చేతికొచ్చిన పుస్తకం-16 :
లేపాక్షి ‘ నవ్వొచ్చే కార్టూన్లు’
ఆ లేపాక్షి ఆలయశిల్పకళకు ఆటపట్టు అనేది నానుడి కాగా, ఈ లేపాక్షి కార్టూన్స్ కు కాణాచి అనేది న్యూనుడి!
మా పూర్వీకుల కదిరి ప్రాంతపు మిత్రుడు ఈ లేపాక్షి. మరి మా సొంతూరు దగ్గరుండే లేపాక్షి ఊరు పేరే వీరి నామకరణం కావడం విశేషమే కాదు, ఆనందం కూడా!
మొన్నటి దాకా ‘సాక్షి’ పత్రికలో కార్టూన్స్ తో అఠకాయించిన లేపాక్షి, హఠాత్తుగా డిసెంబర్ 22న బుక్ ఫేర్ లో మాస్క్ ఉన్న మరో ఇద్దరు కార్టూనిస్టుల సాయంతో రాస్తారోకో చేసి, నవ్వులతో మునిగి తేలండని తన పుస్తకం ‘నవ్వొచ్చే కార్టూన్లు’ రెండు భాగాలు నవ్వకుండా బహుకరించారు! పైపెచ్చు డబ్బులివ్వకపోతేనే పుస్తకాలిస్తా అనే కండీషన్ అదనం. రెండు వారాలు వారి 408 బొమ్మల్లో, కార్టూన్స్ పంచుల్లో మా పారావారం మునిగి, తేలి చివరికి మీరూ కడుపులు పగిలిపోయేలా నవ్వులతో రప్ఫాడాలని ఈ రెండు మాటలు! ఒక్కో భాగం 208 పేజీలు, రూ 120.
అయితే, ఆలస్యం చేయకుండా సంప్రదించండి హార్ట్ స్పెషలిస్ట్ Lepakshi Cartoonist గారిని ఫేస్బుక్ వాలు చూసి!
హోమేజ్ టు మహాత్మా గాంధీ
ప్రతి సందర్భంలో ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది!
శాస్త్రవేత్త సి వి రామన్, వైద్యులు బి సి రాయ్, జర్నలిస్టు ఖాసా సుబ్బారావు, విద్యావేత్త ఎం సి చాగ్లా మొదలైన వారు ఏమి రాశారు, గాంధీజీ గురించి అని ‘హోమేజ్ టు మహాత్మా గాంధీ’ అనే ఇంగ్లీషు నివాళి గ్రంథాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ లో డిసెంబర్ 27న పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్ లో కొన్నాను.
ముప్పై నాలుగు మంది మహామహులు 1948లో వివిధ ఆకాశవాణి కేంద్రాల ద్వారా గాంధీజీ గురించి చేసిన నివాళి ప్రసంగాలను మొత్తం గానీ, వాటిలోని కొంతభాగాన్ని గానీ ఎంపిక చేసి వెలువరించిన 116 పేజీల డిలక్స్ ఎడిషన్ వెల 210 రూపాయలు.
పుస్తకం కొంటున్నపుడు అవి ఆకాశవాణి ప్రసంగాలు కావడం అనేది నాకు అదనపు ఆనందాన్ని కలిగించింది. మళ్లీ వివరంగా చూస్తున్నప్పుడు మరో కొత్త ప్రయోగం ఆకర్షించింది. 1948 తొలి ఎడిషన్ కాగా, ఇది 2017 లో వెలువడిన Restored edition …అనే దాన్లో ‘రిస్టోర్డ్’ అనే మాట!
మిత్రులు ‘రిస్టోర్డ్ ఎడిషన్’ అనే మాటకు వినడానికి సొంపుగా ఉండే అర్థవంతమైన సరళమైన తెలుగు మాటను సూచించవచ్చు!
వడ్డాది పాపయ్యకు వందనం
(శతవసంతాల ప్రత్యేక సంచిక)
బళ్ళారి రాఘవ, ఆంధ్ర కేసరి, ఘంటసాల లాగా అపురూపమైన ఒకే ఒక అజరామరమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య! ఆయన బొమ్మలను ప్రేమించని వారెవరు?
1921 సెప్టెంబర్ 10 న శ్రీకాకుళం లో జన్మించిన ఈ కిన్నెర పురుషుడు చందమామ, యువ పత్రికల్లో వేసిన బొమ్మలు చిరస్మరణీయం! ఆయన కుంచెలో అమృతం చిత్రకళగా ఒలుకుతుంది. 1992 డిసెంబర్ 30న కశింకోటలో కనుమూసినా మన గుండెల్లో సదా చిరంజీవి.
శతజయంతి సంవత్సరం సందర్భంగా సుంకర చలపతిరావు, కళాసాగర్ యల్లపు ద్వయం సంపాదకులుగా చిత్రకళా పరిషత్, విశాఖపట్నం 2021 ఆగస్టు లో 112 పేజీల విలువైన ప్రత్యేక సంచికను వెలువరించింది.
సుమారు 40 పేజీల రంగుల ఫోటోలు నిజంగా కన్నులపండువ! కలకాలం దాచుకో దగ్గ ఈ సంచికలో 28 చిత్రకళా ప్రముఖులు పాపయ్య గురించి రాసిన విలువైన వ్యాసాలున్నాయి!
ఈ సంచికను పూనుకుని, వెలువరించిన చిత్రకళామిత్రుల బృందం సమన్వయం, సాధన, సామర్థ్యాలు శ్లాఘనీయాలు! అభినందనీయం!!
నడిచిన పుస్తకం : చిర్రావూరి సర్వేశ్వర శర్మ
మిత్రులు గణేశ్వరరావు గారి ఏర్పాటుతో వచ్చిన ” నడిచిన పుస్తకం : చిర్రావూరి సర్వేశ్వర శర్మ” బుక్ 2021 ఏప్రిల్ 29 నుంచి ఎదురుగా నిల్చొని తన లోతు కొనుక్కోమంటున్నది. ఇతర చదువు, రాతలతో వాయిదా పడుతోంది!
తిరుపతి స్విమ్స్ మిత్రులు డా అల్లాడి మోహన్ ఓ మెడికో శ్యామ్ కథల సంపుటి నాకు తిరుపతిలో నాలుగయిదేళ్ళ క్రితం బహుకరించారు. అర్థాంతరంగా పెన్నుమూసిన మెడికో శ్యామ్ స్పార్క్ ఉన్న కథకుడు. వారి తండ్రి సర్వేశ్వర శర్మ (1922-2002) గారే ఢిల్లీ శర్మగా ప్రఖ్యాతులైన పుస్తక ప్రేమికులు. వారి గురించే ప్రస్తుత పుస్తకం!
శతజయంతి సంవత్సరం సందర్భంగా విలువైన తెలుగు, ఇంగ్లీషు వ్యాసాలతో, అపురూపమైన ఫోటోలతో, దాచుకున్న రచనలతో 2021 జనవరిలో రెండు వందల పైచిలుకు పుటలతో ఈ పుస్తకం వెలువడింది. వెల: రూ 400. ప్రతులకు 9346821416.
నొప్పించని చమత్కారం పండించే సి యస్ శర్మ గారి చమక్కు మచ్చు కొకటి: సాయంకాలం జన్మించిన కుమారుడికి ‘శ్యామ్’ అనే పేరు పెట్టి, శ్యామ్ లాగే ఉన్న కుమార్తెకు ‘శ్యామ్ లా’ అని పేరు పెట్టడం!
దువ్వూరి రామిరెడ్డి కావ్యవిశ్లేషణ
ఈ శీర్షిక చూడగానే ఉద్గ్రంధమని భావించే అవకాశం ఉంది! తొమ్మిది కావ్యాల గురించి 72 పేజీల పుస్తకంలో చెప్పాల్సిన విషయాలు చెబుతూనే, చక్కని పద్యాలు మనకు రుచి చూపిస్తూ డా కోడూరు ప్రభాకరరెడ్డి విజయం సాధించారు.
‘ఫలితకేశం’ కావ్యం మీద పాతికేళ్ల క్రితం ప్రభాకరరెడ్డి వ్యాసం ఓ పత్రికలో చదివిన విషయం నాకు బాగా గుర్తు. దామరాజు నాగలక్ష్మి గారి దగ్గర నిన్న తీసుకున్న పుస్తకం ఈ మధ్యాహ్నం విహంగ వీక్షణం చేశాను. రామిరెడ్డిలో నచ్చిన విషయాలు చెబుతూనే వైరుధ్యాలనూ చర్చించారిందులో!
థర్డ్ ఫార్మ్ తప్పిన దువ్వూరి రామిరెడ్డి (1895) ఇరవయ్యేళ్ల తరువాత సాహిత్య సృజన ప్రారంభించారు. అంతకు ముందు వ్యవసాయం చేస్తూ విజ్ఞాన విషయాలు, మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఆసక్తి కలిగి ఉండేవారు. అలాగే చిత్ర లేఖనం,శిల్ప కళల్లో సాధన చేసేవారు. 1917-28 మధ్య కాలంలో నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, యువకస్వప్నం, కడపటి వీడుకోలు, పానశాల అనే ఏడు కావ్యాలు వెలువరించడం మానవసాధనకు గొప్ప తార్కాణం!
పద్నాలుగు సంవత్సరాల తరువాత సైన్స్ దృష్టి తో ‘ఫలితకేశం’ ‘కవి-రవి’ అనే కావ్యాలు సృష్టించడం విశేషం! వీటి గురించి మన విమర్శకులు అసలు పట్టించుకోవడం లేదు!
సూక్ష్మంలో మోక్షం లాగా 72 పేజీల పుస్తకం (డిలక్స్ ఎడిషన్ 100రూ. , ఆసక్తి ఉన్న వారు కోడూరు పుల్లారెడ్డి 9550818495 సంప్రదించవచ్చు) సార్వత్రిక తెలుగుకవి దువ్వూరి రామిరెడ్డి సాహిత్యానికి వెల లేని నగ ! 🙏
వైద్యం చేస్తూ క్రమం తప్పకుండా సాహితీ నైవేద్యం కూడా సమర్పిస్తున్న మిత్రులు డా కోడూరు ప్రభాకరరెడ్డి గారికి అభినందనలు! 👍
—–( 0 )——
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾