ఎంత తాగినా తృప్తి కల్గటం లేదుకదూ ? అంటూ, కులశేఖరులు హరిచరణ స్మరణామృత పానమత్త చిత్తాన్ని ఆనందంతో ప్రశ్నిస్తున్నారు. ‘స్వచిత్త’ నా మనస్సా! అంటున్నారు మురిపెంగా! కాపాడే స్వామి భక్తిని అందుకుందని,
ఇంతకాలానికి మనసు సరియైన దారి ఎంచుకుందని, ఇంతకాలం ఈ మనసు యొక్క పోకడలకు వేగలేక ఎలా దీనితో సంబంధం వదులుకోవడమా! అని వేదనపడ్డారు. కానీ ఈ రోజు హరిచరణామృత పానమత్తతతో స్రుక్కిన మనసును ఎందుకైనా మంచిది మరోసారి ఏకారణం కూడా చేతా హరిచరణ స్మరణం మానకు సుమా అంటూ బ్రతిమాలుకుంటున్నారు, ఎక్కడ తిరిగి మనసు పాత వాసనల వెంట పడిపోతుందోనని భావములోన, బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవొ మనసా’’. అంటూ అన్నమయ్య కూడా తన మనసుకు చెబుతారు బుజ్జగిస్తూ ఇలాగే!
ఇంతకు మునుపు ప్రతి అనుభవాన్ని మాను, మాను ఈ ప్రాపంచిక అనుభవాల్ని వదిలేయ్! భగవంతుని వైపు మరలు మరలు అంటూ తనను ఆ అనుభవాల నుండి దూరం కమ్మని కోరేవారు కులశేఖరులు.
అందుకే కొంటె మనసు ఏం ? దీన్ని కూడా మాననా ? అంటూ బెదిరిస్తోంది. వద్దు వద్దు మానకుమా మానసమా అంటూ బ్రతిమాలుకుంటున్నారు ‘‘స్వచిత్తమావిరమ’’ అంటూ! ఈ అమృతం జగత్కారణుడైన పుండరీక్షాక్షునిదే! శంఖచక్రధారియే మా ఈ అమృతం! తనను చేరకుండా మమ్ముల నడ్డగించే విరోధులను నాశనం చేసి తనతో మనకు నిత్య సంబంధం కల్గించేది ఈ అమృతం. ఇంతకంటే సుఖతరమైనది మరొక్కటి లేదు గాక లేదు!
మనసు భగవంతుని భావనలో కలిగిన దర్శనంతో పరవశం పొందుతున్నా, మనసు విషయంలో అనుక్షణం అనుమానమే మహారాజుకి. అనుకున్నంతా అయింది. చంచలంహి మనఃకృష్ణా! అన్నాడు అర్జునుడందుకే! పరవశంగా దర్శనానందాన్ని పొందుతూన్న మనసు ఆ భక్తిపారవశ్యంలో ఉండిపోవచ్చు కదా? అబ్బే! అంతట్లోనే ఓ సందేహం. సందేహాల పుట్ట మనసు! తన సందేహాన్ని ఇలా వినిపించిందీ మనసు.
శ్లో॥ మాభీర్మందమనో విచింత్యబహుధా యామీశ్చిరంయాతనాః
నామీనః ప్రభవంతి పాపరిపః స్వామీ నను శ్రీధరః
ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం నక్షమః॥
యముడు తన కింకరులతో ఇలా అంటున్నాడు. ‘‘పతిత పావనా! పరమ దయానిధీ! శ్రీహరీ!’’ అంటూ సదా ఆ స్వామి యెడ దృఢమైన భక్తితో భజన చేసే వారి పాదధూళి నా శిరసున దాలుస్తాను. కనక మీరు అటువంటి వారి జోలికి వెళ్ళకండి సుమీ! అంటూ తన కింకరులను ఆజ్ఞాపించాడట!! తెలుసా ? అయినా హరిచరణామృత పానం చేసిన మనసును మెచ్చుకుంటూనే ఆ అలవాటును మానకుమని హితవు చెప్పి, మనసుతోనే ఇంకా సంభాషణ కొనసాగిస్తున్నారు. హరిచరణస్మరణామృతం మానవద్దని బోధించారు కదా! అయినా మనసు అంటుందీ! గతంలో చేసిన పాపములున్నవి కదా! వానికై యమయాతనలు తప్పకపోవచ్చు కదా! అంటూ యమయాతనలను తలచి భయాన్ని ప్రకటిస్తే, ఓహో! అదానీ సందేహం? ఓ వెర్రి మనసా. నారాయణుని నమ్మిన వారిని యముడేమి చెయ్యలేదడు.
పరమ దయానిధే పతిత పావననామ, హరేయటంచు
స్ధిరమతులై సదా భజనసేయు మహాత్ముల పాదధూళిన్
శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరధీ కరుణాపయోనిధీ
అయినా మనము ఆ శ్రీధరుని చెందిన వారమైనప్పుడు పాపములు భయపడి పారిపోవా! అంటూంటే, అతడు మనలనెందుకు రక్షిస్తాడు? బెదురుగా చూసింది మనసు. తప్పులు చేసిన వారిని క్షమిస్తాడా ? క్షిపామి అంటాడు కదా ?’’ అంటే భయపడకు మనసా. శ్రీధరుడు, మన తండ్రి కదా! తండ్రి మన తప్పులను సైరించేలా తల్లి నచ్చచెబుతుందిలే! మనవైపు తన చల్లని చూపులను ప్రసరించి, మనలను స్వామిని పొందేలా చేస్తుంది. స్వామిని సేవించేవారంటే తల్లికి ఎంత మక్కువో! అందుకే ఆలస్యం చేయక ప్రేమకు కరిగిపోయే నారాయణుని ఒక్కసారి మనసులో తలచుకో. ఎలుగెత్తి పిలవను కూడా అవసరం లేదు. అందరిలోనూ తానే ఉండే స్వామి ఒక్కసారి తలిస్తే చాలు వెంటనే వచ్చి పాపముల బాధ మనకులేకుండా చేస్తాడు. లోకంలో అందరి ఆపదలూ తీర్చే ఆ స్వామి, తన భక్తుల ఆపదలు మాత్రం తొలగించలేడా? అంటూ మనసును బుజ్జగించి, ధైర్యం చెప్పి, భక్తిమార్గ పయనాన్ని కొనసాగించమంటున్నారు. పైగా …
శ్లో॥ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥
అని భగవానుడే ఎవరైతే అన్యచింతలుమాని, నన్ను ఉపాసిస్తారో వారి యోగక్షేమాలను తాను వహించగలనని ప్రతిజ్ఞ చేశాడు కదా! అందుకే సందేహం వద్దు. శ్రీనాధుని కీర్తన మానకుమని మరీ మరీ ఉద్భోధిస్తున్నారు. పసివాడైనా నమ్మి ఆశ్రయించిన మార్కండేయుని ఆయుష్మంతుని చేయలేదూ ? ఆనాడు ఈశ్వరుడు! కేవలం నమ్మకంతో అన్యచింతలు మాని శివుని పాదాలను వదలక ‘‘చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమః’’ అని మార్కండేయునీ, అలాగే తనను నమ్మిన ధృవునీ, ప్రహ్లాదునీ, ఎంత దయతో రక్షించాడుగా స్వామీ? అంటూ ఉదాహరణలు చూపి ఇక సందేహించకు మనసా హాయిగా నారాయణ స్మరణతో జీవితం గడిపేద్దాం! అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ! అవును. నిజం భక్తిని విడిచి పెట్టొద్దు మనసా! అంటున్నారు మహారాజు.
తరువాయి వచ్చే సంచికలో……
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾