11_020 విధి విన్యాసం

   

“మే ఐ కమిన్ సర్” అంటూ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చిన పాతికేళ్ల అమ్మాయిని చూస్తూ విభ్రాంతికి లోనయ్యాను.

    “ నా పేరు నవీన. నన్ను ఇక్కడ కొత్తగా అపాయింట్ చేశారు ” అంటూ ఆర్డర్స్ తీసి ఇచ్చింది. నేను అది చదివి “ నీవు బి. ఏ. క్లాసుకు వెళ్లి పాఠం చెప్పమ్మా! ” అన్నాను.

    వెళుతున్న నవీనను చూస్తూ ఇది ఎలా సంభవం? ఈ అమ్మాయి అచ్చం జలజ లాగే ఉంది అనుకున్నాను. ఒక ప్రిన్సిపాల్ గా …పగలంతా ఊపిరి తీసుకోవడానికి కూడా తీరికలేనంతగా పని చేశాను.

    రాత్రి భోజనం చేశాక ప్రొద్దున కాలేజీ లో చేరిన నవీనను గుర్తుకు తెచ్చుకున్నాను. నవీన ను చూస్తుంటే నాకు జలజ గుర్తుకు వస్తోంది. జలజ ఎక్కడ ఉందో అనుకుంటుంటే మనసు గతంలోకి వెళ్ళిపోయింది.

    నేను లెక్చరర్ గా పని చేసే కాలేజీలో, అదే డిపార్టుమెంటులో జలజ లెక్చరరుగా చేరింది. జలజకు ఏ సందేహం వచ్చినా నేను చెప్పేవాడిని.

    నిదానంగా మాకు ఒకరంటే ఒకరికి అభిమానం ఏర్పడింది. కాలం గడిచేకొద్దీ అది ప్రేమగా మారింది. మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాము.

    జలజ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. జలజను తల్లిదండ్రులు గారాబంగా పెంచడం వల్ల జలజకు మొండితనం ఎక్కువ. జలజ ఏమనుకొంటే అది జరగవలసినదే. తమ కులము కాని వ్యక్తిని, జలజ పెళ్ళిచేసుకోవడానికి వీల్లేదని తల్లిదండ్రులు చెప్పారు.

    జలజ మొండితనంతో తన పట్టు విడువ లేదు. మా తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో… రిజిస్ట్రారు ఆఫీసులో  జలజ, నేను పెళ్లి చేసుకున్నాము.

    పెళ్లి చేసుకుని మెడలో పూలదండలతో మేము జలజ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూసి జలజ  తల్లిదండ్రులు షాకు కు గురయ్యారు. మేము జలజ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాము.

    జలజ తల్లి కూతురికి తాము చేయించిన నగలు, చీరెలు ఇచ్చింది. అవి తీసుకుని జలజ నాతో మా ఇంటికి వచ్చింది. జలజ ఎంతో సుఖంగా, ఆనందంగా ఉంది.

    జలజ అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఆరు నెలల కాలం ఎంతో సంతోషంగా గడిచింది. జలజ గర్భం ధరించింది. జలజ ఇంటిపని ఆఫీసు పని చేయడం కష్టంగా ఉందని, నేను మా తల్లిదండ్రులను పిలిపించాను.

                                          * .   *.     *      *.      *

    జలజకు పల్లెటూరు నుండి వచ్చిన మా అమ్మ నాన్నల పద్ధతులు ఏ మాత్రము నచ్చలేదు. నాన్న ఎప్పుడూ, చుట్ట కాలుస్తూ ఉంటాడు.ఆ వాసన జలజకు భరించరాని తలనొప్పిగా ఉండేది. అంతేగాకుండా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూ ఉంటాడు.

    అన్ని కూరల్లో వెల్లుల్లి పాయ, మసాలాలు వేసి అమ్మ కూరలు చేస్తే, తప్పనిసరిగా ఏదో అన్నం తింటున్నది గాని జలజకు నచ్చడం లేదు. ఒక ఆదివారం ఇంట్లో నీచు వాసన. అమ్మ నడిగితే మీ మామకు, చంద్రానికి ఇష్టమని  మాంసం కూర వండుతున్నానంది.

    జలజ ఆ వాసన భరించలేక తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. నేను గదిలోకి వెళితే, నేను ఈ వాసన భరించలేను. నేను మా అమ్మ ఇంటికి వెళతానంది. అమ్మ నీకు పప్పు, చిక్కుడు కాయ కూర, రసం చేసింది. నేను అన్నం గదిలోకి తీసుకు వస్తాను, తినమని బ్రతిమాలి తినిపించాను.

    నెల రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఒక ఆదివారం మాంసం కూర తెచ్చి వండుతుంటే జలజ గొడవ చేసింది. మా నాన్న “ మాంసం తినేవాళ్ళం తినకుండా ఎలా ఉంటాము?. నీ కోసం మేము అన్నీ మానుకోవాలి గానీ మా కోసం నీవు ఏ మాత్రం సర్దుకు పోవా? ” అన్నాడు.

    జలజ తలుపు ఢాం అని మోగిస్తూ వేసి తన గదిలోకి వెళ్ళింది. నేను జలజను బ్రతిమాలి అన్నం తినిపించాను. మీ అమ్మా నాన్నలను ఊరికి పంపించమని జలజ సలహా…

    ” మా అమ్మా నాన్నలు ఇక మీదట మన ఇంట్లోనే ఉంటారు.” నాన్న ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నేను…

     జలజకు ఏడవ నెల రాగానే పురిటికి పుట్టింటికి వెళ్లింది. ఉద్యోగానికి రాజీనామా చేసింది.

    అప్పుడప్పుడు నేను అత్తగారింటికి వెళ్లి జలజను చూసి వచ్చేవాడిని. ఒకరోజు జలజ నాతో… ” మీ అమ్మా నాన్నలతో నేను కలిసి ఉండలేను”. మా అమ్మ వాళ్ళింటి దగ్గర నీవు వేరే ఇల్లు అద్దెకు తీసుకుంటే, అక్కడకు పుట్టిన బిడ్డను తీసుకుని నేను వస్తాను.

    మనమిద్దరం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ దగ్గర మన బిడ్డను వదిలితే, అమ్మ చూసుకుంటాదంది.

   ” మా అమ్మా నాన్నకు నేనొక్కడినే సంతానం. మా అమ్మా నాన్నా మనతోనే ఉంటారు. వాళ్ళే మన బిడ్డను పెంచుతార”న్నాను.

    “ అలాగైతే నేనొప్పుకోను. నేను మీ ఇంటికి రాను. నీవు నాతో మాట్లాడవద్దు. నాకు ఫోను చేయవద్దు. నీవు ఫోను చేసినా నేను తీయను ” అని జలజ చెప్పింది. నేను దిగులుగా వెనుదిరిగి వచ్చాను.

     నేను జలజకు ఫోను చేయలేదు. తర్వాత జలజ నుండి గాని, వాళ్ళ తల్లిదండ్రుల నుండి గాని ఎలాంటి సమాచారం లేదు. ఏ బిడ్డ పుట్టిందో కూడా చెప్పలేదు. రెండు నెలలు గడిచాక జలజ విడాకులు కావాలని లాయరు నోటీసు పంపింది. మేము విడిపోయాం.

                                           * .   *.    *.     *       *

    నవీన అచ్చం జలజలాగే ఉంది. జలజ కు ఆడపిల్ల పుట్టిందా? ఆ పాపాయే,ఈ అమ్మాయా? అని నాకు సందేహం కలిగింది. కాలేజీలో రోజూ నవీనను చూస్తున్నాను. “ వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకు మా ఇంటికి రా. నీతో మాట్లాడాల”ని నవీనతో చెప్పాను.

    నవీన ఆదివారం ఉదయం మా ఇంటికి వచ్చింది. నేను నవీనను నా భార్యా బిడ్డలకు పరిచయం చేశాను. మాపెద్ద కొడుకు కిషోర్ మెడిసన్ రెండవ సంవత్సరం, చిన్న కొడుకు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

    నేను నవీనకు ఇల్లంతా చూపిస్తూ, నా గదిలోకి తీసుకు వెళ్ళాను. అక్కడున్న ఫోటోను చూసి నవీన ఉలిక్కి పడింది. “ ఆ ఫోటో ఎవరిది? ” అని నన్ను అడిగింది. “ అది నా పెళ్లి ఫోటో ” అన్నాను. “ మరి ఇందాక మీ భార్యను పరిచయం చేశారు కదా! ” అని అడిగింది.

    “ ఆమె నా రెండవ భార్య శాంత. ఈ ఫోటోలో ఉన్నది నా మొదటి భార్య జలజ. నాకు విడాకులు ఇచ్చింది ” అన్నాను.

    ” మీతో ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మే” నంది. “ ఇన్నాళ్లు నేను మా నాన్నను చూడలేదు. మీరు నాకు జన్మ ఇచ్చిన తండ్రి.” అంటూ నా కాళ్ళకు నమస్కరించింది. నేను అమితానందం తో కూతురిని లేవనెత్తాను.

    అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన శాంత, “ భగవంతుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి ” అంది. నా ఆనందానికి అవధులే లేవు. మగ పిల్లలకి వాళ్ళ అక్కగా నవీనను పరిచయం చేశాను. ఆడ పిల్లలు లేని మా ఇంట్లో నవీనను అందరూ ఆప్యాయంగా ఆదరించారు.

    “ భోజనం వేళ అయింది. అందరం కలిసి భోంచేద్దాం ” అంది శాంత. “ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఇంటికి  వెళతానంది ” నవీన. “ మీ అమ్మకు ఫోను చేసి చెప్పు. ఈ పూట ఇక్కడ భోజనం చేయాలి ” అంటూ నవీనను కుర్చీలో కూర్చోపెట్టింది. అందరం ఆనందంగా భోజనం చేసాము.

    నవీన ను వాళ్ళ ఇంట్లో దింపుతానని నేను బయలుదేరాను. శాంత నేను వస్తానంది. దారిలో నా ప్రశ్నలకు సమాధానంగా,… నవీన తన అమ్మమ్మ తాతయ్యలు చనిపోయారని చెప్పింది. అమ్మ తాను మాత్రమే ఉంటున్నామని, అమ్మ ఉద్యోగం చేస్తుందని తెలియచేసింది.

                                               * .  *.   *.   *.  *

      కారు దిగి నవీన తో పాటు వస్తున్న తన భర్తను, ఇంకొక స్త్రీని చూసి జలజ ఆశ్చరంలో మునిగింది.  

      “ అమ్మా! ఈయన మా ప్రిన్సిపాల్ గారు. అంతే కాదమ్మా! ఈయన నా తండ్రి కూడానమ్మా! నాకూ… నాన్న ఉన్నాడమ్మా! ” అంటూ తల్లి చేతులు పట్టుకుని ఆనందంగా నవీన చెప్పింది.

      తన కళ్ళను తానే నమ్మ లేక ఆశ్చర్యంగా చూస్తున్న జలజ నా వైపు చూసింది. “ జలజా బాగున్నావా? ” అని నేను పలుకరించాను. ఇదిగో ఇలా ఉన్నానంది.

      చిక్కి శల్యమైపోయి, నెరిసిన జుట్టుతో వయసును మించి కనపడుతున్న జలజను చూసి నేను నిట్టూర్చాను. నా రెండవ భార్య శాంతను, జలజ కు పరిచయం చేశాను.

      శాంత చేయందుకుని,… “ ఆయన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పండించుకున్నావు. మీకు ఎంతమంది పిల్లలు ? ” అని అడిగింది జలజ. “ ఇద్దరు మగ పిల్లలు ” అని శాంత సమాధానం.

    జలజ నా వంక చూస్తూ… “ నాకు ఆభిజాత్యం, అహంకారం ఎక్కువ. ఆడదానిలా ఉండి, అందరిలా సర్దుకుపోవడం చేతకాక, మొండితనంతో మీకు విడాకులిచ్చాను.

    నవీనకు ఊహ వచ్చాక మా క్లాసులో పిల్లలందరికీ నాన్న ఉన్నాడు. నాకు నాన్న లేడా? మా నాన్న ఎక్కడున్నాడు? నాకు నాన్న కావాలి అని ఏడుపు మొదలు పెట్టినప్పుడు గాని, నీకు విడాకులిచ్చి నేను ఎంత తప్పు చేశానో తెలిసి రాలేదు.

    అప్పటినుండి నీ కోసం వెదుకుతూ ఉన్నాను. నవీన కు పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తే ఏవీ కుదరడం లేదు. నాకూ…ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది.

    నాకు ఏమైనా జరగరానిది జరిగితే నవీన ఒంటరిది అయిపోతుందని భయపడుతున్నాను. దేవుడి దయ వల్ల నీవు కనపడ్డావు. ఇంక ఫర్వాలేదు ” అని జలజ అంది.

     “ నాకు పెద్ద ఇల్లు ఉంది. జలజా, నవీనా !… మీరూ మాతో రండి. అందరం కలిసి ఉందాం ” అన్నాను.

      శాంత… జలజ చేతులు పట్టుకుని, “ అవునక్కా! మీరిద్దరూ మాతో రండి. అందరం కలిసి ఉందాం. నవీన కు పెళ్లి సంబంధాలు చూడాలంటే, నవీన తండ్రితో ఉంటేనే మంచిది ” అంది.

      జలజ…” శాంతా! నీ మనసు చాలా మంచిది. అందుకే మమ్మల్ని మీతో ఉండి పొమ్మని ఆహ్వానిస్తున్నావు. నాకు నా తండ్రి ఇచ్చిన ఈ ఇల్లు ఉంది. నేను నవీన ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాము. నేనున్నా, లేకున్నా  నవీనను మీరందరూ ప్రేమాభిమానాలతో చూస్తే చాలు.

    అంతే కాదు. నేను చంద్రానికి భార్యగా, ఎప్పుడో దూరమయ్యాను. నేను మీ ఇంటికి వస్తే … మీ ఇద్దరికీ ఒక మంచి స్నేహితురాలిగా మాత్రమే ఉంటా”నని జలజ అంది.

   “ అలాగే! నీకు నచ్చినట్లుగా ఉండక్కా! ” అంటూ జలజను చేయి పట్టుకుని, తీసుకు వచ్చి కారులో కూర్చోపెట్టింది శాంత. అందరూ చంద్రం ఇంటికి వెళ్లారు.

 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾