చేతికొచ్చిన పుస్తకం-26:
“గాంధేయవాదులు మిషనరీలుగా ఉండరాదు, వారు విప్లవకారులుగా వ్యవహరించాలి.” అని తన వ్యాసం ముగించారు మీరాబెన్!
గాంధీజీ శతజయంతి సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ సంపాదకత్వంలో న్యూఢిల్లీ లోని గాంధీ శాంతి సంఘం 1968 అక్టోబరు 2 న 34 మంది దేశవిదేశీయుల రచనలతో ‘ గాంధీ మహాత్ముడు నూరేళ్ళు’ అనే గ్రంథాన్ని వెలువరించింది. ఈ అమూల్యమయిన వ్యాసాలన్నీ పొత్తూరు పుల్లయ్య అనువాదించగా అన్నపూర్ణ పబ్లిషర్స్, విజయవాడ వారు 1970 ఫిబ్రవరిలో వెలువరించింది.
నెల్లూరు మిత్రురాలు, కవయిత్రి, ప్రముఖ సాహితీవేత్త పాతూరి అన్నపూర్ణ ఈ పుస్తకం తనవద్ద కన్నా, నా దగ్గర ఉంటే మంచిదని కానుకగా పంపింది. ఈ పూటే అందింది. అది అన్నపూర్ణ గారి సహృదయతకూ, నా మీదున్న అభిమానానికి తార్కాణం!
మా అనంతపురం జిల్లా కు చెందిన పొత్తూరు పుల్లయ్య తెలుగు ఫైనాన్షియల్ జర్నలిజానికి ఆదికవి వంటివారు. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న పొత్తూరు పుల్లయ్య ఒంటి చేత్తో ఈ 464 పుటల పుస్తకాన్ని అనువాదించారు. 1980 నవంబర్ లో వెలువడిన మూడో ఎడిషన్ నా వద్ద ఇపుడుంది.
సర్వేపల్లి రాధాకృష్ణ, ముల్క్ రాజ్ ఆనంద్, ఎం సి చాగ్లా, కమలాదేవి ఛటోపాధ్యాయ, లూయిస్ ఫిషర్, ఆర్ ఆర్ దివాకర్, హోరేన్ అలెగ్జాండర్, ఇందిరాగాంధీ, మీరాబెన్, మౌంట్ బాటెన్, జగ్జీవన్ రామ్, ప్యారీలాల్, హిరేన్ ముఖర్జీ, సుచేత కృపలానీ, మైఖేల్ షోలోకోవ్, హుమాయూన్ కబీర్ ఇత్యాదులు రాసిన విశ్లేషణాత్మక రచనలు నాకు ఆనందదాయకమే.
థాంక్యూ, Annapurna Pathuri అన్నపూర్ణ గారు!
కుమారి వాణిశ్రీ అభినందన సంచిక 1975
వందకు మించి తెలుగు, మొత్తం ఐదు భాషల్లో కలిసి రెండు వందల సినిమాల్లో నటించిన తర్వాత వాణిశ్రీకి హైదరాబాద్ లో సన్మానం జరిగిన సందర్భంలో విడుదలైన అభినందన సంచిక ఇది.
హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్ నిర్వహించిన ఈ సన్మానం ఆవిడకు హైదరాబాద్ లో తొలి అభినందన సభ కూడా!
ప్రసిద్ధ చిత్రకారులు గోలి శివరామ్ ప్రేమగా స్వీకరించమని కోరినప్పుడు నేను ఎంచుకున్న పుస్తకాలలో ఇది ఒకటి.
నాలుగు దశాబ్దాల క్రితం జీవితం ఎంతో ఆర్బాటరహితంగా ఉండేదనటానికి సంచిక మీద పాపులర్ హీరోయిన్ వాణిశ్రీ ఫోటో లేకపోవడమే తార్కాణం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, చిత్రపరిశ్రమ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుర్తుగా వెలువడిన 96 పుటల సంచిక చివరి పేజీ ప్రకటన లేకుండా ఖాళీగా ఉంది!
అనవసరమైన పొగడ్తలు ఎక్కువగా లేని పోకడ సందేశాలో ద్యోతకమైంది. కాంతారావు, పుల్లయ్య, మిక్కిలినేని, సులోచనారాణి వంటి వారు రాసిన నాలుగు ముక్కల్లో ఎంతో పరిశీలన కనబడుతుంది.
చేతికొచ్చిన పుస్తకం-28:
తెలుగు వారి చరిత్ర … వేర్పాటు వాదం
(క్రీ పూ 300– క్రీ శ 2010)
వర్తమాన కాలంలో చదువుకున్న రాజకీయ నాయకులు తక్కువ, వారిలో చదువరులైనవారు ఇంకా తక్కువ! పరిశీలనతో, పరిశోధనతో రచనలు చేసే బహు అరుదు!! అలాంటి అరుదైన సమూహం లో పుష్కరకాలంలో నాలుగు విలువైన పుస్తకాలు అందించిన రచయిత, వైద్యులు డా దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
ఈ పుస్తకానికి ముందు ఎన్టీఆర్ రాజకీయ జీవితం నేపథ్యంగా ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు..’ అటు తర్వాత ‘ప్రపంచ తత్వం- నాయకత్వం’, ఇంకా ‘ ప్రపంచ దేశాలు- పాలనా వ్యవస్థలు’ వంటి రచనలు చేశారు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇటీవల తన పుస్తకాలన్నీ చదవమని వారు ఎంతో అభిమానంగా పంపారు దగ్గుబాటి వారు.
అంత సుదీర్ఘ చరిత్రను పరిశీలించాలనే ఆలోచన రావడం అభినందనీయం. ఇరవై మూడు శతాబ్దాల చరిత్రను ముప్పయి తొమ్మిది అధ్యాయాలలో రెండు వందల లోపు పుటలలో వివరిస్తే ఆ గ్రంథం తప్పక పఠనీయం అవుతుంది. ఒక సమస్య తీవ్రంగా చర్చనీయాంశమైనప్పుడు, జటిలమైనప్పుడు దాని చరిత్రను వీలైనంత లోతుగా పరిశీలించడం తెలివైన, సమయోచిత వ్యూహమే.
మూడు, నాలుగు గంటల వ్యవధిలో అవసరమైన చారిత్రక అంశాలను తెలుసుకోవాలనే దృష్టితో చేసిన ఈ రచన 2010-2013 మధ్యకాలంలో మూడు ముద్రణలు పొందడం విశేషం!
చేతికొచ్చిన పుస్తకం:29
రాయలసీమ కరువు కథలు
కర్నూలు నుంచి కథల మిత్రుడు డా ఎం హరికిషన్ ఎంతో అభిమానంతో తన బాలసాహిత్యపు పుస్తకాలతోపాటు ఈ సంకలనాన్ని కూడా మూడు వారాల క్రితం పంపినారు. నాలుగు రాయలసీమ జిల్లాల్లో నాకు తక్కువ పరిచయం ఉన్నది కర్నూలు మాత్రమే!
‘సీమకథలు’ సంకలనంలో కర్నూలు జిల్లా కథ లేకపోవడం అప్పట్లో చాలా చర్చోపచర్చలకు కారణమైంది.అయితే ఇటీవల కాలంలో ‘కర్నూలు కథ’, ‘రాయలసీమ రచయిత్రుల కథలు’, ‘రాయలసీమ ప్రేమ కథలు’ వెలువరించడం ద్వారా డా హరికిషన్ గణనీయమైన కృషి చేశారు. హరికిషన్ 2021 మే నెలలో 400 పుటల్లో 45 కథలతో ‘రాయలసీమ కరువు కథలు’ సంకలనం వెలువరించి ఒక మహత్కార్యాన్ని పూర్తి చేశారు.
1953 లో జి రామకృష్ణ రాసిన ‘గంజి కోసరం’ తో మొదలైన ఈ సంకలనంలో ఏడు దశాబ్దాల రాయలసీమ సమాజపు వ్యవసాయ జీవితాన్నీ, అందులో కరువు సమస్యల ప్రతిఫలనాన్నీ మూడు తరాల కథకులు చిత్రించారు. ఇది ఓ విలువైన డాక్యుమెంటేషన్ గా మిగిలి పోతుంది. ఈ సంకలనంలో వివరమైన ముందుమాట ఆకర్షణ కాగా, రచయితల పరిచయాలు లేకపోవడం చిన్న లోటు!
రాయలసీమ కరువు సంబంధించి నాలుగు కాలాలపాటు నిలిచే ఈ సంకలనాన్ని దీప్తి ప్రచురణలు వెలువరించింది. మిత్రుడు డా ఎం.హరికిషన్ (9441032212) పరిశోధన, పట్టుదల , చాకచక్యం అభినందనీయం! వెల్డన్!!
చేతికొచ్చిన పుస్తకం-30:
డా సుశీలానయ్యర్ రాసిన జీవిత చరిత్ర ‘కస్తూర్బా’
మా ఆకాశవాణి అక్కయ్య తురగా జానకీరాణి అనువాదం చేశారని మండలి బుద్ధప్రసాద్ ఈరోజు ఆ పుస్తకం కాపీ ఇచ్చేవరకు నాకు తెలీదు!
1973 మార్చి నెలలో ఈ పుస్తకం తొలిసారి ప్రత్యూష ప్రచురణలు, హైదరాబాద్ ద్వారా వెలువడింది.
వైద్యురాలైన సుశీలానయ్యర్ కు గాంధీజీ దంపతులు 1920 డిసెంబర్ నుంచి తెలుసు. వారికి ఆమె కుటుంబ సభ్యులకు మించి ఆప్తురాలు. కనుక కస్తూర్బా గాంధీ గురించి సుశీలానయ్యర్ చేసిన ఈ 130 పేజీల రచన చాలా కోణాల్లో విలువైంది.
గాంధీజీ రాసిన రెండు పేజీలు మించి మరేయితర అభిప్రాయాలు ఈ పుస్తకంలో లేకపోవడం గమనార్హం.
****************************
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾