ఓ మనసా మురహరుని భజించు ‘‘మనయేవమనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’’ అని బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం. మనసు భగవంతుని యెడ రుచి మరిగితే మరి దేనినీ వాంఛించదు. విషయాలకు లోబడిన మనసు బంధాన్ని కల్గిస్తుంది. ఆ విషయాలను వదిలి భగవంతుని సేవిస్తే అదే మనసు మోక్షాన్ని కల్గిస్తుంది! మనసులో స్మరిస్తే చాలు, మన్నించి దరి చేర్చుకునే దయామయుడు మన స్వామి. ఓ హస్తద్వయమా, శ్రీధరుని పూజించు మన మొరను భగవానునికి వినిపించేది తల్లి శ్రీదేవి. దయాగుణం హృదయగతం. దయకు నిలయం అయిన తల్లి శ్రీదేవి . ఆమెను వక్షస్థలంలో ధరించిన తండ్రి శ్రీధరుడు భగవంతునితోనే తానుండి మన దోషాలను పోగొట్టి ఆశ్రయాన్నివ్వగల చల్లని తల్లి. ఆమె దయతో శ్రీధరుని సేవించడం సులభం, సుఖదం కూడా. అందుకే శ్రీధరుని పూజించు. ఓ కర్ణములారా! హరికధలను వినండి. ఎన్నో జన్మలనుండి పేరుకు పోయిన వాసనలను పోగొడుతుంది హరికధాశ్రవణం.
‘‘వినరో భాగ్యము విష్ణుకధా’’ అంటారు అన్నమయ్య. అది మనకు వెనుబలం! ‘‘విష్ణునాకర్ణించు లీనులులీనులు’’ ఇది ప్రహ్లాదుని మాట.
విష్ణుకథలను విన్న మనసుకు ఎంత భరోసా! ఆ స్వామి వెనుబలమై ఉంటాడు అంటూ భగవద్గీతలో కూడా చెప్పబడింది. నారదాదులు ఆ స్వామి శ్రీహరిని ఎంతగా కీర్తించారో తెలుసుకదా! వేదవ్యాసుల వారు ఎన్నివిధాల ఆ స్వామిని గురించి కధలు, పురాణాలూ చెప్పారో! వినికిడి ఉన్నఫలం విష్ణునామ, విష్ణుకధా శ్రవణం సుమా!
ఓ నేత్రద్వమయా! శ్రీకృష్ణుని దివ్యసుందర రూపాన్ని చూడండి. లోకంలో మనం చూడాలని కోరుకునే అందమైన వస్తువులన్నీ మొదట్లో ఆనందదాయకంగా తోచినా చివరకు ఎంతోకొంత దుఃఖాన్నే మిగులుస్తున్నాయి. కానీ శ్రీకృష్ణ రూపం మాత్రం శాశ్వతమైన ఆనందాన్ని కల్గిస్తుంది. అందులో దుఃఖవీచిక ఏ మాత్రం ఉండదు. అందుకే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూడండి.
మన యశోద చిన్ని మగవాని గనెనట! చూచివత్తమమ్మ సుదతులారా? అంటూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ యశోద పొత్తిళ్ళలోని చిన్ని శిశువుని (దర్శించి) చూసి రావడానికై నందునింటికి నడిచారు నందవ్రజంలోని గోపికలు. ఆ జగన్మోహనాకార శిశువును దర్శించి ధన్యులయ్యారు. ఆ సుందర రూపాన్ని చూసిన కొద్దీ తనివితీరడం లేదు. పదేపదే ఆ చిన్ని శిశువు ముచ్చట్లే! ఆ రూపం నుండి కన్నులు మరలి రాకున్నవి! ఆ దివ్య సుందర రూపాన్ని భావనా చక్షువులతో మనమూ దర్శిద్దాం! అదే కులశేఖరుల వారి కోరిక కూడా!
ఓ ఘ్రాణేంద్రియమా! ముకుందపాద తులసీ వాసనను ఆఘ్రాణించు. ఓ పాదములారా! మహావిష్ణువు యొక్క ఆలయానికి చేర్చండి సర్వఫలప్రదుడైన దైవ సన్నిధికి నడిచి వెళ్ళి సేవించుకునే అదృష్టం కల్గించండి. ఓ శిరస్సా శ్రీనాధునికి వంగి వంగి నమస్కరించు అంటూ పేరుపేరు వరసనా తన దేహేంద్రియ మనో బుద్ధులను కోరుకుంటారు.
భాగవత శిఖామణులందరూ ఈ విధంగానే తమదేహేంద్రియ మనోబుద్ధులను భగవదారాధనలో నిమగ్నం చెయ్యడానికి ఉద్భోదించుకోవడం చూస్తాం. భాగవతమున ప్రహ్లాదుడు…
కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జిహ్వజిహ్వ
సురరక్షకుని చూచుచూడ్కులు చూడ్కులు, శేషశాయికి మొక్కుశిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము
భగవంతువలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి॥
అంటాడు. అంటతేకాదు. అలా భగవత్సేవకు ఉపయోగపడని ఈ శరీరం కేవలం తోలుతిత్తిమాత్రం అంటూ తృణీకరిస్తాడు కూడా!
శ్లో॥ సా రసనా తే నయనా తావేన కరౌ స ఏవకృతకృత్యః
యా యే యౌ యో భర్గం వదతి ఈక్షేతే సదార్చతః స్మరతి ॥
ఎల్లప్పుడు ఈశ్వర నామాన్ని పలికే నాలుకే నాలుక! అనవరతం ఈశ్వరుని చూడగల్గిన నేత్రములే నేత్రములు. నిత్యం ఈశ్వరుని అర్చించు హస్తములే హస్తములు! నిత్యం పరమేశ్వరుని ధ్యానించు భక్తుడే కృతార్ధుడు. అంటారు శంకరాచార్యులవారు తమ శివానందలహరిలో! ఏ భక్తుడైనా తన దేహేంద్రియాలను పరమేశ్వర సేవలోనే తరింపజెయ్యాలనుకుంటాడు!
నీలాంబరి రాగం ` ఆదితాళం
ఎన్నగ మనసుకురాని పన్నగ శాయి సొగసు
పన్నుగ కనుగొనని కన్ను లేలే కన్నులేలే కన్నెమిన్నలేలే ॥
సరసీజ మల్లెతులసీ విరవాజి పారిజాత
విరులచే పూజించని కరములేలే కరములేలే ఈ కాపురములేలే
మాలిమితో త్యాగరాజు నేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే నాలికేలే సూత్రమాలికేలే ॥
నమ్మి సేవించిన త్యాగరాజుని పాలించిన కృపాసముద్రుడు ఆ ప్రభువు. అటువంటి స్వామిని పొగడని నాలిక ఎందుకు కన్నులెందుకు అంటూ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పరమాత్మ సేవకే అన్న విషయాన్ని ఒత్తి చెబుతున్నారు త్యాగరాజులవారు కూడా. మరోవిధంగా శివానందలహరిలో శంకరాచార్యుల వారు
శ్లో॥ పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్రధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే
జిహ్వే చిత్త శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్ధితో
మా మాజ్ఞాపయ త న్ని రూపాయ ముహుర్మామేవ మామే-వచః ॥
ఓ మృత్యుంజయా! పాపోత్పాత = పాపమనే ఉత్పాతమును, విమోచనాయ = పోగొట్టుట కొరకు, రుచిరైశ్వర్యాయ = అభీష్టసంపదకొరకు, స్తోత్ర = స్తోత్రము చేయుట, ధ్యాన = ధ్యానించుట, నతి = నమస్కరించుట, ప్రదక్షిణ = ప్రదక్షిణము చేయుట, సపర్యా = సేవచేయుట, ఆలోకన = దర్శించుట, ఆకర్ణనే = ఆలకించుట, జిహ్వా – నాలుక చేతను, చిత్త = మనసు చేత, శిరః = శిరస్సుచేత, నయన = కన్నుల చేత, శ్రోత్రైః = చెవుల చేత, అహం = నేను, ప్రార్ధితః = ప్రార్ధింపబడితిని, మాం = నన్ను, ఆ జ్ఞాపయ = ఆజ్ఞాపించు, తత్ = దాని గురించి, మాం = నన్ను, ముహుః = మాటిమాటికి, విరూపయ = పురిగొల్పుము, మే = నాకు, అవచః = మూగతనము, మైవ = కలుగనీయకుము.
స్వామీ! నా దేహేంద్రియ మనోబుద్ధులు నిన్నే కోరుకుంటున్నాయి. నిన్ను స్తుతించి, నిన్నే ధ్యానించి, నిన్నే అర్చించి, నీకే ప్రదక్షిణలు చేసి, నీ కథా శ్రవణంతో పునీతమవేలా నీవే ఆజ్ఞాపించుము తండ్రీ! అంటారు.
నయన దియే దరిశన కర్‌నేకో, శ్రవణ దియే శృణుధ్యానరే ॥
అంటూ కబీర్‌దాసుకూడా హరిభజన చెయ్యి మనసా హరిగుణ గానం చెయ్యడానికే నీకు గళాన్నిచ్చింది (లేదా నీ గళమున్నది) అంటూ, ఇంకా ‘‘మత్‌కర్‌మోహతూమత్‌కర్ ` మోహంలో పడకు మనసా, మోహంలో పడి మోక్ష ప్రదాతను మరవకు. అంటూ తన ఇంద్రియాల్ని కోరుకుంటున్నారు.
‘‘మనసు నీ పదములనే జేర, కనులు నీ రూపమునే కోర
విను నీ పేరులకే నోరూర ` రామా నీ పై తనకు ప్రేమ బోదు’’
అంటారు తన కేదార రాగకృతిలో త్యాగరాజుల వారు ఈ విధముగా ఈ శరీరమును ఈశ్వరార్పితముగా వినియోగించవలెననేదే పరమభాగవతులందరి వాక్కు.
కంచిత్కాల ముమామహేశ భవతౌ పాదార విందార్చనై ః
కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్కధాకర్ణనై ః
కంచిత్కంచి దవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశా మీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితామనా జీవన్ స ముక్తః ఖలు ॥
ఈశ్వరా! నిరాటంకంగా నీయందే చిత్తము నుంచి, కొంతసేపు నిన్ను అర్చిస్తూ, కొంతసేపు ధ్యానిస్తూ, నీకు నమస్కరిస్తూ, కొంతకాలము నీ దర్శనా నందాన్ననుభవిస్తూ, కొంతకాలం నిన్ను స్తుతిస్తూ, మరికొంత కాలం నీ కధాశ్రవణంలో గడుపుతూ నీకే అర్పించిన మనసులో… ఇలా తన సమయాన్నంతా గడపగలిగే వాడే కదా జీవన్ముక్తుడు! అంటారు. ఇంకా… శ్రీ శంకరాచార్యుల వారు
మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితా
కరశ్చాభ్యర్చాయాం, శృతిరపి కధాకర్ణనవిధౌ
తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే
పరగ్రంధాన్కైర్వా పరమశివ జానే పరమతః ॥
ఓ పరమశివా! నీపాదపద్మాల ధ్యాంలోనే సదా నా మనసు నిలిచి ఉండే లాగున అనుగ్రహించు. నా వాక్కు నిన్ను స్తుతించడంలో, నా చేతులు నిన్ను అర్చించడంలో నా చెవులు నీ కధా శ్రవణంలో నిమగ్నమై ఉండును గాక. నానేత్రాలు నీ రూప వైభవాన్ని దర్శిస్తూంటే, బుద్ధినీ ధ్యానంలో లీనమయ్యేలా అనుగ్రహించు తండ్రీ! ఇలా నా ఇంద్రియములన్నీ నీ భావనలోనే సమయాన్ని గడపగలిగి నప్పుడిరక ఇతర గ్రంథాలనవలోకించే అకాశమెక్కడ!! ఇతరములైనవేవీ నీ అర్చనకు అవరోధం కాకుండును గాక!
ఇలా ఏ కాలంలో నివసించిన భక్తులైనా, పరమాత్మ విషయంలో వారి భావాలు ఒకే విధంగా ఉండటం గమనించగలం!
మనోవాక్కాయ కర్మలా భగవంతుని సేవలో, ధ్యాసలో, భావనలో గడపడమే తరుణోపాయమంటారు మహారాజు. నిజమే. ఆరోగ్యంగా మనశ్శరీరాలు ఉంటే ఆ విధంగా సర్వాత్మనా భావించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సరికే రోగగ్రస్తమైన మనసుకు ఆరోగ్యం కావాలి కదా! అనాదియైన జన్మపరంపరలలో సంసార వ్యాధి గ్రస్తులకు ఆ అనారోగ్యం నుండి విముక్తి కావాలి ముందు. అందుకు శ్రీకులశేఖరులు తానెరిగిన చికిత్సను ఇలా వివరిస్తున్నారు. తాను రాజు కనక తన ప్రజలను శ్రేయోమార్గంలో నడిపించడం తన బాధ్యతగా భావించి ప్రజలనుద్దేశించి ఇలా చెబుతున్నారు.
ఎందరో మహారాజున్నారు. వారంతా తమ ప్రజల భౌతిక అవసరాలను తీర్చి ధర్మ ప్రభువులనిపించుకున్నారు. కానీ కులశేఖరులు మాత్రం వారి ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కాంక్షించి, అన్నివిధాలా శ్రేయోమార్గాన్ని కూడా చూపుతున్నారు. అందుకే వారు ‘‘ఆళ్వార్ల’’లో స్ధానం సంపాదించుకున్నారు. ఈ మహారాజు ‘‘సంసార వ్యాధిగ్రస్తు’’ లకు ఔషధసేవనం చాలకపోతే, మణిమంత్రాలను కూడా సూచిస్తున్నారు. భగవద్గీతలో పరమాత్మ తన విభూతిని తెల్పుతూ…
శ్లో॥ అహంక్రతు రహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్
మంత్రాహ మహమేవాజ్య మహమగ్నిరహంహుతం ॥
అంటూ తాను యజ్ఞరూపుడనే కాక, తాను ఔషధమై, మంత్రమై, తన్ను నమ్మినవారిని రక్షిస్తాను అంటారు. ఇంతకంటే భరోసా మరేం కావాలి? అలా కృష్ణస్వామిపై ఉన్న నమ్మకంతో తాను మాత్రమే కాదు తన ప్రజలంతా కూడా తరించాలని కోరుకుంటున్నారు. మహారాజు.
- హే లేకాః శ్రుణుత ప్రసూతి మరణ
వ్యాధే శ్చికిత్సా మిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో
యాం యాజ్ఞవల్క్యాదయః
అంతర్జ్యోతి రమేయ మేక మమృతం
కృష్ణాఖ్య మాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే
నిర్వాణ మాత్యన్తికం॥
ఓ లాకులారా! చావుపుట్టుకలనే వ్యాధికి, ‘కృష్ణామృతం’ అనే ఈ మందు సేవించండి. శాశ్వతంగా వ్యాధి తొలగడమే కాదు. శాశ్వతమైన ఆనందం కూడా లభిస్తుంది. పరిపాలకులు వైద్యశాలలు ఏర్పరచి, ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం సహజమే. ఇక్కడ శ్రీ కులశేఖరులు జీవుల ఆత్మలకు ఎప్పటినుండో సంక్రమించిన జనన మరణవ్యాధికి కూడా చికిత్స ఇప్పించాలని తలపోసి ఇలా చెబుతున్నారు.
తరువాయి వచ్చే సంచికలో……
——– ( 0 ) ——-
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾