12_001 కన్యాశుల్కం – ఒక పరిశీలన

 

                        శిరాకదంబం పాఠకులలో చాలామందికి గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకం గురించి కొంత అవగాహన ఉండే ఉంటుంది. చదివిన అనుభవమో, శ్రవ్య, దృశ్య, మాధ్యమాల ద్వారా పరిచయమో ఉండే ఉంటుంది. ప్రచురణ లో మూడు వందల పేజీల కు పైగా ఉన్న నాటకం లో విషయం అనేక అంకాలకూ, రంగాలకూ, ప్రాంతాలకూ, విస్తరించడం వలన ప్రదర్శన కు అంత అనువుగా ఉండదు. చదవడానికి చాలా అనుకూలం.

1892 వ సంవత్సరం లో మొదటిసారి గా ప్రచురించబడి, ఎనిమిది గంటల నిడివి గా ప్రదర్శింపబడిన ఈ నాటకం, ఆ తరువాత  1897 వ సంవత్సరం లో అనేక మార్పులతో సుమారుగా 17 కొత్త పాత్రలను చేర్చి పునర్ముద్రించబడింది. ముఖపత్రం మీద “హాస్య రస ప్రధానమగు నాటకము ” “కన్యాశుల్కం ” అనే మకుటం క్రింద అదనం గా చేర్చారు. ఖండన ప్రస్తావన మాత్రం చేయలేదు.

ఆ తరువాత కాలంలో ప్రదర్శనానుకూలం కోసం అనేక కత్తిరింపుల కు లోనైంది. సినిమా వారు కూడా జనాకర్షణ కోసం ఈ నాటకం పేరు వాడుకుని సినిమాలో వారికి తోచిన ప్రయోగాలు చేశారు. ఆకాశవాణి వారూ, దూరదర్శన్ వారూ కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేశారు. ప్రదర్శన బృందాలలో జేవీ రమణమూర్తి, సోమయాజుల బృందం ప్రసిద్ధి గాంచింది.

ఈ నాటకం కన్యాశుల్క దురాచారాన్ని బలం గా ఖండించడం కోసం రాయడం జరిగింది అనే వాదన ఉన్నప్పటికీ నాటకం లో  ప్రస్తావన చేసిన విషయం ముక్కుపచ్చలారని బాలికలను వయోవృద్ధుల కు కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయడం. వృద్ధులకు బాలికల నిచ్చి పెళ్ళి చేయడం ఖండించదగిన సామాజిక దురాచారం. అప్పటి కన్యాశుల్కం, ఇప్పటి వరకట్నం వ్యక్తుల ఆర్ధిక వ్యవహారం. మొదటి సమస్య సామాజికం కనక, ప్రస్తుతం వివాహానికి కనిష్ఠ వయస్సు నిర్ణయించి చట్టం చేసి సమస్యని రూపుమాపారు. రెండవ సమస్య ని చట్టం ద్వారా నిరోధించడం కష్టం. వరకట్న నిషేధ చట్టం దీనికి ఉదాహరణ.

సాంఘిక దురాచారాలని ఖండించడానికి ఉద్దేశించబడినాయని ముద్ర వేయించుకున్న చింతామణి, వర విక్రయం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు జనాభాహుళ్యానికి చాలా దగ్గర గా అంటే వినాయక /దుర్గా మండపాల ద్వారా జనం లోకి చొచ్చుకు పోగా ఈ నాటకం మాత్రం రవీంద్రభారతుల కీ, ప్రవాసాంధ్రుల ప్రాంతాల్లో ప్రదర్శనలకీ, ఉన్నత మధ్య తరగతి వారి డ్రాయింగ్ రూమ్ ల చర్చలకీ, దిన, వార, మాస పత్రిక ల వారి సమీక్ష లకి మాత్రమే  పరిమితం అవడం వలన, ఈ నాటకం లో ప్రస్తావన చేసిన సమస్య పరిష్కారానికి కొంత ఆటంకం కలిగింది.

1994 వ సంవత్సరం లో ఈ నాటకానికి ఒక శతాబ్దం నిండింది అని నిర్ణయం చేసి కొన్ని ఉత్సవాలు జరిపారు.

ఈ నాటకం గురించీ, అందులో వాడబడిన భాష, పాత్రల స్వభావం, రచయిత ఉద్దేశ్యం చేసిన లక్ష్యం మొదలైన విషయాల గురించీ పుంఖాను పుంఖాలు గా చర్చలు చాలా కాలం నుంచీ జరుగుతుండగా ఇటీవల కాలం లో అనగా 2020 వ సంవత్సరం లో నవీన్ ( అంపశయ్య  రచయిత ) “కన్యాశుల్కం నాటకాన్ని తెలుగు వాళ్లెవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదా?” అని ఏకంగా ఒక పుస్తకమే రాసేశారు. దాన్ని ఖండిస్తూ మరి కొంతమంది వ్యాసాలు రాశారు. కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవయుగ నవోదయ, నవ చేతన బుక్ హౌస్ లూ, భారతి, ఆంధ్రపత్రిక, ప్రభ, జ్యోతి మొదలైన దిన, వార, పక్ష, మాస పత్రిక ల లో ఇవన్నీ ప్రస్తావన చేయ బడినాయి.

 

( సశేషం ) 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾