శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. జనకుడు వియ్యాలవారికి సకల మర్యాదలు చేసి తాంబూలం సమర్పించి కృతకృత్యుడయ్యాడు.
మరునాడు ఉషః కాలంలో జనకమహారాజు తన కుమారుడు లక్ష్మీనిధిని రమ్మని కబురు పంపాడు. లక్ష్మీనిధి తన సఖులతో కూడి తండ్రి దగ్గరకు వచ్చాడు. వంగి తండ్రి చరణాలకు ప్రణమిల్లి “ పిలిచారట ! ” అన్నాడు. “ అవును నాయనా ! నువ్విప్పుడే విడిదికి వెళ్ళి దశరథ మహారాజుగారి దగ్గరకి వెళ్ళి వినయంగా కుశల సమాచారం అడిగి నీ బావగారలు నలుగురిని ఇక్కడికి తీసుకురావడానికి ఆయన అనుమతి తీసుకో – వారిని వెంటబెట్టుకొని రా ! ” అన్నాడు.
లక్ష్మీనిధి “ సరే ! ” అని తలవూపి సఖులతో బయిలుదేరాడు. మనసు ఆనంద తరంగాలలో ఓలలాడుతున్నది. నవ్వుతూ ఆశ్వాలను అదిలించి గాలితో పోటీ పడుతూ విడిది చేరాడు. దోవలో ఎన్నో విశేషాలు చెప్పుకొంటూ గుర్రాలను నృత్యం చేయిస్తూ వారందరూ మృధుమధురంగా పరిహాసాలాడుకొంటూ వెళ్లారు. మిథిలేశసుతుడు, సఖులు గుర్రాలు దిగి లోపలకు వెళ్లారు.
అక్కడ ఉచిత సింహాసనాలపై దశరథుడు, వారి నలుగురు కుమారులు ఆసీనులై వున్నారు. లక్ష్మీనిధి వారందరికి ప్రణామాలు చేశాడు. లక్ష్మీనిధి ఆనందఖని. అతనిని చూడగానే రఘుకులదీపకుడు దశరథ మహారాజు సత్కారంగా లేచి అతని నడుముపై చేయివేసి తీసుకువెళ్లి కూర్చోపెట్టాడు. నలుగురు నాలుగు చందమామల్లా వెలిగిపోతున్న రామలక్ష్మణభరతశతృఘ్నులను చూచి లక్ష్మీనిధి సంతోష సముద్రంలో మునకలు వేశాడు. లక్ష్మీనిధి చూడగానే శ్రీరామునికి శీతల జలాలలో స్నానం చేసినట్లు హాయిగొల్పింది.
లక్ష్మీనిధి నమస్కరించి “ మామయ్యగారూ ! బావగార్లు నలుగురిని మా ఇంటికి ఒకసారి పంప ప్రార్థన ” అన్నాడు చేతులు పట్టుకొని.
దశరథుడు చిరునవ్వు నవ్వుతూ పుత్రుల వంక చూచి నవ్వుతూ “ వెళ్లిరండి ” అన్నాడు. రాముడు జనకుని ఇంటికి వెళ్తున్నాడని వినగానే సేవకులు చీనీ చీనాంబరాలు, ఘనమైన నగలు, ముత్యాల సరాలున్న తలపాగాలు తెచ్చి అన్నదమ్ముల్ని అలంకరించారు. రఘురాముని కురులు సవరించి, పూలు కుట్టిన జరీపాగా పెట్టి, ముత్యాల సరాలు అలంకరించి, తొమ్మిది రంగులున్న తురాయి పెట్టారు. శ్రీరాముడెంత అందంగా వున్నాడంటే వర్ణించడానికి మాటలు చాలడం లేదు. శివుణ్ణి, సనకాది మునులను కూడా మోహింప చేసే రూపమది. ఆభరణాలు, పట్టు వస్త్రాలు సరి చేసుకొంటూ అన్నదమ్ములు గుర్రాలపై బయిలుదేరారు. బుల్లి రాజకుమారుడు రామునికి ప్రాణప్రియుడు లక్ష్మణుడు అన్నగారి సౌందర్యాన్నారాదిస్తూ పక్కనే గుర్రం పై వెడుతున్నాడు. శ్రీరామచంద్రుడికి కుడివైపున గుర్రం పై లక్ష్మీనిధి వున్నాడు. గుఱ్ఱాల కళ్ళాల బిగి సడలించి ఒకరితో ఒకరు పరాచికాలాడుకొంటూ వెడుతున్నారు. శ్రీరామచంద్రుడు అధివసించిన గుఱ్ఱం పేరు “ జగవందన ”. దాని ఠీవి, దాని తేజస్సు ఎంతని చెప్పగలం ? చూస్తేనే చాలు మనసు వశమై పోతుంది. దాని హొయలుకి. దానికి గమ్యం తెలియపరిస్తే చాలు తక్షణం అక్కడికి చేరిపోతుంది. ఒక క్షణం అగుతూ, ఒక క్షణం నృత్యం చేస్తూ అనేక ప్రకారములైన గతులలో నడుస్తుంది.
ఇక భరతుడి అశ్వం సంగతి చెప్పనే అక్కర లేదు. అల్లంత దూరం దాకా ఎగురుతూ, దుముకుతూ మెరుపుకు కన్నుకొట్టి పరుగెడుతుంది. అది మంచి షోకులాడి. దాని సంగతి ఎవరూ వర్ణించలేరు.
సిరి చిందుతూ తళుకులీనుతూ నడిచే శతృఘ్నుడి గుఱ్ఱం పేరు ‘ చంప ’. చంప లేడిని, నెమలిని కూడా సిగ్గుపరచేటంతగా నాట్యం చేస్తుంది. నడివీధిలో ఎవరైనా ఒకసారి చేయి కొంచెం ఎత్తితే చాలు. అది గాలిలోకి ఎగిరిపోతుంది. బతిమాలినా ఇక మాట వినదు. లక్ష్మణుని గుఱ్ఱం పేరు ‘ లఖ్ఖీ ’. చాలా నేర్పరి. దాని కాళ్ళు నేలపై ఆనవు. మాటి మాటికీ వాయుమండలం దాకా ఎగుర్తుంది. ఉన్నట్లుండి గర్జిస్తూ లక్ష్మీనిధి గుఱ్ఱం మీద మీదకి పోతుంది. బాగా చేశావు – అంతే కావాలి అన్నట్లు రఘువంశీకులు, రాములవారు గర్వంగా నవ్వుకొంటారు. లఖ్ఖీ చంచల గమనం, లక్ష్మణుడి స్థిరత్వం నామి వంశీయులు, రఘు వంశీయులు ఇద్దరూ నవ్వుకొంటున్నారు. శ్రీరామచంద్రుడు మిగిలిన యువ రాజులు లక్ష్మణుడిని ఉత్సాహంతో, సంతోషంతో పొగడ్తలతో ముంచెత్తారు. బాజాభజంత్రీల మధ్య ఆనందంగా ఉత్సవం నడుస్తున్నది. సన్నాయి పాట విని స్త్రీలు వాకిటి వరండాలలోకి వచ్చి కూర్చున్నారు. శ్రీరామచంద్రుని ముఖం చూచి, రాముని రూపానికి ముగ్ధులయి, తనువులు సోలి మైమరచిపోయారు.
ఒక స్త్రీ అనుపమానమైన శ్రీరాముని విగ్రహాన్ని చూచి మురిసి అత్యంత మోహితురాలై తన్ను తాను మరిచింది. ప్రీతి అనే బాకు మెత్తని గుండెల్లో గుచ్చుకొంది.
ఒక సుందరి తన మేలిముసుగు తొలగించి శ్రీరాముని చూచి మణులు పొదిగిన ఉంగరం తీసి అందులో రాముణ్ణి చూస్తూ ఆనంద సముద్రంలో మునిగిపోయింది.
మరొక జాణ రాముని దివ్య మంగళ విగ్రహం చూచి వివశురాలై గడ్డిపోచలు తుంపుతూ, విసరివేస్తూ సర్వమూ మరిచి నిలబడింది.
ఒక యువతి మరొక యువతితో “ చూడవే ! శ్రీరామచంద్రుడు అత్తవారింటికి వెళుతున్నాడు. వాళ్ళని శ్రీనిధి వెంటనిడుకొని తీసుకు వెళ్తున్నాడే ! ” అంది.
“ ఈ షోకిల్లాలందరూ దశరథుని బిడ్డలేనటే ! ” అంది మరొకామె.
“ సూర్యకుల దీపకులైన ఈ మణులు జనకుని అల్లుళ్లు కాకపోతే మనం వీళ్ళని చూచే వాళ్ళమా ? ఆ భాగ్యం మనకు కలిగేదా ? మనం ధన్యులమయాం ! ” అంది తృప్తిగా మరొక వనిత.
“ మిథిలాధిపతి సీత ఎంత భాగ్యవంతురాలు ? ఈ శ్యామ సుందరమూర్తిని పుష్పమాలాంకృతుని చేసి, కంటితో నీరాజనాలిచ్చి పూజించింది.
“ చెలీ ! మనం కూడా జనకమహారాజు మందిరానికి వెడితే ఎంత బాగుంటుందో కదా ! మనం కూడా వాళ్ళతో కలిసి పరిహాసలాడుకోవచ్చు, నవ్వచ్చు, నవ్వించవచ్చు, పదండే పోదాం ” అంది ఒకామె. దయాసముద్రుడు శ్రీరాముడు వీళ్ళ మాటలు విననట్లుగా విని చిరునవ్వు నవ్వుకొంటూ ముందుకు సాగాడు.
మణులు తాపిన ముంగిలి చూచి ముగ్ధులై వీధి ద్వారం వద్దనే నిలబడిపోయారు అన్నదమ్ములు.
సీతాదేవి తల్లి నగరంలోని సుమంగళీ స్త్రీలని ఆహ్వానించింది. వారందరూ బంగారు కలశాలు తలపై పెట్టుకొని వచ్చారు. కలశాలలో చివుళ్లు, దీపాలు పెట్టి అలంకరించారు. చేతిలో బంగారు పళ్ళాలు తీసుకొని, దీపాలు పెట్టి మంగళ గీతాలు పాడుతూ రాముల వారి సేవకు హాజరయారు. రామచంద్రుని దగ్గరకు వెళ్ళి ఆయనని పరికించి చూడగానే ఆ ముగ్ధ మనోహర లావణ్యమూర్తి అందంతో వారి కళ్ళలో ఆనందాశ్రువులు నిండాయి. అనుపమానమైన ఆ సౌందర్యం చూచి తృప్తిపడి చకితలై నిలబడి పోయారు. వాళ్ళకి తమ ఎదుటనున్న సుందర మోహనరూపం తప్ప ప్రపంచం కనిపించడం లేదు. తమని తాము మర్చిపోయారు. ఇక హారతి ఇచ్చేదెవరూ ? కొంతసేపటికి ఆ ప్రేమ సాగరం నుంచి బయటికి వచ్చి తమని తాము సంబాళించుకోసాగారు. అప్పుడు లక్ష్మీనిధి అశ్వం మీద నుంచి దిగి బావలకు చేయి ఆసరా ఇచ్చి దింపి మందిరం లోపలికి తీసుకువెళ్లాడు. అక్కడ సుఖనిధి లాటి రాణి మధుర భాషిణి సునయన కూర్చుని వుంది. ఆమె సౌందర్యం చూచి ఇంద్రాణి మాత్రమే కాదు. రతీదేవి కూడా మోహపరవశురాలై పోతుంది. నాల్గువైపులా చంద్రరేఖల వంటి స్త్రీలు గుమిగూడారు. కొందరు రామునికి వింజామర వీస్తున్నారు. కొందరు హారతి ఇస్తూ ఆ వెలుగులో రాముని ముఖారవిందం చూస్తూ మంగళ గీతాలు పాడుతూ పరవశించి పోతున్నారు. పట్టు పీతాంబరాలు ధరించి కామదేవుణ్ణి ధిక్కరించే అందంతో రాముడు వచ్చాడు. ప్రభువుని చూడగానే రాణివాసం లోని స్త్రీజనమంతా మంత్ర ముగ్ధులయి పోయి ఒళ్ళు తెలియని పరవశంతో సర్వమూ మరిచిపోయారు. నలుగురు అన్నదమ్ములకు హారతి ఇచ్చి మణులు, ఆభరణాలు దిగదుడుపు చేసి, పాదాలు కడిగి, కళ్ళు పన్నీటితో వత్తారు. నాలుగు రంగుల సింహాసనాలు ఏర్పాటు చేశారు. పెళ్లికొడుకుల్ని వాటిపై ఆసీనులని చేశారు.
మోహనమూర్తి శ్రీరామచంద్రుణ్ణి రాణి సునయన రెప్ప వేయకుండా చూస్తున్నది. మాట రావడం లేదు. ఎంత ప్రయత్నించినా నాలుక కదలడం లేదు. స్మృతి తప్పి పోయింది. కదలదు, మెదలదు. కళ్ళు ఆనంద భాష్పాలు కురిపిస్తున్నాయి.
అత్తగారు ఇలా స్తబ్ధుగా నిలబడడం చూచి శ్రీరామచంద్రుడికీ ఏమీ తోచలేదు. హారతి ఇచ్చి లోపలికి పిలవరేం ? ఏమయింది ? అనుకొన్నాడు. అడగడానికి సంకోచించాడు. ఇదంతా తిలకిస్తున్న ఒక సఖి “ రామచంద్రా ! ఇదంతా నీ గుణాల ప్రభావమేనయ్యా ! వేరే భావమేమీ లేదు ” అంది. అది విని రాణి ఉలిక్కిపడి రాముని బుగ్గలు ముద్దాడి, మెటికలు విరిచి దిష్టి తీసింది. శ్రీరామచంద్రుని సౌందర్యానికి తనకు తాను దాసోహం అంది. “ లే నాయనా ! మీకిష్టమైన పదార్థాలు తినండి ” అంది. మాటిమాటికీ అతని ముఖం చూచి రకరకాల హారతులిచ్చి మురిసిపోయింది. శ్యామసుందరుని మెడలో మాలతీమాల వేసి పునుగు, జవ్వాది అలవి రామచంద్రుని ముఖం తన సరిగంచు చీరతో వత్తి స్వహస్తాలతో తాంబూలం అందించింది. శ్రీనిధి భార్య సిద్ధి అంతఃపురం లోకి అన్నదమ్ములు వెళ్లారు. సిద్ధి మరికొందరు తాము కూడా రామునికి తాంబూలం ఇవ్వాలని కుతూహలంతో లవంగాలు, కర్పూరం, కస్తూరి వేసి తాంబూలాలు సిద్ధం చేశారు. ఒకతె పాందాన పుచ్చుకొంది.
అనుపమాన సౌందర్యవంతులం అనుకొన్నవారు కూడా శ్రీరామచంద్రుని సౌందర్యం చూచి అవాక్కయిపోయారు. సిద్ధి కూడా మేలమాడింది. ఒక సఖి అంది – “ మాకు మన్మథుడే గొప్ప అందగాడు అని తెలుసు. మీకు అంతకుమించిన అందం ఎలా వచ్చింది ? మన్మథుడికే పుట్టారా ? ” అంది. “ నువ్వు మా ఇంటి అల్లుడివి _ ఒక విషయం అడుగుతాను. దాచకుండా చెప్పు. అందరూ సజాతీయుల్ని పెళ్ళాడుతారు కదా ! మీ అక్కని ఋష్యశృంగుడికి ఇచ్చి ఎలా పెళ్లి చేశారు ? వాళ్ళే వచ్చి ఎత్తుకెళ్ళారా ? లేక మీ అక్కే… మీ వంశం నిష్కళంకమైనది కదా ! అందుకని అడుగుతున్నాను ” అంది. “ వివాహం ఏ విధంగా ఎవరితో జరగాలో వారితోనే జరుగుతుంది. వివాహం కర్మఫలమే కదా ! ” అన్నాడు లక్ష్మణుడు. “ చూడు మేము రఘువంశపు రాజకుమారులం, మరి మేమెక్కడ ? విరాగి అయిన జనక మహారాజెక్కడ ? మీ విరాగులతో మా వివాహం అయింది. బ్రహ్మరాత ఎవరెరుగగలరు ? నాకు ఓ విషయం తల్చుకొంటే నవ్వు వస్తున్నది. ‘ సిద్ధి ’ ‘ లక్ష్మీనిధి ’ రెండు పేర్లు స్త్రీ వాచకాలే కదా ! స్త్రీ వివాహం మరొక స్త్రీతో ఎలా అయింది ? ” అన్నాడు. వేరొక సఖి అంది “ లక్ష్మణా ! నీతో ఎవరు నెగ్గగలరు ? అయోధ్యలో స్త్రీలు చాలా ఉదర స్వభావులట ! భర్తతో పని లేకుండానే పాయసం తాగి పిల్లల్ని కంటారుట ! ”.
అందరి మాటలు విని శ్రీరాముడు “ మీ సొంత విషయాలు కప్పిపుచ్చి ఇతరుల సంగతి చెప్తున్నావే ! తల్లిదండ్రి లేకుండా పిల్లలు పుట్టరని వేదాలలో కూడా వుంది. కానీ మీ దేశంలో మట్టిలోంచే పిల్లలు పుడతారుగా ! మా దేశంలో అలా కాదు బాబూ ! ” అన్నాడు రాముడు.
సిద్ధి చిన్న చెల్లెలు చంద్రముఖి చాలా నేర్పరి.
“ మీరు చిన్నప్పటి నుంచి మహర్షుల ఆశ్రమంలో పుట్టారు. ఈ మోసాలు, జిత్తులమారి మాటలు ఎక్కడ నేర్చుకొన్నారో ! ముని పత్నుల దగ్గర నేర్చుకొన్నారా ? లేక మీ అక్క దగ్గరా ? తీపి – పులుపు తేడా తింటేనేగా తెలిసేది మరిది గారూ ! ”
“ సత్యం చెప్పావు. నువ్వు ఇంకా కన్యవేగా ? పురుషుల సంగతి నీకెలా తెలుసు ? కాని మేము జ్ఞాన సముపార్జన కోసం ఋషుల ఆశ్రమంలో వున్నాం, నేర్చుకొన్నాం. ఇప్పుడు ‘ కామకళ ’ నేర్చుకోవాలని మీ దగ్గరకి వచ్చాం “ అన్నాడు భరతుడు.
“ నువ్వు ఇలాటి మాటలు మాట్లాడకు. నిన్ను సాధువుల్లో జమ కట్టాం. ప్రపంచం గురించి నీకేం తెలుసు ? ” అంది సిద్ధి.
“ నిజం చెప్పావు. మేము పరోపకారం చేసే సాధువులం. భామినీ ! మాకు ఆహ్లాదం కలిగించేలా సేవ చెయ్యి – మీ ఇంటికి అపూర్వమైన అతిథులు వచ్చారు తెలుసుకోండి. ఆధారమృత రసం భోజనంతో పూజ చేయి ”. ఇలా పరిహాసాలు ఆయాక నలుగురు అన్నదమ్ములు అత్తగారి వద్ద సెలవు తీసుకొని విడిదికి చేరారు. సిద్ధి అంతఃపురం వెలవెలబోయింది.
( రామచరిత మానస్ ఆధారంగా )
***********************
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾