శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారి గురించి వివరాల లోనికి వెళ్ళడానికి ముందు కొంత ఉపోద్ఘాతం ~
నేను 1957-58 సంవత్సరంలో హిందూ కళాశాల, గుంటూరులో తొలి బ్యాచ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ విద్యార్థి ని.. నేను అప్పట్లో గుంటూరు కు 8 మైళ్ళ దూరం లో పొన్నూరు ( నిడుబ్రోలు ) రోడ్డు మార్గం లో ఉన్న చేబ్రోలు గ్రామం నుండి బస్ లో రోజూ ఉదయం అరగంట ప్రయాణం చేసి ( టికెట్ ఐదు అణాల ముక్కాని —రానూ పోనూ అయితే పదకొండు అణాలన్నర ) గుంటూరు, పాత బస్ స్టాండ్ కి చేరి, అక్కడ నుండి జిన్నాటవర్, కూరగాయల మార్కెట్, గాంధీ పార్క్ మీదుగా అరగంట కాలినడక న కాలేజీ కి చేరుకునే వాడిని. మా నాన్నగారు వెంకటరత్నం గారు అప్పట్లో చేబ్రోలు లో సూర్యదేవర నరసయ్య హైస్కూలు లో లెక్కల మాస్టారు గా పనిచేసేవారు.
హిందూ కళాశాల లో మాకు తెలుగు విభాగం లో శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, శ్రీ మల్లాది హనుమంత రావు గారు ఉండేవారు. అలాగే ఇంగ్లీషు విభాగం లో శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు గారు ( ఆయన ప్రిన్సిపాల్ కూడా ), శ్రీ ప్రతివాది భయంకర అప్పలాచార్యులు గారు, శ్రీ అమరేంద్ర గారు మాకు గురువులు. అమరేంద్ర గారు, కృష్ణమాచార్య గారు తెలుగు భాష లో మాకు అంతకు ముందే బీజం వేసి ఆసక్తిని కల్పించిన చేబ్రోలు పాఠశాల తెలుగు మాష్టారు శ్రీ కోదండరామాచార్య గారి కృషి కి అనుబంధం గా మాకు మరింత ప్రోత్సాహాన్ని అందించారు. అప్పట్లో గుంటూరు లోనే మరొక ప్రముఖ విద్యా సంస్థ ఏ. సి. కాలేజి లో తెలుగు విభాగం లో కరుణశ్రీ గా వ్యవహరింపబడే శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఉండేవారు. కరుణశ్రీ గారికి ఆ నాటికే ఎంతో పేరు ప్రతిష్టలు ఉండేవి. నాకున్న తెలుగు భాష అభిమానము కారణంగా కరుణశ్రీ గారిని కలవాలని, వారి ఆశీస్సులను పొందాలని కోరిక, తపన ఉండేవి.. కానీ ఈ విషయం లో నా ప్రయత్నలోపం కారణంగా ఆ కోరిక కోరిక గానే మిగిలిపోయింది..
కాలచక్ర భ్రమణం లో కొన్ని ఇలాంటి పరిణామాలు తప్పదు. అయితే మరి కొన్ని దశాబ్దాల అనంతరం నాలో మిగిలిపోయి ఉన్న పై కోరిక మరల విజృంభించి రూపాంతరం చెందింది. ఫలితం గా జరిగిన ఒక సంఘటన ను గురించి అప్రస్తుతం కాదని భావించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ప్రతీ ఏడాది నేను గుంటూరు లో మా హిందూ కళాశాల వారు నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు అవుతూ ఉండడం పరిపాటి. నేను ఉండేది విజయవాడ లోనే అవడంతో గుంటూరు ప్రయాణం లో ఏమీ శ్రమ ఉండేది కాదు. అలా ఒక ఏడాది జరిగిన సమావేశం లో గౌరవ ఆహ్వానితులలో ఒకరు గా శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు రావడం తటస్తించింది. ఆయన కరుణశ్రీ గారికి జ్యేష్ఠ పుత్రుడు. బహుశ: ఆ కారణంగా కాబోలు సాహిత్యపరం గా తండ్రి గారి నుండి కొన్ని వారసత్వపు లక్షణాలను ఆయన పుణికి పుచ్చుకున్నారు. ఆ సమావేశ అనంతరం నేను ఆయనను వేదిక పైన కలిసి నన్ను పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ ముఖాముఖి పరిచయం జరిగిన ముహూర్తబలమో, మరేమిటో తెలియదు గాని మేము ఇద్దరం దగ్గర అయ్యాము. మా ఇద్దరి మనసులూ కలిసాయి మా ఆలోచనలూ, అభిరుచులతో బాటుగా!
తరువాత మరి కొంతకాలానికి ఆయన వాళ్ళ పిల్లల దగ్గరకూ, నేను మా పిల్లల దగ్గరకు అమెరికాకు రావడంతో — మేము ఉభయులమూ ఉండేది వేరు వేరు రాష్ట్రాలే అయినా తరచుగా ఫోన్ లో ఇష్టాగోష్టి గా మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. కాలక్రమేణా ఆ బంధం ఎంత దృఢతరం అయిందంటే — నేను తనని తమ్ముడూ అని, ఆయన నన్ను అన్నగారు అని ఆప్యాయం గా పిలుచుకోవడం వరకూ అన్నమాట ! అలాగే ఫేస్ బుక్ లో సాహిత్యపరమైన పోస్ట్ లు మాకు ఉభయతారకాలు అయ్యాయి. తెలుగు సాహిత్యం లో ప్రత్యేకించి పద్య రచన కి సంబంధించి – అవధాన ప్రక్రియ లో వలె పద్య పూరణలో శ్రీ బాపూజీ గారు నిస్సందేహంగా సిద్ధ హస్తులని చెప్పవచ్చును. ఆ వెనుక ఈ నిరంతర సాహితీయానం లో ఆయనకు తండ్రి గారి ఆశీస్సులు, సరస్వతీ కటాక్షం కరదీపికలు.
మరి ఇంతా చెప్పి, ఆయన బయో డేటా లో విషయాలను కొన్నిటినైనా ఇక్కడ చెప్పకపోవడం ఏ మాత్రం సమంజసం అనిపించుకోదు.
బాపూజీ గారు మే 5, 1948 లో అమరావతి ( గుంటూరు జిల్లా ) లో అనసూయాదేవి, పాపయ్య శాస్త్రి దంపతులకు జన్మించారు. విద్య పరం గా తెలుగులో శ్రీనాధుని సాహిత్య ప్రస్తానం అన్న అంశం పైన ఆచార్య శ్రీ యస్వీ జోగారావు గారి పర్యవేక్షణ లో పరిశోధనా వ్యాసం సమర్పించి డాక్టరేటు ని పొందారు. హిందూ కళాశాల, గుంటూరు లో 34 సంవత్సరాల బాటు లెక్చరర్ గా, హెడ్ గా, రీడర్ గా, వైస్ ప్రిన్సిపాల్ గా, మేజర్ రేంక్ తో NCC officer గా వివిధ హోదాలలో పనిచేసారు.
బాపుజీ గారు సాహితీ వ్యవసాయరంగం లో నిత్య కృషీవలుడు. ఆ పరం గా సాధన సలిపి ఆయన మనకు అందించిన పంటలు :
రచనలు:
నృత్యాంజలి, రామదాస విజయం, శివశంకరి, భారతీయ నృత్యామృతం, మహానదీమణిహారం మొదలైన ముప్ఫై నృత్య రూపకాలు,
“ మానిక్ బందోపాధ్యాయ ” సుప్రసిద్ధ బెంగాలీ రచయిత చరిత్ర – కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ
” విశ్వతారావళి “- విశ్వయోగి విశ్వంజీ గురించి 27 గేయాలు
” దైవం మానుష రూపేణా ” ( ఆంధ్రానువాదం )
” ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర అరుణార్ద్రకాంతులు “, ” ప్రజాహృదయాస్థాన కవి – కరుణశ్రీ ”
” సుమాంజలి ” – నూరు కవితల సంపుటి, ” కదంబమాలిక ” ( 1300 సమస్యా పూరణలు )
సాహిత్య వ్యాసాలు :
నూరు ( పత్రికలూ, విజ్ఞాన సర్వస్వాలు )
విశేషాంశాలు :
” చంద్రోదయం “- కవిత కు స్వర్ణపతకం
ఆంధ్రప్రదేశ్ అధ్యాపక పురస్కారం ( ఆం. ప్ర. ప్ర.)
డా. దాసరి సాంస్కృతిక సంస్థ పురస్కారం
డా. ప్రసాదరాయ కులపతి పురస్కారం /
డా. పళ్లేపూర్ణ ప్రజ్ఞాచార్య పురస్కారం
కరుణశ్రీ గారి రచనలు 6 సంపుటులకు సంపాదకత్వం
తానా- నేట్స్ – టెన్ టెక్స్ – సిలికానాంధ్ర సంస్థల సత్కారం
శతాధిక ” భువనవిజయ ” సభలలో మల్లన కవిగా ” ఇంద్ర సభ ” లో కరుణశ్రీ గా పాల్గొనడం
ఆడియో కేసెట్స్ :
సిద్దార్ధగౌతమ
పద్మావతీ వేంకటేశం
కట్టలమ్మ వైభవం, సాయిసుధ
ప్రస్తుతం అచ్చు లో శ్రీనాధ కవి సార్వభౌముడు ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ )
భరత ధీర శతకం ( వీరరస ప్రధానమైన శతకం )
ఇక ముగింపు కు ముందు ఇటీవల బాపూజీ నాకు ముత్యాల వంటి తన దస్తూరీ లో వ్రాసి పంపిన లేఖ – అదే తోక లేని ( మనసు నిండిన ) పిట్ట, మీ ముందు సమర్పణ చేస్తున్నాను..ఇవి ఆయన నోటి మాటలు కావు. మనసు పంచిన మధురమైన తేనె పలుకులు.. మరి మీరూ రుచి చూడండి.. ఇంకెందుకు ఆలస్యం ?!
<><><>*** నమస్కారములు- ధన్యవాదములు ***<><><>
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾