11_020 ఉన్మత్త రాఘవం

                                     ( కావ్య నాటిక )

సంస్కృత మూలం – శ్రీ భాస్కర కవి.
తెలుగు అనువాదం – శ్రీ కోరాడ రామ చంద్ర కవి.

శ్రీ కోరాడ రామచంద్ర కవి తొలి తెలుగు నాటక రచయిత.
పంతొమ్మిదవ శతాబ్దంలో జీవించిన ప్రముఖ కవి. (1816 – 1897) 
తెలుగు నాటక కర్తలలో వీరు ప్రధములు. సంస్కృత భాషనుంచి తెలుగు లోనికి అనువాదం చేసిన మొదటి రచయిత కూడా వీరే కావడం విశేషం.
అవధాన విద్య యందు ప్రవీణులు. తారక మంత్రోపాసకులు. సాహితీ మూర్తులు. బందరు నోబిల్ కళాశాలలో సంస్కృత, ఆంధ్రోపన్యాసకులు. సంస్కృత, ఆంధ్ర భాషలలో ముప్పదికి  పైగా కావ్యాలు, నాటకాలు  రచించారు. ఈయన ప్రధమాంధ్ర  నాటక రచయిత మాత్రమే  కాదు “స్వోదయ” పేరుతో వారి స్వీయ చరిత్రను కావ్య రూపాన సంస్కృత భాషలో రచించారు. ఆయన గ్రంధాలలో “ఘనవృత్తం” అనే సంస్కృత కావ్యం , “మంజరీ మధుకరీయం” అనే తెలుగు నాటకం ప్రసిద్ధాలు. వీరు సంస్కృతం లోని “వేణీ సంహారం” నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం  నుండి తెలుగు లోనికి వచ్చిన మొదటి నాటకం. ఆయన ఆంధ్రీకృత గ్రంధాలలో మరొకటి  “ఉన్మత్త  రాఘవం” – భాస్కర కవి కృతం. అతి క్లిష్ట పదజాల ప్రయోగంతో, పద్య గద్య రూపాన రచింప బడిన తెలుగు నాటకం.

ఆ నాటకాన్ని తేలికైన తెలుగు పదాలతో కూర్చి  చదువరులకు పరిచయం చేయాలనే ఆశతో చేసిన సాహసమే ఈ క్రింది సరళీకరణ.

(శ్రీ కోరాడ రామచంద్ర కవి మా మాతామహులైన శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి పితామహులు.)
                                                           ___
           

                                           

                                               ఉన్మత్త  రాఘవం

             
                                          { మంగళ స్తుతి,  నాటకారంభం }

 

 

(పుష్పములను కోయుట నభినయించుచు ప్రవేశము సీత, సఖి మధుకరిక)

మధు- చెలీ ! జానకీ ! ఎదుటనే విరులు కనబడుచున్నవి కదా అపరిచిత ప్రదేశముల కెందుకు వెడలుచున్నావు?

సీత – చెలియా ! మధుకరికా ! ఆతోట యందు ఇంతకు మించి యందమైన పుష్పములు గలవను కోరికచే వెళ్ళు చున్నాను.

మధు – చెలియ జానకీ ! ఇప్పటికిని మనకీ ప్రదేశములు అపరిచితములు. ఈ యడవులందు శపింపగల తాపసులు పెక్కుమంది గలరు. ఇతరుల యాశ్రమంబుల పూవులు కోసినచో వారు కోపించ గలరు. రామభద్రుడును నీకు సంతసము సలుప బంగారు లేడిని చేకొని వేట నుండి మరలి రాగలడు. కావున కోసిన పువ్వులు చాలు. పర్ణశాలకు పోవుదము రమ్ము.

సీత – అందరికిని అనుభవ యోగ్యములు కదా వన్యము లందలి పుష్ప ఫలములు, నదీ జలములు! కావున నెవరైన ఎందుకు కోపగించుదురు? ఆర్య పుత్రుని దేవతార్చన కీ పుష్పములు చాలవు కావున యా ముందున్న వనమున విరుల గోసుకుని పర్ణశాలకు పొవుదము.

                                 (ఇరువురు వెడలుచున్నారు)

సీత – (ఆశక్తితో గాంచుచు) చెలియా! ఇచట మధుకరంబులు శీఘ్ర గతిని యా తీగల గుబురుల యందలి పూలలో గుమిగూడి భ్రమించుట ఎంత వింత!

మధు – ఓ చెలియా ! పచ్చని యాకులచే నావృత్తమై యలరు నీ ముఖారవిందమును పుష్పముగా భ్రమించి, పూదేనె యలభ్య మగుటను ఖేదించి, మతి భ్రమించి యట్లు పొరలాడుచున్నవి. నిజము సుమా!

సీత – (విలోకించి) చెలియా! బాగుగా తలచితివి.

మధు – ఎంత వింత! (అంతటా కలియ తిరుగుచు) చెలియ కానరాదే !

సీత – ఓ మధుకరికా ! దీనిని దానితో కూర్పుము.

మధు – ఈ దండము సహాయమున పూపొదలో తేనె గ్రోలుచున్న ఈ మధుకరమును లేవ గొట్టె దను. ఆశ్చర్యము! తేనెటీగ ఈ పూ పొదను వదలి తన ప్రియురాలితో గూడి మాధవీ లతను చేరి మధు రసము గ్రోలుచు సంబర పడుచున్నది.              
(నలు దెసల పరికించి)
జానకి ఎటు వెడలె? ఎచటను కాన రాదాయె!
(వన మధ్యమున చేరి వెదకుచు, ఎదట చూచి)
ఆహా! ఏమీ  వింత! సుందరమైన నీ హిరణము చెమర్చిన కనులతో, చెలిమితో నన్ను గాంచు చున్నది. పూర్వ జన్మమున నేను దీని సఖి యను భావమును నాకు కల్గించుచు, నా సమీపముననె తిరుగుచున్నది. ఇది తాపసుల యాశ్రమ ప్రదేశ మగుటచే దుష్ట జంతు సంచారము లేదు.
జానకి ఎటు పోయెనో నాకు మిక్కిలి విస్మయం బగుచున్నది! (నిట్టూర్చి)
నేను మంద భాగ్యను కదా! వేట నుండి మరలి వచ్చు రామ భద్రున కేమని చెప్పుదును? ఈ వృత్తాంతము వినిన రాముని పరిస్థితి ఏమగునోయని మనసు కలవర మొందు చున్నది.

 

                               ( నేపధ్యమున కలకలము )

 

(తాపసులు సంచరించుట గోచరించును. రామ భద్రుడు కనక మృగము తో ప్రవేశించుట సూచింప బడును.)

వన్య మార్గములెల్ల యూడ్చి, కలశ ధారలతో పవిత్ర మొనరించి,
పరిమళ భరితమౌ పుష్ప రాసుల మాలలతో నలంక రించుడు.
ఇనకుల గోత్రు డరుదెంచు చున్నాడు
సీతకు ముదమలరింప బంగారు లేడితో….!!!
మిత భాషియు, వినయ సౌజన్య శీలి, సౌమిత్రి వెంట రాగా, చుట్టి వచ్చుచు,
వన్య ప్రాంత మందలి మనోహర దృశ్యముల గాంచుచు,
సుందర వదనారవిందుడై, అతి ముదమున సంభాషించుచు,
శ్రవణాగ్ర భాగమును చుంబించు వింటిని దాల్చిన వాడై,
ముత్యముల బోలు చెమట బిందువుల ముఖమున దాల్చి,
ధరణీ సుతను గాంచ కడు ఆత్రముతో….
మన్మధాభి రాముడదే యేతెంచుచున్నాడు!!!

మధు – (సంభ్రమముగ) – రామభద్రుడు ధనుర్ధారి యై చెంతనున్న సౌమిత్రితో  నేదో ఆలోచించుచు నిటు వైపే యేతెంచు చున్నాడు. కావున నేనును వారి సమీపమునకు పోవుదును. (అట్లే చేయును).
(ప్రవేశించిన పిదప)

రామ – ఓయీ వత్సా! జానకి ఈ బంగారు లేడిని గాంచి తప్పక ముదము నొందును.

లక్ష్మ – మాట మాత్రాన అన్న జానకీ మాత మాటను పాటించి, యామెకు వేడుక కల్గించిన నీ యనుగ్రహమే ఆమెకు హైమ హిరణ లాభము కంటె నతి ముదమును కల్గించ గలదు.

రామ – (నిమిత్తం బభినయించి) – ఓ లక్ష్మణ! సకల మునిజన మాన్యుడగు ఆగస్యుని తపోవనము వివిధ కౄర మృగములతో గూడి యున్న ప్రదేశము. మరియు నపరిచితము. ఇచట మధుకరిక తో గూడ నుండిన జానకిని తలచి మనము కీడును శంకించు చున్నది.

లక్ష్మ – ఆర్యా ! “ప్రేమ పశ్యతి భయా న్యప దేపి ”  ప్రేమాతి శయమే ఆప్త జనులకు ప్రమాదమును ఊహింప జేయును.

మధు – (స్వగతం) ఇదియే సరియగు సమయము. కావున ఇప్పుడు వెడలి సీత వృత్తాంతము తెలియ జెప్పుదును.
( వారి చెంతకు పోవును.)

లక్ష్మ – (మధుకరికను గాంచి మనమున) ఏమిది? మధుకరిక చిన్నబోవు వదనముతో నొంటరి యై వచ్చుచున్నది. సీతామాత కేదేని యాపద వాటిల్ల లేదుకదా !

మధు – మహారాజునకు జయము !

రామ – మధుకరికా ! జానకి యెచట నుండె ?

మధు – ( సగద్గద స్వరంబున ) ఓ దేవా ! దేవర దేవతార్చనకై విరులం గోయుదునని పర్ణశాల చెంతనుండు తీగల దెసగా బోయె.

లక్ష్మ – దేవతారాధనకై కుసుమము లవస్యములే.

రామ – ఈమె యేమి వచించునో యని మనసు శంకించు చున్నది. (ప్రకాశముగా) పిమ్మట పిమ్మట?

మధు – మిక్కిలి చక్కని పుష్పములచట గలవని జానకి కాననాంతరము సేరె. వెంటనే వెదుక కానరాదాయె.

రామ – హా! విధిచే వంచితుడ నైతిని కదా!
చిరకాల ప్రజ్వలితాగ్నిని ఢీ కొని యాకారము కోల్పోయిన లోహము మాదిరి
ధరణీ సుత అదృశ్య మయ్యె నను మిక్కిలి విచారకరమగు వార్త చెవినం బడి, అతిశయించిన తిరస్కారాగ్ని శరీరమును దగ్ధము చేయగా స్నేహ భావమును కోల్పోయినవాడ నైతిని. అకటా! రిక్త హస్తుడనైతి!

లక్ష్మ – హా! కష్టము. దైవ లీల ఎంత దారుణము!
మాతృజనమును, అతి పూజ్యులు తండ్రిని, సోదరులను, ప్రభుత్వమును, సకల సంపదలతో నలరు గృహమును, ఆత్మీయులగు బంధు మిత్రులను, సకల భోగములను న్యాయ పాలనకై త్యజించి అరణ్య సీమల కేతెంచిన మాకేల ఇట్టి సహింప జాలని దుఃఖము సంభవించెనో కదా!

రామ – నన్ను వదలి యుండ లేక, కఠిన పరిస్థితుల కోర్చి, సకల సంపదలను తిరస్కరించి, ఏ మాత్రము అనుమానము లేక, ఎవ్వరేమి చెప్పినను లొంగక మా వెంట వచ్చితివి. అయ్యో!
ఇసుమంతైనను నీ తప్పు లేకయే ఇట్లు మాయమగుట ఎట్లు సమర్ధ నీయము?

లక్ష్మ – (తనలో) ఈ బంగారు లేడిని గాంచిన నార్యుడు మిక్కిలి దుఃఖితుడగును కావున దీనిని వేరొక ప్రదేశమునకు తరలించెదను. (అటు తిరిగి) మధుకరికా! దీనిని పర్ణశాలకు తీసుకొని పొమ్ము. నేనార్యుని సమీప గృహమునకు తోడ్కొని పోయెద.

మధు – అట్లే.

(కనక మృగముతో వెడలును.)

రామ – అకటా! నా జీవితమునకే జీవమౌ లతాంగికి అనవసరముగా సంకటము సంభవించెను కదా! నా సుందరాంగి సీతను క్షేమముగ నెచట గాంచెదను?

లక్ష్మ – ఇట్లు చింతించ నేల? ఈ వనమంతయు వెదకిన తప్పక సీతామాతను  గాంతుము.

రామ – సజలంబులైన నా నయనములకు సీత ఎట్లు కాన గలదు? అట్లైన మార్గము చూపుము వెదకుదము.

లక్ష్మ – ఓ ఆర్యా! ఇసుక మయమౌ ఈ ప్రదేశమున దేవి పద ముద్రల వరుస వ్యక్తమై కనబడు చున్నవి.

రామ – (విలోకించి) నిజమే!
ఇవి నా  జీవిత ప్రియయగు జానకి పద ముద్రలే.
అవిగో! చిగురాకులవంటి నా లక్ష్మి కాలి వేలి ముద్రలు.
ఆనపూర్వకముగా నివి నా పద్మజ పాద చిహ్నములే కదా.
మనమున ఎంతాలోచించినను జానకి నడచి ఎటు వెడలెనో అంతు పట్టకున్నది!
(నిట్టూర్పు విడిచి)
ప్రణయ కలహమున చెలిమి పొందుటకై మొక్కినపుడు శిరము నుండి జారిన కుసుమము వలె దీప్తి వంతమై, లేడి కూన వలె కడు దైన్య దృక్కులు గల జనకసుత పాద పద్మ ముద్రలు కడు మనోజ్ఞముగా కనబడుచున్నవి.
(పాద పధ్ధతి తలచుచు అవలోకించుచు)
కాటుక కంటితో కన్నీటిని కార్చుచు, సుదీర్ఘముగ సాగు యీ బాటల యందు ఆవేదనాగ్రస్తయై నా ప్రాణేశ్వరి తప్పక గోచరించును.
(సమీపించి)
ఓ ప్రేయసీ! ప్రసన్నమగుము. ఓ నా ప్రియే! కోపము విడుము.
లేనిచో నది చంద్రుని వలె ప్రకాశించు నీ మోమును శుక్ల పక్ష చంద్రుని వలె విమలత్వము క్షీణింప జేయును. ఓ భాగ్యవంతురాలా! శుభ ప్రదమగు నీ పాదములకు వందన మొనరించి, నీ పాదముల నలంకరించు లత్తుక నా శిరమున దాల్చి సంతోషింతును.

                             (ఇట్లని యడుగు జాడలకు ప్రణమిల్లును.)

లక్ష్మ – (మనమున) కష్టము! ఆర్యునకున్మాద దశ కల్గుచున్నది. (ప్రకాశముగా) ఆర్యా! జానకీ మాత ఎట నున్నదని శిరసు వంచి వందన మాచరించుచున్నావు?

రామ – (లేచి పుష్పభరిత మగు యా స్థలమును గాంచి)
పూతేనియల భారముచే వంగి, వినమ్రమముగ శిరము వంచి వందన మాచరించు పుష్ప శాఖా భాగములు రసాతలము నుండి జారి మకరందమును గ్రోల వచ్చిన భ్రమర సమూహములచే నావృత్తమై  
అరుణ వర్ణమున నొప్పు యీ స్థల పద్మినిని జూచి మూఢత్వము నొందితి!

లక్ష్మ – ఆహా! ఎంత ఆశ్చర్యము! అదియును సహజమే కదా!
జ్ఞానమునకు అజ్ఞానమునకు సంవాదము జరుగు చున్నది
కొన్ని పలుకు లసత్యములు, మరికొన్ని సత్యములు.
అల్ప దళ వృక్షమున వెలుగు నీడలు రెండును సమమై యున్నట్లు యీ వీరుని యందు భావ సంఘర్షణ జరుగుచున్నది.

రామ – కానిమ్ము దీని నడిగెద. సీత అడుగుల వరుస ఇచటకు చేరెను.
ఓ పుష్పమా! నా నలిన నయనను నాకిమ్ము.
లేకున్న ఇట నుండి ఆమె పాద ముద్ర లెచటి కేగెనో తెల్పుము. (ఊహించుచు) ఈ మందవాయువు సూచన చేత కమల వదన, ప్రేయసి పద ముద్ర లిట నుండి వెళ్ళుట తెలియుచున్నది.

లక్ష్మ – దేవి చరణ ముద్ర లిట నుండి సహకార వాటిక చేరినవి.

                              (ఇరువురు సహకార వాటిక ప్రవేశింతురు)

లక్ష్మ – (మనమున) ఆర్యుని మనసు మరలింతును. (ప్రకాశముగా)
లతల చివరి భాగము లన్నింటినీ కొంచెము కొంచెముగా కదల్చుచు, వాటిపై నొప్పు భ్రమరములతో సమముగా పోవుచు, చిగురాకులపై నున్న నీటి బిందువుల హరింప జేయుచు, సువాసనా భరితయై  తమ గొప్పదనమును చాటుచు మంద పవనములు ఆహ్లాదమును కల్గించుచున్నవి.

రామ – విరహి జనులకు కార్చిచ్చు వంటి వాయు దేవా!
జగమునకు ప్రాణ దాతవని జనులు నిన్ను పొగడుట మిధ్యయే సుమా! జగములో నొక డైన నాకు శత్రువై నా ప్రాణముల తీయుచున్నావు.
విరిసిన శిరీష కుసుమము వలే నొప్పు సుకుమారి సీత. ఆమె యంగములను తాకవలసినచో….
ఇపుడు నన్ను మన్ననతో తాకిన విధమున మృదువుగా స్పృశించుము.
లేనిచో మరలి పొమ్ము. (ఆలోచించి) కానిమ్ము ప్రేయసి కొరకై అడిగెద.
ఓ మంద పవనమా! నీవు వనమంతయు కలియ తిరుగు వాడవు గాన, ఈ వృక్ష ఛాయ లందు తిరుగుచు, శుభ లక్షణములతో నలరారు అదృశ్య యగు సీత నెచట నైన గాన్చితివా చెప్పుము.
ఓ చందన పవనా! నా ప్రేయసీ వదన సహజ సౌరభ్యమును అచటి వాయువు లందు పొంది ఈర్ష్య చెంది మరలి పోయితివా?

                                     (సమీప ప్రదేశముల గాంచి.)

ఈ చూత వృక్షము నుండి వెలువడు సుమధుర గాత్ర రసప్రవాహము లందీ భ్రమరములెల్ల స్నాన మాచరించి, పిదప గౌరవ పూర్వకముగా మన్మధ మంత్రములు చదువు చున్నవి. నిరంతరము మధు రస సేవనలో మునిగి యుండు ఈ భ్రమరముల వ్యవహారము సత్యాన్వేషణకు కొరగానివి.
(లక్ష్మణునితో) వత్సా!  ఈ మామిడి వృక్షమున సీత కొరకై వెదకుము. చిగురాకులలో నుండి వెల్వడు మధుర నాదము దుఃఖితుడ నైన నా మనసునకు శుభ సంకేతముగా తోచుచున్నది.

 

                                                                       తరువాయి వచ్చే సంచికలో…..

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾