అమెరికాలో అష్టావధాన వైభవం
ఆగష్టు 7వ తేదీ అమెరికా, రోలింగ్ మెడోస్ లోని శ్రీ షిర్డిసాయి మందిర్ లో శ్రీ షిర్డీసాయి మందిర్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగొ ( TACC ) సంయుక్తంగా నిర్వహించిన సంగీత, సాహిత్య కార్యక్రమం డా. శొంఠి శ్రీరామ్ ( SAPNA ). శ్రీమతి ఉమ అవధూత ( TACC ) ల దీప ప్రజ్వలనతో, స్వాగత వచనాలతో ప్రారంభం అయింది.
వేద విద్యా పీఠం కు చెందిన శీలాకౌశిక్ వేదసూక్తం వినిపించారు. అనంతరం విదుషీ మాధురికృష్ణ గాత్రంలో తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనా చంద్రిక కు పూర్ణ కుమార్ వైయోలిన్, సోహం కాజే మృదంగ సహకారం చక్కగా అమిరాయి.
తదుపరి విజయవాడకు చెందిన అసమాన అవధాన సార్వభౌమ పండిత శ్రీ పాలపర్తి శ్యామలానంద గారి శ్రీ శుభకృతు శ్రావణి సాహిత్య రసభారతి అష్టావధాన వైభవం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి శ్రీకళాపూర్ణ ప్రొఫెసర్ వేదాల శ్రీనివాసాచార్య అధ్యక్షత వహించి సన్మాన ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వహకులుగా, సంధాన కర్తగా బ్రాహ్మీకళా విశారద, సాహితీ సుధీమణి డా. శొంఠి శారదాపూర్ణ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పృచ్ఛకులుగా శ్రీ వేదాల శ్రీనివాసాచార్య నిషిద్ధాక్షరి, శ్రీ శ్రీనివాస కె. రాజు సమస్యాపూరణం, శ్రీ మురళి నందుల దత్తపది, శ్రీ కార్తీక్ కందమూరి వ్యస్తాక్షరి, శ్రీమతి డా. దామరాజు లక్ష్మి వర్ణన, శ్రీ శివ నముడూరి ఆశువు, శ్రీ యడవిల్లి రమణమూర్తి అప్రస్తుత ప్రసంగం, ఇంకా గ్రంథ పఠనం, ఘంటానాదం వ్యవహరించారు.
అవధానులు పాలపర్తి శ్యామలానంద గారిని “ అవధాన సుధీమణి ” అనే బిరుదుతో సత్కరించి, నిర్వాహకులు ఉచిత రీతిన వారిని సన్మానించారు.
వేదాగమ రత్న శ్రీమాన్ పరాంకుశం హనుమత్ప్రసాదవర్యులు వేదాశీర్వచనమ్, ప్రశంస అందించారు.
విశ్వసాహిత్యం – మాలతీచందూర్ దృక్పథం
విశ్వ సాహిత్యాన్ని పరిచయం చేయడం మాలతీ చందూర్ ఘనత
– ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు
అంతర్జాలం, సెర్చ్ ఇంజిన్లు లేని వెనకటి కాలంలోనే తెలుగువారికి విశ్వ సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనత మాలతీ చందూర్ దని ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు కొనియాడారు. స్థానిక అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి “నెల నెలా వెన్నెల” పేరిట నెలకొకసారి నిర్వహించే సాహితీ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల పరంపరలో భాగంగా… ఆగస్టు 21 మాలతీ చందూర్ వర్ధంతిని పురస్కరించుకొని ఒక ప్రత్యేక ప్రసంగాన్ని ఆగష్టు 13వ తేదీ శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారం చేసింది. ఇందులో భాగంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు “విశ్వ సాహిత్యం – మాలతీ చందూర్ దృక్పథం” అంశంపై ప్రసంగించారు. అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు తెలుగువారికి ప్రపంచంలోని అనేక ప్రాంతాల సాహిత్యాన్ని (ఇంగ్లీషులో ఉన్నవాటిని) మాలతి పరిచయం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈరోజున అంతర్జాలం అందుబాటులో ఉన్నందున ఎక్కడి సమాచారమైనా మన అరచేతుల్లో ఉంటోందని, ఈ దుర్భిణులు లేని కాలంలోనే ఆమె ఎంతగానో శ్రమించి విశ్వవ్యాప్తంగా విఖ్యాతి గాంచిన 350 పైచిలుకు అమూల్యమైన నవలలను పరిచయం చేశారని ప్రశంసించారు. ఆ రోజుల్లో ఆమె అంతగా చదువుకొనప్పటికీ, సాహిత్య రంగంలో విశేష కృషి సలిపారని ప్రశంసించారు. ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆమె పుస్తకాలను చదవాలని విశ్వవిద్యాలయాల ఆచార్యులు కూడా తమ విద్యార్థులకు సిఫారసు చేయడం గొప్ప విషయం అన్నారు. రచయితల దర్శనిక శక్తి, ఊహా వైభవం, అనుభవాల సాంద్రత ద్వారా గతకాలపు జీవితాలు, మానవీయ సంబంధాలు, పోరాటాలు, వాటి ఫలితాలు సమాజంలో ప్రతిబింబించిన విధానాలు తెలుసుకొనే అవకాశం ఉంటుందని వివరించారు.
డి. ఆర్. బి. సి. సి. సి. హిందూ కళాశాల తెలుగు శాఖ సహ ఆచారిణి డా. కల్పన గుప్తా మాలతీ చందూర్ ను, వక్తను పరిచయం చేస్తూ… ఆనాటి ప్రతి అమూల్యమైన పుస్తకం మాలతి కంటపడి, ఆ తరువాత పాఠకుల సాహితీ కంఠాభరణం అయ్యేదని వ్యాఖ్యానించారు.
కార్యక్రమం ప్రారంభంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సంస్థ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా నిర్వహించిన సిద్ధాంత గ్రంథాల పోటీ విజేతను డా. కొలకలూరి ఆశాజ్యోతి ప్రకటించారు. మాలతీ చందూర్ రచించిన “శతాబ్ది సూరీడు” నవల ఆధారంగా రాయవలసిన సిద్ధాంత గ్రంథ రచనల పోటీలో 20 మంది తమ రచనలను పంపించారని వెల్లడించారు. వాటిలో నియమాలను అనుసరించి రాసినవి 6 కాగా, పాణ్యం దత్త శర్మ రాసిన వ్యాసం ఆయన విలక్షణమైన దృష్టి కోణాన్ని వెల్లడి చేసి మొదటి స్థానంలో నిలిచిందని ఆమె వివరించారు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో ఛీఫ్ కృష్ణారావు, కొలకలూరి ఆశాజ్యోతి, బూదాటి వేంకటేశ్వర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని కల్పన తెలిపారు. ఫలితాల వెల్లడిలో భాగంగా కృష్ణారావు కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾