11_020 ఆనందవిహారి

         అమెరికా లో వైభవంగా సాగిన వాగ్గేయకారోత్సవం 2022

 

మండు వేసవిలో మధురమైన గానామృతంతో సేదదీరారు అమెరికాలోని హ్యూస్టన్ వాసులు. భారత దేశం నుండి వెళ్ళి అమెరికాలో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న వారు తమ సంస్కృతి మూలాలను మర్చిపోకుండా, తమ తర్వాత తరాల వారికి అందించే కార్యక్రమలో భాగంగా శిక్షణాలయాలతో బాటు అనేక కార్యక్రమాలను నిర్వ్హిస్తున్నారు. వారిలో హ్యూస్టన్ లో ప్రముఖమైన తెలుగు సాంస్కృతిక సమితి, స్వరభారతి, భారతీయ వాహిని సంస్థలు సంయుక్తంగా జూన్ 11వ తేదీన శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో “ వాగ్గేయకారోత్సవం 2022 ” నిర్వహించారు.

ఉదయం పది గంటలకు శ్రీదేవి జోశ్యుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. దేవాలయార్చకులు ప్రసాద్ గారు అర్చన చేశారు. తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు కిరణ్ నెక్కంటి గారి స్వాగత వచనాల అనంతరం శ్రీదేవి జోశ్యుల నిర్వహణ లో ‘ వాగ్గేయకార వైభవం ’ శీర్షికన జరిగిన గోష్టి గానం శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచింది. ఈ కార్యక్రమంలో అయిదుగురు ప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలను ఎంచుకొని ఆలపించడం జరిగింది. అవి, ఓ రామ నీ నామ – భద్రాచల రామదాసు, శివ శివ శరణం – నారాయణ తీర్థులు, పాహి నారేయణ – కైవార యోగి నారేయణ, రామ రామ యనరాదా – ప్రయాగ రంగదాసు, యే తీరుగనను – భద్రాచల రామదాసు, శరణు శరణు – అన్నమాచార్య అనే కీర్తనలు. ఈ బృందం లో హిమబిందు పొన్నపల్లి, ఉష అయ్యగారి, రోహిణి ధూళిపాళ, స్వర్ణ లంక, అపర్ణ గంటి, ఉమా సుందర్, లక్ష్మి ముక్కవిల్లి, గాయత్రి అవధానుల, హేమ నళిని అక్కిరాజు, శిరీష పిల్లలమఱ్రి , ఇందిరా విజయ్, కృష్ణప్రియ కూరెళ్ల, జ్యోతి వెంకటేశన్, అను గన్నవరపు, శ్రీవిద్య, శ్రీ గౌరీ అంబటిపూడి, దీప్తి, శ్వేత, ప్రేమ చీటి, స్మిత ప్రహ్లాద్, పద్మ సీతపల్లి, మేఘన కర్రా, అలేఖ్య సాంబరాజ్, ఆశ్రిత, శ్రీ హర్షిత అంబటిపూడి, చిరంజీవి సిద్దార్థ అయ్యగారి మున్నగు వారు పాల్గొన్నారు. వీరికి వైయోలిన్ మీద ముకుంద్ జోశ్యుల, మృదంగం మీద విశాల్ సెట్లూర్ సహకరించారు. ప్రసిద్ధ వాగ్గేయకారుల జీవిత విశేషాలను మేఘన, శ్రీసంహిత, ఆశ్రిత వివరించారు. అయ్యగారి సీతారాం గారు ఈ బృందానికి అభినందనలు అందించారు.

అనంతరం హ్యూస్టన్ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సంగీత గురువులు అయ్యగారి సీతారామ్, అపర్ణ గంటి, శార్వాణి ధూళిపాళ, జ్యోతి వేంకటేశం, రాజ రాజేశ్వరి భట్, మహేష్ అయ్యర్, శంకర్ అయ్యర్, కొమండూరి వెంకట కృష్ణ (ఇండియా), పార్థు నేమాని (ఇండియా), రాజశేఖర్ ఓరుగంటి (ఇండియా) మున్నగు వారు. తమ శిష్యుల చేత అన్నమాచార్యులు, భద్రాచల రామదాసు, తూము నరసింహ దాసు, త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, నారాయణ తీర్ధరు, పొన్నయ్య పిళ్ళై, ప్రయాగ రంగదాసు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ మున్నగు  ప్రసిద్ధ వాగ్గేయ కారుల సంకీర్తనలు గానం చేయించారు.

ఈ కార్యక్రమం లో శ్రావిక తిరునగరి, హంసిక అయాపిల్ల, కోవిద కొత్త, నియతి పండరి, మేధాశ్రీ భట్టర్, ప్రాణిక తిరునగరి, హర్షిత్ చిలుకూరి, ప్రియాంక చిలుకూరి, ఆదిత్య శ్రీనివాస్, కృతిక శ్రీనివాస్, మనస్వి జూటూరు, శ్రావ్య ఉప్పల, లాస్య ఉప్పల, సుశాంత్ మూట, సాత్విక్ సాయి ఉమ్ముటి, మీనాక్షి ఎర్రగుంట్ల, శ్రీవల్లి కోళపురం, షాలిని లక్ష్మి షాక్కొటై, సంశ్రిత పొచెంపెద్ది, శ్రద్ధ వల్లూరి, సిరి రామినేని, అక్కి వర్రే, అలేఖ్య సాంబరాజు, భార్గవ బలిజేపల్లి, సహస్ర బలిజేపల్లి, అనిషా అయిలవరపు, శ్రావ్య వేదుల, అన్వి భట్, రాణా వఝా, అభి కల్వకోట, శ్రీసంహిత పొన్నపల్లి, సిద్ధార్థ్ అయ్యగారి, వెంకట్ భారతి, ఆషిత ఆనంద్, నిఖిల్ భరధ్వాజ్, గాయత్రీ ముళ్ళపూడి / అవధానుల మున్నగు వారు తమ గాత్రాన్ని అందించగా, మను వఝా, గణేష్ వేణు, కార్తీక్ ముక్కవిల్లి వయోలిన్ తోనూ, దత్త ముళ్ళపూడి మృదంగం తోనూ సహకరించారు.  

అనంతరం వర్ధిష్టు కళాకారుల చే జరిగిన రెండు లఘు కచేరీలలో చి. భార్గవి చంద్రశేఖరన్, చి. సమర్థ్ అనంతుని తమ గానంతో రసజ్ఞులను అలరించారు. వీరికి వైయోలిన్ పైన చి. ప్రణవ్ ప్రవీణ్, మృదంగం పైన గోవింద్ రంగప్ప సహకరించారు.

ఈ కార్యక్రమాల తర్వాత మురళీధర్ లంక బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీక్ష విఠల, అలేఖ్యా సాంబరాజ్, శ్రీసంహిత  పొన్నపల్లి, ఆకాంక్ష పంపంగౌడ్గారి ప్రదర్శించిన రామాయణ గాథ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమాలన్నిటికీ కాంత్ జోశ్యుల, సీతారాం అయ్యగారి, హిమబిందు పొన్నపల్లి, శ్రీదేవి జోశ్యుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వంగూరి చిట్టెన్ రాజు, వాడ్రేవు సత్యనారాయణమూర్తి, రఘు చుండూరి, శ్రీనివాస్ ముళ్ళపూడి, శాస్త్రి చెరువు, సురేశ్ పిల్లుట్ల, కిరణ్ నెక్కంటి, యశోద, రమణ వాడ్రేవు, ఇందిరా చెరువు లు సంగీత గురువులను సత్కరించి, విద్యార్థులకు జ్ఞాపికలను బహుకరించారు.

తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు కిరణ్ నెక్కంటి, కార్యవర్గ సభ్యులు తమ సహాయ సహకారాలను అందించారు.

ఆ సాయింత్రం జరిగిన ప్రధాన కార్యక్రమం విద్వాన్ విశాల్ సాపురం బృందం చిత్ర వీణ కచేరీ ఆద్యంతం రక్తి కట్టింది. ముకుంద్ జోశ్యుల వైయోలిన్ మీద, విశాల్ సెట్లూర్ మృదంగం మీద సహకరించారు. విశాల్ సౌరాష్ట్ర రాగంలో ‘ రంగనాథుడే ’ అన్న కీర్తనతో ప్రారంభించి, వాసుదేవయని, వెంకట శైల విహార, సాధించెనే, రాజువెడలె కీర్తనలతో అలరించారు. మైథిలి చాగంటి కళాకారులను సభకు పరిచయం చేశారు. కాంత్ జోశ్యుల వందన సమర్పణతో ఆనాటి కార్యక్రమం ముగిసింది.

శశాంక్ వల్లూరి, మురళీధర్ & స్వర్ణ లంక, అరవింద్ & సుధా, రవికాంత్ & బిందు, సీతారామ్ & ఉష అయ్యగారి, రమణ & మహతి విట్టల, సుధేష్ & సంగీత పిల్లుట్ల, సాయి & లలిత రాచకొండ, శ్రీనివాస్ & గీత కర్రా, చలపతి & హేమ నళిని అక్కిరాజు, రోహిణి & ప్రసాద్ ధూళిపాళ, రఘు & శైలజ చుండూరు, సతీష్ కృష్ణమూర్తి & జయశ్రీ , లక్ష్మి నారాయణ & కృష్ణప్రియ కూరెళ్ల, శిరీష & భార్గవ మల్లాప్రగడ, చంద్ర & అను గన్నవరపు, వెంకట్ & ప్రేమ చీటి, మహేంద్ర & మాధవి మొదలైన వారు ఈ ఉత్సవానికి హర్థికంగా, ఆర్థికంగా సహకారం అందజేశారు.    

        

               అద్వితీయం నటత్రయం

ఎస్వీ రంగారావు, గుమ్మడి, కైకాల సత్యనారాయణ ముగ్గురూ అద్వితీయ నటులని, ఎవరికి వారే సాటి అని హైదరాబాదుకు చెందిన సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రతినెలా ఒక అంశంతో ముందుకొచ్చే “నెల నెలా వెన్నెల” ఈసారి వెండితెర వెలుగులను వెదజల్లింది. సుదీర్ఘ కాలం నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆ ముగ్గురు అసమాన నటులూ పుట్టినది జూలై మాసమే కావడంతో…. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి  “అద్వితీయం నటత్రయం” పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం జూలై 9 శనివారం సాయంత్రం యూట్యూబ్ ద్వారా ప్రసారమైంది. ఇందులో జోస్యుల మనీషా ఎస్వీఆర్ గురించి, పొత్తూరి రాజశ్రీ గుమ్మడి గురించి, పొత్తూరి అశ్విన్ కుమార్ సత్యనారాయణ గురించి ప్రసంగించారు. సంస్థ సంయుక్త కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య ప్రేక్షకులకు స్వాగతం పలికి తనదైన శైలిలో వక్తలను పరిచయం చేశారు. 

     

ఏ పాత్రైనా ఆయనకి మంచినీళ్ళప్రాయమే – జోస్యుల మనీషా 

ముందుగా ఎస్వీ రంగారావు నటన గురించి మనీషా  ప్రసంగిస్తూ… ఈ పాత్రలు లేకపోతే అసలు కథే లేదు కదా అనిపించే ప్రతినాయక పాత్రలు, దుష్ట పాత్రలు, కథా గమనానికి తోడ్పడే సహాయ పాత్రలను అత్యంత ప్రతిభ కలవారు పోషిస్తేనే సినిమా అనేది రక్తి కడుతుందని అంటూ ఆయా పాత్రల ముఖ్యత్వాన్ని ఎంతో చక్కగా విశ్లేషించారు.  సినీరంగం, సినీ ప్రేమికుల అదృష్టం కొద్దీ ఎస్వీ రంగారావు అనే అసమాన అనుపమాన నటుడు 1946లో తెలుగు తెరకు పరిచయమయ్యారని గుర్తు చేశారు. దుర్యోధన, కంస, రావణ తదితర ప్రతినాయక పాత్రలు, మాంత్రికుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు, రౌడీ వంటి దుష్టపాత్రలు, కుటుంబ పెద్ద, జమీందారు తదితర సహాయ పాత్రలు అన్నిటికీ మంచినీళ్ళప్రాయంగా ప్రాణం పోసి మహోన్నత నటుడిగా ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఏ సంభాషణ చెప్పినా, ఆ చెప్పిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకునేదని, రౌడీ పాత్రలో ఆయన అన్న “గూట్లే” అన్న మాట ప్రేక్షకులను మెప్పించిందని గుర్తు చేశారు. హిరణ్యకశిపుడుగా, కీచకుడుగా ఇంకొకరిని ఊహించలేమని, నిజానికి ఆయన పోషించడం వల్లే అనేక పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయని అభిప్రాయపడ్డారు. అందువల్లే తెలుగునాట ఆయన విగ్రహాలు నాలుగైదు ప్రాంతాలలో ఏర్పాటయ్యాయని అంటూ వాటి వివరాలు తెలియజేశారు. రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, ప్రధాని ఇందిరా గాంధీల నుంచి పురస్కారాలు అందుకున్నారని, ఆయన చిత్రంతో భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను కూడా విడుదల చేసిందని మనీషా గుర్తు చేశారు. ఈ సహజ నటుడు 56 ఏళ్ళకే మరణించినా, మూడు దశాబ్దాల కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలు కలిపి 300 సినిమాలలో నటించారన్నారు. సందర్భానుసారం అనేక చిత్రాలను వక్త ప్రస్తావించారు. కథా రచయితగా కూడా ఆయన రాణించారని చెప్పి కొన్ని ఉదాహరణలిచ్చారు. 

        మద్రాసులో కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే నటుడిగా రాణించిన ఎస్వీఆర్ అప్పట్లోనే నటనలో వైవిధ్యం చూపారని వివరించారు. “వధ” నాటకంలో 22 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ళ వృద్ధుడి పాత్రను అద్భుతంగా పోషించడమే అందుకు నిదర్శనమన్నారు. నగరంలో ఎక్కడ నాటకం ఏర్పాటైనా వెళ్ళి చూసేవారని, అన్ని భాషల సినిమాలనూ చూసి విశ్లేషించేవారని చెప్పారు. వక్తృత్వ పోటీలలో, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలలో రాణించినా నటన మీది ప్రేమ వల్ల నటుడవ్వడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఆయన చదువులో కూడా చురుకని అంటూ… ఇంటర్మీడియట్ లో 45 మంది పరిక్ష రాసినా పాసైన ప్రతిభావంతుడు ఎస్వీఆర్ ఒక్కరేనని మనీషా వెల్లడించారు. 

నాన్న, అన్న, చిన్నాన్న, భర్త, మిత్రుడు…. అన్నీ ఆయనే – పొత్తూరి రాజశ్రీ

తెలుగు ప్రేక్షకులలో ఇంటిపేరుతో ప్రసిద్ధుడైన గుమ్మడి వెంకటేశ్వరరావు సినిమాలలోకి రాకముందు ప్రసిద్ధ రంగస్థల నటుడని పొత్తూరి రాజశ్రీ గుర్తు చేశారు. ఉన్నత విలువలకు, హుందాతనానికి పెట్టింది పేరైన ఆయన వ్యక్తిత్వానికి తగినట్టుగానే సినిమాలలో అనేక వైవిధ్యమైన పాత్రలు ఆయనను వరించాయని అంటూ…. ఆయన నటించిన 500 చిత్రాలలో సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక వంటి అన్నిరకాల చిత్రాలలో ముఖ్యమైన వాటిని, వాటిలో ఆయన నటనను ఒక కాగితం ముక్క కూడా దగ్గర పెట్టుకోకుండా గడగడా వివరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. జీవితంలో ఎవరిపట్ల గౌరవంగా, ఎవరితో ఆప్యాయంగా, ఎవరెవరితో కఠినంగా, ఎవరిపట్ల దయతో వ్యవహరించాలో పెద్దలు చెప్తుంటారని, తెలుగు సినిమాలలో ఒక్క గుమ్మడి పాత్రలు గమనిస్తే అవన్నీ సోదాహరణగా తెలిసిపోతాయని గుమ్మడి అభినయాన్ని వక్త ప్రశంసించారు. తండ్రి, అన్న, తమ్ముడు, భర్త, చిన్నాన్న, మామగారు, మిత్రుడు పాత్రలకి, అన్నిటికీ మించి ఒక మంచి వ్యక్తి పాత్రకి ప్రాణం పోశారన్నారు. 1951లో “అదృష్టదీపుడు”తో మొదలుపెట్టినా, రెండో చిత్రంగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన “తోడు దొంగలు”తో గుర్తింపు తెచ్చుకున్నారని, ఆ చిత్రానికి పురస్కారం కూడా లభించిందని చెప్పారు. ఇక “అర్ధాంగి”తో నటుడిగా ఆయనకు తిరుగు లేకపోయిందన్నారు. అది వయసుకి మించిన పాత్రే అయినా, దర్శకుడు పుల్లయ్య ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఆయన వయసు చిన్నది కావడంతో ఆయన ఈ పాత్రలో నటించలేరేమోనన్న తోటి నటి శాంతకుమారి సందేహాన్ని పటాపంచలు చేశారని అన్నారు. ఇక అక్కడినుంచి వయసుకి మించిన పాత్రలే ఎక్కువగా వేశారని చెప్తూ… సాంఘిక చిత్రాలైన మీనా, జీవన తరంగాలు, మైనరు బాబు, సావాసగాళ్ళు, పండంటి కాపురం చిత్రాలలో ఆయన నటనను విశ్లేషించారు. పండంటి కాపురంలో ఆయన వ్యక్తపరిచిన సంఘర్షణ ఉత్తమ నటనకు గీటురాయని కితాబిచ్చారు. చారిత్రక చిత్రం మహామంత్రి తిమ్మరుసులో ఆయన నటన అసమానమైనదని, ఎన్టీఆర్ తో పోటాపోటీగా సాగిందని అన్నారు. బలరాముడు (మాయాబజార్), దశరథుడు (సీతా కల్యాణం), ధర్మరాజు (పాండవ వనవాసం)గా కూడా మెప్పించారన్నారు. ప్రతినాయకుడిగా లక్షాధికారి తదితర చిత్రాలలో రాణించారని చెప్పారు. ప్రేక్షకులు తమ తమ పాత్రలను ఆయనలో చూసుకున్నారు కాబట్టే ఆయన పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, కళాప్రపూర్ణ వంటి గౌరవాలకు అర్హులయ్యారని వివరించారు. 

తరతరాల నటుడు కైకాల సత్యనారాయణ – పొత్తూరి అశ్విన్ కుమార్

         

ఎన్టీఆర్ నుంచి జూనియర్ఎన్టీఆర్ వరకు వారితో సమానంగా రాణించిన అరుదైన నటుడు సత్యనారాయణ అంటూ…. నేటి యువతీయువకులకు హీరో హీరోయిన్ల మీదే ఎక్కువ దృష్టి అన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు పొత్తూరి అశ్విన్ కుమార్. బహుచక్కని తెలుగులో వెనకటి తరం ప్రముఖ ప్రతినాయక పాత్రధారి కైకాల సత్యనారాయణ విలక్షణ నటనను గురించి వివరిస్తూ…… ప్రతినాయక పాత్ర, హాస్య పాత్ర, దుష్ట పాత్ర, సానుభూతి చూపించే పాత్ర, మోసగాడి పాత్ర… పాత్ర ఏదైనా ఎటువంటి తారతమ్యం లేకుండా ఆయన అవలీలగా వాటిలోకి పరకాయ ప్రవేశం చేస్తారని ప్రశంసించారు. “యముడు ఎలా ఉంటాడు?” అన్న ప్రశ్నకి ఆ తరంవారి నుంచి ఈ తరంవారి వరకు ఎవరైనా “సత్యనారాయణ లాగా ఉంటాడు” అని జవాబిస్తారని అన్నారు. యమగోల (1975) చిత్రంలో ఆయన మొదటిసారి యముడి పాత్ర ధరించారని, ఆంగిక, వాచికాభినయాల ద్వారా ఆ పాత్రపై తన ముద్ర వేసేశారన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత యముడికి మొగుడు చిత్రంలో చిరంజీవితో కలిసి హాస్యం పండించారని గుర్తు చేశారు. యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య జోడీ తిరుగులేనిదన్నారు. అడవి రాముడు, వేటగాడు, ఖైదీ నంబర్ 786లలో ఆయన మెప్పించారన్నారు. సూర్యవంశం చిత్రంలో తండ్రిగా ఆయన కళ్ళతో కనబరిచిన భావం మాటల్లో చెప్పలేనిదని  కొనియాడారు. ఆయన వేసిన అన్ని పాత్రలూ “అదరహో” అన్నట్టు ఉంటాయన్నారు. మురారిలో సత్తిపండు అమాయకత్వం, అరుంధతిలో తాతగారి గాంభీర్యం చూసినా, దరువులో మళ్ళీ యముడిగా, యమలీలలో యముడిగా, ఘటోత్కచుడు లో ఘటోత్కచుడిగా, ఆలీబాబా అరడజను దొంగలులో పోలీసుగా నటన చూసినా “నవరస నట సార్వభౌమ” అన్న బిరుదు  ఆయనకు అత్యంత సమంజసం అనిపిస్తుందన్నారు. చిరంజీవితో కలిసి ఆయన నటించిన చిత్రాలు అనేకం బాక్స్ ఆఫీసు వద్ద విజయఢంకా మోగించాయంటూ ఈ యువ వక్త ఈతరం చిత్రాలను ఉదహరించారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్ ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ తదితర ఆధునిక నటులతో కూడా ఆయన కలిసి నటించి మెప్పించారన్నారు. ద్వేషం, ఆవేశం, క్రోధం, సంతోషం…. ఎటువంటి భావాన్నైనా సరళంగా పలికించే సత్యనారాయణ “నటనకు గ్రంథాలయం” అని  అభివర్ణిస్తూ…. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలోని ఆయన పాత్రలు నటనకు గీటురాళ్ళు అని ప్రశంసించారు. ఇక పాత చిత్రాలలో ఎన్టీఆర్, సత్యనారాయణ ఒకేసారి తెరమీద కనిపిస్తే ఎవరిని చూడాలన్న అయోమయంలో ప్రేక్షకులు పడతారని, తెరమీద సత్యనారాయణ ఉనికి అంతటి శక్తిమంతమైనదని అన్నారు. అందుకే రఘుపతి వెంకయ్య, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాల గ్రహీత అయ్యారన్నారు. 

నిజ జీవితంలో సత్యనారాయణ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారని అశ్విన్ చెప్పారు. బాహుబలి అనేది కెమెరా పనితనంతో తీసిన సినిమా మాత్రమే అని ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయం, చిన్న సినిమాలు విజయం సాధిస్తే సంతోషపడడం ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమం వీడియో… ఈ క్రింద….

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾