11_018 నొప్పుల దిగుమతులు – వ్యక్తుల తిప్పలు

 

సామాన్యంగా మనకు వొళ్ళు నొప్పులు, తలనొప్పులు, పంటినొప్పులు, వంటినొప్పులు వస్తూవుంటాయి. శారీరకంగా వీటికి ఏవో కారణాలు ఉండటం సహజం. వాటినిబట్టి మందులు చాలా తయారుచేస్తున్నారు. మాటిమాటికీ ఈ నొప్పులతో బాధపడేవాళ్ళకు – మందుల పేరుకూడా క్షుణ్ణంగా తెలిసివుంటాయి.

మాటిమాటికీ డాక్టరు దగ్గరికి పరుగెత్తవలసిన అవసరంలేకుండా ఆయామందులు తెచ్చుకొని వేసుకోవడం అలవాటైపోతుంది. కొందరి ఇళ్ళల్లో తల్లో, తండ్రో ఫలానానొప్పి అనగానే పిల్లలు ఎదురుగా వున్న మందులషాపువద్దకు పరుగెత్తి ఆమందుతెచ్చి వారికివ్వడం జరుగుతువుంటుంది. ఇంచుమించు ఇంట్లో వాళ్ళందరూ కాంపౌండర్ హోదాలో సంచరిస్తూవుంటారు.

 

తలనొప్పులకు తమాషా కారణాలు –

తలనొప్పులు వగైరాలు రావడానికి ముఖ్యంగా ఈరోజుల్లో శరీర సంబంధమైన కారణాలు కాకుండా బయిట కారణాలు చాలా తల ఎత్తుతున్నాయి. ఒక్క తలనొప్పి విషయం తీసుకుందాం. ఎన్ని కారణాలో ! పత్రికా సంపాదకునికి వారం వారం అందే వ్యాసం సకాలంలో అందకపోతే ఎంతో తలనొప్పి రావడం తప్పదు. అప్పుడు ఏమందు పనిచేస్తుంది ? ఆవ్యాసం వున్న ఒకపోస్టుకవరు వచ్చి బల్లమీద పడితే తప్ప !……

వ్యాసాలు వ్రాసేవారికి అవి అందినాయని వుత్తరం రాకపోతే ఒక్క తల నోప్పే కాదు – వంటి నొప్పులు కూడా వస్తాయి. తమ వ్యాసంపడ్డ పత్రిక అందకపోతే ఇంచుమించు కీళ్లవాతం వచ్చినంతపని అవుతుంది. అవి అందేదాకా తొట్టిస్నానం చేసేవాడిముఖం పెట్టుకొని కూర్చోవడమే ! దానికి వేరే చికిత్స వుండదు.

ఒకప్పుడు వ్యాసం పంపి అది పత్రికలో వస్తుందని కాలెండరు వంక చూస్తూ కాలం గడుపుతుండగా అది అసలే అందలేదని వుత్తరం వస్తే తలనొప్పితో బాటు నడుం బెణుకునొప్పి వచ్చితీరుతుంది. వీటికి ఏ కంపెనీ తయారు చేసిన మందులు పనిచేస్తాయి. కొంతసేపు అనుభవించి “ అయిందేదో అయింది….. ఏం చేస్తాం ? ” అనేమంత్రం జపించి మరిచిపోవలసిందే !

రచయితలు పంపే వ్యాసాల్లో దస్తూరీ సరిగ్గా లేకపోతే – దాన్ని అచ్చువేయ్యలేక, ఆ అక్షర స్వరూపాలు తెలుసుకోలేక, బయిటకు ఎలావున్నా మనస్సులో బాధపడి వాటిని కంపోజ్ చెయ్యడంలో, దిద్దడంలో – కంటినొప్పులు రాకమానవు.  అవి కొంతసేపటికి మాడునొప్పులుగా మారకపోవు !

అసలు కొందరు వ్యక్తులతో మాటాడుతుంటే తలనొప్పి రాకమానదు – వచ్చిన తర్వాత మాత్రం వదిలించుకొని అవతలకు పోవడం సాధ్యమా ! ఈ వ్యక్తిని ఎందుకు పరిచయం చేసుకొన్నానా ? ఇంతకాలం ఎలా భరించాను ? ఇంకోవూరు పోదామన్నా వీలు లేదు, ఈ సంసారాన్ని ఎత్తుకొని – అని తలనొప్పితో బాధ పడుతూనే తన దుస్థితిని వర్ణించుకోక తప్పదు.

 

పేరువిన్న – తలనాదు తప్పదు –

కొంతకాలానికి ఆ వ్యక్తులు అంత దూరం వుండగానే తలనొప్పి చెప్పకుండా వస్తుంది. కొన్నాళ్లు పోయిన తర్వాత ఆవ్యక్తి పేరు వింటేనే తలనాదు ప్రారంభం అవుతుంది. మరికొన్నాళ్ళకు ఆ పేరు గల వాళ్ళను మరొకళ్లను చూచినప్పుడు కూడా ఆ పేరు బలం వల్ల – కొంతసేపు తలనొప్పి దంచి తర్వాత సర్దుకొంటుంది. దానికి మందేమిటి ?

మొన్న ఒక మిత్రుడు వచ్చాడు. ఏదో వ్రాసుకొందామని కూర్చున్నవాణ్ణి – కలం కాగితం అక్కడపెట్టి – “ దాసాను దాసుండను ” అన్నట్లు కూర్చున్నాను. ఆ అవకాశం తీసుకొని రెండుగంటలు మాట్లాడి – మెదడు ఐమూలగా త్రిప్పి వదిలిపెట్టాడు. దాన్ని సరిచేసుకొని మళ్ళీ కలం ఎక్కడుందో వెతుక్కునేసరికి మూడుపూటలు పట్టింది.

ఆయన విశాఖపట్టణం వెళ్ళి వచ్చాడట. ఆ కథంతా చెప్పాడు. విన్నాను. తర్వాత భీమునిపట్నం మాట ఎత్తాడు. వింటున్నాను. “ అక్కడ స్థలాలు అమ్ముతున్నారు ” అన్నాడు. “ అలాగా ” అన్నాను. “ ఇప్పుడు ఆ వూళ్ళో కొనుక్కుంటే మంచిది ” అన్నాడు. ఏ వూళ్ళో కొనాలన్నా డబ్బులుండాలి. వెళ్ళి ఇల్లుకట్టాలి. ఇంకా డబ్బుంటె దేవాలయం కట్టాలి.  

 

అక్కడ మంచి చేపలు దొరుకుతాయి –

“ ఇంకా ఎక్కువ మొత్తం ఉంటే ఒక విశ్వవిద్యాలయమే కట్టుకోవచ్చు గాని చాలా దగ్గరిలోనే వున్నదాయే ! ఇంకేమైనా చెయ్యొచ్చు. కానీ అసలా వుద్దేశంలేదు. ఉచితంగా వచ్చే గ్రాంటులూ లేవు. నాకెందుకా స్థలాల సంగతి అనుకొన్నాను.

“ అక్కడ హార్బర్ కట్టాలనుకొంటున్నారు ” అన్నారు. “ మంచిదే ! ఆంధ్ర దేశానికి ఎన్నో హార్బరులు అవసరం ” అన్నాను. “ మీకు తెలుసో తెలియదో అక్కడ మంచి చేపలు దొరుకుతాయి సముద్రంలో ” అన్నాడు.

“ సముద్రంలో చేపలు దొరుకుతాయని తెలుసుగాని, అక్కడ ప్రత్యేకంగా మంచివి దొరుకుతాయని తెలియదు ” అన్నాను.

“ చాలా మంచివి దొరుకుతాయి. ఎగుమతి చేస్తారు బాగా ! ” అన్నాడాయన. తల వూపాను మాట్లాడే వొపికలేక….. “ ఇంట్లో కూర్చుంటే సముద్రం కనిపిస్తుంది తెలుసా ? ” అన్నాడు. “ ఎందుకు కనిపించదు. కబోదులైతే తప్ప ? ” అన్నాను విసుగుకొద్దీ. “ స్థలం మాట ఆలోచించు. నేను మళ్ళీ రేపు కనిపిస్తాను ” అని లేచాడు. అసలు ఆలోచనాశక్తి పోయింది రెండు మూడు పూటల వరకూ.

తర్వాత మనస్సు సరిచేసుకొని ఆలోచిస్తే అనిపించింది ఈయనగారు తరుచూ ఇలా రావడం జరిగితే భీమునిపట్నంలో కాపురం మంచిదేమోనని. 

ఆయన చెప్పిన కారణాలవల్ల కాదు. విశాఖపట్నం పిచ్చాసుపత్రి దగ్గరకనుక.

 

                                           ——— ***** ———

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾