12_001 ద్విభాషితాలు – చారిత్రక శకలం

 

వసారా ప్రక్కన…

కొట్టుగదిలో..గోడకానుకొని..

ఓ సుఖశయనం కోసం ఎదురుచూస్తున్నట్లుండేది…

నా  నాలుగు కాళ్ళ మడతమంచం.

బుజం పై తువ్వాలు వేసుకొని…

కాళ్ళు ఒకదానితో మరొకటి బిగించి..

పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చొన్న తాతయ్యలా..

ఓ కుటుంబ సంప్రదాయానికి.. కాపలా కాస్తున్న సంరక్షకుడిలా..

ఒక శతాబ్దపురుషునిలా…

ఠీవిగా  కనిపించేది నా  మడత మంచం!

 

దాగుడుమూతలాటలో…

తెరుచుకున్న తన క్రింద దూరి కూర్చొన్న..

చిట్టి తమ్ముడి రహస్యాన్ని..

బట్టబయలు చేసేది.

చెల్లెలితో ఆడి అలసిపోయిన

మా చిన్ని కుక్కపిల్లకు…

తనక్రింద ఆశ్రయమిచ్చేది.

మండు వేసవిలో…

గొంతులో చల్లటినీటిచుక్కలా.. పలకరించే ఓ ఆత్మీయఅతిధికి..

భోజనానంతర విడిది అయ్యేది.

 

భుక్తాయాస ఉపశమనానికి…

పెరటి మావిడి చెట్టుక్రింద..

తనపై వాలిన నాకు..

ఆకులసందుల్లోంచి…

సన్నగా జారిపడే..

కిరణాల వెచ్చదనాన్ని..

చెంపలకు అందించేది.

అలముకున్న నిశ్శబ్దంలో..

కొమ్మపైనుండి అరిచే…

కాకి పిలుపుని చెవులకు అందించి ..

తీయటి నిద్రాభంగం కలిగించేది.

మగత నిద్ర మధ్యలో

ఒకవైపు నుండి మరొక వైపుకు బద్ధకంగా తిరిగినప్పుడు…

తన చప్పుడు తో ..

 నాకు జోలపాడేది.

వేసవి వెన్నెల రాత్రులలో..

ఆరుబయట తనపై సోలిన..

మా కళ్ల నిండా..

వెండి మేఘాల వింత ఆకృతుల్ని నింపి..

రెప్పల వెనుక కలలకు తెరదీసేది!.

 

చూస్తుండగానే..

మా ఇద్దరి వయసులు

వడలి పోయాయి.

ఇప్పుడు..

అపార్టుమెంట్ ఏసీ  గదుల్లో.. 

మెత్తని పరుపుపై శయనిస్తున్న నాకు..

స్థాన భ్రంశం చెంది..

శాశ్వతంగా ముడుచుకుపోయిన..

నా మడతమంచం…

మనసును మెలిపెట్టే…

ఓ బాధామయ  జ్ఞాపకం.

నా తరువాత సాఫ్ట్ వేర్ తరం తలపుల్లోకి కలనైనా ప్రవేశించని..

శయనానంద తల్పం..

చారిత్రక శకలం..

నా మడత మంచం!

 

—-(0)—-

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾