11_020 బడాయిలు – బఠానీలు

 

ఈ మధ్య మా మామయ్య పుట్టినరోజు అయింది. దగ్గిర వాళ్ళు రెండు పుంజీల వాళ్ళని డిన్నర్ కి తీసుకెళ్ళాడు. ఆ హోటలు పెద్ద చెరువు ఒడ్డున ఉంది. అలలపై చంద్రుడు ఉయ్యాలలూగుతున్నాడు. అద్దాల గోడలు – వీటిమీద కూర్చున్నట్లే వుంది. చల్లని గాలి – దీపాల వెలుతురు పిసినారి దానం లాగా వుంది. దీపాలు రంగురంగుల షేడ్స్ లో వున్నాయి. ఆ షేడ్స్ టేబల్ మీద పరిచిన తల్లటి షీట్లపై రంగుల గీతాలు గీస్తున్నాయి. తినబోయే పదార్థాలకి ఆర్డరిచ్చి కబుర్లాడుతున్నాం. ఎలాగా గంటా రెండు గంటలు పడుతుంది కదా !

 

మా పక్క టేబుల్ దగ్గర ఓ పదిమంది కూర్చున్నారు. వారికి బట్లర్ వైన్ సర్వ్ చేస్తున్నాడు. టేబుల్ మీదున్న సుకుమారమైన వైన్ గ్లాసుల్లో వైన్ పోస్తున్నాడు. ఒక చేత్తో వైన్ బాటిల్ అడుగు ఒక చేత్తో ఓరగా పట్టుకొని టేబుల్ మీదున్న వైన్ గ్లాసుల్లో మనిషి మనిషి మధ్యనుంచి తొణకకుండా బెణకకుండా పోస్తున్నాడు. సురభి నన్ను చూడు పిన్నీ అని సైగ చేసింది. “ నలుగురు భోజనానికి వచ్చినపుడు చారులు, పులుసులు వడ్డించడం కష్టమయిపోతుంది. హీట్ ప్రూఫ్ సీసాలు తయారు చేస్తే చారు వడ్డించవచ్చు. టేబుల్ క్లాత్ మీద, పక్క వాళ్ళ మీద , మన చీరల మీద పోసుకోకుండా వుంటుంది ” అంది.

 

నాకు నవ్వు వచ్చింది. పూర్వం పెళ్లిళ్లలో వడ్డనలు చేసేటపుడు పులుసుకు, చారుకు, పచ్చళ్ళకి, నేటికీ ప్రత్యేకమైన ఇత్తడి సామాను ఉండేవి. పచ్చళ్లు, పొళ్ళు నాలుగు రకాలు వుంటాయి కదా ! ఒక్కొక్కటి పుచ్చుకు నాలుగుసార్లు తిరగకుండా ఒకేసారి వడ్డించేందుకు పచ్చళ్ళ గుత్తి వుండేది. ఇత్తడి గిన్నెలు కళాయి పెట్టినవి 4 కలిపి వుండి ఒక హ్యాండిల్ వుండేది. ఆ పాత్రతో పాటు పులుసు పోసే పాత్ర గుర్తుకు వచ్చింది. లోతు ఎక్కువ గిన్నె గుండ్రంగా వుండేది. దానికి ఒక పక్క పక్షి ముక్కు ఆకారంగా వుండేది. గిన్నె పైన హ్యాండిల్ వుండేది. అతిథులు పులుసుకోసం అన్నం గుంట చేస్తే సరిగ్గా ఆ గుంటలో పులుసు పోసేవారు. దాని పేరు గుర్తుకు రాలేదు. టేబుల్ దగ్గర మా వాళ్లందరిని అడిగాను. ఎవరికీ తెలియదు. వీరంతా ఆ పాత్రని చూడని పాత్రలే ! ఆ తరవాత ఏదో తింటున్నాను, ఏదో మాట్లాడుతున్నాను కానీ నా బుర్ర అలమరలో ఆ పదం కోసం వెతుకుతూనే వున్నాను. ఏదన్నా గుర్తుకు రాకపోతే బాధగా వుంటుంది. ఎలా మర్చిపోయాను ? ఎలా మర్చిపోయాను అని ఒకటే నస. ఆలాటప్పుడు నామీద నాకే కోపం వస్తుంది. వస్తువుల వాడుక తగ్గిపోయాక వాటి పేర్లు తెరమరుగున పడిపోతున్నాయి. అలాగే భాషలో ఎన్నొ తెలుగు పదాలు మర్చిపోతున్నాం. వాటి బదులు ఇంగ్లీషు పదమో, హింది పదమో నాలిక మీదకి వచ్చి కూర్చుంటుంది. తెలుగు పదం వెతుక్కుంటే గాని గుర్తుకు రావడం లేదు. రెండు రోజులు గింజుకొన్నాక ఆ పదం గుర్తుకు వచ్చింది. పులుసు వడ్డించే పాత్ర పేరు “ గోకర్ణం ”. ఆ గిన్నెకి వుండే వంపు గోవు చెవిలా వుంటుంది కనుక ఆ పేరు వచ్చింది.

 

నెయ్యి వడ్డించే గిన్నెకు కూడా పక్కన నాలుగు అంగుళాల కొమ్ములా వుండేది. నెయ్యి కరిగించి గిన్నెలో పోసుకొని వడ్డిస్తే కొమ్ములోంచి సన్నధార విస్తట్లో పడేది. ఆ గిన్నె పేరు “ నేతి జారీ ”

.

పూర్వం సంసారంలో పిల్లలు పుట్టగానే బంగారాలు, వెండి కొని జాగ్రత్త చేసుకొనేవారు. పిల్లలు పెరుగుతుంటే పండగలకి, పబ్బాలకి వాళ్ళు వీళ్ళు వస్తే వుంటాయని ఇత్తడి సామాను ఒక్కొక్కటి జమ చేసేవారు. గంగాళాలు, బిందెలు, గుండిగెలు, పిల్లలు వేరే కాపురాలు పెడితే ఇచ్చి పంపేవారు. ఇప్పుడేవారికీ మన ఎంపిక నచ్చదు. చెంబు, ఆకుపారా, మరచెంబు మంచినీళ్ళకి. మరచెంబుల మీద కథలు వచ్చాయి. ఆకుపరా తేవే అంటే మా మనుమరాలు పాలకూర పట్టుకొచ్చింది. రాచిప్పలంటే ఇప్పుడెవరికి తెలియదు. మా యింట్లో వుండేవి. ఆమధ్య నా స్నేహితురాలి అమ్మాయి మా యింటికి వచ్చింది. వంటింట్లోకి మంచినీళ్ళకి వెళ్ళి గావుకేక పెట్టింది. నేను హడిలిపోయా – ఏమయిందే ? అంటే “ ఆంటీ ! అబ్బా ! రాచిప్ప వుందాండీ ! ఎన్నాళ్లనుంచో వెతుకుతున్నా. దొరకలా ” అంది. “ ఇస్తాలే ! పట్టుకుపో ! ” అని ఇచ్చాను.

 

ఇంకో ఫ్రెండ్ దీపావళి కి వెళ్ళి ఎనిమిది వెండి గంగాళాలు కొన్నది. ఖంగారు పడకండి – చిన్నవే ! ఇన్ని ఎందుకోయ్ అంటే పిల్లలందరికి తలో ఒకటి ఇస్తా. ఈ తరం వాళ్ళకి పేర్లు కూడా తెలియడం లేదే ! ఒకల్లు అందులో అక్షింతలు పోశారు. ఒకరు పూలు పెట్టి వాజ్ చేశారు. ఒకళ్లు డ్రై ఫ్రూట్స్ పెట్టారు.

 

కుంకుమ భరిణ కొందరిళ్లలో వుండటమే లేదు. అవుసరం లేదు. మనం పెట్టుకోనక్కరలేదు – ఇంకొకరికి పెట్టనక్కరలేదు. పంచపాత్ర, ఉద్ధరిణి, ఏకహారతి ఈ పేర్లు తెలియవు. ఉద్ధరిణి ఉపయోగించేవారిని ఉద్ధరిస్తుంది అనేది మా బామ్మ.  సంస్కృతిని అజరామరం చేయాలంటే మన వస్తువులని ముందు తరాలవారికి అందజేయాలి. ఇది మన విధి.

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾