11_020 చేతికొచ్చిన పుస్తకం 05

చేతికొచ్చిన పుస్తకం-21:

 

గోపీచంద్ ఆర్ట్స్ 4

సంక్రాంతి పండుగ తర్వాత ఓ ఉదయం చిత్రకారుడు గోలి శివరామయ్యను వారింట్లో కలిశాం. ‘వేణునాదం’ పుస్తకానికి తానే ఇష్టపడి ముఖచిత్రం ఇచ్చినప్పటి నుంచి ఇది డ్యూ. కొన్ని విలువైన గ్రంథాలు తీసుకోమని కోరారు, మంచి కాఫీ ఇచ్చిన పిమ్మట! ఎన్ని, ఏవి తీసుకున్నానో నేను చెప్పలేను కానీ ఒక సావనీరు గురించి మాత్రం ఇక్కడ చెబుతా!

హైదరాబాద్ నుంచి గోపీచంద్ ఆర్ట్స్ 1972 లో సావనీరును 200 పేజీలతో వెలువరించింది. చాలా మంది పెద్దలు భాగస్వాములైన ఈ సంచికలో ఓ ఆరు వ్యాసాలు గోపీచంద్ గురించి కాగా మిగిలిన అరశతం నాటకరంగానికి సంబంధించినవి కావడం విశేషం! వ్యాసాల గురించి కాదు, వ్యాసకర్తల జాబితా ఇవ్వడం కూడా కష్టమే!

ఒక్క మాటలో చెప్పాలంటే కడువిలువైందీ, మరీ ముఖ్యంగా నాటకరంగపరంగా!!

చేతికొచ్చిన పుస్తకం-22:

 

గణాంక శాస్త్రమే ఊపిరిగా – సి. ఆర్. రావు జీవితం: కృషి

సాహిత్య అకాడమి, నేషనల్ బుక్ ట్రస్ట్, పబ్లికేషన్స్ డివిజన్, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి వంటి ప్రభుత్వ సంస్థలు చాలా మంచి పుస్తకాలు వెలువరిస్తాయి, ఎన్నో విమర్శల మధ్యన. అయితే వాటికి ప్రచారం ఉండదు, మామూలుగా దొరకవు. సాహిత్య అకాడమి సమావేశాల కన్నా వారి పుస్తకాల ఎగ్జిబిషన్ మీద నాకు ఆసక్తి ఎక్కువ ఎందుకో మీకు బోధపడి ఉంటుంది.

డిసెంబర్ లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫేర్ లో రెండోసారి వెళ్ళినప్పుడు కేవలం ఈ ఐదారు పాపులే తిరిగి కొన్ని కొన్నాను. అలా తెలుగు అకాడమి లో కొన్న పుస్తకం ఇది. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్త సి ఆర్ రావు గురించి నేను ఇప్పుడు రాయటం లేదు. ఆ గొప్ప శాస్త్రవేత్త కు వందో పుట్టిన రోజని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవడం మన మేధావుల‌ బాధ్యతారాహిత్యం.

పాతికేళ్ళ క్రితం వెలువడిన ఈ పుస్తకాన్ని నళిని కృష్ణమూర్తి మంచి ప్రణాళికతో కుదురుగా రాశారు. అసలు ఆ విషయాలేవీ లోపల లేవు. .అయితే మూల రచయిత పేరును తెలుగు అకాడమీ అట్ట మీద చేర్చక పోవడం చెడు పోకడా, బాధ్యతా రాహిత్యమే కాదు, రచయితకు తీవ్రమైన అన్యాయం కూడా!

 

చేతికొచ్చిన పుస్తకం-23:

 

 పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ‘కనకపుష్యరాగం’

నెల్లూరు సాహితీ మిత్రులు, పసగల పరిశోధకులు డా కాళిదాసు పురుషోత్తం గారి మెసేజ్ ఏమి చేసిందో తెలుసా? నా సొంత గ్రంథాలయంలో వందకు పైచిలుకున్న స్వీయచరిత్రలలోకి నా చెయ్యి వెళ్ళేట్టు చేసింది! స్వీయచరిత్రల రచన తెలుగులో తక్కువ, స్త్రీలు రాసినవి ఇంకా తక్కువ! పురుషోత్తం గాలించి, విలువైన ఈ పుస్తకాన్ని 2011లో వెలువరించి పుణ్యం కట్టుకున్నారు!!

పొణకా కనకమ్మ (1892-1963) మహోన్నత వ్యక్తి! బిపిన్ చంద్ పాల్, బాలగంగాధర తిలక్, అనిబిసెంట్ , గాంధీజీ ఇంకా ఉన్నవ లక్ష్మీనారాయణ, కంచి పరమాచార్య వంటి ఎందరో నాయకులతో పరిచయమున్న ఈ మహిళ పలుసార్లు కారాగార శిక్ష అనుభవించిన పోరాట యోధ! సుజనరంజనీ సమాజం, వివేకానంద గ్రంథాలయం, పల్లెపాడులోని పినాకిని ఆశ్రమం, కస్తూరీ దేవి విద్యాలయం, జమీన్ రైతు వంటి ఎన్నో సంస్థలు రావడానికి దోహదపడిన మహాశక్తి కనకమ్మ!

వాదం కన్నా ప్రయోజనం మీద దృష్టి గల కనకమ్మ తొలుత తీవ్రవాదం వైపు మొగ్గు చూపినా, గాంధీజీ ప్రభావంతో దేశంలోనే రెండో గాంధీ ఆశ్రమం (అంతకు ముందు సబర్మతి ఆశ్రమం మాత్రమే ఉంది) ప్రారంభించిన ఆచరణవాది ఆవిడ!

ఇంకా చాలా విషయాలే ఉన్నాయి, మీరే పుస్తకం కొని చదవండి – ఇటీవల విజయవాడ లోని పల్లవి పబ్లికేషన్స్ తాజాముద్రణ వేసింది! మరిన్ని వివరాలకు రచయిత డా కాళిదాసు పురుషోత్తం Purushottam Kalidas +91 90006 42079

 

చేతికొచ్చిన పుస్తకం-24:

మదరాసు బదుకులు

మదరాసు తెలుగువారి స్వభావానికి చిరుదర్పణం

ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో నాకు బాగా తెలిసిన ముగ్గురు మద్రాసు ప్రముఖులు- రిటైరైన ఐఏఎస్ అధికారి, సాహితీవేత్త జే టి ఆచార్యులు ( జనవరి 18); ఆంధ్లాంగ్ల కథారచయిత, తత్వశీలి ‘శ్రీవిరించి’ (జనవరి 26); చిత్రకారుడు, కార్టూనిస్టు బుజ్జాయి ( జనవరి 27) కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురి రచనలున్న మా కథాసంకలనం ‘మదరాసు బతుకులు’ గురించి రెండు మాటలు!

2016 మార్చి నెలలో ఒక ఆలోచన వచ్చింది, అప్పటి అక్కడి తెలుగు వారి జీవితాన్ని చిత్రించే కథలు రాయించి, సంకలనం తీసుకురావాలని. అలా 2017 లో వెలువడిన సుమారు 300 పుటల గ్రంథం లో మొత్తం నలభై కథలున్నాయి. శ్రీవిరించి ముందు మాట, ఆచార్యులు రాసిన ఒకేఒక్క కథ, 1939 నుంచి తనకు తెలిసిన మద్రాసు గురించి బుజ్జాయి రాసిన అనుబంధపు వ్యాసం ఇదే సంకలనంలో ఉన్నాయి!

2017 లో ఈ పుస్తకం గురించి ఒక రోజంతా జరిగిన కార్యక్రమంలో అందరితోపాటు ఈ ముగ్గురు పాల్గోవడం విశేషం! బహుశా అదే ఈ ముగ్గురిని ముఖాముఖి ఆఖరిసారిగా కలవడం! ముగ్గురికి మరోసారి శ్రద్ధాంజలి!

 

చేతికొచ్చిన పుస్తకం-25:

భారత రాజ్యాంగ నిర్మాణంలో నారీమణులు

2021 ఆగస్టు లో క్విట్ ఇండియా దినోత్సవం సమావేశంలో ముఖ్య అతిథిగా డా చిరంజీవినీకుమారి గారు కాకినాడకు ఆహ్వానించినపుడు రచయిత్రి డా ఎం. వి.భారతలక్ష్మిగారు ఈ పుస్తకాన్ని బహుకరించారు.

1946 డిసెంబర్ 9న రాజ్యాంగ నిర్మాణం కోసం తొలిసారి సమావేశం అయినప్పుడు 398 మంది సభ్యులలో 15 మంది మహిళలు. ముస్లిమ్ లీగ్ సభ్యులు విడిపోయాక మిగిలిన 299 మందిలో 15 మంది మహిళలు. వీరిలో విదేశాల్లో చదువుకున్న స్త్రీలు, పురుషులు (5) సమాన సంఖ్యలో ఉండటం విశేషం!

  1. అమ్ము స్వామినాథన్
  2. అనీ మాస్ కేసుల్ని
  3. బేగమ్ కుద్సియా అయినాజ్ రసూల్
  4. దాక్షాయణి వేలాయుధన్
  5. దుర్గాబాయి దేశముఖ్
  6. హంసా జీవరాజ్ మెహతా
  7. కమలాచౌదరి
  8. లీలారాయ్
  9. మాలతీచౌదరి
  10. పూర్ణిమా బెనర్జీ
  11. రాజకుమారి అమృత కౌర్
  12. రేణుకా రే
  13. సరోజినీ నాయుడు
  14. సుచేత కృపలానీ
  15. విజయలక్ష్మి పండిట్… వీరు ఆ పదిహేను మంది.

భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న 15 మంది మహిళల గురించి డా ఎం వి భారతలక్ష్మి రాసిన వ్యాససంపుటి 118 (డెమీ సైజులో ) పుటలతో సంవత్సరం క్రితం 2021 ఫిబ్రవరి లో వెలువడింది. ఈ వ్యాసాలన్నీ ‘మిసిమి’ పత్రికలో చదివినవే అయినా ఒకచోట లభ్యం కావడం అదనపు ఇన్సైట్స్ తో పాటు కించిత్ గర్వాన్ని కూడా కల్గిస్తోంది!

ఆసక్తి ఉన్న వారు ‘మిసిమి’ మాసపత్రిక కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾