.
భక్తరామదాసాదులు కూడా ఆ స్వామి శరణ్యత్వాన్నే నమ్మి తరించారు. అందుకే వారికి ఎంత ధైర్యం ? ఎంత భరోసా!?
కీర్తన ప॥ తక్కువేమి మనకు రాముండొక్కడుండేవరకూ
చ॥ ప్రక్కతోడుగా భగవంతుడు మును
చక్రధారియై చెంతనెయుండగ ॥ తక్కు ॥
చ॥ దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు
మనపై కృపతో నుండగ ॥ తక్కు ॥
చ॥ రామదాసులను గాచెడి శ్రీమన్నారాయణునే
నమ్మియుండగా ॥ తక్కు ॥
అంటూ భారం భగవంతునిపై నుంచి ఆ స్వామిగానంలో పరవశించాడు! రామదాసు. ఎన్ని కష్టాలనైనా భరించే శక్తి ఈ నమ్మకం, శరణాగతీ ఇస్తాయ్. అదే ఈ భక్తుల ధైర్యం!
ప॥ రఘునాయక నీ పాదయుగరాజీవములనె విడజాల శ్రీ
అ.ప॥ అఘజాలముల పారద్రోలి నన్నాదరింపనీవెగతిగాద శ్రీరఘునాయక ॥
అంటూ తన ఆరాధ్యదైవాన్ని ‘‘పాపజాలములన్నిటిని పారద్రోలి తన్ను రక్షించాలని’’ వేడుకుంటారు త్యాగరాజు. భాగవత శిఖామణులందరూ కూడా తమ మనసును స్వాధీనపరుచుకోవడానికి ఉద్భోధిస్తూనే ఉంటారు.
మాటవినని మనసుని త్యాగరాజు ఇలా మందలిస్తాడు.
మనసా ఎటులొర్తునే నామనవిని చేకొనవే
దినకరకుల భూషణునీ దీనుడవై భజనచేసీ
దినము గడుపుమనిన నీవు వినవదేలగుణవిహీన
కలిలో రాజస తామస గుణములు గల వారి చెలిమి
కలిసిమెలసి తీరుగుచుమరి కాలముగడపకవే
సులభముగా కడతేరను సూచనలను
తెలియజేయు ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణ విహీన ॥ మనసా॥
ఎలా చేస్తే జన్మధన్యమవుతుందో చెప్పినా వినవేం మనసా॥ ఇంత గుణ విహీనమైతే ఎలా భరించడం. అయినా సులభంగా తరించే ఉపాయం చెబుతానంటున్నాను కదా! అంటూ మళ్ళీ బుజ్జగిస్తారు మనసును. మనసు పెంకితనం చేసే పసివాళ్ళలాంటిది. బుజ్జగించాలేకానీ, ఆజ్ఞాపిస్తే అసలు చెయ్యదు. అందుకే అంతటి మహనీయులూ మనసుని అంతగా బుజ్జగించడం. ఈ విధంగా మనసును స్వాధీనపరచుకుందుకు పదే పదే బుజ్జగించాలి మరి!
‘‘ మనసు స్వాధీనమైనయా ఘనునికి మరి మంత్రతంత్రములతో పనిలేదు.’’
భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుత దుహితృ కళత్ర త్రాణ భారార్దితానాం
విషమ విషయతోయే మజ్జతా మప్లవానాం
భవతి శరణ మేకో విష్ణుపోతో నరాణాం॥
శ్రీమన్నారాయణుడు జగద్రక్షకుడు. రక్షణ అంటే అనిష్టాన్ని తొలగించడం, ఇష్టాన్ని అందించడం. ఈ ఇష్టానిష్టాలు వారి వారి మనస్థితిని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఆది వ్యాధులు సంసారులకు అనిష్టం. భగవత్ప్రాప్తిని కోరే వారికి ఈ సంసారం అనిష్టం. భగవంతునిపై బుద్ధిమరలితే వేదనామయ సంసారం నుండి ఉద్ధరింపబడినట్లే! ప్రకృతికి వశుడై, కర్మపరతంత్రుడై, విషయ సుఖాలలో మునిగి, భగవంతునికి దూరం కావడం కంటే ఆపద మరియొకటి ఉండదు. అటువంటి ఆపదను ఎలా దాటడమా అని బెంగతో బాధపడుతున్న వారికి శ్రీ కులశేఖరులు రాబోయే మూడు శ్లోకాలలో ఇలా ధైర్యం చెబుతున్నారు.
సంసారం ఒక మహాసముద్రం. దాన్ని ఈది దాటలేం. పైగా ఈ సంసారమనే సముద్రంలో శబ్దస్పర్శరూప రసగంధాలనే విషయ రూపమైన జలాల అలలు ఉవ్వెత్తుగా లేచి ముంచివేస్తాయి. పైగా సుఖదుఃఖాలూ, శోకమోహాలూ, జరామృత్యువులూ మొదలైన ద్వంద్వాలు పెనుగాలులై ఒడ్డుకు చేరనివ్వక త్రోసి వేస్తూంటాయి. ఇంకా, తెలిసీ తెలియక ఎవరికి వారు ఏర్పరుచుకున్న భార్య, భర్త, బిడ్డలూ మొదలైన బంధుత్వాల బరువులు కుంగదీసేస్తూంటే ఇంకే విధంగా ఒడ్డుకు చేరగల్గడం ? ఇటువంటి వేళల్లో విష్ణుపోతం ఒక్కటే శరణ్యం.
ప. రఘునాయకా నీపాదయుగరాజీవములనె విడజాలశ్రీ ॥
చ. భగసాగరముదాటలేకనే బహుగాసిపడి నీమరుగుజొచ్చితిని
అవనిజాధిపా, శ్రితరక్షకా ఆనందకర శ్రీత్యాగరాజనుత ॥
అంటూ త్యాగరాజుల వారు శ్రీరామపాదయుగరాజీవాన్ని శరణుజొచ్చారు.
అంటే ఈ సంసారాన్ని దాటించే ‘‘విష్ణువు’’ అనే పడవ అన్నమాట. విష్ణువు సర్వవ్యాపకుడు. అందుకే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకూ వ్యాపించిన విష్ణువు అనే పడవను శరణు వేడితిమా తెడ్డు వెయ్యక్కర్లేదు. పడవ నడపక్కర్లేదు. మనం ఆవలి ఒడ్డున ఉంటాం! అంటే సంసార తరణానికి సర్వేశ్వరుడే ఉపాయం కాని, స్వప్రయత్నం కాదన్నమాట. దాటింతర్వాత అక్కడ ఉన్నదీ ఆ విష్ణువే! అంటే సంసార సాగరాన్ని దాటించేదీ, దాటిన తర్వాత చేరే రేవూ కూడా ఆ పరమాత్మే నన్నమాట! ఎంత నిశ్ఛింత! విష్ణుపోతాన్ని ఆశ్రయిస్తే జలస్థల విభాగం లేకుండా ఎక్కడికైనా నిరపాయంగా చేరవచ్చు. భగవానుడు ఉపాయమే కాదు. ఉపేయము కూడా ఆ దేవుడే!
అందుకే కర్మనో, జ్ఞానాన్నో, మరిదేన్నో సాధనంగా ఆశ్రయించి సంసారాన్ని దాటి భగవంతుని పొందాలనుకుని శ్రమపడకండి. భగవానుడే భగవానుని పొందించే ఉపాయం అని తెలిసి శ్రీమహావిష్ణువే పడవగా ఈ భవజలధిని దాటుదాం. ఎంత సుఖమీ ప్రయాణం! అర్ధమైందా మనసా ఇప్పుడు ? అందుకే ఆ పాదయుగాన్ని ఆశ్రయించారు త్యాగరాజులవారు.
అర్ధమైంది కానీ ఏమైనా సంసారం విషయంలో నా అనుభవం నాది! అంటూంది మనస్సు! ఏమిటా అనుభవం ?
శ్లో॥ భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం
కథ మహ మితి చేతః మస్మగాః కాతరత్వం
సరసిజదృశి దేవే తావకీ భక్తి రేకా
నరకభిది నిషణ్ణా తారయిష్య త్యవశ్యం
సంసారసాగరాన్ని దాటడానికి విష్ణుపోతం ఎక్కడం సరే. ఈ సముద్రపు అలలు అంతగా ఎగసిపడుతూంటే ఆ అలల ధాటికి తట్టుకుని విష్ణుపోతాన్ని మాత్రం ఎక్కగలనా? అంటూ భయాన్ని ప్రకటించే మనసును సమాధానపరచి ఇలా అంటున్నారు రాజుగారు. సంసార సముద్రంలోతైందనీ అలల ధాటికి తట్టుకుని పడవనైనా ఎక్కగలనో లేనో అంటూ భయపడకు మనసా. ఆ స్వామిపై నమ్మకమూ, ధైర్యమూ ఉంటే చాలు.
శ్లో॥ ఉద్ధరోద్ధర గోవిందా । పతితంభవసాగరే ।
భీ కరే! శ్రీహరే! కృష్ణ వృష్ణి వంశసముద్భవ ॥
యదుకులంలో పుట్టి కృష్ణుడవై పెరిగిన ఓ నారాయణా! భయంకరమైన సంసార సముద్రంలో పడి ఉన్న నన్నుద్ధరించు తండ్రీ! గోవిందా! నన్నుద్ధరించు! అంటారు నారాయణ తీర్ధులు.
శ్లో॥ హరత్వం సంసారం దృతతరమసారం సురపతే ।
హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే ॥
అహో! దీనానాధం నిహితమచలం పాతుమనిశం
జగన్నాధస్వామి నయనపధగామి భవతుమే ॥
సంసారాన్ని హరించి, పాపాలను పోగొట్టి దీనుడనైన నన్ను ఉద్ధరించి నీ దర్శన భాగ్యమును కన్నులకు కలిగించు తండ్రీ. జగత్కారణమై, ప్రేరకమై, సాక్షియు నయిన ఆ పుండరీకాక్షుని ప్రేమతో తలిస్తే చాలు. నీ ప్రయత్నమక్కరలేకుండానే తరింపబడగలవు. భక్తే భగవంతుని చేర్చేది విష్ణుపోతాన్ని నువ్వు ప్రయత్నించి ఎక్కలేక పోయినా, ‘‘అదియే నిన్ను రక్షించగలదని’’ నమ్మకంగా, భక్తితో తలచుకో! అంతే. అదే నిన్నెక్కించుకుంటుంది. అని చెప్పిన మహారాజు మాటలకి, ఇంకా సంశయం వదలని మనసు జంకుతో ‘‘అసలు నేను తలచినట్లు విష్ణు పోతానికి ఎలా తెలుస్తుంది? ఇంతకీ అసలు ఆ పడవ నా కన్నులకు కనబడదేం?’’ అంటూన్న మనసుతో పిచ్చిమనసా అది మామూలు పడవకాదు. తామరపూవులంతేసి కన్నులు గల పుండరీకాక్షమగు పోతం. దీనిని అధిరోహించడం కాదు. కేవలం తలిస్తే చాలు, క్రూర తిమింగిలాది జంతువుల వంటి నరకబాధల నుండి కూడా దాటించి, ఏ విధమైన శ్రమ లేకుండా, ఆవలి ఒడ్డుకు చేర్చగలదు. అనాయాసంగా పాపముక్తులను చేసేది నరకాంతకుడైన శ్రీకృష్ణభక్తి. నమ్మకముంచితే చాలు. నట్టనడి సముద్రంలోనైనా నిరపాయంగా నడిపి ఒడ్డుకు చేర్చేది ఆ చరణాలపై భక్తి నమ్మకం.
‘‘ అంతరంగమున ఆత్మారాముడై యుండి అనంతరూపముల వింతలు సలిపే స్వామి’’ మనల్నినట్టనడి సముద్రంలో కూడా నిరపాయంగా నడిపించేస్తాడు.
ప. రామచరణం (అదే విష్ణుపోతం) రామచరణం రామచరణం
మాకు శరణం
మాకు చాలును మౌనిమస్తక భూషణం
చ. నావలో తానుండి మము నట్టేట నడిపే రామచరణం
త్రోవలో కారడలిలో తోడ్తోడనడిచే రామచరణం
నావయైతే రామచరణం త్రోవయైతే రామచరణం
మాకు చాలు మహేంద్ర సంస్తుత వైభవం
ఈ నమ్మకంతోనే అంటే శ్రీకృష్ణునిపై నమ్మకంలోనే గోపికలు యమునా నదిని దాటారు. అంతెందుకు ? శంకరాచార్యుల వారి ఆదేశంతో నదిని దాటి వచ్చారుకదా పద్మపాదాచార్యులవారు? ఈ విధంగా గురుగోవిందులపై నమ్మకం భవసాగరాన్ని దాటించే శక్తిగలది. ఈ విధంగా సాగరంలాంటి సంసారాన్ని గురించి మనసు వెలిబుచ్చిన అనుమానాలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పి, ఇంకా భక్తి సాధన విషయంలో మరిన్ని విషయాలు చెబుతారు.
త్వమప్యంబ మాంపశ్య శీతాంశుమౌళిప్రియే
భేషజం త్వం భవవ్యాధిశాన్యై
బహుక్లేశ భాజం పదాంభోజపోత
భవాబ్ధౌ నిమగ్నం నయస్వాద్యపారమ్ ॥
ఓ చంద్రమౌళిప్రియా! తల్లీ! సంసార రోగశాంతికి ఔషధానివి నీవు. ఈ భవసాగరాన మునిగి క్లేశపడుచున్న నన్ను నీ పాదపద్మములనే పడవలోనికి చేర్చుకో తల్లీ! మార్జాల కిశోర న్యాయంగా అలా చేర్చుకునే భారము నీదే! ‘‘భక్తిగమ్యాయై నమోనమః నా భక్తికి తల్లే గమ్యం అంటారు శంకర భగవత్పాదులు. తమ శివ భుజంగ ప్రయాత స్తోత్రంలో.
తృష్ణాతోయే మదనపవనోద్ధూత మోహోర్మి మాలే
దారావర్తే తనయసహజ గ్రాహ సంఘాకులేచ
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం న స్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ
సంసార సముద్రంలో పడి దాటలేక బాధపడుతున్న వారికి ‘‘విష్ణువే’’ అంటే ‘‘విష్ణుభక్తే’’ పడవ అనీ, దాని సాయంతో భవజలధిని దాటవచ్చులెమ్మని, మనసుతో గత శ్లోకంలో చెప్పారు. అంతా విన్నా మనసు మళ్ళీ ఇలా అంటూంది. ‘‘ఈ సంసార సముద్రం ఎంత అగాధమైందో వింటూనే ఉన్నాను. అంతటిలోతైన సాగరాన్ని దాటడం ఎంతమాత్రం సులభం కాదు. నాకు భయం వేస్తుంది బాబూ! అంటున్న మనసుకు మరింత ధైర్యం చెబుతూ, మహారాజు ‘‘నిజమే మనసా సంసార సముద్రం చాలా లోతైనదీ, భయంగొలిపేదనీ, అన్నమాట నిజమే! ఎందుకంటే ఈ సంసారంలో ఆశయే జలం. ఆ జలం కోరికలు (కామం) అనే పెనుగాలిచే కదల్పబడుతూ ఉంటుంది. ఆ కదలికలు మోహం అనే కెరటాల్ని ఆగకుండా ఎగసిపడేలా చేస్తాయి. ఇందు భర్తకు భార్య, భార్యకు భర్త, సుడిగుండమై తిప్పుతూ లోతుకు లాగివేస్తుంటే, బిడ్డలు బంధువులూ మొసళ్ళవంటి జలచరాలై వేధిస్తూంటాయి.
ఎంత చదివినా, ఎంతటి విజ్ఞానమున్నా, ఆశ మాత్రం పొంగులు వారుతూనే ఉంటుంది. ముందుగా బ్రతుకు ఆశ బతుకు ఉన్నందుకు తగినంత ధనం, సుఖం ఉండాలని ఆశ. అవి సంప్రాప్తించినా, అవన్నీ ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండాలని ఆశ. నాకే కాదు నా తర్వాతి తరాలకు కూడా ఉండాలని ఆశ! ఇలా సముద్రంలో మున్నీరులా నిండుతూనే ఉంటుందీ ఆశఁ అటువంటి ఈ సంసారంలో భక్తికి అవకాశమెక్కడ! ఒకవేళ భగవంతుని స్మరించినా, విషయవాంఛలను తీర్చమని కోరడానికి మాత్రమే!! ఇలా విషయాలపైనే ఆశ కల్గిన మనకు ఈశ్వరునిపై భక్తి ఎక్కడ?! అయినా ఏ ఆశతోనైనా భగవంతుని తలచుకుందామంటే, కామమనే పెనుగాలికి కదలిన మోహమనే కెరటాల విసురు ఆ విధమైన తలపుకు అవకాశమే ఇవ్వదు. ఇక స్త్రీ యెడ కామం సుడివలె దిగలాగి బయటకు పోనీయక ముంచి వేస్తుంది. ఆ సుడిగుండం నుండి ఏదో విధంగా బయటపడినా, సంతానం, వారిపై ప్రేమ పేరుతో పెంచుకున్న బాధ్యతలు, మొసళ్ళలా పట్టుకొని కదలనీయవు. ఇలా ఈ సంసారంలో అన్నీ భక్తికి ప్రతిబంధకాలే! అందుకే అన్నారు శంకరాచార్యులవారు…
తరువాయి వచ్చే సంచికలో……
——– ( 0 ) ——-
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾