అమెరికాలో తెలుగు కథా సాహిత్యం పుట్టుక, పురోగతి, భవిష్యత్తు
అమెరికా తెలుగు కథకులు ఇంకా స్పృశించని అనేక అంశాలు ఉన్నాయని, వాటి మీద అక్కడి రచయితలు దృష్టి పెట్టాలని ప్రముఖ రచయిత, “అమెరికా హాస్యబ్రహ్మ” వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయపడ్డారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి శనివారం సాయంత్రం (ఏప్రిల్ 9, 2022) యూట్యూబ్ ద్వారా ప్రసారం చేసిన “నెల నెలా వెన్నెల”లో ఆయన “అమెరికాలో తెలుగు కథా సాహిత్యం పుట్టుక, పురోగతి, భవిష్యత్తు” అన్న అంశంపై ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆయనలోని సాహితీ పిపాసనే కాక, ఆయన నిశిత దృష్టికి, ఎల్లెడలా తెలుగు కథ వెల్లివిరియాలన్న సదాకాంక్షకి అద్దం పట్టింది.
ముందుగా, కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రముఖ రచయిత్రి కల్పన రెంటాల వక్తను పరిచయం చేస్తూ… చిట్టెన్ రాజు సాహితీవేత్త, సాహితీ పిపాసి అనే అందరికీ తెలుసని, ఆయన కొన్ని సేవా సంస్థలకి కోట్ల రూపాయలు సమీకరించి ఇచ్చిన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కూడానని వెల్లడించారు.
అమెరికా తెలుగు కథకి 60 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. 1964, ఏప్రిల్ 24న ఆంధ్రపత్రికలో ప్రచురితమైన “వాహిని” అనే కథ ఉత్తర అమెరికా నుండి ఒక పత్రికలో ప్రచురింపబడిన తెలుగు కథ అని వెల్లడించారు. ఆర్వీయస్ కలం పేరుతో ఆ కథ రాసిన వ్యక్తి అప్పట్లో ఒట్టావా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉండిన పులిగండ్ల మల్లికార్జునరావు అని తెలిపారు. తదనంతర కాలంలో అమెరికా తెలుగు కథ ఒక ప్రత్యేకతని సంతరించుకోవడానికి గల కారణాలను వివరించారు. మేధావులు, సాంస్కృతిక అవగాహన ఉన్నవాళ్ళు అక్కడికి వలస వెళ్ళడం, తమపాటు సాంస్కృతిక, సాహితీ వారసత్వాన్ని తీసుకువెళ్ళడం ఒక ముఖ్య కారణం అన్నారు. 125 ఏళ్ళ క్రితం తెలుగు కథ మొదలైతే, ఆ వికాస క్రమంలో సగం కాలం అమెరికా కథ కూడా ప్రయాణించడం చిన్న విషయం కాదన్నారు. రాయడంలో అక్కడ ఉన్న స్వేచ్ఛ, అక్కడి సామాజిక అమరిక తెలుగు కథకి విస్తారమైన కాన్వాస్ ను కల్పించాయని తను అనుభవంతో తెలుసుకున్న విషయాన్ని వక్త ప్రేక్షకులతో పంచుకున్నారు.
గౌతంశెట్టి వీరభద్రరావు “గోడ గడియారం”, మాచిరాజు సావిత్రి “మోసం”, సి. ఎస్. సి. మురళి “మనిషి” ఆ తరువాత ఇక్కడి పత్రికలలో అచ్చయ్యాయని చెప్పారు. 1965 తరువాత తెలుగు సంఘాలు ఏర్పడ్డాయని, అవి లిఖిత పత్రికలను మొదలుపెట్టాయని అన్నారు. పత్రికల ప్రారంభంతో సాహిత్య సృజనకి తగిన వాతావరణం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మొదట భారతదేశంలో ఉండగా రాసుకున్న కథలను రచయితలు అక్కడ ప్రచురింపజేసుకున్నారని, క్రమంగా శాస్త్ర విజ్ఞాన కథలను వెలయించాలనుకున్న మొట్టమొదటి వ్రాత పత్రికని ప్రారంభించిన పెమ్మరాజు వేణుగోపాలరావు తదితరుల ఉద్దేశ్యం నెరవేరసాగిందని అన్నారు. తెలుగు కథ మొదలయ్యాక మొదటి 15 సంవత్సరాలలో రాసిన రచయితలు, రచయిత్రులు ఇప్పటికీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం ముదావహమన్నారు. తరువాత 1990 వరకు కథ నిలదొక్కుకున్న కాలమని, 1977లో తానా ఏర్పడడం ఆ సంస్థ మొదలుపెట్టిన పత్రికతోపాటు అనేక పత్రికలు దీనికి దోహదం చేశాయని చిట్టెన్ రాజు వెల్లడించారు. ఇక్కడి పత్రికలలో అక్కడివారి కథలు వచ్చినప్పుడు, “అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళ కథలు వేశారు” అన్న చులకన భావం భారతదేశవాసుల్లో ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అదే సమయంలో, తెలుగు కథకున్న ఒక కొత్త కోణం బయటపడిందని ప్రముఖ పత్రికా సంపాదకుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారని వక్త గుర్తు చేశారు. తను, వేలూరి వేమూరి వంటి రచయితలు తప్ప 1990 వరకు ఎక్కువమంది తమ వెనకటి జ్ఞాపకాలు, అసంతృప్తుల గురించి రాసినవారేనన్నారు. ఆ “నోస్టాల్జియా తరం”లోనే హాస్యానికి పెద్దపీట వేసింది తనేనని, సైన్స్ ఫిక్షన్ కి పెద్దపీట వేసింది వేమూరి వెంకటేశ్వరరావు అని చెప్పారు. సత్యం మందపాటి నిబద్ధతతో అత్యధిక కథలు రాశారని, అనువాదాల ద్వారా అత్యున్నత స్థాయి రచనలు చేస్తున్నది నిడదవోలు మాలతి అని, విమర్శ, విశ్లేషణల మీద ఎంతో కృషి చేస్తున్నది వేలూరి వెంకటేశ్వరరావు అని అమెరికా సాహితీమూర్తుల కృషి గురించి ప్రస్తావించారు.
1975 నుంచి 95 వరకు వెలువడిన మంచి కథలు ఇవి… అంటూ కొన్ని కథలని ప్రస్తావించారు. వంగూరి ఫౌండేషన్ (1994), అజో విభో కందాళ, విశ్వనాథ సత్యనారాయణ కుమారుడు అచ్యుతరాయలు, మురళి ప్రారంభించిన “జల్సా”, చికాగోలో శొంఠి శారదాపూర్ణ, ఆమె భర్త శ్రీరాం స్థాపించిన “సప్నా” సంస్థలు తెలుగు సాహిత్యానికి పరిపుష్టి కలగడానికి ఇతోధికంగా సేవ చేశాయని చిట్టెన్ రాజు గుర్తు చేశారు. “ఆటా” వంటి సంస్థల ఏర్పాటు వల్ల సావనీర్ల సంఖ్య పెరిగి రచయితలకు అవకాశాలు కల్పించాయని చెప్పారు. మొదటి అంతర్జాల పత్రిక “ఈమాట”, తరువాత వచ్చిన “కౌముది”, అఫ్సర్, కల్పన రెంటాలల “సారంగ్”, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాలల “మధురవాణి”, “సృజన రంజని”, “వాకిలి” తదితర పత్రికల కృషిని కూడా కొనియాడారు. భారతదేశ కేంద్ర సాహిత్య అకాడమి అమెరికా తెలుగు కథని గుర్తించి త్వరలో ఒక పుస్తకాన్ని విడుదల చేయనుందని చెప్తూ, ఇది హర్షణీయమని పేర్కొన్నారు. ఆ పుస్తకానికి తను, ఆచార్య సి. మృణాళిని సంపాదకత్వం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఇంకా స్పృశించని అంశాలెన్నో…..
అమెరికా కథకులు ఇంకా స్పృశించని అంశాలు చాలానే ఉన్నాయని, లోతైన అంశాలతో కథలు రావాలని చిట్టెన్ రాజు అభిప్రాయపడ్డారు. వర్క్ ప్లేస్ కథలు, వీసా గ్రీన్ కార్డులు రాక యువత పడుతున్న ఇబ్బందుల మీద, గృహహింస మీద, తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా చేరుకున్న మితిమీరిన కుల రాజకీయాల గురించి తప్పకుండా కథలు రావాలన్నారు. కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన “హౌస్ సర్జన్” నేటికీ ఆదరణ పొందుతున్నది అది వర్క్ ప్లేస్ కథ కావడం వల్లేనని అన్నారు. హాస్యం, ఆహ్లాదకరమైన ఇతివృత్తాల మీద ఇంకా కథలు రావాలని ఆకాంక్షించారు. అక్కడి భావ స్వేచ్ఛ, ప్రస్తుతం ప్రపంచమంతటా అందివచ్చిన ఆధునిక సాంకేతికతల ఆధారంగా ఎన్నో మంచి కథలు రావాలని, అమెరికా తెలుగు కథకే కాక ప్రపంచంలోనే తెలుగు కథకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు.
హాంకాంగ్ తెలుగు వారు ఘనంగా అంతర్జాలంలో ఉగాది వేడుకలు
కోవిడ నిబందనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకలను నిర్వహించలేక పోయారు. ఈ సంవత్సరం జూమ్ ద్వారా వైభవంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుకలను అంతర్జాల మాధ్యమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి గారు ప్రారంభించగా, శ్రీమతి శాంతి మోగంటి గారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి శ్రీ రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ శ్రీ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ శ్రీ గరదాస్ జ్ఞానేశ్వర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులతో నిర్వహించారు.
తెలుగు ఎన్. ఆర్. ఐ idol ద్వితీయ విజేత గాయని హర్షిణీ పచ్చoటి తన అద్భుతమైన గాత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఎందరో చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, కూచిపూడి నృత్యం, సుమతీ శతకాలు, శాస్త్రీయ వాయిద్యం మరియు భజన కార్యక్రమాలు ఉగాది వేడుకలలో తెలుగు సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టాయి.
అధ్యక్ష ప్రసంగంలో వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య పురోగతి గురించి మాట్లాడారు. మహమ్మారి కారణంగా ఎందరో భాదితులకు తమ సమాఖ్య మాతృభూమిలో సహాయం అందచేసిందని వివరిస్తూ స్థానిక వలస కార్మికులకు సేవలు అందజేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందజేసేనట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక అంతర్జాతీయ తెలుగు సాహిత్య – సాంస్కృతిక సమావేశాలలో తమ సభ్యులు ఔత్సాహికంగా పాల్గొన్నారని చెప్పడానికి తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
విశిష్టమైన సామాజిక సేవలు చేసిన వారిని గుర్తించడం ప్రతి యేటా ఉగాది వేడుకలలో ఉగాది పురస్కారాలతో ఒక ఆనవాయతిగా జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా, కోవిడ మహమ్మారి సమయాలలో సామాజిక -మానవీయ ధృకపదంతో సేవలు అనజేస్తున్న స్థానిక భారతీయులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా HELP GROUP సోషల్ మీడియా గ్రూప్స్ యజమానులు శ్రీ రాఘవేంద్రన్, శ్రీమతి నందిని, మరియు అడమిన్స్ శ్రీమతి సోనల్ శా మరియు శ్రీమతి దీప్తి రామచంద్రన్ హాజరయ్యారు. వీరు హాంకాంగ్ లో కోవిడ్ 19 సమయంలో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు అందించిన సేవలను కొనియాడి వారిని సత్కరించారు. అలాగే హాంకాంగ్ వాస్తవ్యులైన శ్రీమతి కుంజ్ గాంధీని మరియు శ్రీమతి టెస్స లైసన్స్ ని తమ ఫేస్బుక్ గ్రూప్ “HKQSG” ద్వారా కోవిడ్ సమయంలో అందరికి అందించిన సహాయ సహకారాలను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేండ్రం మాట్లాడుతూ, తాము 2015 నుంచి తమ సేవలు ప్రారంభించినా, ఇప్పటి వరకు తమ సేవలని ఎవరు కూడా ఇటువంటి వేదికల పైన గుర్తించలేదని తెలుగు సమాఖ్యని అభినందించి తమ కృతజ్ఞతలను తెలిపారు.
తదుపరి తెలుగు సమాఖ్య ముఖ్య కార్యవర్గ సభ్యులు ఉగాది వేడుకల కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసి, కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు అభినందనలు తెలిపారు.
కార్యకర్తలందరికీ తమ హర్షధ్వానాలతో జేజేలు తెలుపుతూ, జై తెలుగు తల్లి , జై హింద్ అనే వందనంతో ఉగాది వేడుకలని సుసంపన్నం చేశారు.
ఈ అంశాల పైన మీ అభిప్రాయాన్ని ఈ క్రింద ఉన్న ‘ Leave a reply ‘ లో వ్రాయండి.