శ్లో॥ అసారే సంసారే నిజభజన దూరే-జడధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్
స్వామీ! సారం లేని సంసారంలో నిజ (నీయొక్క) భజనకు దూరమై, అంధుడనై భ్రమిస్తూ తిరిగే నన్ను కృపతో (జ్ఞానదృష్టిని ప్రసాదించి) సద్బుద్ధి ననుగ్రహించి నీవె రక్షించుట ఉచితం స్వామీ! అంటారు. మరో లక్ష్మీనృసింహ స్తోత్రంలో..
శ్లో॥ సంసార సాగర విశాల కరాళకాల
నక్రగ్రహగ్ర సన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగ రసనోర్మిని పీడితస్య
లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ॥
అంటూ సంసార సాగరాన్నుండి ఉద్ధరింపబడటానికి లక్ష్మీనృసింహస్వామి కరావలంబ చేయూతను అర్థిస్తున్నారు. కానీ మనసా, ప్రయత్న పూర్వకంగా భక్తి నావను ఆశ్రయించ గలిగితిమా! అంటే ఈ లౌకిక ప్రేమలను భగవంతుని పైకి మరలించగలిగితిమా! పైన చెప్పిన ప్రతి బంధకాలేవీ మనల్ని బాధించవు! భక్తినావలో కూర్చుని, చిదానందంగా, కెరటాల్నీ, సుడుల్నీ, మొసళ్ళనీ చూస్తూ నిర్భయంగా సాగిపోవచ్చు. అందుకే ‘‘స్వామీ భక్తినావం ప్రయచ్ఛ!!!’’ అని కోరుకుందాం.
మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపిభవతో భక్తిహీనాన్ పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవచరిత మపాస్యాన్య దాఖ్యాన జాతం
మాస్మార్షంమాధవత్వామపి భువనపతేచేత సాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యావ్యతికర రహితో జన్మ జన్మాంతరేపి
సాగరంలాంటి సంసారాన్ని దాటే ఉపాయం సర్వేశ్వరుని పాదకమలాలపై ‘భక్తి’ అన్న నౌక వల్లనే సాధ్యం. భగవంతుని చరణాలపైన నమ్మకమే మనలను ఉద్ధరించే మార్గం. అని చెప్పి, ఇంద్రియాల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మానవుని పతనావస్థకు చేరుస్తాయి సుమా! అంటూ ఇంద్రియాల విషయంలో, భగవంతుని పొందడానికి ఉన్న ప్రతిబంధకాల విషయంలో, ఎలా జాగ్రత్త పడాలో చెబుతున్నారు మహారాజు.
భక్తి ప్రసాదించమని కోరుకుని, ఆ భక్తికి ప్రతి బంధకాలయిన వాటిని తొలగించడానికి, మనసా వాచా కర్మణా ఏవి కూడవో వాటిని వివరిస్తున్నారు. ఓ జగన్నాధా! మాధవా! నీపాదారవిందాలపై క్షణమైనా మనసు నిల్పలేని పుణ్యహీనులను ఈ కంటితో చూడకుందును గాక! పురాణ పురుషా! నీ ఉనికినే సందేహించు నాస్తిక మనస్థితి గలవారి పొందు నాకు కలుగకుండు గాక!
మన ఇంద్రియాలకు ఏది కనబడితే ఆ ఆకారానికి పరవశించి, వశమైపోవడం అలవాటు అది అంతానికే కాగలదు. భగవత్ప్రాప్తికి సుగమమైన, సోపానమైన, ఈ మానవ జన్మకు భగవంతుడు బుద్ధి, మనసు, వాక్కు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కూడిన చక్కని దేహాన్ని ప్రసాదించి, వినియోగించుకునే విధానం తెలిపే శాస్త్రాలను కూడా అనుగ్రహించాడు. మానవుడు తన కిచ్చిన బుద్ధితో సక్రమంగా ఆలోచించి, భగవత్ప్రాప్తినీ, తద్వారా శాశ్వత ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
రూపానికి భ్రమసి దీపం పురుగూ, లేడి పాటకు, ఏనుగు స్పర్శకూ, చేప రుచికీ, తుమ్మెద వాసనకూ లొంగిపోయే కదా నశిస్తున్నవి? బుద్ధి జీవియైన మానవుడు అన్ని ఇంద్రియాలకూ వశమైపోతే పతనానికి అవధి యెక్కడ? ఈ భావాన్నే కంచెర్ల గోపన్న తన దాశరధీ శతకంలో ఇలా అంటారు.
వనకరి చిక్కెమైసనకు వాచవికింజెడిపోయెవినుతా
వినికికి జ్రిక్కెజిహ్వ గనువేదురు జెందెను లేళ్ళుతావిలో
మనికి నశించె దేటి తరమా ఇరుమూటిని గిల్వ నైదుసా
ధనముల నీవె కావదగు దాశరధీ కరుణాపయోనిధీ
ఓ దాశరథీ! గజేంద్రుడు ఆడేనుగుల యందలి శరీర భ్రాంతిచే (స్పర్శ) మొసలికి చిక్కి బాధలు పడినది. చేప జిహ్వచాపల్యము చేత ఎరను తినడానికై వచ్చి, జాలరి గాలానికి చిక్కి నశిస్తున్నది. చిల్వ (పాము) పాములవాని నాదస్వరం వినడానికి వచ్చి వానికి చిక్కి నశిస్తున్నది. లేళ్ళు కనువెదురు చూచుట అనే మోహానికి చిక్కి వేటగాని వలలో చిక్కి నశిస్తున్నది. తుమ్మెద వాసనకు పరవశించి, పద్మంలో చేరి, రాత్రి పద్మం ముకుళించుకోగా అందులో చిక్కి నశిస్తున్నది. కనుక స్పర్శ, రుచి, వినికిడి, చూచుట, వాసన అనే పంచేద్రియాలకు వశమైపోతే పతనానికి అవధి ఎక్కడ?! స్వామీ! ఈ ఇరు+మూటిని = రెండు + మూడు = ఐదింటిని గెల్వ నాతరమా! కనుక ఈ ఐదు సాధనములను నీవే కాపాడాలి. అంటారు. పంచేంద్రియాలూ పరమాత్మవశంలో ఉంటే ఇంక పతన భయమెక్కడ!
విషయాల నుండి మనసును మరల్చడమే కాదు చేయవలసిన కర్తవ్యాన్ని చేయడమూ అంతే అవసరం.
విముఖులతో చేరబోకు మనెనే
వెతగల్గితె తాళుకొమ్మనెనే
దమశమాది సుఖదాయకుడగు శ్రీ
త్యాగరాజనుతుడు… అంటారు త్యాగరాజు తన ఆరభి రాగ పంచరత్నంలో భగవద్విముఖులతోడి సాంగత్యం చేయవద్దని, ఓర్పు గలిగి ఉండాలనీ బోధించి, దమశమాది సుఖదాయకుడు ఆ స్వామేనని, అందుకే ఆ స్వామి భావనే కర్తవ్యమని అంటారు త్యాగరాజస్వామి.
మాధవా! నేను ఏంచేసినా, ఏం మాట్లాడినా, అది నీకోసం మాత్రమే కావాలి. ఎన్ని జన్మలెత్తినా నా ఇంద్రియములు నీ విముఖులకు విముఖములై, నీకు అభిముఖములై ఉండుగాక!
భక్తి లేనివారి సాంగత్యం వల్ల అంతకు ముందు మనలో ఉన్నది కూడా లుప్తమై, నాస్తికమనస్తత్వం ఏర్పడుతుంది. భగవద్భక్తి కలవారి దర్శనమే దైవదర్శనమంత ఆనందాన్ని, శాంతినీ ఇస్తుంది.
రామభక్తి సామ్రాజ్యమే మానవుల కబ్చెనో
ఆ మానవుల సందర్శన మత్యంత బ్రహ్మానందమే అంటారు త్యాగరాజు తన బంగాళ రాగ కృతిలో.
భగవంతుని అంతరంగంలో నిల్పుకున్న భక్తులు శాంత చిత్తంతో, సదా ఆనందంతో, దైవ గుణాలతో భాసిస్తుంటారు. అటువంటి వారి దర్శనమాత్రమే మనకు శాంతినిస్తుంది. సంతోషాన్నిస్తుంది. మనలోనూ భక్తి భావాన్ని పెంచుతుంది.
భగవంతుని కధలూ, భగవంతుని గురించిన చర్చలూ మనసుకు శక్తినిస్తాయి. అలాకాక రాజసతామసులతోడి చెలిమి మనసును కలుషితం చేసి, పతన కారణ మవుతుంది.
మనం చదివే పుస్తకాలూ, వినే సంగీతమూ, తిరిగే పరిసరాలూ చేసే చెలిమి, తినే పదార్థాలు… ఇవన్నీ కూడా మన జీవితంపై ప్రభావం చూపగలవు. భగవంతునికి దూరం చెయ్యగలవు. ఆ విషయాలనే త్యాగరాజుల వారు తన గౌళరాగ పంచరత్నకృతిలో విపులంగా చర్చించారు.
మలయనాట రాగంలో…
ప॥ దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా
అ.ప॥ కడుదువ్వపయా కృష్ణుడై గడి తొగడియకు నిండారు ॥ దుడుకు ॥
చ. మానవతను దుర్బభమనుచెనెంచి పరమానందమందలేక
మదమత్సరకామ లోభమోహులకు దాసుడై మోసపోతిగాక।
నరాధములను కోరి సారహీన మతములను సాధింప తారుమారు ॥దుడుకు॥
త్యాగరాజు సర్వగుణ సంపన్నుడే? భాగవతోత్తముడే కానీ సమాజపు పోకడను గమనించి, వారిలో ఉన్న అవగుణాలను తనపై ఆరోపించుకుని, తన మనసును వ్యాజంగా మందలిస్తున్నారు.
ఇంకా…
సతులకై కొన్నాళ్ళాస్తికై, సుతులకైకొన్నాళ్ళు
ధనతులకై తిరిగితినయ్యా… ఇటువంటి నన్ను
ఏ దొర కొడుకు రక్షిస్తాడూ! అంటూ నిష్ఠూరంగా మనలోని లోపాలను ఎత్తి చూపి, ఆవిధంగా ఉండటం పతనహేతువని మందలిస్తాడు.
భగవంతునే భక్తినివ్వమని ప్రార్ధించి, అందుకు ప్రతిబంధకాలయిన పాపాలను పోగొట్టుకోవడానికై, ఇంద్రియాలతో మనసులో సాధింపవలసిన శమదమాది సాధన సంపత్తిని వివరించి, మనసుకు భక్తిమార్గ పయనాన్ని అలవాటుచేసినా, అనేక జన్మల నుండి ఈ సంసార జలధిలో తిరగడం వల్ల, ఆ వాసనా బలంతో లాగబడుతూ, కొంతసేవు భగవంతునిపై మనసు లగ్నం చేసినా, తిరిగి ఆ పాతవిషయాలనే తలపించి, బెంగపడటం మానదు. ఎందుకంటే ఇంద్రియాల ప్రాబల్యం మనసు మీద అంత బలీయం! అందుకే ఆ ఇంద్రియాలను ఎలా భగవదున్ముఖం చెయ్యాలో చెబుతున్నారు. ఒక్కొక్క ఇంద్రియాన్ని సంబోధిస్తూ… మహారాజు…
- జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం
చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కథాః
శ్రోత్రద్వయ త్వం శ్రుణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరే
ర్గచ్ఛాంఘ్రియు గ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం
మూర్ధన్నమాధోక్షజం ॥
ఇంద్రియనిగ్రహం రెండు విధాలు చేయకూడని వాటి నుండి మనసును మరల్చడం, చేయవలసిన వాటిని చేయడం విచిత్రా దేహసంపత్తి రీశ్వరాయ నివేదితుం’’ ఈ విచిత్రమైన దేహ నిర్మాణం ఈశ్వరుని కొరకు వినియోగించడానికే ఏర్పడినది. ఈ శరీరం భగవంతుడు ప్రసాదించింది. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహాన్ని భగవంతుని సేవలో కాక ఇతరత్రా కేవల భోగాపేక్షతో వినియోగించడం కృతఘ్నత అవుతుంది. బంధానికి కారణమవుతుంది. అలాకాకుండా, ఓ నాలుకా కేశవుని కీర్తించు. కేశవనామం ముక్తిప్రదం. బ్రహ్మరుద్రాదులకు కారణమైనవాడు కేశవుడు ‘‘కారణంతు ధ్యేయః’’ ` కారణతత్వాన్ని తెలిసి, స్మరించడం ధన్యతను చేకూరుస్తుంది. కేవలం రుచులను చవిచూడటానికే అయితే గరిటికూ నాలుకకూ తేడా లేదు. అందుకే ముందుగా నామ సంకీర్తన చేయమంటున్నారు.
ఓం శ్రీ కృష్ణాయ నమః అని జపించు నాలుకా! ఆ నామం రుచి ఒక్కసారి చవిచూస్తే, మనసు అలౌకిక ఆనందానికి ఆలవాలమవుతుంది.
నలిన దళాక్షుని నామకీర్తనము ` కలిగి లోకమున కలదొకటే.
ఇలనిదియే భజియింపగ పుణ్యులు ` చెలగి తలపసం జీవనియామె ।
ఇన్నిటా ఇంతటా ఇరవొకటే `
వెన్నుని నామము వేదంబాయె ॥ అంటూ పాడారు అన్నమయ్య.
అందుకే మహాత్ములైన వారు ఎల్లప్పుడూ భగవన్నామ సంకీర్తన చేయడంలోనే ఆనందాన్ని పొందుతూంటారు.
శ్లో ॥ సతతం కీర్తయన్తోమాం యాతన్తశ్చధృఢవ్రతాః
నమస్యన్తశ్చ మాంభక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥
తరువాయి వచ్చే సంచికలో……
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾